"డూట్!" అని తల విదిలించాడు చిచ్చు. అతడికీ చాలా కోపంగా ఉంది అలా జడిసిపోయిన వాడిలా వెళ్ళాలనిపించలేదు. ఏదో ఒకటి చెయ్యాలి.
ఆలోచిస్తూ నిక్కరు జేబు తడుముకున్నాడు. చేతికి ఒక వస్తువు తగిలింది. అక్కడున్న అందరినీ ఏడిపించేలాగ, ఏం చెయ్యాలో తోచింది. కొంచెం దూరంగా చెట్టుకింద ముసలయ్య చుట్ట కాల్చుకుంటున్నాడు. వెనగ్గా వెళ్ళి "ముసలయ్యా!" అన్నాడు గట్టిగా. ముసలయ్య ఉలికిపడి చిచ్చుని చూసి స్థిమితపడి "నువ్వా?" అన్నాడు తాపీగా?
"అక్కడ దుర్గాపూజ జరుగుతోంటే, నువ్విక్కడే చుట్ట కాల్చుకుంటూ కూచున్నావ్!" దబాయింపుగా అన్నాడు.
"ఏం చేసేది చిచ్చులయ్యా? పూజమో ఎంతకీ తెవల్దు. సుట్ట కాల్చుకోకుండా ఎంతసేపుండగలనూ!"
"నామాలయ్యతో చెప్తాను!"
"ఓర్నాయనో? అంతపని సెయ్యబోకు. సచ్చి నీ కడుపున పుడతాను."
"చావొద్దు, నీ దగ్గిర అగ్గిపెట్టె ఉంటే ఇయ్యి ఒక పుల్ల. పోనీ రెండు పుల్లలు చాలు!"
"అగ్గిపెట్టె! నీకెందుకు! నువ్వు కూడా సుట్ట తాగుతావా!" సంబరంగా అడిగాడు ముసలయ్య.
"బాబ్బాబు? ఒక్కటంటే ఒకటయ్యా? సచ్చి...."
"వొద్దొద్దు-చావొద్దు లంక పొగాకు చుట్టేనా! ఒకటేం కర్మ! నాలుగు తెచ్చి పెడతాను పెద్ద పెద్దవి. ఇప్పుడు నా దగ్గిర లేవు. రేపు తెస్తాను. అగ్గిపెట్టె...."
చెయ్యి జాపాడు. మొల్లోంచి అగ్గిపెట్టె తీసి చిచ్చూ చేతిలో పెట్టాడు ముసలయ్య. అది తీసుకుని పూజ హాలు గుమం పక్కకి వచ్చాడు చిచ్చు. తలుపు అడ్డుగా ఉండి అతడు లోపలి వాళ్ళకి కనపడడు. టౌన్ లో టపాకాయల షాపులో కొన్ని ఆటంబాంబు జాగ్రత్తగా గోడవారగా అమర్చాడు. తలుపు సందులోంచి తొంగిచూసాడు. పూజ పూర్తయింది. నైవేద్యమూ, మంగళహారతీ కూడా అయిపోయాయి. ఆడవాళ్ళెవరో మంగళహారతి పాడుతున్నారు. చప్పుడు కాకుండా అగ్గిపుల్ల గీసి జాగ్రత్తగా ఆటంబాంబు వెలిగించి బాణంలా రివ్వున పారిపోయాడు.
పురోహితుడు మంత్రపుష్పం చదువుతున్నాడు.
"జాత వేద సేసునవా సోమ మరాతీయతో...."
"ఢాం!" పరిసరాలన్నీ దద్దరిల్లిపోయే శబ్దంతో ఆటంబాంబు పేలింది పూజగదిలో ఉన్న యావన్మందీ కంగారుగా బయటకొచ్చారు. కళ్ళు విప్పనిదీ, కదలనిదీ-ఇళాదేవి ఒక్కర్తే! జరిగింది తెలుసుకున్నారు. చాలామంది రహస్యంగా నవ్వుకున్నారు. కొద్దిమంది కోపగించుకున్నారు. నామాలయ్య ఏం చెయ్యాలో తెలీక ఎదురుగా ఉన్న పాలేళ్ళని తిట్టాడు. ఏదో సంగీతం వింటున్నట్లు తలొంచుకుని, ఆ తిట్లన్నీ విన్నారు వాళ్ళు. "ఫర్వాలేదండీ! నైవేద్యం పూర్తయింది కదా? పూజ పాడు కానట్లే!" సర్ది చెప్పబోయాడు యోగనాధశాస్త్రి. అందరూ లొపలికి వచ్చేసరికి అక్కడొక అద్భుత దృశ్యం కనిపించింది. బాలదుర్గాదేవి లాగ పీట మీద కూచుని ఉన్న ఇళాదేవి వళ్లో శ్రీనివాసు కూచుని ఉన్నాడు. అతడికి నైవేద్యంగా నివేదించిన పాలు తాగిస్తోంది ఇళ. ఒంటిమీద తెలివి లేకుండా, పక్కమీద నుంచి కదలలేకుండా ఉన్న శ్రీనివాస్ ఇళాదేవి వళ్ళో మృత్యుంజయుడైన మార్కండేయుడిలా కూచున్నాడు. వరండాలోంచి నామాలయ్య పూజ గదిలోకి రాగానే నీరసంగా "అమ్మా" అన్నాడు.
పొంగి పొరలే ఆనంది భాష్పాలతో చేతులు జాపింది ఆ తల్లి.
"ఏం జరిగింది!" అనేక కంఠాలు ఒక్కసారిగా కుతూహలంతో ప్రశ్నించాయి ఇళని?
"దుర్గాదేవి ధ్యానంలో మునిగి ఉన్నాది. ఏదో కంఠం పాలు పాలు అని పలికింది. మెత్తగా, తీయగా ఉంది ఆ స్వరం. కళ్ళు తెరిచాను. నా ఎదురుగా పాలగ్లాసు ఉంది. శ్రీనివాసులు ఏడుస్తున్నాడు. నన్ను అక్కా అని పిలిచాడు. వాడిని కూచోబెట్టుకుని పాలు తాగిస్తోంటే, మీరంతా వచ్చారు."
పసితనపు పవిత్రత ఉట్టిపడే అచ్చమైన అమాయకత్వంతో అంది ఇళాదేవి!
2
గోడకుర్చీ వేసి కూచున్నాడు చిచ్చు. అలా కూచునే, క్లాసు పుస్తకం చదువుతున్నాడు గట్టిగా. చిచ్చు అలా కూచోవటం చూడలేకపోతోంది వర్ధని. చిచ్చు ఆమెకి ఒక్కగానొక్క కొడుకు. ఇద్దరు పోయాక, బ్రతికి బట్టకట్టిన బిడ్డ. అంచేత ఆమె పంచప్రాణాలూ కొడుకు మీదనే ఉంటాయి. ఈ వెర్రి ప్రేమతో గారాబాలు చేసి కొడుకుని పాడుచెయ్యకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతుంటాడు జ్ఞానదేవ్.
"చిచ్చూ! నాన్న వస్తోంటే, చూసి చెప్తాను. అందాక మామూలుగా కూర్చో.
పదోసారి చెప్పింది వర్ధని. వినిపించుకోకుండా క్లాసు పుస్తకం మరింత గట్టిగా చదవసాగాడు చిచ్చు.
జ్ఞానదేవ్ వచ్చాడు. వరండాలో చెప్పులు వదిలి, తొట్లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చాడు. గోడకుర్చీ వేసి కూచున్న చిచ్చూ కనిపించాడు. ఏదైనా విపరీతమైన అల్లరి చేసినప్పుడు తండ్రి కోపం తగ్గించడానికి చిచ్చు అవలంబించే ఉపాయం అది! జ్ఞానదేవ్ కి బాగా కోపం వచ్చినప్పుడు గోడకుర్చీ శిక్షగా విధిస్తాడు. తండ్రికి కోపం వస్తుందని రూఢీగా అనిపించినప్పుడు, చిచ్చు తనకితనే గోడకుర్చీ వేసి కూచుంటాడు. అక్కడితో జ్ఞానదేవ్ కి కోపం రావడానికి మారుగా జాలి కలుగుతుంది.
"ఏం చేశావురా? గోడకుర్చీ దేనికి!" అడిగాడు జ్ఞానదేవ్. తెల్లబోయాడు చిచ్చు. తండ్రి అప్పుడే మరిచిపోయాడా!
"నిన్నే. ఏం చేశావ్?"
"నామాలయ్య ఇంట్లో...."
"అదా...."
గట్టిగా నవ్వాడు. తండ్రి అలా నవ్వాడంటే, తండ్రికి కోపం లేదన్నమాట. గోడకుర్చీ మానేసి లేచాడు. మోకాళ్ళు నొప్పి పుడుతున్నాయి. కుంటుకుంటూ నడుస్తూ తండ్రి దగ్గరగా వచ్చాడు. జాలేసింది జ్ఞాన్ కి. కొడుకు భుజాల చుట్టూ చేతులేసి దగ్గరగా లాక్కుని వళ్ళో కూచోబెట్టుకున్నాడు.
"చిచ్చూ, నువ్వు చేసిన పనిలో తప్పేమీ లేదురా? చాలా మంచిపని చేశావు" అన్నాడు.
"అదేమిటండీ. ఒక వంక దుర్గ పూజ జరుగుతోంటే, వీడంత అల్లరి చేస్తే, మంచి పనంటారా!" దెబ్బలాటకి దిగింది వర్ధని.
"దుర్గా లేదు. చండీ లేదు నిజంగా వుంటే సమాజంలో చెలరేగుతున్న ఎందఱో మహిషాసురుల్ని నాశనం చెయ్యకుండా ఊరుకుంటుందా!" కసిరాడు జ్ఞాన్.
వర్ధనికి భర్త మాటలు పూర్తిగా అర్థం కాలేదు. దేవిని తిట్టాడని మాత్రం అర్థమయింది.
"అయ్యయ్యో. మహాశక్తిని అలా తిట్టకండీ. కళ్ళు పోతాయి." టపటప లెంపలేసుకుంది. జ్ఞాన్ నవ్వాడు. అతడితో పాటు చిచ్చూ నవ్వాడు. తండ్రీ కొడుకులిద్దరూ నవ్వుతోంటే, వర్ధని ఉడుక్కుని లోపలికెళ్ళి దుర్గాదేవి కాలెండర్ బొమ్మ ముందు నిలబడి "తల్లీ, వీళ్ళు అజ్ఞానులు. నా ముఖం చూసి వీళ్ళని క్షమించు" అని మళ్ళీ లెంపలేసుకుంది.