అర్థంకాలేదు రాజుకి_ రాజుకు అర్థంకాదని తనకింతకుముందెన్నడూ అర్థంకాలేదు.
"గుడ్ బై లలితా!"
"గుడ్ బై!"
పాలిపోయిన తన ముఖం చూసి జాలిపడగలిగిన మనసుంది రాజుకి. కానీ ఆ మనసుకి రాగిణిని కాదనగలిగే శక్తి లేదు. మనసు చికాకుపడింది. ఆ చికాకు మరిచిపోవడానికి తాగాడు.
తమను తాము మరిచిపోవటంలో ఉండే సుఖమేమిటి? తన్మయత్వంలో, పారవశ్యంలో, మైమరుపులో, మైకంలో, మత్తులో... మనుష్యులు తమను తాము మరిచిపోతారు. అంతమాత్రాన ఈ భావాలన్నీ ఒకటేనా?
తనూ ఒక విధమైన తన్మయత్వంలోనే ఉంది. రాజూ మైకంలోనే ఉన్నాడు. అదీ, ఇదీ, ఒకటేనా?
దుఃఖానికీ, ఆనందానికీ_ ఆశ్రువులు స్రవిస్తాయి. పులకరించినా, జలదరించినా రోమాంచమవుతుంది. బాహ్య చిహ్నాలన్నీ ఒకటే! భేదమంతా అనుభూతులలో, ఆ అనుభూతుల నందుకునే అంతరంగాలలో.
తాగుబోతుకీ మైకం వస్తుంది, కళాతపస్వికీ మైమరపు వస్తుంది. ఆ మైకంలో మనసు అదుపులో ఉండదు. తనను తాను మరిచి బయట పడుతుంది. పైపైకి పోవాలనే ప్రయత్నమే ఉండదు. మాదకత తప్ప.
ఈ మైమరపులో మనసు అదుపులో ఉండదు. తనను తాను తెలుసుకుంటూ బయటపడుతుంది. అందని ఔన్నత్త్యాలను అందుకోవాలని ఆరాటపడుతుంది. ఇంతే తేడా!
రాజు రాగిణిని స్వీకరించి తనకు గుడ్ బై చెప్పగలిగాడు. రాగిణి! తనను చూసుకుని తాను గర్వపడగలిగిన రాగిణి, పాపం రాగిణి!
2
కారులోంచి దిగి తన దగ్గిరకు వచ్చిన రత్నమ్మను నివ్వెరపోయి చూసింది లలిత. పట్టు పరికిణీ_ మెడలో సన్నని గొలుసు_ ముఖంలో కొత్తగా వచ్చిన వికాసం రత్నమ్మేనా?
"రత్నా..." అని ఏదో అనబోతుండగానే రత్నమ్మ అడ్డుకుని " 'రత్నా' అనకు 'రాగిణీ' అని పిలు. నేను మారిపోలా? నా పేరూ మారిపోయింది" అంది నవ్వుతూ.
"ఏవిటిదంతా?" అంది ఆశ్చర్యంగా లలిత.
"నా అదృష్టం. శ్యామలంబగారు నన్ను తమ సేవాసదనంలో చేర్చుకున్నారు."
దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది రాగిణి. ఆ నిట్టూర్పులో విషాదం లేదు, ఆవేదన లేదు. ఏదో సంతృప్తి వుంది. ఒక విధమైన రిలీఫ్ వుంది.
రత్నమ్మ విధిలేక పినతండ్రి ఇంట్లో పెరగవలసి వచ్చింది. వాళ్ళదీ అంతంత మాత్రం కుటుంబమే! కన్నపిల్లలకే పెట్టుకోవటానికి కటకటలాడే ఈ రోజుల్లో రత్నమ్మను సాకవలసి రావటం పినతల్లికి కష్టంగానే వుండేది. ఆవిడకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు. తన పిల్లలకంటే రత్నమ్మ అందగత్తె కావటం కూడా ఆవిడ మనసులో రత్నమ్మ పట్ల అసహనం కలగటానికి మరో కారణం.
ఒకే వీధిలో ఉండే రత్నమ్మను చిన్నప్పటినుండీ లలితకు తెలుసు. రత్నమ్మ పినతల్లి చేతిలో దెబ్బలు తిని ఏడుస్తోంటే ఎన్నోసార్లు లలిత తన దగ్గరున్న తాయిలం పెట్టి ఓదార్చింది. ఇంట చాకిరీతో బడికి తిన్నగా రాలేని రత్నమ్మకు తనాన్ నోట్సులిచ్చేది. అప్పటికే చదువులో వెనకపడ్డ రత్నమ్మ చేత చదివించాలని చూసేది. రత్నమ్మకు తీరిక లేకపోవటమే కాదు_ చదువులో కూడా ఆసక్తి అంతంత మాత్రమే! పినతల్లి ఏదో వంకతో రత్నమ్మను తిట్టని రోజంటూ లేదు. రత్నమ్మ కుమిలిపోతోంటే లలిత ధైర్యం చెప్పేది. రత్నమ్మ ఎలాగైనా చదువుకుని తన కాళ్ళమీద తను నిలబడాలని లలిత ఉద్దేశం. కానీ రత్నమ్మకు పుస్తకం పుచ్చుకోగానే ఆవులింతలొచ్చేవి. ఎక్కడో, ఎప్పుడో, ఎలాగో, తాను గొప్పదైపోయినట్లు కలలుగంటూ కూర్చునేది. వెలిసిపోయిన చిరుగుల పరికిణీలు, ఎప్పుడూ దిగులుగా ఉండే ముఖం. రత్నమ్మను చూసినప్పుడల్లా జాలితో కరిగిపోయేది లలిత మనసు.
అలాంటి రత్నమ్మ రాగిణిగా వచ్చేసరికి లలితకు విడ్డూరంగా తోచింది.
"శ్యామలాంబగారెవరు? సేవాసదనమేమిటి?" అంది.
"శ్యామలాంబగారు గొప్ప సంఘ సేవకురాలులే! ఆవిడ చేతికింద చాలా సంస్థలున్నాయి. మా ఇంటికొచ్చి ఆవిడ తన సేవాసదనంలో చేర్చుకుంటానంది. పిన్ని ఒప్పుకుంది. పిన్ని కావిడ రెండు వందలు కూడా ఇచ్చింది. ఎందుకూ? దండుగ కదూ."
లలిత అప్పటికి స్కూల్ ఫైనల్ చదువుతోంది. కొంచెం కొంచెం లోకం తెలుస్తోంది. రాగిణి మాటలు వింటున్న కొద్దీ మతిపోయినట్టవుతోంది లలితకు.
"ప్రత్యేకంగా ఇంటికొచ్చి అనాధ శరణాలయంలో చేర్చుకుంటానన్నారా? ఎదురు డబ్బిచ్చారా?" నమ్మలేనట్టు అడిగింది.
"అనాధ శరణాలయం కాదు, సేవాసదనం. అక్కడ ఎవరినంటే వాళ్ళను చేర్చుకోరు. అందమైన వాళ్ళనే చేర్చుకుంటారు."
లలిత కేదో అనుమానం తోచింది.
"అక్కడ నీకు బాగుందా?"
"బ్రహ్మాండంగా ఉంది. ఈ పరికిణీ చూశావా? పట్టు పరికిణీ. కంచిపట్టు. ఈ వోణీ కూడా జార్జెట్ దే! ఎప్పుడు నేనిలా పట్టు పరికిణీలలో జార్జెట్ వోణీలలో ఉండాలని చెప్పారు శ్యామలాంబగారు. అందుకే మెడ బోసిగా ఉందని ఈ చిన్న గొలుసు వేశారు. కొంచెం రోజుల్లో ఇంకా బోలెడు నగలు చేయిస్తానన్నారు."
రాగిణి కళ్ళల్లో, కంఠంలో ఆశ అంతులేని ఆశ. లలితకు భయం వేసింది.
రాగిణి రెండు చేతులూ పట్టుకుని "రాగిణీ! ఆవిడ ఇవన్నీ ఊరికే ఎందుకిస్తుందీ? బాగా ఆలోచించుకో!" అంది.
రాగిణి చేతులు విడిపించుకుని "ఊరికే ఎందుకిస్తుందీ? ఆవిడకు నాతో...మాతో ఏదో అవసరం ఉంటుంది." అంది ఎటో చూస్తూ.
లలిత నిర్ఘాంతపోయింది.
"నీకు తెలుసా అయితే?"
"ఆ! తెలుసు! ఇకముందు పిన్నితో తిట్లూ చీవాట్లూ తినక్కరలేదని తెలుసు. తిండికి తడుముకోనక్కర్లేదని తెలుసు. దర్జాగా బ్రతకొచ్చని తెలుసు!"
"ఈ బ్రతుకు దర్జా బ్రతుకు అనుకుంటున్నావా?"
"అవును ఎందుకు కాదు? నన్ను చూశాక మా పిన్ని తన కూతుర్ని కూడా తీసుకోమని శ్యామలాంబగారిని అడిగింది. ఆవిడ ఒప్పుకోలేదు. ఈ రకమైన బ్రతుకు కావాలన్నా అందరికీ రాదు. అందంగా ఉండాలి!"
గర్వంగా అంది రాగిణి.
లలిత తెల్లబోతూ "అయితే నీకు ఇష్టమయ్యే అక్కడ చేరావన్న మాట!" అంది.
"ఆ! నేనే కాదు అందరూ అంతే! ఎందుకిష్టంలేదు? ఏ బలవంతమూ లేదు. అక్కడ చేరాలని ఎందరు తాపత్రయపడతారో తెలుసా? ఏం తక్కువయింది? డబ్బు, గౌరవం పలుకుబడి అన్నీ ఉంటాయి. మామూలుగా మీరంతా ఇంతకంటే ఎక్కువ సుఖపడుతున్నారా?"