Previous Page Next Page 
నివేదిత పేజి 3

   
    కాసేపు ఉన్నాక వేదిత లేచి కూర్చుంది. పమిట చెంగుతో శుభ్రంగా కళ్ళు తుడిచేసుకుంది. ఆమె పెదాలపై చిరుహాసం ఉదయించింది. ఆమె మనస్సిప్పుడు మహా ప్రశాంతంగా ఉంది.

 

    లేచి గుడి తాళాలు తీసుకుని బయల్దేరింది. కాసేపటికి గుళ్ళో గంటలు గణ గణ మని మ్రోగాయి. భూమి కదలినట్లయింది. వేణుగోపాలుని విగ్రహం చుట్టూ దీపాలు జాజ్జ్వలమానంగా వెలిగాయి. ఈ విగ్రహం నిర్మింప చేయటానికి ఆలయ నిర్మాతలు ఆ రోజుల్లో ఎంత శ్రమించారో తెలీదుగాని, ఏమీ ఆఉజ్వల, రమణీయ, మోహనమూర్తి! అవి ఏమి కన్నులు! ఆ కాంతి ఎక్కడినుంచి వస్తున్నది? "భగవాన్! ఈ ధన్యత ఎవరిది? నేను యిందు కోసమా? ఇంత ఆలస్యంగా గుర్తుచేశావేం? తరింపజెయ్యి నన్ను ముక్కలుగా కోసి అవి నీలో కరగనియ్యి, నాలో శాంతి మంటలు రేపు. నీ పిల్లనగ్రోవితో నా జీవితరంగాన్ని అలాపించు.

 

    సృష్టికర్త ముందు మోకరిల్లి, చేతులు జోడించి అలా నిమిషాల తరబడి, గంటల తరబడి అచేతనావస్తలో ఉండిపోయింది వేదిత. "అమ్మ!" అన్న పిలుపు ఆమెనీ లోకంలోకి తీసుకువచ్చింది.

 

    వేదిత కళ్ళు తెరిచింది.

 

    "అమ్మా!"

 

    ఆమె తల త్రిప్పి వెనుదిరిగి చూచి "ఎంత సేపయింది నాన్నా వచ్చి?" అనడిగింది తండ్రిని.

 

    "ఇప్పుడేనమ్మా! చాలా వేళయింది. తలుపులు వేసి రామ్మా! భోజనాలు చేద్దాం."

 

    "వస్తున్నా నాన్నా! అంటూ ఆమె బయటకి వచ్చి. తండ్రికి ప్రసాదం అందిచ్చి తలుపులు తాళాలువేసి యింటివైపు బయల్దేరింది తండ్రితో.

 

    కాసేపటికి యిద్దరూ భోజనాలకు కూర్చున్నారు. వేదిత పచ్చికూరలే తింటుంది. పళ్ళు తింటుంది. అదే ఆమె భోజనం. ఉప్పు, కారం ఆమె మానేసి చాలాకాలమైంది. ఆచార్యులుగారు కూడా కూతురి లాగా పచ్చి కూర తినటానికి కొంతకాలం ప్రయత్నించాడుగాని, వృద్ధాప్యం వల్ల ఆయన శరీరానికి సరిపడక గోధుమ అన్నం వండించుకుని తింటున్నాడు. "శాయి వచ్చాడమ్మా విదేశాల నుంచి" అన్నాడు తండ్రి కొంచెం సేపు గడిచాక.

 

    ఇందాక రంగశాయిగారింటికి వెళ్ళాను ఇందుమతమ్మగార్ని చూడటానికి. నిన్న వచ్చాడట. నేను వెళ్ళేసరికి యింట్లోలేడు. పోన్లే! ఇన్నాళ్ళకి ఆ పిల్ల ప్రార్థనలు దేవుడాలకించాడు. ఆమె కాపురం చక్కబడింది.

 

    "ఇందాక వచ్చారు నాన్నా ఆయనిక్కడికి" అంది వేదిత.

 

    "ఎవరు? శాయేనా?"

 

    "అవును. వేటకని బయల్దేరారట. దారిలో దేవాలయం కనిపించి లోపలకు వచ్చారు."

 

    "ఎలా ఉన్నాడమ్మా మనిషి? చిన్నప్పటి లాగానే నిర్లక్ష్యంగా ఉన్నాడా?" అన్నాడు ఆచార్యులుగారు ఆసక్తిని కనబరుస్తూ.

 

    "అప్పుడే ఏం చెప్పగలం నాన్నా?" అంది వేదిత సమాధానంగా.

 

    "ఇంకా నయం వచ్చాడు. ఆ మధ్య యిక్కడికి రాననీ, అక్కడే స్థిరపడి పోతాననీ ఉత్తరాలు రాశాడుట. అతని మీద బెంగతోనే ఇందుమతమ్మగారికి సగం రోగం వచ్చింది. అతన్ని యిక్కడికి రప్పించటానికి ఆవిడ నానా హైరానా పడాల్సి వచ్చింది.

 

    "అన్నట్టు ఎలా ఉంది నాన్నా ఆవిడగారికి!"

 

    "వృద్ధాప్యం కదమ్మా! పోయేరోజులే గాని వచ్చేరోజులు కావు. తీవ్రత యింకా తగ్గలేదు" అన్నారు ఆచార్యులుగారు సానుభూతిని కనబరుస్తూ. ఆయన మాటల్లో వైరాగ్యం ధ్వనించింది.

 

    భోజనం ముగించాక ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి నడుం వాల్చాడు. వేదిత భగవద్గీత చేతుల్లోకి తీసుకుంది.

 

                                            * * *

 

    ఈ సంఘటనలు జరగటానికి చాలాకాలం పూర్వం వేదితకు ప్రపంచంలో ప్రియాతి ప్రియమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను కళ్యాణమూర్తి. అదే గ్రామంలో ఒక మోతుబరి రైతు కామందులలో చెప్పుకోదగినవారూ అయిన నాగేంద్రరావుగారి కుమారుడు కళ్యాణమూర్తి, శేషశాయి సమవయస్కులు. వేదిత వారికన్నవయసులో కొద్ది సంవత్సరాలు చిన్నది. అయినా పెద్దవారికున్న స్నేహ సంబంధాలను బట్టి ముగ్గురూ ఒకరి కొకరు చేరువైనారు. చెట్టాపట్టాలు వేసుకొని మైలున్నర దూరంలో వున్న ప్రక్క గ్రామంలోని బడికి పోయివచ్చేవారు. వీరికి సాయంగా రంగశాయిగారి పాలేరు తోడు వచ్చేవాడు. ఇహ ఇళ్లకి వచ్చాక ఎండనక, వాననక తోటల్లోనూ, చేలల్లోనూ పడి వాళ్ళు చేసే అల్లరికి అంతు ఉండేదికాదు. వేణుగోపాలస్వామి కోవెల వీళ్ళకు క్రీడా రంగమైంది. దాగుడుమూత లాడేటప్పుడు ఒక్కోసారి వేదిత జంకూ, గొంకూ లేకుండా దేముడి వెనక్కే వెళ్ళి దాక్కునేది. బయటకు ముగ్గురూ ఒకేతీరున ఉన్నట్లు కనిపించినా, వేదితకు లోలోపల కళ్యాణమూర్తి అంటే ఎక్కువ స్నేహానురాగం,ఆర్థ్రభావాలు ఏర్పడినాయి. ఆమె కళ్ళకి కళ్యాణమూర్తి మృదువుగా, జాలిగా, అమాయకంగా గోచరించేవాడు. ఆమె కేమైనా బాధ కలిగినా, అస్వస్థత చేసినా అతను తల్లడిల్లిపోయేవాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒకసారి ఆమెకు ఆట్లమ్మ వచ్చి మంచమెక్కినప్పుడు. అతను విడవకుండా అంటిపెట్టుకుని వుండి తనకు చేతనైన బుల్లి బుల్లి ఉపచర్యలు చేశాడు. చివరకు ఆట్లమ్మ అతన్ని కూడా కనికరించకుండా సోకి, పది రోజులపాటు మంచాన పడవేసింది. శేషుబాబు ఆమెకు మోటుగా, అహంభావంగా కనిపించేవాడు. అతన్నెంత సేపూ కవ్వించాలని వుండేదామెకు. ఏదో పొల్లుమాట అని ఉడికించేది. అతనికి కోపంవచ్చి కొట్టబోయేవాడు. ఆమె వెక్కిరిస్తూ పారిపోయేది. ఒకసారి యిలాగే ఏదో కొంటెమాట అని పారిపోతూ, పరికిణీ పాదాలకు ఆడ్డంపడి పడిపోయింది. మెకాలు దగ్గర నేల గీసుకుని, రక్తం చిమ్మి, బాధతో ఆమెకు కళ్ళ నీళ్లు తిరిగాయి. తనని ఉడికించిందని ఉద్రేకంలో వున్న శేషశాయి ఆమె బాధ గమనించకుండా, యిదే సమయమని జడపుచ్చుకుని గుంజుతూ నెత్తిమీద రెండు తగిలించాడు. స్నేహితురాల్ని లేవతీద్దామని ఆదరా బాదరా పరిగెత్తుకు వస్తూన్న కళ్యాణమూర్తికి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. కోపం ఆపుకోలేక శాయిని ముఖంమీదా, వీపుమీదా నాలుగు వాయించాడు. అయితే శాయి, కళ్యాణమూర్తి కన్న బలవంతుడు. ఒక్క వూపుతో అతన్ని క్రింద పడవేసి గుండెలమీద ఎక్కికూర్చున్నాడు. ముఖంమీద గుద్దుతున్నాడు. ఈలోపున వేదిత విరిగిపోయిన కొమ్మ ఒకటి సంపాదించుకు వచ్చింది. కసితీరా అతని తలమీద బాదింది. దాంతో శాయికి దిమ్మతిరిగి, కళ్యాణమూర్తిని వదిలేసి "మీరిద్దరూ కలిసి నామీద దండయాత్ర చేస్తారా? ఇవాళనుంచి మీతో మాట్లాడనుపొండి" అని మట్టిచేతుల్ని చొక్కాకి పులుముకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.                    

 Previous Page Next Page