Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 29

    పద్మజకు కాస్త నిరాశగా అనిపించింది.

    "గిరీ - పగలంతా  నేనెలాగూ బిజీగా ఉంటాను. ఆదివారం ఒక్కరోజే మనం పూర్తిగా ఫ్రీ. ఆ రోజు నోటర్ డామ్ నూ, మ్యూజియంనూ చూసి సీన్ లో బోటుషికారు చెయ్యాల్సిందే తప్పదు" చెప్పింది.

    "తప్పకుండా డియర్, అలాగే. ప్రస్తుతానికి ఆ ఆలోచనలు కట్టిపెట్టి ఇటు రా. నోటర్ డామ్ ని బ్రద్దలుకొట్టేద్దాం."

                                                              *    *    *


    సీన్ నది ఒడ్డున  రెస్టారెంటులో  కూర్చుని కాఫీ త్రాగుతోంది పద్మజ. గిరి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు.

    "మే ఐ జాయిన్ యూ" పద్మజ తలెత్తి చూసింది.

    చాలా అందంగా ఉందా అమ్మాయి. తేనెరంగు జుట్టు, అదే రంగు కళ్ళూ....హోటల్లో చూసిందా అమ్మాయిని.

    "ష్యూర్, వెల్ కం" ఆహ్వానించింది చిరునవ్వుతో.

    "ఐయామ్ జూలీ, జూలీ క్లాడ్, అమెరికన్" అందా అమ్మాయి.

    "పద్మజ" తనూ పరిచయం చేసుకుంది పద్మజ.

    "మీ భారతదేశపు వస్త్రధారణ అంటే నాకు చాలా యిష్టం....మిమ్మల్ని హోటల్లో చూసినప్పటి నుండీ పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను."

    ప్లాష్ మీద వెలగడంతో ఇద్దరూ తలెత్తి చూశారు....గిరి.

    "అరె ఏమిటి. అనుమతి తీసుకోకుండా ఫోటో తీయకూడదు" కాస్త నొచ్చుకుంటూ అంది పద్మజ.

    "ఫర్వాలేదు లెండి. ఇటీజ్ ప్లెజర్" అంది జూలీ.

    "మీ యిద్దర్నీ  దూరం నించి చూస్తే గమ్మత్తుగా అనిపించింది. అందుకే తీశాను" అన్నాడతను.

    ముగ్గురూ చాలాసేపు కూర్చుని కబుర్లు  చెప్పుకున్నారు. తర్వాత హోటల్ లో రెండుసార్లు కల్సిందా అమ్మాయి.

    వారం రోజులు  యిట్టే గడిచిపోయాయి. మర్నాడు ప్రొద్దుటే ప్రయాణం. ఆఫీసు పని చూసుకుని వచ్చి అలసటగా కూర్చుంది పద్మజ. గిరి మొత్తం అన్ని సామాన్లూ సర్ది స్నానానికి వెళ్ళాడు. ఆమె పక్కమీద పడుకుని ఏదో పత్రిక తిరగేస్తూంది.

    "పద్మజా, మోనాలిసా ఒరిజనల్ చూడాలన్న  మీ కోరిక యిన్నాళ్ళకు తీరింది కదూ" గిరి స్వరంలో మార్పుకు వెనక్కి తిరిగి చూసింది పద్మజ. బాత్రూం తలుపుదగ్గర నిలబడి ఉన్నాడతను. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఈ వారం రోజులుగా గిరి కాస్త ఫ్రీగా వున్నాడనుకుంటోంది ఇప్పుడే....మళ్ళీ ఇక్కడ కూడా.

    "అవును శేఖరం! వింగ్ డ్ విక్టరీని కూడా చూశాక నా జన్మ తరించిందనుకున్నాను" అంది తమాయించుకుని.

    మంచం మీద కూర్చుని అతడు ఆర్క్ డిట్రయంఫ్ నూ, సెయింట్ చాపల్ ను వర్ణించి వివరిస్తుంటే వింది. ఆమె మనసు సంతృప్తితో నిండిపోయింది. ఏదో సంతృప్తితో కూడిన అసంతృప్తి.

    అయిదు నిముషాలు మాట్లాడి అతను గిరి నుంచి విడివిడి వెళ్ళిపోయాడు. వాళ్ళని చివరిసారి కలుసుకోవటానికి వచ్చిన జూలీ క్లాడ్ తలుపు దగ్గర నిలబడి ఈ సంభాషణ అంతా విన్నదని వారికి తెలీదు.

    సంభాషణ పూర్తయ్యాక క్లాడ్ లోపలికి వచ్చి, వారికి మామూలుగానే అభినందనలు తెలిపి, విమానాశ్రయం వరకూ వచ్చి శలవు తీసుకుంది. మామూలు భార్యాభర్తలు అలా స్వాప్నికావస్థలో వున్నట్లు  ఎందుకు మాట్లాడుకున్నారో ఆమెకి అర్ధం కాలేదు.

    కొత్త ఉత్సాహంతో ప్లేన్ దిగింది పద్మజ. గిరి కూడా చాలా హుషారుగా ఉన్నాడు. కొత్త బిజినెస్ కాంట్రాక్టు దొరికిందతనికి. గిరితో కలిసి విమానాశ్రయం బయటకు రాగానే ఎదురుపడ్డాడు ప్రకాశరావు.

    "అరే, అంకుల్ మీకెలా తెలుసు మేము విమానంలో వస్తున్నామని?" ఇంగ్లీషులో ఆశ్చర్యంగా అడిగింది పద్మజ.

    "తెలుసుకున్నాను మీ ఆఫీసులో" క్లుప్తంగా అన్నారాయన.

    "ఏం జరిగింది అంకుల్ ?" అడిగింది ఆత్రుతగా ఆయన ముఖం అదోలా వుండటం చూసి.

    "రండి, కూర్చుని మాట్లాడుకుందాం" రెస్టారెంటులోకి  దారి తీశాడాయన. అయోమయంగా ఆయన్ననుసరించారిద్దరూ.

    "మీరు ఇల్లు చేరేలోపల మిమ్మల్ని కలవాలని వచ్చాను. ఈ పేపర్ కటింగ్స్ చదవండి" అందించాడాయన.

    మొదటిది చిన్న కటింగ్.


        మారణ హోమాల గురించి హెచ్చరిస్తున్న ప్రేతాత్మ


    అన్న హెడ్డింగుతో వుంది.

    ఈ మధ్య ఒక ఐ. ఏ. యస్. ఆఫీసరు ఇంట్లో గ్యాస్ లీక్ తో మరణించిన ఒక వ్యక్తి కేసు గురించి దర్యాప్తు చేయడానికే వెళ్ళిన ఇన్ స్పెక్టర్ గోపాల్ అక్కడ దెయ్యం ఆవహించిన ఒక వ్యక్తి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోవడం జరిగింది.

    దేశంలో  ఇక ముందు అనేకచోట్ల  మారణహోమం జరగబోతుందని జాగ్రత్త పడమనీ, ఆ ఆత్మ ఆ ఇంటి యజమాని ద్వారా తెలియపరిచింది, ఇన్ స్పెక్టర్ భయభ్రాంతుడై తిరిగివచ్చాడు. ఎవరికి చెప్పాలో తెలియక చెపితే హాస్యాస్పదుడనౌతాననే భయంతో  అతను ఆ వార్తను బయట పెట్టలేదు. తరువాత మా విలేఖరి భూతనాథ్ దగ్గిర ఈ విషయం ప్రస్తావించడంతో అతనికి ఆసక్తి కలిగి దీని విషయమై దర్యాప్తు చేయబోతున్నాడు! త్వరలోనే పూర్తి వివరాలు మీకందించగలం.

    ఆ తర్వాత పేపర్లో పద్మజ యింటి ఫోటో వేసి __



              'ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ ఆత్మానిలయం'

    అన్న హెడ్డింగ్ తో మళ్ళీ వ్రాశారు.

    "కొద్దినెలల క్రితం  ఒక ఐ. ఏ. ఎస్. ఆఫీసర్  సోమశేఖరం ఈ ఇంట్లో  ఆత్మహత్య చేసుకున్నాడు. విఫలమైన ప్రేమ ఇందుకు కారణం అని తెలుస్తోంది. కాని అతని ఆత్మ మాత్రం ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ తను ప్రేమించిన ఆ ఇంటి యజమానురాలు అయిన శ్రీమతి పద్మజ భర్త గిరిధర్ ను ఆవహిస్తున్నట్లు  రూడి అయిన వార్తల వల్ల  మార్పు వస్తుంటుందనీ, ఆ సమయంలో  ఆయన వింతయిన  భవిష్యత్తు వార్తలు  చెప్తూ  వుంటారని తెలిసింది. ఇంతకాలం  ఈ విషయం బయటపడకుండా  వారు చాలా జాగ్రత్తపడ్డారు.
 

 Previous Page Next Page