ప్రజలకు మోసం చేయడమెలా?
ఈ విద్యకు భారతదేశం పురాతన కాలం నుంచీ పుట్టినిల్లు! తమాషా ఎక్కడుందంటే తమని అందరూ మోసం చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఇలా అడ్డమయినోడూ భారత ప్రజలను చెడామడా వాయించేస్తున్నారన్న విషయం భారత ప్రభుత్వానిక్కూడా తెలుసు. అయినా గానీ ఎక్కువ సందర్భాలలో ప్రభుత్వమే ప్రజలను మోసగిస్తోంది కనుక మిగతా తోటి మోసగాళ్ళను శిక్షించడం వాళ్ళకిష్టం వుండదు.
మా ఫ్రెండ్ యస్. అప్పలాచారి వున్నాడనుకోండి! వాడి జాతకమేమిటో అందరూ వాడిని మోసం చేసి పారిపోయేవాళ్ళు.
"ఒక వందుంటే కొట్టు గురో౧ ఎల్లుండి మధ్యాహ్నం 'టు'వో క్లాక్ కి రిటర్న్ చేస్తా" అని ఒక్క రంగారావే పాతికసార్లు డబ్బు రిటర్న్ చేయకుండా అప్పులు తీసేసుకున్నాడు.
సరే-ఫ్రెండ్స్ తో ఇలాంటి గొడవలు మామూలే కావచ్చు కానీ వాడిని దేశంలోని పెద్దపెద్ద సంస్థలు కూడా మోసం చేసేసినయ్.
అప్పలాచారి ఓ సబ్ బ్రోకర్ దగ్గర ఇంకా పబ్లిక్ ఇష్యూకి రాని ఓ కంపెనీ షేర్లు కొంచెం ఎక్కువ ప్రీమియమ్ ఇచ్చి కొన్నాడు. రెండు నెలల్లో పబ్లిక్ ఇష్యూ వస్తుందని రెండేళ్ళు ఎదుర్చూశాడు. అయినా ఉపయోగం లేకపోయింది. అసలా కంపెనీ పేరే వినిపించటం మానేసింది.
ఆ కంపెనీ ప్రమోటర్స్, మేనేజ్ మెంట్, సబ్ బ్రోకర్స్ అంతా కలసి మా అప్పలాచారిని మోసం చేశారని చివర్లోగాని తెలీలేదు.
ఈ విషయం ఎవరికి కంప్లెయింట్ ఇవ్వాలన్నా ఎవరికివారే మాకేం సంబంధం లేదని కొట్టిపారేశారు (గవర్నమెంటుతో సహా)
ఇంకా కొన్ని పెద్ద కంపెనీలు పేపర్లో వేసే డిపాజిట్లు ఆకర్షణలు చూసి తెగ ఎట్రాక్టయిపోయి, ఎక్కువ వడ్డీ వస్తుంది కదాని మరో ఫ్రెండ్ టి.జె.యమ్ బాబు ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొని ఆ డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. మూడేళ్ళ తర్వాత వెళ్ళి డబ్బడిగితే మూడేళ్ళ టర్మ్ అయిపోయినా నెలరోజులముందే ఆ విషయం తెలియజేస్తూ నోటీస్ ఇవ్వాలన్నారు కంపెనీ వాళ్ళు.
"నేనెందుకు నోటీసివ్వాలి? ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ టర్మ్ మూడేళ్ళన్న విషయం మీకూ తెలుసు కదా?" అనడిగాడు బాబు.
"తెలుసండీ! తెలుస్తేమాత్రం రూల్స్ వుండవేమిటి మాకిక? మర్యాదగా అప్లికేషన్ రాసిచ్చి నెల్రోజుల తర్వాత రన్ది౧ మీ డబ్బు మీకిచ్చేస్తాం" అన్నాడతను.
కోపం దిగమింగుకుని నోటీస్ రాసిచ్చి నెలరోజులు వెయిట్ చేసి మళ్ళీ ఆ ఆఫీస్ కి చేరుకున్నాడు. "మీ చెక్ ఇంకా రడీ అవలేద్సార్!" చిరునవ్వుతో చెప్పాడు అతడు.
"అదేమిటి నోటీసిచ్చి నెల్రోజులు అయిపోయింది కదా!"
"అయిపోయింది గానీ బెంగుళూరు నుంచి చెక్ రాలేదు. బెంగుళూరు మా హెడ్డాఫీసు కదా! ఇవాళే ఒక రిమైండర్ కొడతాము. ఓ పదిరోజుల తర్వాత ఫోన్ చేసి రండి! పర్సనల్ గా ఇంతదూరం రావడం ఎందుకు?"
పదిరోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు టి.జె.యమ్. బాబు.
"మీ చెక్ రడీ అయి కలకత్తా ఆఫీస్ కెళ్ళిందండీ! అక్కడ సంతకం అవగానే వచ్చేస్తుంది."
"అదేమిటి? కలకత్తాకీ, నా చెక్కుకీ సంబంధం ఏమిటి?"
"మా ఎకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ కలకత్తాయే కదండీ!"
"అయితే మరి బెంగుళూరుకి ఎందుకు పంపారు అప్లికేషన్"
"బెంగుళూరు ఆఫీసులోనే కదా కంప్యూటర్స్ వుంది. కంప్యూటర్ మీ డిపాజిట్ డిటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీకెంత డబ్బివ్వాల్సింది ఓకే చేస్తుందన్నమాట! అంచేత ఇంకో పదిహేను రోజుల తర్వాత ఫోన్ చేయండి" అలా మరో నెలరోజులు గడిచాక -
"మీ చెక్ ఎక్కడో మిస్ అయిపోయింది సార్! అందుకని వెంటనే మీరు ఆఫీసుకొచ్చి డూప్లికేట్ చెక్ ఇవ్వాలని ఒక అప్లికేషన్ రాయండి! అది రేపే బెంగుళూరు పంపిస్తాను!" మరో రెండు నెలలు గడిచిపోతాయ్.
ఈ టైమంతా కూడా ఆ కంపెనీ మన డబ్బుని హైర్ పర్చేజింగ్ కో లేక ఇంకా ఎక్కువ వడ్డీ వచ్చేచోటో ఉపయోగించి తెగ లాభాలు సంపాదిస్తుందన్నమాట.
ఆ తర్వాత మనం కన్సూమర్ కోర్టుకెళతామని బెదిరించామనుకోండి! అప్పుడు చెక్ వస్తుంది. లేదా మన దగ్గర్నుంచి వసూలు చేసిన డబ్బు మరీ ఎక్కువ వుంటే కంపెనీ మూసేసి మేనేజ్ మెంట్ ఒక్కక్కరూ ఒక్కో అరబ్ దేశం పారిపోయే అవకాశాలు కూడా వున్నాయ్. ఇక చిట్ ఫండ్ కంపెనీల సంగతి సరేసరి.
మనం రెండు నెలల డబ్బు కట్టకపోతే వెంటనే గ్యారంటీ వున్న వాళ్ళకి లీగల్ నోటీసులు వచ్చేస్తాయ్. అదే మనం పాడిన చీటీ తాలూకు డబ్బు అడిగితే మూడు, నాలుగు నెలలు కూడా పడుతుంది. గ్యారంటీలు చాల్లేదని ఓసారి వెరిఫికేషన్ కెళ్ళినప్పుడు గ్యారంటీ ఇచ్చినవాళ్ళు దొరకలేదని మరోసారీ, దొరికినా వాళ్ళ గ్యారంటీ చెల్లదనీ, కనుక ఇంకో గ్యారంటీ ఇమ్మనీ- ఇలా సాగిపోతుందది.
ఇంకో రకం మోసాలెలా ఉంటాయంటే ఓ పెద్ద సంస్థకు మీదో వస్తువు సప్లయ్ చేయటమో లేదా వాళ్ళకేదయినా సేవ చేయటమో జరిగిందనుకోండి! అందుకుగాను మీకు పద్దెనిమిది వందల పదహారు రూపాయలు రావాల్సి వుంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది మీ నరకం.
సుమారు రెండు వందలసార్లు వాళ్ళాఫీసుకి తిరగాల్సి వస్తుంది. రెండు మూడు వందల ఫోన్ కాల్స్ చేయాల్సి వుంటుంది. ఐదారు నెలలు వేచి వుండాల్సి వస్తుంది. అప్పుడు మీకు అండమాన్ లోని ఓ బ్యాంక్ పేరు మీదున్న చెక్కు వస్తుంది. ఆ చెక్ ని మేరు క్లియరెన్స్ కి అండమాన్ పంపుతారు.