"ఉందిలే, కానీ రేపటినుంచి మేనేజ్ మెంట్ ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి మొదలవుతుందట. అందులో ప్రతిభవంతుల్ని విదేశాలకు పంపించే అవకాశం కూడా వుందట. అక్కడ మేనేజర్ నా స్నేహితుడే కదా! ఎలాగో ఒకలాగ ప్రయత్నంచేసి నీకా అవకాశం వచ్చేటట్టు చేస్తానన్నాడు. చాలా మంచి ఛాన్స్. పద, వెంటనే బయలుదేరాలి".
అవినాష్ కొంచెం తటపటాయించి "అమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడిన తర్వాత బయల్దేరితే మంచిదేమో డాడీ! తను హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక బాంబే వెళ్తాను. రెండో బ్యాచ్ టైనింగ్ లో జాయినవుతాను" అన్నాడు.
శంకరం కొంచెం కటువుగా, గంభీరంగా "అవినాష్! నువ్వు గొప్ప పేరు తెచ్చుకొని, పెద్ద స్థానానికి ఎదిగితే- మా అందరి ఆరోగ్యాలు ఆటోమాటిక్ గా బాగవుతాయి. మా గురించి నువ్వేం దిగులుపడకు. అంతా నేను చూసుకుంటానుగా" అన్నాడు.
అవినాష్ మౌనంగా వెళ్ళి సూట్ కేస్ సర్దుకోవడం మొదలుపెట్టాడు.
ఇద్దరూ కారులో కూర్చుంటున్నప్పుడు అవినాష్ "ఒక్కసారి హాస్పిటల్ కి వెళదాం డాడీ. అమ్మని చూసి అట్నుంచి ఎయిర్ పోర్ట్ కెళదాం" అన్నాడు.
'ఒకసారి నిఖితని చూసొస్తాను' అనకుండా పార్వతి గురించి మాట్లాడటం శంకరానికి తృప్తినిచ్చింది. "వద్దులే. ఇప్పుడు మనం వెళ్ళినా తను మాట్లాడే స్థితిలో లేదు" అన్నాడు. అవినాష్ కంగారుపడి "అదేమిటి, బి.పి. కంట్రోల్ లోనే వుందని డాక్టర్లు చెప్పారుగా. రేపే డిశ్చార్జి చేస్తామని కూడా అన్నారు" అన్నాడు.
శంకరం కొడుకు మొహంలోకి గుచ్చి చూస్తూ "అది ఉదయం మాట. పొద్దున్నే నిఖిత మమ్మీని చూడటానికి వచ్చిందిగా, వచ్చి ఏదో మంచిగా మాట్లాడి వెళితే బావుండేది. అర్థం పర్ధం లేకుండా తలతిక్కగా మాట్లాడింది. దానితో అమ్మ బి.పి. పెరిగింది. అదికూడా చూసుకోకుండా "వచ్చే ఏడాది మీ కొడుకుని పెళ్ళి చేసుకొని తీరతాను" అంటూ శాపధాలు అవీ చేసింది. దాంతో అమ్మ పరిస్థితి విషమించింది. సమయానికి డాక్టర్లు రాబట్టి సరిపోయింది. అమ్మకి సెడిటివ్ యిచ్చి పడుకోబెట్టారు. చెప్పవలసిదంతా చెప్పేసి ఏమీ పట్టించుకోకుండా ఆ నిఖిత విస విస వెళ్ళిపోయింది" కొడుకు మొహంలో రియాక్షన్ చూస్తూ మెల్లగా అన్నాడు శంకరం.
అవినాష్ ఏమీ మాట్లాడలేదు. ఎయిర్ పోర్ట్ చేరేసరికి బాంబే విమానం గంట ఆలస్యమని తెలిసింది. బ్యాగ్ యిచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర క్యూ ఎక్కువుందేమో అని శంకరం అటువైపు వెళ్ళాడు. కౌంటర్ దగ్గర ఎవరూ లేరు. శంకరం కంగారుపడ్డాడు. కొడుకు తమని వదిలేసి వెళ్ళిపోయాడేమో అన్నంతదూరం వరకూ వెళ్ళాయి ఆలోచనలు. కానీ కౌంటర్ వెనకాల కొడుకు బ్యాగ్ కనపడటంతో 'అతడు టిక్కెట్టు తీసుకున్నాడు' అన్న విషయం ధృవపడింది. కొడుక్కోసం విమానాశ్రయమంతా వెతకసాగాడు.
* * *
విమానాశ్రయం బయట ఖాళీ ఆటో కనిపించగానే మరేమీ ఆలోచించకుండా అవినాష్ ఎక్కి నిఖిత యింటి అడ్రస్ చెప్పాడు. అక్కడికి చేరుకోవడానికి పావుగంట పట్టింది.
"నిఖిత ఇంట్లోలేదు బాబూ. వాళ్ళమ్మని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది" అన్నాడు దశరధ్.
"ఏ హాస్పిటల్?" అని అడిగాడు అవినాష్. ఆ హడావిలో దశరధ్ మొహంలో దిగులుని, వేదనని కూడా అతడు పసిగట్టలేకపోయాడు. ఆయన చెప్పిన అడ్రస్ కి చేరుకోవడానికి మరో పావుగంట పట్టింది.
విమానాశ్రయం చేరుకోవడానికి యింక అరగంట మాత్రమే టైముంది.
* * *
నిఖిత ఆస్పత్రి కారిడార్ లో నించొని వుంది. లోపల గదిలో ఇద్దరు డాక్టర్లు కౌసల్యని పరీక్షిస్తున్నారు. ఆమె బాధతో అరిచే అరుపులు బయటికి వినిపిస్తున్నాయి.
ఆ రోజు నిఖిత ఇంటికొచ్చేసరికి కౌసల్య కడుపునొప్పితో మెలికలు తిరిగిపోతోంది. చక్రాల కుర్చీలో కూర్చొని నిస్సహాయంగా చూస్తున్నాడు దశరధ్. అతడికి ఏం చెయ్యాలో తోచలేదు. అదృష్టవశాత్తూ నిఖిత అప్పుడే వచ్చింది. అప్పటికప్పుడు తల్లిని ఆటోలో తీసుకొని ఆస్పత్రికొచ్చింది.
కారిడార్ లో నుంచొని కిటికీలోంచి బయటికి చూస్తూ నిఖిత ఆలోచనలో పడింది. రకరకాల వ్యక్తులు ఆస్పత్రి వరండాలో, బయట ఆవరణలో తిరుగుతున్నారు. దగ్గరి వాళ్లను, తోబుట్టువులను, స్నేహితులను ఆఖరిక్షణంలో చూడటానికి వచ్చినవాళ్ళు, అంతా అయిపోయింది అని తెలుసుకున్నవాళ్ళు, ఏమవుతుందో అనీ ఆత్రుతతో వున్నవాళ్ళు...... రకరకాల మనుష్యులు, రకరకాల బంధాలు, బాధకి వున్న 'రెలిటివిటీ' గురించి ఏ ఐన్ స్టీన్ కనుక్కోలేదు. ఉదయం ఆస్పత్రిలో అవినాష్ తల్లిదండ్రులతో జరిగిన వాగ్వివాదం మనసుకి బాధ కలిగించింది. ఇంటికొచ్చేసరికి తల్లి కడుపు నెప్పితో విలవిలలాడటం మరో బాధ. ఈ బాధముందు అంతకు ముందుది చిన్నది. 'చిన్నగీత- పెద్దగీత' అనుకొని విషాదంగా నవ్వుకుంది నిఖిత.
ఈ లోపులో వెనకనుంచి 'నిక్కీ' అన్న పిలుపు వినిపించింది. వెనక్కీ తిరిగిచూస్తే అవినాష్, మూడంతస్థులు ఎక్కివచ్చాడేమో ఆయాసంతో రొప్పుతున్నాడు.
"ఏమిటి అవినాష్, ప్లేన్ లో ఆస్పత్రికొచ్చినట్టున్నావ్?" అంది చిన్నగా నవ్వుతూ. అవినాష్ ఆమెవైపు సంభ్రమంగా చూశాడు. ఎలాంటి పరిస్థితిలో వున్నా ఎప్పుడూ నవ్వుతూ వుండటం చాలా కొద్దిమందికి సాధ్యమవుతుందేమో! అందులోనూ ఆడపిల్లలు అలా వుంటే మరింత చూడముచ్చటగా వుంటుంది. అవినాష్ మొహం ఆనందంతో విచ్చుకుంది. "ఉదయం హాస్పిటల్ లో జరిగిన సంఘటన చూశాక సంవత్సరం దాకా నన్ను కలవొద్దు అవినాష్" అంటుందనుకున్నాడు. కానీ, ఏమీ జరగనట్టు ఆమె మామూలుగా మాట్లాడటంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది.
ఈ లోపులో లోపలినుంచి పెద్దగా మూలుగు వినిపించింది.
తను వచ్చినపని మర్చిపోయి " ఆంటీకెలా వుంది?" అని అడిగాడు గాభరాగా.
"మరేం ఫరవాలేదు అవినాష్. రొటీన్ చెకప్. అంతగా బాధపడవలసినదేం లేదు" అంది అతి మామూలుగా. తన కష్టాన్ని ఎలాగూ తీర్చలేని మనిషిదగ్గర తన కష్టాలు వెలిబుచ్చుకొని, అవతలి మనిషి మనసుని కూడా బాధపెట్టడం అంత అనవసరమైనా ఆపని ఇంకొకటి లేదు. ఇలాంటి ప్రొడక్టివ్ థింకింగ్ వున్నవాళ్ళు చాలా తక్కువ.
ఆ విషయం అవినాష్ కి కూడా అర్థమైంది. తనని ఎవరో ఛెళ్ళున చరిచినట్లయింది. గోరంతని కొండంతలుగా చేసి చెప్పి అందరి సానుభూతినీ ఆశించే తన తల్లిదండ్రులకీ, ఈ కుటుంబానికీ ఎంత తేడా వుందో మరోసారి అర్థమైంది. ఇంత బలమైన వ్యక్తిత్వం వున్న అమ్మాయి ముందు తన ఎమోషనల్ ఫీలింగ్స్ ని కనపర్చటం కూడా చాలా నామోషీగా అనిపించింది. ఎంతో ఉద్వేగంతో తను ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుదామనుకున్నాడు. కానీ ఆ పరిస్థితుల్లో ఆమె ముందు ఏమీ మాట్లాడలేకపోయాడు. "ఒక్కసారి కనిపించి వెళదామని వచ్చాను నిక్కీ వెళ్ళొస్తాను - టైమవుతోంది" అన్నాడు మెల్లగా.
నిఖిత అతడివైపే చూస్తోంది. అతడు అంత దూరంనుంచి ఎందుకొచ్చాడో...... అతని హడావుడి...... అతని తత్తరపాటు..... అన్నీ అర్థమయ్యాయి. ఆనందం వేసింది. ఆనందంకన్నా ఎక్కువ దిగులు కలిగించింది. అతడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇప్పట్లో రాగలడో లేదో- అసలు వస్తాడో లేదో- అన్నీ అనుమానాలే.
ఆమెది మొదటి చూపులో ప్రేమకాదు. దానిలో ఆమెకి నమ్మకం లేదుకూడా. ఒకప్పుడు ఆమెకి అతని పిరికితనంపట్ల కోపం వచ్చేది. తరువాత అతని కుటుంబ పరిస్థితి, అతడు పెరిగిన విధానం ఆకళింపు చేసుకున్నాక, ఆ కోపం సానుభూతిగా మారింది. అర్థంచేసుకోవటానికి ప్రయత్నించింది. ఆ సానుభూతీ ఇప్పుడు అతడు కొద్ది కొద్దిగా మారుతున్నకొద్దీ ప్రేమగా పెరుగుతోంది.
మొదట్లో అతనికి ఆమె డైరెక్టుగా ఆ విషయం చెప్పలేదు. తమ కుటుంబం పరిస్థితి ఎంత భయంకరంగా వుందో ఆమెకి తెలుసు. అతడి తల్లిదండ్రుల అహంభావం, అహంకారం కూడా ఆమెకి తెలుసు. కానీ ఈ రోజు అతడు చిన్నపిల్లాడిలా తనముందు నిలబడేసరికి ఆమెలో స్త్రీ హృదయం కరిగిపోయింది. ఎంతటి మగవాడైనా, ప్రేమని ఎంత నిగూఢంగా నొక్కి పెట్టగలవాడయినా సరే, ప్రేయసి తన ప్రియుడి మొహంలో ఆ చూపుని క్షణాల్లో పట్టుకోగలదు.
"అవినాష్" అని నెమ్మదిగా పిలిచింది. వెళ్ళొస్తానని చెప్పి మెట్లుదిగుతున్న అవినాష్ అక్కడే నిలబడి వెనుదిరిగి చూశాడు. ఆమె పైనుంది. పెదవులు కదిల్చి "ఐ లవ్ యూ" అంది.
సహస్ర వేణువుల నాదంలా అది కారిడార్ లో ప్రతిధ్వనించింది. మధురంగా అతడి చెవులను నింపి, ఆపైన మనసుని తాకి, అక్కడినుంచి కళ్ళల్లోకి పరావర్తనం అయ్యింది.
అతడాక్షణంలకో తన సంస్కారాన్నీ, హొదానీమ్ వయసునీ..... అన్నీ మరిచిపోయాడు. ఎవరికీ వినిపించదు అని కూడా ఆలోచించలేదు.
"ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా నీకోసం ఆగుతాను నిక్కీ- సంవత్సరం తర్వాతనీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు ఎదురు చూడటం మొదలుపెడతాను. అప్పటిదాకా......" అని మరి మాట్లాడలేక నవ్వేశాడు. నిఖిత కూడా నవ్వి, గాలిలోకి చెయ్యి వూపింది. అవినాష్ హుషారుగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు.
ఇంతలో వెనకాల తలుపు చప్పుడయ్యింది. నిఖిత వెనుదిరింది. లోపలినుంచి డాక్టర్ బయటికొస్తున్నాడు. అతడి మొహం సీరియస్ గా వుంది.
* * *
అవినాష్ ఆటో దిగేసరికి విమానాశ్రయం బయటే శంకరం కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతని మొహం జేవురించి వుంది. కొడుకుని చూడగానే గట్టిగా అరుస్తూ "ఎక్కడికి.......ఎక్కడికి వెళ్ళొచ్చావ్?" అని అడిగాడు కోపంగా.
"చిన్న పనుండి వెళ్ళొచ్చాను డాడీ" క్లుప్తంగా అన్నాడు అవినాష్.
"అబద్ధాలు చెప్పకు. ఆ నిఖిత దగ్గరికి వెళ్ళావు కదూ?"
అవినాష్ తలెత్తి సూటిగా తండ్రివైపు చూస్తూ అన్నాడు. "ఇందులో అబద్ధం చెప్పవలసినంత అవసరమేంలేదు డాడీ. అబద్ధాలు చెప్పేది మీరు. పొద్దున హాస్పిటల్ లో జరిగినదంతా నేను చూశాను. మొత్తం సంభాషణంతా విన్నాను..." అతని కంఠం స్పష్టంగా దృఢంగా పలికింది. "నేను పెళ్ళంటూ చేసుకుంటే నిఖితనే చేసుకుంటాను డాడీ. ఉదయం నుంచీ నా ప్రయాణం కోసం మీరెంత శ్రమపడ్డారో, నన్ను వెంటనే పంపించేయటానికి ఎంత కష్టపడ్డారో గమనిస్తూనే వున్నాను" అని ఆగి, "నేను వెళ్ళి ఉద్యోగంలో జాయినవుతాను. విదేశాలకు కూడా వెళతాను. కానీ ఇదంతా మీరు చెప్పటం వలన కాదు డాడీ. నిఖిత తీసుకునే నిర్ణయాలపట్ల నా ప్రేమపట్ల నాకు నమ్మకం వుండటంవల్ల".
"శంకరం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఈ లోపులో అవినాష్ అతనికి మరింత దగ్గరగా వచ్చాడు. "మా ఇద్దరిమధ్యా వున్నది మీరనుకుంటున్నంత చౌకబారు ఆకర్షణ కాదు. అది నిజమైన ప్రేమ! అంతేకాదు!! స్నేహం, గౌరవం, నమ్మకం, ఆరాధన అన్నీ కలిసిన బంధం!! అది మీ కార్ధంకాదు" అన్నాడు.
"సరే, అదీ చూద్దాం. మీ ఇద్దరి పెళ్ళీ ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను. ఈ సంవత్సరంలో నువ్వు మరింత ప్రపంచాన్ని తెలుసుకొని, పైసాకి కొరగాని ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటంవల్ల ఏ లాభమూ లేదు అన్నంత జ్ఞానం సంపాయిస్తే సరే. అలాకాని పక్షంలో- నీకంత వివేకం ఆ బాంబే వాతావరణం నేర్పని పక్షంలో- ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు" అని అక్కడినుంచి విస విసా నడిచి వెళ్ళిపోయాడు శంకరం.