Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 28


    "మిమ్మల్నో మాటడిగితే ఏమీ అనుకోరుగా?" ఓ గంట గడిచాక అడిగాడు రవళిని.

 

    "అడగండి సార్! మీరేదడిగినా చెప్పడానికి నాకేం అభ్యంతరం వుండదు. మీ దగ్గర ఏదీ దాచుకునే శక్తి కూడా నాకులేదు" అంది మనస్ఫూర్తిగా.

 

    "మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు?" అడిగాడు. అతనిగొంతు స్థిరంగా ఉంది.

 

    ఓ క్షణం ఆయన్ని చిత్రంగా చూసి,

 

    "కార్డియో థొరాసిక్ సర్జన్స్ కి పెళ్ళెందుకు సార్?" అంటూ నవ్వేసింది. రాజ్యం కూడా శృతి కలిపింది. ఆమె సీనియర్ నర్స్ అవడం వల్లా, మంచి మనిషి అవడంవల్లా, ఆమె నెవరూ వేరుగా చూడరు. కుటుంబ సభ్యుల్లో ఒకదానిగానే భావిస్తారు డాక్టర్లు. ఒక్క భగవంతం మాత్రమే అప్పుడప్పుడు అధికారాన్ని చలాయించి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు.

 

    "అలా అంటున్నారేమిటి రవళీ?" అంటూ ఆమె నవ్వుతో తాను శృతి కలిపాడు.

 

    "మీరంతా పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత సుఖపడుతున్నారో, వచ్చిన వాళ్ళనెంత సుఖపెడుతున్నారో నాకు తెలీదా సార్?" ఆమె మొహంలో నవ్వు ఎండ కాస్తున్నప్పుడు కురిసిన వానజల్లులా ఒక్కసారే ఆగిపోయింది. అతనికి నీలిమా, పిల్లలు కళ్ళముందు కదిలి మనస్సు ఏదోలా అయిపోయింది. 'ఇంటికి వచ్చెయ్ డాడీ' మువ్వ మాట చెవుల్లో గింగురుమంది.

 

    "అయితే మేమంటా పెళ్ళి చేసుకుని పెద్ద పొరపాటు చేశామా?" అతని మొహంలోంచి నవ్వు పూర్తిగా చెరగకపోయినా - అడిగిన తీరు సీరియస్ నెస్ ని సంతరించుకుంది.

 

    "ఛ! అదేంకాదు సార్! సరదాగా అన్నాను. ఎందుకో నాకే పెళ్లిమీద ఇంట్రెస్టు పోయింది" ఆమె మాట గుండె లోపలి పొరల నుండి వస్తున్నట్లు బరువుగా ఉంది.

 

    "నేనింటి కెళ్ళలేదని రాత్రి మా మువ్వ దిగులుపడిపోయి వుంటుంది" అతని చూపు ఎక్కడో ఉంది. కళ్ళనిండా నీళ్ళు నింపుకున్న మువ్వ అతని చూపునిండా అల్లుకుని ఉంది.

 

    మీరింకా నయం సార్? మీరు మగవాళ్ళు మీ భార్యలు యింటి బాధ్యతలన్నీ చూసుకోగలరు కాబట్టి- పనిలో మీ ఏకాగ్రత చెదరదు.

 

    కానీ, మేమలా కాదుగదా, ఇల్లు-పిల్లలూ, ప్రొఫెషన్ యిదంతా కుదిరే పనికాదు."

 

    "మరి.... కార్డియో థొరాసిక్ సర్జరీ ఎందుకు ఎన్నుకున్నట్లు? వేరే సబ్జక్టేమైనా తీసుకొని చదవకపోయారా?" ఈ సబ్జక్టే తీసుకుని జీవితంలో ముఖ్యమైన వాటిని ఎందుకు కోల్పోతోందో అర్ధం కాలేదు శరత్ చంద్రకి. అందుకే అడిగాడు.

 

    "ముందు నాకీ సబ్జెక్టు మీద దృష్టే లేదు."

 

    "మరి?"

 

    "ఎం.బి.బి.యస్. అయిపోయాక అందరూ నన్ను గైనిక్ లో చేరమన్నారు. కాస్త డిఫరెంట్ గా బ్రతకాలనే ఉబలాటంతో జనరల్ ఎమ్.యస్. లో చేరాను. ఎమ్.ఎస్, చదువుతుండగానే మా వాళ్ళు నాకు పెళ్ళి చేయాలని చూశారు.

 

    వచ్చిన పెళ్ళికొడుకులందరూ నేను గైనిక్ తీసుకొని ఉండాల్సందనీ ఇద్దరం కలిసి ప్రాక్టీసు చేయడానికి బాగుండేదనీ వెనక్కెళ్ళిపోయారు. కొందరయితే నేను గైనిక్ లోకి మారితే పెళ్ళి చేసుకుంటామని ప్రపోజ్ చేసారు.

 

    గైనిక్ అయితే ఆడ డాక్టర్ గానే చలామణి అయిపోతాను. జనరల్ సర్జన్ గా అయితే వాళ్ళకన్నా నాకెక్కువ పేరొస్తుందేమోనని వాళ్ళ పురుషాధిక్యత ముందుగానే జాగ్రత్త పడింది!"

 

    ఆమెనే చూస్తున్నాడు శరత్ చంద్ర. అమాయకంగా కనిపించే రవళిలో ఇంత ఆలోచన దాగివుందా అని ఆశ్చర్యంగా ఉంది అతనికి.

 

    చలపతిరావు శరీరానికి కదలిక యివ్వడం కోసం అతని కాళ్ళు చేతులూ కదిలిస్తూ శ్రద్ధగా వింటోంది రాజ్యం.

 

    మా ఇంట్లో వాళ్లు కూడా నాకు పెళ్ళి జరగడం కోసం నన్ను గైనిక్ లో చేరమని బలవంతం చేశారు. కాని నాకు పట్టుదల పెరిగింది.

 

    వీళ్ళందరి కోసం నేనెందుకు నా సబ్జెక్టుని మార్చుకోవాలి? పెళ్ళి అంత ముఖ్యమైనదా?

 

    ఇద్దరు మనుషులు పరస్పర అవగాహనతో.... కలిసి బ్రతకడానికి నిర్దేశించిన పెళ్ళి, తన అర్ధాన్నే మార్చుకొని, ఏ ఇద్దరి మనుషులు కలిస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే విషయమ్మీదే నిర్ధారించబడుతోందని అప్పుడే అర్ధమైంది.

 

    ఇద్దరు మనుషుల మధ్య అనుబంధాన్ని సంపాదన శాసిస్తుందనుకున్నప్పుడు ఈ పెళ్ళిమీదే అసహ్యం కలిగింది. ఈ పెళ్ళికోసమా నేను నా సబ్జెక్టునే మార్చుకోవాల్సింది....?

 

    "నేను ససేమిరా అన్నాను. ఏమీ చేయలేక మా వాళ్ళు నన్ను వదిలేశారు. ఏ బాదర బందీలేని నేను సబ్జెక్టుకి న్యాయం చేయగలనని పించింది. కార్డియో థొరాసిక్ సర్డన్ అయ్యాను."

 

    ఆమె ఆగింది. శరత్ చంద్ర ఆక్షణం ఆమె మీద ఎంతో ఇష్టం, గౌరవం కలిగింది.

 

    మనిషి మొగ్గలాంటివాడు. మామూలుగా కనిపించే రోజువారీ జీవితంలాంటి రెక్కలని ఒక్కొక్కటి విడదీస్తే అసలు ఎసెన్స్ అయిన లోపలి పిప్పొడిలాంటి జీవితం - సంఘటనలు కనిపిస్తాయి అనుకున్నాడు.

 

    తను చాలా మామూలుగా అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన లోతయిన జవాబుతో అతని మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.

 

    ఆ ఆలోచన ఆమె జీవితాన్ని ఓ ముఖ్యమైన మలుపు తిప్పబోతోందని ఆమె అప్పుడే మాత్రం ఊహించలేదు.


                                                    *    *    *    *


    రెండు రోజులు గడిచిపోయాయి.

 

    ఈ రెండు రోజుల్లో చలపతిరావు ఆపరేషన్ నుండి చాలా కోలుకున్నాడు.

 

    సాయంత్రం అయిదు కావస్తోంది. పడమటి దిక్కున సూర్యుడు భవనాల వెనక్కి జారుకొంటున్నాడు. శక్తిని కోల్పోయిన సూర్యుడి బలహీనమైన వెలుగు హాస్పిటల్ కారిడార్ లో వాలుగా పడుతోంది. పొడవాటి వరండా పొడవునా ఉన్న పిల్లర్స్ నీడలు క్రమబద్ధంగా గచ్చుమీద వాలి దూరంనుండి చూసేవాళ్ళకి ఎడారిలోని వెలుగు నీడల ఇసుక తిన్నెల్లా అందంగా కనిపిస్తోంది.

 

    ఆ వెలుగు నీడల వరండాలోంచి చేతిలో కాగితాలు పట్టుకొని పరుగు పరుగున వస్తున్నాడు మైక్రో బయాలజిస్టు. అతనికి చాలా ఉద్వేగంగా ఉంది.

 

    అతని చేతిలో చలపతిరావుకిచ్చిన రక్తం తాలూకు రిపోర్టులు ఉన్నాయి. అదే పరుగుతో గదిలోకి దూసుకొచ్చి శరత్ చంద్ర ముందు నిలబడ్డాడు.

 

    "సార్....!" వగర్పు అతని గొంతు పెగలనీయడం లేదు. మైక్రోబయాలజిస్టుగా ఉద్యోగంలో చేరాక బహుశ అతనెప్పుడే ఇంత ఉద్వేగానికి గురవలేదు.

 Previous Page Next Page