Previous Page Next Page 
శారద పేజి 28


    "ఈ చిన్నక్క ఒక ఏహ్యమైన వస్తువు. ఆమె రెండు జీవితాల సంఘర్షణ. ఆమె పవిత్రమూర్తి కాదు. ఈ అమాయక మానవులు ఈ నిజాన్ని గుర్తించ లేకుండా వున్నారు."

    "చిన్నక్క దౌర్భాగ్యురాలు."

    "చిన్నక్క అల్పురాలు."

    ఆవేదనతో దగ్ధమైపోతోంది. కానీ యిలా కాల్చబడే తనువులకు ఆయుర్ధాయం ఎక్కువ వుంటుందేమో? ఆ నిర్మలత్వం, ఆ కఠినత్వం - అవయినా ఆయుఃప్రమాణాన్ని తగ్గించడానికి ఆశక్తమైనవా?

    అయినా సంవత్సరాలుగా చల్లారినట్లుగా వున్న ఈ అగ్ని ఇప్పుడెందుకు ప్రజ్వలింపబడుతోంది తిరిగి?

    ఎవరో మంటలు పెడుతున్నారు.

    ఆ నిప్పులో ఇప్పుడు చెలగాటం ఆడాలి. ఆమె కళ్ళుమూసుకుని పడుకుంది. "వాడి ఉద్దేశం బోధపడింది నాకు, కానీ నా ఉద్దేశం వాడికి బోధపడదు."

    కానీ అట్టి విషమపరిస్థితిలో ఏదో అమృతహస్తం శీతలపరుస్తున్నట్లుగా తోచింది. "ఎవరు? రాగిణా!" అని నివ్వెరపోయింది. అప్పుడు ఆమె సర్వేంద్రియాలూ సొమ్మసిల్లలేదు. తను కఠినురాలిగానే గుర్తింపబడవచ్చు. కానీ ఈ కఠినత్వం తనదికాదు. బహుశా రవి కన్నీళ్లు విడవవచ్చు. కానీ తను తుడిస్తేనే ఆ కన్నీళ్ళు చెరగకపోవటం వల్ల హాయిహాయి. తన విద్యుక్తధర్మం ఈ విధంగా పరిష్కరింపబడింది.

    కానీ ఈ ఆలోచన ఏమీ సంతృప్తికరంగా లేదు. ఒకరిని శాసించే హక్కు తనకు లేనప్పుడు, ఒకరిని  సంపూర్తిగా ఆనందం కలిగించే శక్తి తనలో లోపించినప్పుడు, నిశ్చింతగా న్యాయాన్ని అందివ్వలేకపోయినప్పుడు ఎందుకీ సంతృప్తి? కాల్చనా?

    ఆమె ఆలోచించి ఆలోచించి అలసిపోయింది.

    కానీ చివరకు ఒకరోజు రవి ఆమెముందు సాక్షాత్కరించినప్పుడు నోరువిప్పి ఏదీ పలుకలేకపోయింది. అతడికళ్ళు బాగా రక్తిమను పులుముకున్నాయి. జుత్తు నిర్లక్ష్యంగా వదిలివేయబడింది.

    ఈ ఇద్దరి రూపాలలో తారతమ్యం ఏదీలేదు. అంతర్యాలలో అంతా సంబంధం.

    "చిన్నక్కా!" అన్నాడు రవి "నీకు కోపం వచ్చిందా?"

    ఆమె తల విదిలించింది.

    "ఏం చెయ్యను? అదంతా అలా జరిగిపోయింది. ఇన్నిరోజులూ ఇక్కడికి వద్దామని ప్రయత్నించికూడా నీకు ముఖం చూపడానికి వెరచిరాలేకపోయాను."

    "నాకు తెలుసు బాబూ!"

    అంతే. అంతకన్నా సంభాషణ ఏమీ జరుగలేదు. గోడలమీద పెచ్చులు బెత్తికలుగా ఏర్పడ్డా విడివడలేదు. ఇంకా అంటుకునే వున్నాయి.

    కొన్ని రోజులతర్వాత ఓ మనోహరమైన సాయంత్రం రైలులో రవీవాళ్ళు స్వంత ఊరిని సమీపిస్తున్నారు. ఫస్టుక్లాసు కంపార్టుమెంటు. గోవిందరావుగారు చాలాసేపు మాట్లాడి అలసి, పడుకుని హాయిగా నిద్రపోతున్నారు. ఆయనకు సుదూరంలో శారద కూర్చుంది. చల్లగాలికి చీరె రెపరెపలాడుతోంది. అదేగాలికి రేగిన ముంగురులు భావశైలిని ప్రదర్శిస్తున్నాయి.    

    "రవీ!" అంది.

    కిటికీలోంచి సాలోచనగా, బాహ్యంలోకి భావగర్భితంగా అవలోకిస్తున్న వాడల్లా అది విరమించి "చిన్నక్కా!" అన్నాడు.

    "మాతో మా ఊరు వస్తావుకదూ!" అతను దిగులుగా చూసి "రాలేను అన్నాడు."

    "ఏం?"

    "ఏమో. కారణం చెప్పలేను. నేను కేశవుల్ని పంపిస్తాను."

 

    "నీతో కొంచెం మాట్లాడాలయ్యా!" అంది శారద.

    అతను దిటపు తెచ్చుకున్నాడు "నేను ఎల్లప్పుడూ సిద్ధంగా వున్నాను" అన్నాడు.

    "మీ బావ నిద్రపోతున్నారు కదూ?"

    "చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే కనిపిస్తుంది."

    "ఆరోజు..." అంది ఆమె "మీ ఇంజనీరుగారు వచ్చారు. బావతో వాళ్ళమ్మాయిగురించి, నీ గురించీ మాట్లాడారు."

    చలనరహితంగా కూర్చున్నాడు రవి.

    "నీ ఉద్దేశం నాకు సాంతం బోధపడలేదు" అని అతను తల ఎత్తి తనవంక చూసేసరికి "నాకు చెప్పక్కరలేదులే" అంది.

    రవి తల అడ్డంగా ఊపాడు ఊపిరి బిగపెట్టి. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఈ నిశ్శబ్దాన్ని భరించలేక రవి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వదనం నల్లబడివుంది.

    "ఇదేమిటి?" అని గొణిగాడు. సడలుతున్న స్థయిర్యం కూడదీసుకుని "నేను పదే పదే క్షమించాలని అడుగుతూ వచ్చాను. అందుకు కారణం ఇదే."

    "ఏది?"

    "ఇ......ఇదే!"

    ఆమె మంద్రస్వరంతో "కానీ ఇప్పుడు చిన్నక్క నిన్ను క్షమించేస్థితిలో లేదు నాయనా! నువ్వే నన్ను క్షమించాలి."

    "చిన్నక్కా!" అన్నాడు కంపితుడై.

    "నేనేం మాట్లాడుతున్నాను? ఓహో! నిన్నో కోరిక కోరుతానునాయనా! మన్నిస్తావుకదూ? హేమని నీవు చెల్లెలి భావంతోనే చూస్తావని నాకు తెలుసు. నీ విశాలహృదయాన్ని అక్క అపార్ధం చేసుకుని కష్టపెట్టుకుంటుందనీ నాకు తెలియకపోదు. తమ్ముడూ! శశిని చూసినప్పటినుంచీ నా మనస్సు ఆకర్షించేసిందిరా! నేను తప్పక ఆమెనే మరదలుగా చేసుకోవాలి."

    తన రెండు చేతులతో ముఖం కప్పుకున్నాడు. చాలాసేపు గడిచింది. ఏదో స్టేషన్ లో రైలుఆగి మళ్ళీ బయల్దేరింది. అతను మెల్లగా చేతులుతీసి భీభత్సనయనాల్తో ఆమెవంక చూపులు ప్రసరించాడు. కానీ చిన్నక్క ముఖాన్ని కప్పి వున్న మృదుహస్తాలు మాత్రం అతనికి దృగ్గోచరమైనాయి. నిజం ఏది?

                                               9

    జీవితమంటే ఆసక్తి ఏనాడో సన్నగిల్లింది. ఇప్పుడు అసహ్యం రెట్టింపైంది. జీవితమంటే ఎవరు? తను? తనో ప్రేక్షకుడు.

    మనుషులు ఇంతేకదా! తమ చేతులతో తమ గోతులు త్రవ్వుకుంటారు. తీరా అందులోపడి మన్ను, ఇసుకలో మునిగిపోయాక "ఇంత పెద్ద గొయ్యి ఎందుకు త్రవ్వుకున్నా"నని దురపిల్లుతారు.  

 Previous Page Next Page