మహల్లో బతికే ఆమెకు తన సందేశం అందించే అవకాశం చేజారిపోతూంది.
ఏ ఉద్దేశ్యంతో తను అక్కడకు వచ్చాడో అది నెరవేరకముందే ఆమె కారెక్కిపోతూంది.
ఒక్కక్షణంపాటు ఆమెను సమీపించాలనుకున్నాడు కాని ఆమెను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన నౌఖర్లని, కారుడ్రైవర్నీ చూసి ఆగిపోయాడు.
అప్పుడు మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. "నాని ఓ పనిచేస్తావా?"
"ఏంటంకుల్."
ఓ కవరు నాని చేతికిచ్చాడు. "ఇది నన్ను బ్రతికించే మందు. దీన్ని ఆ కారెక్కుతున్న అంటీని చూశావా? ఆమెకి అందించాలి. అలా అయితే ఆ తర్వాత మీ తాతయ్యకి మందు నేను సంపాదిస్తాను."
పరుగెత్తబోతుంటే ఆపాడు "ఇక్కడేకాదు సగందూరంలో" వివరంగా చెప్పాడు ఏం చేయాల్సిందీ.
కారు కదలబోతుంటే పరుగెత్తుకుంటూ ఆమెని చేరిన నాని "ఆంటీ... నన్నూ మార్టూరుదాకా రానివ్వవూ" అన్నాడు అభ్యర్థిస్తున్నట్టుగా.
నౌఖర్లు నానిని ముందు నెట్టేయబోయాడు కాని వారించింది "రా కూర్చో" కారు డోర్ తనే తెరిచింది.
ప్రారంభం సంతృప్తికరంగా జరిగిపోయినందుకు దూరంగా నిలబడ్డ మన్మథరావు ఆనందించాడు.
మరికొన్ని నిముషాలలో తెలిసిపోతూంది తన జీవితంలోని ఓ అమూల్యమైన మలుపుకి సంబంధించిన ఫలితం.
వెనుకగా తనూ రిక్షా ఎక్కాడు.
ఒక పరీక్షలో తలదూర్చి పరిచితుడైన ఒక మంచిమనిషికి సహకరించాలనుకున్న నానీకి తెలీదు కారెక్కుతుండగానే రాజారావు చూశాడని...
నేరప్రవృత్తిలో బ్రతికే రాజారావుకి ఆ ప్రాంతం కొత్తకాదు. కాబట్టే ఈసారి పరిచయమున్న మరికొందరు నేరస్థులతో చేతులు కలిపాడు. డబ్బు ఆశ చూపించి నానీకోసం వెంటపడ్డాడు మరింత పకడ్బందీగా.
* * *
అంబాసిడర్ మార్టూరువేపు సాగిపోతూంది వేగంగా.
విండోలోనుంచి వెనక్కి పరుగెడుతున్న చెట్లను చూస్తుంటే తొలిసారి కారెక్కిన నానీకి చిత్రంగా వుంది.
ఒక పెద్ద జమీకి ఏకైక వారసురాలైన రతి నిశ్శబ్దంగా బయటికి చూస్తుంటే చాలాసేపటిదాకా ఆమెనే గమనిస్తూ వుండిపోయిన నానీకి చనువుగా మాట్లాడాలంటేనే భయం వేసింది.
నెమ్మదిగా పిలిచాడు "ఆంటీ"
తలతిప్పి చూసి నానీ కవరందిస్తుంటే ముందు అదేంటో అర్థంకాక అడగబోయిందికాని ఉత్తరం చివరలో మన్మథరావు పేరును చూసి ఆగిపోయింది.
"రతీ! నిన్ను ప్రియమైన అని ఎడ్రస్ చేయవచ్చో లేదో తెలియని స్థితిలో వున్న సామాన్యుడ్ని నేను. కాని ఏం చేయను? చిన్నతనంనుండి నీతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తుంటే 'గారూ' అంటూ మాత్రం సంబోధించలేకపోయాను. నువ్వు అప్పటికీ ఇప్పటికీ మహల్లో కోకిలవయినా ఎలా మరిచిపోగలను నీతో కలిసి ఆడుకున్న ముచ్చట్లనీ, నన్ను ప్రతిక్షణమూ ఆటపట్టించే నీ చిలిపి అల్లరిని? గుర్తుందా... నేలపైనుంచి తాడిచెట్టును చూస్తేనే చాలు కళ్ళు తిరిగే నేను ఈసారి తాటిచెట్టెక్కి కాయలు కోసి నువ్వడిగావని ముంజుల్ని తీసిచ్చాను. కాలవలో మనం జంటగా వదిలిన కాగితపు పడవల్లో నీ పడవ నీట మునిగిందని నవ్వేడుస్తుంటే ఈత రాకపోయినా అందులోని దూకి నేను ప్రాణాలమీదికి తెచ్చుకున్నాను. ఈత రానివాడివి నీటిలో ఎందుకు దుమికావని నువ్వెన్ని నెలలు ఏడిపించావని! గుర్తుందా మనల్ని చూసి అమ్మేమనేదో? కాకిలాంటి నాకు కోకిలవైన నీకూ స్నేహమేమిట్రా అంటూంటే "పో అత్తయ్యా" అంటూ అప్పుడూ వరస కలిపేశావు. ఆ తర్వాత ఆ ఒక్కపదం లాలిత్యంగా గుండెలపై ముద్రపడితేనే జ్ఞానంలేని వయసైనా ఎన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపానో నీకేం తెలుసు?
ఒక్కరోజన్నా ఇద్దరం కలుసుకోలేకపోతే మరుసటిరోజు రాముడికోవెల దగ్గర వెక్కివెక్కి ఏడ్చేవాళ్ళం. ఎప్పుడూ ఎద్దేవాచేసే నిన్ను నిజంగా ఎప్పటికీ నాతో స్నేహం చేస్తూనే వుంటావా అని నేనోరోజు వినయంగా అడిగితే నువ్వేం చేశావో గుర్తుందా... మామిడితోపులోని చెట్టు మొదలుపై 'రతీమన్మథుల పెళ్ళంట' అని చెరిగిపోని అక్షరాలను రాసేశావు.
వయసు పెరుగుతున్న నువ్వు రోజూ నాకు కనిపించటంలేదని ఉత్తరంరాస్తే ఆ ఉత్తరాన్ని చదివి నన్నెంత అభినందించావని... 'రచయితవైపోతావా' అంటూ ఎన్నిరోజులు ఆటపట్టించావు? ఉడుకుమోత్తనంతో నేను నిజంగానే కథ రాస్తే అది ప్రచురింపబడినప్పుడు చాటుగా నువ్విచ్చిన బహుమతి నేను రాసిన ఎన్ని కథలకు స్పూర్తినిచ్చిందో, నేను రయితగా ఎన్నెన్ని మెట్లు అధిరోహించడానికి దోహదంచేసిందో నీకెలా చెప్పేది రతీ!
ఎక్కడున్నా నేనే నీ మనిషినన్నావు. ఎంత దూరంలో వున్నా నీ తలపునిండా నేనే అంటూ ఎన్నెన్ని జాబులు రాశావు? అన్నింటికన్నా నన్ను ఆశ్చర్యపరిచింది నువ్వు ఓరియంటల్ కాలేజీలో చేరావని తెలిసినప్పుడు నీకున్న సాహిత్య పిపాసే, ప్రాచీన సాహిత్యంపై నీకున్న ఆసక్తే నిన్ను 'బాషా ప్రవీణ'ని చేసిందీ అంటే రయితనైన నేనూ ఎంత సంబరపడిపోయానో తెలుసా...
ఏంటో... ఏదేదో రాసుకుపోతున్నాను కదూ... రతీ! ఉద్వేగాన్ని ఎలా ఆపుకోను? నీ ఆలోచనలు ఆశ్రువుల్లా నా కనుకొలుకుల్లో నిలిచి అల్లరిచేస్తుంటే వాటిని ఆనంధభాష్ఫాలనుకోనా లేక మనల్ని దూరంగా నెట్టేసి ఆడుకునే అల్లరి అనుభూతుల తర్పణాలననా..
ఈ మధ్య ఆరునెలలుగా నిన్ను కలుసుకోవాలని ఎంత ప్రయత్నించానని... వీలైతేగా... వచ్చే చనువుందేమోకాని నీ అంతస్తు చూసి రావాలంటే భయం... అమ్మసైతం నిన్నెన్నిసార్లు గుర్తుంచుకుందో తెలుసా...
రతీ! నువ్వు దూరంగావున్నా ఎప్పుడూ దగ్గరేవున్న అనుభూతిని కలిగిస్తుంటే దగ్గరేవున్న అమ్మ త్వరలో దూరం కాబోతూ నన్ను నిస్సహాయుడ్ని చేస్తూంది. నీకు కబురందిందిదో లేదోకాని అమ్మకి కేన్సర్. ఇంకెన్నాళ్ళో బ్రతకదంటున్నారు. అందుకే ఈమధ్య నాగురించి మరీ ఆరాటపడిపోతూంది. నీకోసం క్షణం క్షణం తపించిపోతూంది. బహుశా 'అత్తయ్యా' అన్న నీగొంతువిని కన్ను మూయాలనుకుంటుందేమో.
ఇదేంటీ... చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నా నెందుకని... రతీ! నేను స్థితిలో నీకు అనర్హుడే అయినా నీ మనసులో చోటు చేసుకోగల అదృష్టవంతుడిగా అర్హుడే అనుకుంటున్నాను. బహుశా అమ్మ కోరుకుంటున్నదీ అదేనేమో... రతీ... నేను దురాశపరుడ్నే అనుకొంటే ఈ ఉత్తరాన్ని చించి పారేయ్... కాదూ అనుకుంటే నన్ను అల్లరిపెట్టి ఆట పట్టించడానికన్నా ఒకసారిరా... అమ్మకోరిక కథగా ముగుస్తుందో లేక నా అభీష్టకావ్యమై అమ్మని మరికొన్నాళ్ళు బ్రతికిస్తుందో అంతా నీ చేతుల్లో వుంది. అతిచనువు తీసుకుంటే మన్నించు...
నీ ఉత్తరంకోసం దురాశగా ఎదురుచూసే
మన్మథ."