Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 28


    "ఛ ఛ, అదికాదు. నేను నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. అదీగాక నేనా నాట చరణాల్ని వింటూ ఏదో ఆలోచనలో వుండిపోయాను." ఆమె స్పీకర్ వైపు అప్రయత్నంగా చూసింది.

    वो अफ़साना जिसे अंजाम तक
    लाना न हो मुमकिन
    उसे एक ख़ूबसुरत मोड ढेकर
    तोडना अच्छा__  
         

    "ఏ కథనైతే మనం చివరివరకూ తీసుకు వెళ్ళలేమో ఆ కథని అందమైన మలుపు తిప్పి అక్కడే వదిలెయ్యటం మంచిది అంటున్నాడు కవి. అది నిజమైనా బావుణ్ను" అన్నాడు.

    "ఏది?" అంది.

    "ఉహూ_ఏమీలేదు" అతడు చప్పున సర్దుకుని "నాకు....అదే....నేను....ప్చ్....ఏం మాట్లాడాలో నాకు అర్ధం కావటంలేదు. నాకు....నాకు మిమ్మల్ని చూసిన మరుక్షణమే ఇలాంటి స్నేహితురాలు వుంటే ఎంత బావుణ్ణు అనిపించింది. కానీ నా అంతస్థు గుర్తుకొచ్చి మరి ఆ వైపు ఆలోచించలేదు. నాలో మీరు ఒక మంచి స్నేహితుణ్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు. కానీ నేను మీ క్రింద పనిచేసే గుమాస్తాని...."

    చెప్పుకుపోతున్నాడేగానీ అతడికి తన మాటలు తనకే మెలో డ్రమటిక్ గా అనిపించసాగినయ్. సిగ్గుగా వుంది. అయినా సర్దుకున్నాడు.

    "ఆ మాటలొద్దు. గుమాస్తా ఏమిటి గుమాస్తా? నాన్నగారు నిన్ను ఈ కాంట్రాక్టుకోసం గోవా పంపించారంటేనే అది ఎంత పెద్ద బాధ్యతో తెలుసా? గుమాస్తా కెవరూ అంత ప్రాముఖ్యత ఇవ్వరు. అందులోనూ మా నాన్నగారు ఎంపిక చేశారంటే దానికి తిరుగులేదు."

    ఆ మాట మాత్రం నిజమే- అనుకున్నాడు మనసులో.

    "వేణూ!"

    "ఊ!"

    "కేవలం నేను అడిగితే నువ్వు నాతో స్నేహం చేయటం లేదు కదూ?"

    "లేదు లేదు. చెప్పానుగా ముందే."

    "నా మాటలూ, ప్రవర్తనా_ నీకు మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నాయా?"

    "ఉహూ లేదు. నేను అర్ధం చేసుకోగలను. ప్రతి మనిషికీ ఏదో ఒక టైములొ తను ఈ ప్రపంచంలొ చాలా ఒంటరివాడనీ, తనకెవరూ లేరనీ అనిపిస్తూ వుంటుంది. సరిగ్గా అదే సమయంలొ నేనున్నాననే స్నేహితుడి కోసం తపించిపోతూ వుంటాడు. ఈ విషయం నాకు బాగా తెలుసు!"

    "ఎలా తెలుసు?"

    "చాలాసార్లు ఇదే వంటరితనాన్ని నేనూ అనుభవించాను కాబట్టి."

    ఆమెలో అప్పటివరకూ కనపడుతూన్న అస్పష్టమయిన సందిగ్ధత పోయి, మొహం విప్పారింది. సంతోషంతో "థాంక్స్" అంది. "నాకు ఎప్పుడైనా, ఏదైనా సాయం కావల్సివస్తే స్నేహితుడిగా నువ్వు చేస్తావ్ గా?"

    "తప్పకుండా!"

    "ప్రామిస్!" చెయ్యి సాచింది.

    "ప్రామిస్!" ఆమె చేతిని మొట్టమొదటిసారి తాకుతూ అన్నాడు. "అయినా నాలాంటి వాడి సహాయం మీకెందుకు వస్తుంది ప్రేమా!"

    అతడి మాటలు పట్టించుకోకుండా, 'అన్నట్టు ఇంకో విషయం....' అందామె.

    "ఏమిటి?"

    "మనమిప్పుడు స్నేహితులం. నన్ను 'మీరు' అనడం మానెయ్యాలి."

    అతడు ఇబ్బందిగా తలూపుతూ "సరే" అన్నాడు. "నా తరపు నుంచి కూడా ఒక విషయం...."

    "ఏమిటి?"

    "మనమిప్పుడు స్నేహితులం కాబట్టి మీరు.... నువ్వూ నాకోసాయం చెయ్యాలి....అంటే నా మాట వినాలి."

    "ఏం మాట అది?"

    "ఈ రాత్రికి ప్రయాణం మానెయ్యటం."

    ఆమె ముందు తెల్లబోయి, అంతలో అర్ధమై, "సరే-సరే" అని తేలిగ్గా నవ్వేసింది.

    అతడు సంజాయిషీ చెప్పుకుంటున్నట్టు- "రేపే కాంట్రాక్టు సంతకాలు పెట్టవలసింది! ఒక్కరోజు ఆగితే పని పూర్తయిపోతుందని నా ఉద్దేశ్యం" అన్నాడు.

    "సరే అన్నానుగా" అంది. అంతలో వెయిటర్ వచ్చి బిల్లు టేబిల్ మీద పెట్టాడు. అతడు టిప్ తో సహా డబ్బు ప్లేట్లో వేసి లేచాడు. ఆ పాటికే ఆమె లేచి మెట్లవైపు నడిచింది. అతడూ అటువైపుకి రెండు అడుగులు వేశాడు.

    అతడు పక్క టేబిల్ వద్దకు వచ్చేసరికి అక్కడ కూర్చొని నిద్రకు జోగుతున్నట్టు వున్న వృద్ధుడు-ఇంగ్లీషు కౌబోయ్ పిక్చర్ లోలా- హాట్ కాస్త పైకెత్తి గొణుగుతున్నట్టు "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు.

    వేణు పెదాలు కదిల్చీ కదల్చకుండా "థాంక్స్" అంటూ ముందుకు సాగిపోయాడు.


                                                                      5


    "నాకు అర్ధం కావటంలేదు" అన్నాడు వేణు. "ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.... అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో...."

    "నాకూ నిన్నరాత్రి అర్ధంకాలేదు" అన్నాడు ప్రసాదరావు. "....కానీ రాత్రి రూమ్ కి వచ్చాక ఆలోచిస్తే అర్ధమయింది."

    "ఏమిటి?"

    ప్రసాద్ తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితులలో మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసొచ్చింది. ఇక కథ కలయిమాక్స్ కి వచ్చేసినట్టే...."

    "క్లయిమాక్సుకా?"

    "ఆఁ! అవును.... ఆమె వంటరితనం ఫీలింగ్ నిన్నరాత్రి నువ్వు చాలా బాగా ఉపయోగించుకున్నావు. నువ్వు ఏం మాట్లాడతావా, ఆ పరిస్థితిని ఎలా హాండిల్ చేస్తావా-అని కంగారుపడ్డాను. చక్కగా నటించావు."

    'అది నటనకాదు. ఆ క్షణంలో తనూ అలాగే ఫీలయ్యాడు' అని చెప్పాలనిపించింది కానీ మాట్లాడలేదు.

    ప్రసాదరావు కొనసాగించాడు. "దీనికంతటికీ చాలాకాలం పడుతుందనుకున్నాను. నువ్వింకా జగపతిరావు ఇంట్లో చాలాకాలం పని చెయ్యాలనీ, ఆమెకి క్రమక్రమంగా దగ్గిరవ్వాలనీ, చెయ్యవలసింది ఎంతో వుందని అనుకున్నాను. నాకు కొంత అనుమానంగానే వుండేది. ప్రేమలాంటి అమ్మాయిలు ఎంత ప్రేమలోపడ్డా, పెళ్ళికిముందే శారీరకంగా దగ్గరవ్వటానికి వప్పుకుంటారా అని! కాని అదృష్టం మనని ఈ గోవా ప్రయాణ రూపంలో వరించింది. ప్రసాద్ మధ్యలో తప్పుకోవటం కూడా అదృష్టమే!

    వేణూ! ఇక నీదే ఆలస్యం. ఇనుము వేడిగా వున్నప్పుడే వంగుతుంది. ఆమె మానసికంగా ఇలా బలహీనంగా వున్నప్పుడే మన పని సులవవుతుంది. అందుకే ఈ రాత్రికే...."

    వేణూ అదిరిపడి, "ఈ రాత్రికా!" అన్నాడు.

    "అవును, ఈ రాత్రికే. మనం వేస్తున్న ఈ మాస్టర్ ప్లానుతో ఈ కథ ఈ రాత్రికి ముగింపుకి వచ్చేస్తుంది."

    "ఏమిటా మాస్టర్ ప్లాన్?"

    ప్రసాదరావు చెప్పటం ప్రారంభించాడు.

    "చక్కటి సాయంత్రం!"

    పడమటివైపు కృంగిపోతున్న సూర్యుడు ఆకాశం కాన్వాస్ మీద కుంచెతో అందంగా ఎరుపురంగు దిద్దుతున్నాడు. గోవా ప్రత్యేకత ఏమిటంటే, ప్రొద్దున్నా సాయంత్రం కూడా గాలి సముద్రం మీదనుంచే భూమి మీదకు వస్తూ వుంటుంది.

    కారు నెమ్మదిగా వెళుతూంది. కానీ బలంగా వీస్తున్న గాలికి ఆమె ముంగురులు చెంపలమీదుగా మెడపైన జీరాడుతున్నాయి. విండో మీద మోచెయ్యి ఆన్చి అరచేతిలో గెడ్డం పెట్టుకుని కనురెప్పలు ఆర్పకుండా ఆమె బైటకి చూస్తూంది. ఆ భంగిమ ఎంతో ముగ్ధమనోహరంగా వుంది.

    వేణూ కూడా తొందరేమీ లేనట్టు తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. అతడి మనసంతా ఉత్సాహంతో నిండి వుంది.

    ఆ రోజు చాలా మంచిరోజు.

    మధ్యాహ్నం కాంట్రాక్టుమీద సంతకాలు జరిగినయ్. అతడి మాట మీద ఆమె వుండిపోవటం మంచిపనే అయింది.

    వీళ్ళు చెప్పిన ధరకి అవతల పార్టీ ఇష్టపడటమే కాక వీలయితే కాంట్రాక్టుకన్నా ఎక్కువ సరుకు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని అతడు జగపతిరావుకు ఫోన్ చేద్దామనుకున్నాడు.

    ప్రేమ అక్కరలేదంది! ఒకరి తరపున ప్రతినిధిగా పంపించినప్పుడు ఆ మాత్రం నిర్ణయం తీసుకునే హక్కు అతడికి ఎప్పుడూ వుందని వాదించింది. చివరికి అతడు మామూలుకన్నా మూడింతలు ఎక్కువ సరుకు పంపేటట్టు కాంట్రాక్టు వ్రాసేరు. ఆమె సంతకం పెట్టింది.

    తన నిర్ణయంమీద ఆమె అంత నమ్మకముంచినందుకు అతడికి సంతోషం వేసింది. కానీ ఎక్కువ సంతోషాన్నిస్తున్న విషయం అదికాదు. తను కోరగానే ఆమె ప్రయాణం ఆపుచేసుకుని వెళ్ళకుండా వుండిపోవటం ఆప్యాయత చాలా చిన్న విషయాలద్వారా ప్రకటింపబడుతూ వుంటుంది. నిద్రలేని రాత్రులు-బర్త్ డే బహుమతులే అఖ్కరలేదు.

    కారు సముద్రపు అంచునే రోడ్డుమీద సాగిపోతూంది.

    "నాకేమనిపిస్తుందో చెప్పనా!" నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అంది.

    "ఏమనిపిస్తూంది?"

    "ఇలాగే ప్రయాణిస్తూ ఈ సముద్రపు చివర ఎక్కడుందో కనుక్కోవాలనిపిస్తూంది."

    అతడు నవ్వేడు.

    ఆమె అంతలోనే- "ఈ లోపులో సముద్రాన్ని వదిలేసి రోడ్డు పక్కకి వెళ్ళిపోతుంది" అంది.

    "వెళ్ళదు పందెం కడదామా కావాలంటే?"

    "ఏమిటి పందెం?"

    "కార్లో పెట్రోలు అయ్యే లోపులో రోడ్డు సముద్రాన్ని వదిలేస్తుందని నువ్వూ, పక్కనుంచి వెళుతుందని నేను."

    "పెట్రోలు అయిపోతే వెనక్కి ఎలా వస్తాం?"

    "చూసేవా! ఎంత భయపడుతున్నావో...."

    "నేనేం భయపడటంలేదు" ఉక్రోషంగా అంది.

    "సరే, పందెమా?"

    "ఏమిటి పందెం?"

    "ఓడిపోయినవాళ్ళు, గెలిచినవాళ్ళు ఏం అడుగుతే అది ఇవ్వాలి."

    "సరే!"

    కారు సముద్రం పక్కనుంచి వెళుతూంది.

 Previous Page Next Page