Previous Page Next Page 
రామాయణము పేజి 25

    "బుశ్యమూకమునకు పోవు దారిలో మతంగ మహాయుని ఆశ్రమమున్నది. అందు 'శబరి' యను వృద్ద  తపస్విని రాకకై నిరీక్షించుచున్నది. ఆమెకు మీ దర్శనభాగ్యమును కలిగించి ఆమె  ఆతిథ్యమును స్వీకరించి ఆమె చూపిన మార్గమున పోయి బుశ్యమూకమును చేరుకొనుడు" అని ముగించినాడు.
    పిమ్మట దనువు రామలక్ష్మణుల వీడ్కోలును పోంది గంధర్వ లోకమునకు పోయినాడు.  రామలక్ష్మణులు మతంగాశ్రమమును చేరుకున్నారు.
    శబరి వారికి స్వాగతము పలికి "మహనీయులారా, మీరు  చిత్రకూటమున వసించు కాలముననె మా గురుదేవులు మతంగ మహాముని స్వర్గమును చేరినారు. వారు పోవుచూ 'శబరీ మహాత్ముడు శ్రీరాముడు  అనుజునితో వచ్చువరకును  నీవిచ్చటనె వేచియుండుము. వారికి అతిథి సత్కారము  లొనరించి పిమ్మట స్వర్గమును చేరుకొనుము' అని ఆద్వీశించినారు. మహానీయులారా మీ రాక  వలన ఈ ఆశ్రమము పావనమైనది. మీ దర్శనము  వలన నా జన్మ  ధన్యమైనది. మీ పాదములను కడిగి ఆ జలమును తలపైన జల్లుకోననిండు. మధుర ఫలములను సేకరించి తెచ్చినాను, ఆరగించుడు" అన్నది.
    శ్రీరాముడు "శబరీ , నిన్ను చూచుటయూ, నీ ఆదరణయూ నాకెంతయో ఆనందమును కలిగించినవి. మేమింక బుశ్యమూకమునకు పోవలెను. మార్గమును తెలుపుము" అని కోరినాడు. శబరి "అల్లదే పంపాసరోవరము. దాని కావల కనపడుచున్న కొండయే బుశ్యమూకము "అని వివరించినది. పిమ్మట ఆ వృద్ద తపస్విని వారివద్ద సెలవుగైకొని నాకమును చేరుకొన్నది.
    రాముడు అనుజునితో సరోవరము వైపు అడుగులు వేయుచూ "లక్ష్మణా ఈ ప్రశాంత వాతావరణమున నా విషాదము మంచువలె విడిపోయి నా మనస్సు కలకదేరినది. సీతాన్వేషణ ప్రయత్నము తప్పక ఫలించునన్న దైర్యము కలిగినది" అన్నాడు. లక్ష్ముణుడ గ్రజునిలో కలిగిన ఈ సత్పరిణామమునకు సంతసించినాడు. వారు సరోవరము వారగా పోయి బుశ్యమూకమును చేరి ఆ గిరిని  పరికించినారు.
                                *      *      *             
                            సుగ్రీవమైత్రి
    లక్ష్మణుడు" ఈ రామచంద్రుడు దుష్ర్కుతులను శిక్షించి పీడితుల రక్షించుటకు కంకణము కట్టుకొన్నాడు. మేము వల్కలమును ధరించినను ఆయుధములను విసర్జించకుండటకు కారణమిదియె.
    బుశ్యమూక పర్వతముపైన ఆంజనేయుడు మున్నగు నల్వురు మంత్రులతో కాలము వెళ్లబుచ్చు చున్న  సుగ్రీవుడు  క్రింద లోయలో కొండను కలయజూచుచు తచ్చాడుచున్న ఆజానుబహులూ, విశాల వక్షస్కులూ ఉన్నత  కాయులూ ధనుర్ధరులూ ఐన మహాపురుషులు రామలక్ష్మణులను చూచినాడు. అతడు "ఆంజనేయ ఆ ధానుష్కులను నన్ను చంపుటకు మా అన్న వాలి పంపించియుండు నన్న భయము  కలుగుచున్నది. నీవు పోయి వారెవరో ఇచ్చటికెందుకు వచ్చినారో  నేర్పుగా  మాట్లాడి తెలిసికొని రమ్ము" అని ఆ సచివుని అనిపినాడు.
    అంజనీ సుతుడు రామలక్ష్మణుల  వద్దకు పోయి  "మహనీయులారా, మీ జటలను వల్కములను చూడగా  మీరు  మునుల  వలె  నున్నారు.  మీవద్ద  ఆయుధములు  కూడ ఉన్నవి. మీరు ఎవరో ఈ అరణ్యమున కేలరావలసి వచ్చినదో తెలుపగోరుచున్నాను" అన్నాడు.
    ...రామలక్ష్మణులు "ఎవరీతడు?" అని  యోచించుచుండగా అతడు గ్రహించి "నేను 'కుంజరుడు' అను వానరోత్తముని దౌహిత్రుడను. నా జనని పేరు  అంజని, జనకుని నామము కేసరి. ఆ  దంపతులకు నేను పవనుని వరము  వలన జన్మించితిని. అందువలన నాకు 'పావని' యనియూ, 'మారుతి' యనియూ నామదేయములు కలిగినవి. అంజని సుతుడను కనుక 'ఆంజనేయుడ' నియూ పిలిచెదరు. 'హనుమంతుడు' అన్న అభిధానము కూడ ఉన్నది" అన్నాడు.
    లక్ష్మణుడు: వానరోత్తమా, నీకా అభిధానము (పేరు) ఎట్లు వచ్చినది?
    హనుమంతుడు: నేను శైశవమున నొకనాడు ఎర్రని సూర్య బింబమును చూచి పండు అనుకొని ఆ ఫలమును  కోసి తెచ్చుకొని తినవలెనన్న కోరికతో మూడు వందల యోజనముల ఎత్తు ఆకసములోనికి ఎగిరిపోయినాను. దేవేంద్రుడు నన్ను జూచి  అగ్రహాముతో  "లోక బాంధవుడగు సూర్యుని కబలింప బోవుచుంటివా దుష్టుడా?" అని వజ్రాయుధముతో  నా ముఖ మందలి కుడివైపు హనువు (చెక్కిలి) పైన కొట్టి గాయపరిచినాడు. ఆ దెబ్బకు  నేనో కొండపైన పడగా నా యెడను హనువుకూడ గాయపడి నేను మూర్చిల్లినాను. నేను వాయువు వరము వలన జన్మించితిని కాన ఆ దేవునకు నాపై అభిమానము మెండు. వాయుదేవుడు నన్ను సేదదేర్చినాడు. "శిశువు మీదనా  వజ్రాయూధము  ప్రయోగించుట?" అని ఆయన మహేంద్రుని పై ఆగ్రహించి వీచుట మానివేసినాడు. బ్రహ్మదేవుడు మరుత్తు (వాయువు )ముందు నిలిచి "పవనుడా నీవు జగత్ర్పాణుడవు; నీచక స్తంభించి పోయినచో ప్రాణికోటి ఊపిరాడక నశించిపోవును శాంతించుము నీ చలనముణు వీడక విశ్వమును కాపాడుము... ఈ వానరకిశోరము ఆంజనేయునకు అశ్వనీ దేవతలచే చికిత్సను చెయించెదను; వజ్రాయూధము వలన కాని బ్రహ్మస్త్రము వలన కాని మరియే అస్త్రము వలన కాని  వీనికి హానిజరుగకుండనూ జరయూ రుజయూ (వృద్దాప్యమూరోగమూ) లేకుండగనూ వరము నొసంగినాను... అంతియె కాదు; వీడు చిరంజీవి యగును' అని  వచించి  వెడలినాడు. చికిత్స వలన  హనువులపై గాయములు పోయి వాటి స్ధానమున మచ్చలు ఏర్పడినవి. ఆ మచ్చల వలన హనువులు నా ముఖమున స్పష్టముగా  కనబడుచూ నాకు 'హనుమంతుడు' (హనువులు కలవాడు) అన్న  పేరును తెచ్చినవి.

 Previous Page Next Page