10. మార్జిన్
ఒకవ్యక్తి తను ఉపయోగిస్తున్న కాగితం మీద ఖాళీ స్థలాన్ని ఏవిధంగా వినియోగించుకుంటాడు అనేదాని మీద అతడి యొక్క వ్యక్తిత్వం,డబ్బు ఖర్చుచేసే విధానం, సమాజంలో అతను కోరుకునే స్థానం మొదలైన విషయాలన్నీ ఆధారపడి వుంటాయన్నది నమ్మశక్యం కాకపోయినా యధార్దం.
మనం అప్పుడప్పుడూ గమనిస్తూనే వుంటాం. ఇన్ లాండ్ లెటర్లో వుత్తరాలు వ్రాసేవారు ఊరిపేరు, తేదీ వేసాక చాలా ఖాళీస్థలం వదిలిపెట్టి, 'ప్రియమైన'... అంటూ మొదలు పెట్టి, ఉత్తరం పూర్తిచేయలేక మళ్లీ ఆ చివరి పేరాగ్రాఫుల్ని ఉత్తరం ప్రారంభంలోనో, లేక అడ్డంగా త్రిప్పో వ్రాసి ఉత్తరం పూర్తి చేస్తుంటారు. అప్లికేషన్ ఫారమ్స్ లోనో, లేక తెల్లకాగితం మీద అర్డీ వ్రాయవలసి వచ్చినప్పుడో కొంతమంది కాగితం మొదట్లోనో FROMఅని మొదలు పెట్టి, ఆ కాగితాన్ని ఖాళీగా వదిలేయడం కూడా చూస్తూనే వుంటాం.
అలాగే కొంతమంది కాగితాన్ని ఎడమవైపు మార్జిన్ చాలా ఎక్కువగా వదులుతారు. మరికొంతమంది ఎడమవైపుకన్నా కుడివైపు ఎక్కువ స్థలం వుండగానే ఆ వాక్యాన్ని వ్రాయడం ఆపేసి మల్లీ కిందలైనులో వ్రాయడం ప్రారంభిస్తారు.
ఇదేవిధంగా కొంతమంది అయిదారు పేజీలు వ్రాయవలసి వచ్చినప్పుడు మొదటిపేజీలో ఇంకా నాలుగయిదు అంగుళాల స్థలం వుండగానే పేజీ తిప్పేసి రెండవ పేజీ ప్రారంభిస్తారు.
ఇలా రకరకాల వ్యక్తులు కాగితాన్ని రకరకాలుగా వినియోగించడాన్ని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని విశ్లేషించవచ్చు.
ఎడమవైపు మార్జిన్ ఒక మనిషి యొక్క గత జీవితపు అనుభవాల్ని, గత జీవితంలో అతడు పొందిన ధైర్యాన్ని లేక అభద్రతాభావాన్ని, అతడిమీద మిగతా వ్యక్తుల ప్రభావాన్ని సూచిస్తుంది. ఎడమవైపు మార్జిన్ ఎమోషన్ ని, మనిషి యొక్క ప్రస్తుత పరిస్థితిని కూడా సూచిస్తుంది. అలాగే కుడివైపు వాక్యం కాగితం చివర వరకు వ్రాయకుండా ఎంతోఖాళీ స్థలం వుండగానే తరువాత లైనుమొదలు పెట్టాడూ(కుడివైపు మార్జిన్) అంటే, ఆ ఖాళీ వదిలే మనస్తత్వం మీద ఒక వ్యక్తియొక్క భవిష్యత్ దృక్పధం ఆధారపడి వుంటుంది. ఒక వ్యక్తి ఎడమవైపు మార్జిన్ ఎంత వదిలిపెట్టాడో, కుడివైపు మార్జిన్ కూడా అంతే వదిలిపెడితే అతడు చాలా రిలాక్స్ డ్ గా బ్రతికే మనిషి అని నిర్దారణకి రావచ్చు. అలాగే, కుడి ఎడమల తక్కువఖాళీ వదిలితే అతడు న్యాచురల్ గానే అభద్రతా భావానికి తరచులోనయివుంటాడు.
ఇవన్నీ ఎవరైనా చెప్పగల సాధారణ విషయాలు. ఇంకా లోతయిన విశ్లేషణలు ఈ ఛాప్టర్ లో చర్చిద్దాం.
ఎడమవైపు మార్జిన్:
1.ఎడమవైపు ఎక్కువ మార్జిన్ వదిలి వ్రాసే వారు స్వశక్తి మీద ఎక్కువ ఆధారపడతారు. పిత్రార్జితం మీద ఎక్కువ ఆశ వుండదు. సాధారణంగా వీళ్లు ఎక్కువ సంస్కారవంతులై వుంటారు. డబ్బు సంపాదన పట్ల ఎక్కువ ఆసక్తి కలిగివుండి విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. సాధారణంగా రిజర్వ్ డ్ గా వుంటారు. జనంలో కలవటానికి ఎక్కువ ఇష్టపడరు.
ఎడమవైపు మార్జిన్ పేజీ మొదట్లో ఎంతుందో చివరివరకూ అదే మార్జిన్ మెయిన్ టెయిన్ చేస్తూ, అది అవసరమైన దానికన్నా కొంచెం ఎక్కువ విశాలంగా వుంటే ఆ వ్యక్తులు ఇతరుల నుంచి సాధారణంగా ఏ సహాయమూ కోరరు. అలాగే ఇతరులకి సహాయం చేసే గుణం కూడా అంతగా వుండదు. కానీ నిజంగా అవతలి వారికి అవసరమున్నట్లయితే వాళ్ళు అడిగిన దానికన్నా రెండింతలు ఎక్కువ సహాయం చేస్తారు.
దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఉదయాన్నే వీళ్లు పేపరు చదువుకుంటున్నప్పుడు శ్రీమతివచ్చి "స్టవ్ లో కిరసనాయిలైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు" అని గొడవ చేస్తే అసలా మాటలే విననట్లు పూర్తిగా ఆ పేపర్లో తల దూర్చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం వాళ్ళావిడ ఇంట్లో ఉండేటప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపులు తట్టి కొత్తగ్యాస్ స్టౌ, దానితో పాటు సిలిండర్ తెచ్చి అమరుస్తారు. ఇలాంటి వ్యక్తుల శ్రీమతులు అవేవో తమ తండ్రిగారు పంపారనుకోనవసరం లేదు. ఇలాంటి వ్యక్తులతో సంసారం ఈ విధంగానే వుంటుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు, అనుకొని సమయాల్లో సంతోషకరమైన కార్యాలు చేయటానికి వీరు ఇష్టపడతారు.