పానకాలు ఇంక పరుగెత్తలేక ఆగిపోయాడు.
"ఒరేయ్! మీరిద్దరూ ఎక్కడ కనబడ్డా మర్డర్ చేస్తాను_ రోజులు లెక్కపెట్టుకోండి" అన్నాడు బిగ్గరగా అరుస్తూ.
చంద్రకాంత్ ఆటో ఎక్కి ఒకవేళ పానకాలు ఇంకా వెంబడిస్తున్నాడేమో అన్న అనుమానంతో కొంతదూరం వెళ్ళాక ఇంకో ఆటో ఎక్కి రైల్వేస్టేషన్ చేరుకుని అప్పుడే ఖమ్మం వేపు వెళుతున్న రైలెక్కేశాడు.
అతని భార్య అష్టలక్ష్మి తలుపు తీయగానే చిరునవ్వు నటిస్తూ లోపలికొచ్చాడు.
"ఏమిటలా వున్నారు?" అడిగింది అష్టలక్ష్మి అనుమానంగా.
"అబ్బే... ఎలా వున్నాను? బాగానే వున్నాను" అంటూ కంగారుని కప్పిపుచ్చుకోడానికి "లలలా_ లాలలలా" అంటూ సినిమా ట్యూన్ పాడాడు.
దాంతో అష్టలక్ష్మి అనుమానం మరింత పెరిగిపోయింది.
"నిజం చెప్పండి! హైదరాబాద్ ఆటోలో దాన్నెవత్తెనో వేసుకుని తిరిగారా లేదా?" నిలేసిందామె ఊరికే దబాయించి చూద్దామని.
ఆమె దబాయింపుకి దభేల్ మని పడిపోయాడు చంద్రకాంత్.
"అదా... అదీ... అది... మన క్రియేటివ్ హెడ్ గారెవర్నో డ్రాప్ చేయమంటేనూ... తీసుకెళ్ళి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాను.."
"బెల్ట్ తీసుక్కొడతాను నిన్నూ, నీ క్రియేటివ్ నీ_ పద ఇప్పుడే తేల్చుకుంటాను. అదెవత్తో_ దాన్ని వాడు మీతో ఎందుకు పంపించాడో.."
"ఏమిటే ఆ పిచ్చివాగుడు_ ఆమె ఎవరనుకుంటున్నావ్? ఫేమస్ హీరోయిన్ నీలిమాదేవి."
"సిగ్గు లేకపోతే సరి_ దాన్ని హీరోయిన్ అనడానికి! బూతుశాస్త్రం ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే లావార్సీదాన్ని పట్టుకొచ్చి హీరియినంటావా? దాని క్యారెక్టర్ ఎప్పుడూ పదిమందితో తిరగటమేగా? అయినా దాంతో మీకేమిటి పని? ఏ సంబంధమూ లేకపోతే మీతో ఎందుకొచ్చింది? రోడ్డున పోయేవాడి నెవడినడిగినా నెత్తినెక్కించు కెళ్తారుగా".
"ఛ! బై గాడ్ చెప్తున్నానే_ నేనెప్పుడూ, ఎవరినీ అలాంటి దృష్టితో చూడను."
"బెల్ట్ తీసుక్కొడతాను అబద్ధాలు కూశావంటే_ నేను పుట్టింటి నుంచి ఆ రోజు సడెన్ గా వచ్చేసరికి ఇంట్లో నువ్వూ, నీ సినిమాల్లో ఎక్ స్ట్రా...."
"అబ్బా! అది వేరే! ఆ రోజు నన్ను అదే బలవంతం చేసింది_ అయినా ఆ రోజు నీకు ప్రామిస్ చేశాను కదా ఇంకెప్పుడూ ఆడదానివంక కన్నెత్తి చూడనని"
ఆమె కొంచెం శాంతించింది.
"మరిప్పుడు ఆటోలో ఆ బూతు హీరోయిన్ని.."
"అబ్బా! ఇది ఆబ్లిగేషనే. చెప్పిన పని చేయకపోతే వాడు నాతో సీరియల్ రాయించడు చేయడు. రాయించకపోతే మనకి నెలనెలా వచ్చే సంపాదన తగ్గిపోతుంది."
"ఎందుకొచ్చిన సంపాదన అది_ బోడి సంపాదన_ సగం వాడికే ఇవ్వాలి. కొంత వాడి పార్టీలకు తగలెయ్యాలి_ ఇంకేమిటి మిగిలేది?"
"అసలు రచయిత కాకపోయినా మనకెంత పేరొచ్చిందో చూడు ఆంధ్రదేశమంతా మోగిపోతోంది. డబ్బు కొంచెం తక్కువస్తేనేం?"
"ఇదిగో_ నువ్వేమయినా చెయ్ వప్పుకుంటానుగానీ, ఇంకోదాంతో వ్యవహారంలోకి దిగావంటే మాత్రం బెల్ట్ తీసుక్కొడతాను. తర్వాత మా పుట్టింటికెళ్ళిపోతాను. మా వూళ్ళో ఇప్పటికీ నన్ను పెళ్ళిచేసుకోడానికి సిద్ధంగా వున్నాళ్ళు ఇద్దరున్నారు_ తర్వాత మీ ఇష్టం."
చంద్రకాంత్ ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
"ఎందుకంత కోపం? అలాంటి వేషాలేమీ వేయనని నీకు ప్రామిస్ చేశాను కదా_"
స్నానం చేసి తన గదిలో కూర్చుని మెయిల్ ఓపెన్ చేసేసరికి సీతాగోపాల్రావ్ అనే ఆమె ఇచ్చిన మెయిల్ కనిపించింది.
"హలో_ మీరే మా ఆయన ఫ్రెండ్_ ఒకసారి అర్జంటుగా మా యింటికి రండి! ఇదీ నా అడ్రస్. నేనిలా మెయిలిచ్చిన విషయం మా ఆయనకు చెప్పకండి. నేను మీ ఫాన్ని. మీర్రాసిన టీవీ సీరియల్స్ చూస్తున్నాను"
సీతాగోపాల్రావ్ ఎవరో ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి. ఒకవేళ క్రియేటివ్ హెడ్ నీలకంఠం కేసేమో.
ఎప్పుడో తనతోపాటు ఆటో ఎక్కి వుంటుంది. దారిలో తను కూడా లైట్ కొట్టి వుంటాడు. అందుకని వాళ్ళాయన లేనప్పుడు రమ్మని మెయిలిస్తోంది.
మరికొద్దిసేపు నీలకంఠం ఛానెల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ తాలూకూ హీరోయిన్స్ అందరి పేర్లూ గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాడతను.
సీత అనే పేరు ఎక్కడా తగలటం లేదు.
"ఎవరిచ్చారా మెయిల్?" అడిగింది అష్టలక్ష్మి.
చంద్రకాంత్ అదిరిపడ్డాడు.
"ఆ_ ఇదా_ ఇదీ_ ఇది_ ఆ_ మా ఫ్రెండ్ దగ్గర్నుంచి_ మా క్లోజ్ ఫ్రెండ్ లే" అతని కంగారు అనుమానం కలిగించిందామెకి.
"పేరేంటి?"
"గోపాల్రావ్"
"ఆ పేరెప్పుడూ మీ దగ్గర విన్నట్లు లేదే?" మరింత అనుమానంగా అడిగింది.
"భలేదానివే_ నేను ఎప్పుడూ వాడినే తల్చుకుంటాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా_ కల్సుకోవాలని ట్రై చేస్తుంటాను. కానీ కలుసుకోవటం కుదరటం లేదు."
"అంటే అతను హైదరాబాద్ లో వుంటాడా?"
"అవును!"
"ఇప్పుడెందుకు మెయిలిచ్చాడు?"
"ఏమిటో_ పిచ్చి వెధవ. నేనంటే తెగ ప్రేమ_ రేపు వాడి బర్త్ డే అట. నేను లేకుండా చేసుకోవటం యిష్టం లేదట."
"అంటే రేపు కూడా హైదరాబాద్ వూరేగుతారన్నమాట."
"తప్పదు కదా! పాపం వెళ్ళకపోతే వాడు చాలా ఫీలవుతాడు."
"ఆ వంకతో మళ్ళీ దేన్నో ఆటోలో వేసుకుని తిరగడానికి ప్లాను."
"ఛ! అవన్నీ మానేశానే అని చెపుతున్నా కదా."
ఆమె లోపలకు వెళ్ళగానే సీతాగోపాల్రావ్ అడ్రస్ చూసి తన డైరీలో రాసుకున్నాడతను.
అనుకోకుండా దొరికింది కేస్_ ఇంతకూ అందంగా వుంటుందో లేదో_ ఆ_ ఎలా వుంటే తనకేం?
కొంచెం వయసులో వుంటే చాలు.
ఆ రాత్రి అతనికి ఎగ్జయిట్ మెంట్ తో నిద్రపట్టలేదు.
మర్నాడు తను, ఆ సీతాగోపాల్రావ్ తో జరపబోయే ప్రణయం తాలూకు సెక్స్ సీన్లు కళ్ళముందు కనిపించి చక్కిలిగిలి పెడుతున్నాయ్.
అతని పక్కనే పడుకున్న అష్టలక్ష్మికి కూడా నిద్ర పట్టడం లేదు.
ఆ మెయిల్ గురించి చంద్రకాంత్ యిచ్చిన వివరణ ఆమెకు సంతృప్తి కలిగించలేదు. అతను ఏదో దాస్తున్నాడని అనుమానం కలిగింది.
నిజం తెలుసుకోవాలంటే అతని మెయిల్ పక్కింటి కాలేజ్ స్టూడెంట్ సుజాతతో చదివించుకుని ఆ ఇంగ్లీష్ కి అర్థం తెలుసుకోవాలి.
తనకు ఇంగ్లీష్ రాకపోవటం ఓ పెద్ద సమస్య అయిపోయింది.
తెల్లారుజామున అయిదింటికి మెలకువ వచ్చినప్పుడు సుజాతో ఆ మెయిల్ చదివించి అడ్రస్ నోట్ చేసుకుంది అష్టలక్ష్మి.
* * * *