వాలి సుగ్రీవులు ఇంద్ర సూర్యుల వల్ల అహల్యకి పుట్టినవాళ్ళు. అంజన గౌతముడికి పుట్టిన కూతురు.
గౌతముడు వాలి సుగ్రీవులు తనకు పుట్టినవాళ్ళే అనుకుని ఎత్తుకుని తీసుకెళ్తుంటే అంజన "నాయనా! నీ కన్నకూతుర్ని నడిపిస్తూ ఎవరికో పుట్టిన వాళ్ళను ఎత్తుకుంటావా?" అని అసలు రహస్యం చెప్పేసింది.
గౌతముడు కోపంతో వాళ్ళని సముద్రంలోకి విసిరేస్తూ "నా కొడుకులు కాకపోతే కోతులుగా మారిపోండి" అని శపించాడు.
తన రహస్యం బయట పెట్టినందుకు అహల్యకి కోపం వచ్చి "నీ కడుపున కోతి పుడతాడు" అని కూతుర్ని శపించింది ఆగింది అనిల.
"గమ్మత్తుగా ఉంది మీరన్నట్లు. ఈ కథలు ఆనాటి సామాజిక జీవితంలో చీకటి కోణాలకి సంకేతాలేమో! తరువాత శిల్పం?" అడిగాడు రవి.
"అది కుబేరుడుది. మీరు గమనించారో లేదో కాని లేపాక్షి శిల్పాల లోనూ, ఎల్లోరా శిల్పాలలోనూ కూడా కుబేరుడు పొట్టిగా పెద్ద బొజ్జతో చేతి సంచీతోనే ఉంటాడు. యక్షులని సాధారణంగా పొట్టివాళ్ళుగానే చెక్కుతారు చిత్రిస్తారు. ఎందుకో తెలీదు. అజంతా చిత్రాలలో సహితం, అవి భౌద్ధ చిత్రాలయినా, మరుగుజ్జులయిన యక్షులు కనిపిస్తారు. కుబేరుడు శివుడికి స్నేహితుడు. అతడికి అలకాపురాధిపత్యం ఇచ్చిందీ సంపదల నిచ్చిందీ శివుడే! అయినా ఇతడు కైలాసానికి వెళ్ళి శివుడి తొడమీద ఉన్న పార్వతినే లాలసతో చూశాడట. పార్వతి తీక్షణ వీక్షణం వల్ల అతడి కన్ను పేలిపోయిందట? ధనమదాంధుల ప్రవర్తనలిలాగే ఉంటాయని కాబోలు, ఈ కల్పనా శివపురాణంలోది"
"ఈ శిల్పాలు నిధి రహస్యానికి సంబంధించినవి కావచ్చు" అప్రయత్నంగా వచ్చింది రవి నోట.
ఒక్క క్షణం నిశ్శబ్దం!
"ఎలా?" ఆతృతగా అడిగాడు విష్ణు.
"కేవలం ఊహ! ఇవే శిల్పాలు. మళ్ళీ మళ్ళీ ఉండబట్టి...కుబేరుడు సంపదకి అంటే నిధులకి ప్రతీక కదా! ఇక్కడ సముద్రంలాంటి నీటి వసతి ఉన్నచోట నిధులు ఉన్నాయని ఊహించొచ్చునేమో! నీటి వసతి ఉన్నచోట చెట్లకి కాయలూ, పళ్ళూ ఉంటాయి కనుక, కోతులు తిరుగుతాయి."
"ఇక్కడా? సముద్రంలాంటి నీటి వసతా?" నీరసపడిపోయాడు విష్ణు. మండు టెండలు, రాతికొండలు, బిందెడు మంచినీళ్ళ కోసం మైళ్ళకొద్దీ ప్రయాణం చేసే పల్లెజనం. బక్క చిక్కిన లోతులేని ఒకే ఒక కాలువ.
రవి కూడా అలాగే నీరసపడిపోయాడు.
ఆ ప్రాంతాలలో నీటి వసతి అతడి ఊహకి కూడా అందటం లేదు.
మెరుపులా స్ఫురించింది. ఆ రోజు కాషాయాంబధారితో కలిసి ఆకాశ మార్గాన బెంచీలో వస్తున్నప్పుడు కోతుల కిచకిచలు వినిపించాయి. అప్పుడంతగా పట్టించుకోలేదు. అక్కడెక్కడైనా పెద్ద చెరువు కానీ, నది కానీ ఉండే అవకాశం ఉందా?
ఆ పాతకాలపు రాతి కోటకి అన్ని జాగ్రత్తలెందుకు?
ఒకవేళ దేనికీ, నిధికీ ఏమైనా సంబంధం ఉందా?
అడవిలో కాలిబాట రెండుగా చీలినచోట కాషాయాంబధారిణి తనను ఏనుగుల గుంపు బారి నుండి తప్పించిన చోట నిలబడ్డాడు రవి.
రెండు కళ్ళూ మూసుకుని, తన మానసిక శక్తినంతా కేంద్రీకరించి, దేవిని ప్రార్థించాడు.
"ఓ దేవీ! నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెక్కడుంటావో అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా నాకు తెలీదు. నీకూ, ఇక్కడ ఉంది అని చెప్పబడుతున్న నిధికీ ఏదో సంబంధం ఉందని నా అనుమానం. నిధి నిక్షేపాల మీద నాకేమీ ఆశలేదు. చారిత్రకాంశాలు తెలుసుకోవాలని మాత్రమే నా ఆరాటం. దయచేసి నాకు సహకరించు."
పరిసరాలను మరిచి ఒక గంట వరకూ మనసులో దేవిని నిలుపుకుని తదేకంగా ప్రార్థించాడు.
కళ్ళు తెరిచి చుట్టూ ఆశగా చూశాడు. కాషాయాంబధారులెవరూ కనబడలేదు. అతడికి మొదట నిరాశ కలిగింది. ఆ తర్వాత కోపం వచ్చింది తనమీద తనకి.
అంతలో నవ్వొచ్చేసింది. భ్రమలకు మానవుడు ఎంత తేలిగ్గా వశుడౌతాడు అనే భావన కలిగేసరికి, ఇదేమైనా సినిమానా? "హా! దేవీ!" అని ప్రార్థించగానే బాగ్రౌండ్ మ్యూజిక్ తో సహా దేవి ప్రత్యక్షం కావటానికి?
చదువుకున్న తను, తర్క బద్ధంగా ప్రతి విషయాన్నీ విశ్లేషించుకునే తను, దేవుళ్ళలోనూ దయ్యాల లోనూ ఏ కోశానా నమ్మకం లేని తను, ఈ రకమైన వ్యామోహంలో పడిపోయాడు.
ఇక చదువు సంధ్యలు లేని అమాయకులైన గిరిజనులు, పల్లెప్రజలు దేవుళ్ళ దయ్యాల భ్రమలలో చిక్కుపోయి, ఆ భ్రమలే యదార్థమనుకోవటంలో విడ్డూరమేముందీ?
"చిల్లర రాళ్ళకు మొక్కుతూ ఉంటే, చిత్తము చెడునుర ఒరే! ఒరే!" అని తనను తాను మందలించుకుని నృసింహస్వామి లోయకి దారితీశాడు. దైవ విగ్రహం రెండు నేత్రాలనూ మరోసారి దగ్గర్నుంచి చూడాలని అనుకున్నాడు. కొత్త విశేషాలు స్ఫురించవచ్చు. ఏవైనా క్లూలు దొరకవచ్చును. రెండువైపులా ఎత్తయిన కొండలు ఆ రాతి కొండల మధ్య మట్టి దిబ్బల మీద గుబురుగా పెరిగిన ఏవో మొక్కలు.
నీటి కొరత ఉన్న ఈ రాతి ప్రదేశంలో ఈ పచ్చదనం ఎక్కడి నుంచి చీల్చుకుని వస్తోంది?
ఈ ప్రశ్న చాలాసార్లు తలెత్తింది మనసులో. నడుస్తున్న వాడు చటుక్కున ఆగిపోయాడు.
ఎదురుగా ఒక ముసలమ్మ గుండె బాదుకుంటూ ఏడుస్తూ వస్తోంది. నలుగురయిదుగురు గిరిజన యువతులు ఆమెను పట్టుకుని నడిపించుకుని వస్తున్నారు.
"ఏం జరిగింది. ఈ ముసలమ్మా ఎందుకిలా ఏడుస్తోంది" అడిగాడు రవి.
ఈ మాత్రం ఓదార్పు వినగానే ముసలమ్మ ఏడుపు మరింత్ ఎక్కువయిపోయింది.
"ఆడిని జోగులమ్మెత్తుకుపోనూ..."
"ఆడి వంశం దుంప నాశనమయిపోనూ..."
"ఆడి నోట్లో మట్టి పడ...."
ఏడుస్తూ, ఒగరుస్తూ శాపనార్థాలు పెట్టేస్తోంది.
"ఏం జరిగిందీ?" పక్కనున్నవాళ్ళని అడిగాడు రవి. ఒకావిడ వివరించింది జరిగిన విషయం.
సహకార సంఘాల సుబ్బయ్య, గేదెలు కొనుక్కోవటానికి ప్రభుత్వం నుంచి అప్పులిప్పిస్తానని గిరిజనుల దగ్గిర్నుంచి ఒక్కొక్క కుటుంబానికీ యాభై రూపాయల చొప్పున వసూలు చేశాడు. అప్పు శాంక్షన్ కావాలంటే బ్యాంక్ అధికారుల చేతులు తడపాలనీ, అందుకోసం డబ్బు కావాలనీ గిరిజనులను నమ్మించాడు.
అప్పు శాంక్షన్ అయింది. గిరిజనులకి కాదు. సుబ్బయ్య తమ్ముడి కొడుక్కి. అతడు గేదెలు కోనేసుకున్నాడు కూడా. సుబ్బయ్యకి లంచం సమర్పించుకున్న కుటుంబాలన్నీ "మాసంగతేమిటని" గోల పెట్టాయి.
కొన్ని కుటుంబాలు భరించలేక సుబ్బయ్య ఇంటిమీద పడి "మా డబ్బు మాకిచ్చెయ్య"మని గోల చేశారు.
"మీ డబ్బు నా దగ్గిర లేదు. మీకు అప్పులు శాంక్షన్ చెయ్యటానికి బ్యాంక్ అధికారులకిచ్చేశాను" అన్నాడు సుబ్బయ్య.
"అతడినడిగి పట్టుకురా?" అన్నారు వాళ్ళు. దానితో "మీరసలు డబ్బియ్యలేదు, నేను తీసుకోలేదు" అనేశాడు సుబ్బయ్య.
అక్కడితో గిరిజనులు విజృంభించి కర్రలతో అతడి ఇంటిమీద పడ్డారు. సుబ్బయ్య ఇంట్లో దూరి తలుపెసుకున్నాడు. అతడి తమ్ముడు దొడ్డిదారిన వెళ్ళి పోలీసులని పిలుచుకొచ్చాడు.
పోలీసులు సుబ్బయ్య ఇంటి ముందు గొడవ చేస్తున్న గిరిజనులనందరినీ అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకుపోయారు. వాళ్ళలో వయసులో వున్న ముసలమ్మ కూతురు కూడా వుంది.
కర్మకాలి ఆ కూతురి విషయంలో జరగరానిదేమైనా జరిగితే ఆ పిల్ల బతుకు నాశనమైపోతుంది. తప్పెవరిదీ? అని ఆలోచించకుండా కులం వాళ్ళు వెలివేస్తారు. మొగుడు వదిలేస్తాడు. ఆ తరువాతా అమ్మాయి చావకుండా బతికుంటే, ఆ బతుకు ఎలా వుంటుందో ఊహించుకోవలసిందే!