Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 25

   
    "అన్నయ్య దగ్గరకి నాన్నగారూ!" అంది తొట్రుపాటుతో.

 

    మరుక్షణంలో ఆయన ముఖమంతా కోపంతో నిండిపోయింది. అయినా కోపాన్ని దిగమ్రింగుకొని 'ఎందుకు వెళ్ళావమ్మా ఆ విశ్వాసం లేనివాడి దగ్గరకు?" అన్నాడు భారంగా.

 

    ఆశ ధైర్యం తెచ్చుకుని 'ఎల్లుండి చిన్నన్నయ్య మలయా వెడుతున్నాడుగా నాన్నగారూ!" అంది.

 

    "అయితే...?"

 

    ఆమె గుటకలు మ్రింగి "మన ఇంటికి రాకుండా..."

 

    "వాడిని బ్రతిమాలటానికి వెళ్ళావా ఆశా?"

 

    కూతురు ఏమీ జవాబు చెప్పలేక తలవంచుకుంది.

 

    "వాడి యిష్టం. వాడు మలయా వెడతాడో, ఆఫ్రికాకే వెడతాడో ఏమయినా చేసుకోనీ! నాకేం సంబంధంలేదు. వాడి అహంభావానికి పశ్చాత్తాపపడే వరకూ వాడి వూసు నేను పట్టించుకోను. వాడికి మించిన పట్టింపు వుంది నాకు. అన్నం తిన్నావా?"

 

    "లేదు నాన్నగారూ! తింటాను" అని బ్రతుకుజీవుడా అనుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది ఆశ.

 

    ఓ అరగంట గడిచాక విశ్వనాథంగారు భార్య వంటరిగా వున్నచోటుకు వెళ్లి అటూ యిటూ చూసి రహస్యంగా "సుందరం ఏమన్నాట్ట ఆశతో" అన్నాడు.

 

    లలితమ్మగారు నిట్టూర్చి విషాదంగా "వాడి పట్టు వాడు విడవలేదు. ఏమయినా సరే తనుగా తాను ఇక్కడకు రాడట! ససేమిరా తన ప్రయాణం మానుకోడట" అన్నది.

 

    "సరే సరే" అన్నాడు విశ్వనాథరావు కసిగా.

 

    కాని ఒక్క నిముషమయినా గడవకముందే ఆయన దిగజారిపోయాడు. "అయితే వాడు నిజంగానే పోతున్నాడా లలితా" అన్నాడు దిగులుగా. ఆయన కంఠస్వరం వణికింది.

 

    "ఇదంతా కలకాదండీ! ఒక్క రవ్వకూడా అబద్ధంలేదు. అన్నీ నిజాలే! అలా జరుగుతున్నాయి. మనం ఆపలేనివి. జరుగకూడనివి."

 

    విశ్వనాథంగారు ఆశ్చర్యచకితుడై భార్యముఖంకేసి చూశారు. ఆ శోకరేఖలు, విషణ్ణ చిహ్నాలు...! ఆయన హృదయం కలచివేసినట్లయింది. మెల్లగా ఆమెను సమీపించి "ఏం చెయ్యనే లలితా!" అన్నారు.

 

    నిజానికి ఈ జీవి ఈ అనంతకాలంలో ఎలాంటి మానసిక పరిణామాల నెదుర్కొన్నది? ఎంత వేదన సహించింది? జాలితో, దుఃఖంతో ఆయన హృదయం నిండిపోయింది.

 

    ఆమె అమీ అనలేదు. చెంగుతో కళ్ళు తుడుచుకుంది.


                                                                    *  *  *


    ఆశ మేడమీదకు వెళ్ళింది. చిన్నన్నయ్యా, వదినలని గురించే ఆమె ఆలోచిస్తోంది.

 

    ఇంతలో ఎదురుగా బల్లమీద ఓ కవరు కనిపించి ఉలికిపడినట్లయి దగ్గరకు వెళ్లి చూసింది. ఎప్పుడు వచ్చిందీ ఉత్తరం? తనకెవరూ చెప్పలేదేం! తాను జగన్నాథపురం వెళ్లినప్పుడు వచ్చివుంటుంది. వాళ్ల గొడవలో వాళ్లు పడి తనకు చెబుదామనుకుని మరిచిపోయి వుంటారు.

 

    ఆ ఉత్తరం చూస్తోంటే ఎందుకో ఆమెకు భయం కలిగింది. అది రాఘవరావు రాశాడు. ఆమె భర్త.

  

    ఆశా!

 

    నువ్వు వెళ్ళి చాలారోజులయింది. ఇంతవరకూ నువ్వు ఇక్కడకు రాలేదు. నీకు పొగరు బాగా ఎక్కువయింది. నేనంటే నీకు బొత్తిగా లక్ష్యం లేకుండా పోయింది. ఇక్కడకు వచ్చాక నీకు తన్నులూ, గుద్దులూ ఎలానూ వున్నాయి. ఈ ఉత్తరం అందగానే వెంటనే రాకపోతే నీకూ, నాకూ రాం రాం. నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఈ సంగతి మీ నాన్నకు చెప్పు.

                                                                                            రాఘవరావు.

 

    ఏమిటిది! అకారణంగా తనని దోషిని చేసి ఎందుకు దూషిస్తున్నాడు? తాను ఏం అపరాధం చేసింది? రానన్నదా! అతని మాటకెదురు చెప్పిందా! తనకు ఎందుకీ శిక్ష!

 

    ఆమె కంటినుండి కారిన నీరు చెక్కిలిమీద జాలిగా జారుతోంది.


                                            9


    ఆశ స్కూల్ ఫైనల్ చదువుతూన్న రోజులలో ఓ సాయంత్రం బడినుండి అలిసిసొలిసి ఇంటికి రాగానే తల్లి హడావుడి పడుతూ కనిపించింది. "రా తల్లీ రా. త్వరగా స్నానంచేసి బట్టలేసుకుని ముస్తాబుకా. ఎక్కువ టైంకూడా లేదు" అంటోంది.

 

    'ఏమిటమ్మా ఆ కంగారు? ఎందుకు యిప్పుడు నేను ముస్తాబు చేసుకోవాలి?" అనడిగింది ఆశ చికాకుపడుతూ పుస్తకాలు బల్లమీద గిరవాటు వేసి.

 

    "పెళ్ళి వారొస్తున్నారే నిన్ను చూడటానికి."

 

    ఆశ నెత్తిమీద పిడుగుపడినట్లయింది. కళ్ళు చీకట్లు క్రమ్మినాయి. 'నన్ను చూడడానికా? నాకు పెళ్ళా ఇప్పుడు" అంది గోడకు ఆనుకుని బలహీనంగా.

 

    "అవును. నీకేనే తల్లీ. ఆట్టే ఆలశ్యం చెయ్యక త్వరగా తెములు, వాళ్లు వచ్చేసరికి నువ్వింకా తయారుకాకుండా కూర్చుంటే మీ నాన్నగారు మండి పడతారు" అంది భయంగా.

 

    "నేను పెళ్ళి చేసుకోను" అంది ఆశ తల ఎత్తి సూటిగా.

 

    "చేసుకోవా! చేసుకోక ఏం చేస్తావు?"

 

    "చదువుతాను."

 

    ఈ మాటలు ఎక్కడ భర్తచెవిన పడతాయేమోనని లలితమ్మగారు హడలి పోతోంది. దగ్గరకు వచ్చి కూతురి తలమీద చేయివేసి నిమురుతూ లాలనగా, "అలా మొండితనం చేయకమ్మా. ఇవాళ సాయంత్రం రైల్లో వస్తున్నట్లు మధ్యాహ్నం హటాత్తుగా ఉత్తరం వచ్చింది. వాళ్ళను తీసుకురావటంకోసం నాన్నగారు స్టేషన్ కి వెళ్ళారు. ఓ పదినిముషాలలో వచ్చేస్తారేమో కూడా. స్నానం చేద్దువుగాని రావూ!" అంది బ్రతిమాలుతూ.

 

    ఆశలో కాస్త అహం తల ఎత్తింది. "నన్ను అడక్కుండా, నాతో చెప్పకుండా అసలు ఎందుకు ఇలా చేశారు?" అంది పౌరుషంగా.

 Previous Page Next Page