Previous Page Next Page 
అనైతికం పేజి 25


    ఆరైనా గది తలుపులు తెరవ లేదేమీ అనేమో నా అత్తగారు తలుపులు బాదుతోంది. "ఆఁ వస్తున్నా!" అనేసి రేగినజుట్టు సవరించుకుంటూ, ఎర్రబడ్డ కళ్ళని నులుముకుంటూ తలుపుతీశాను. నన్ను నిద్ర లేపేసి ఆవిడ స్నానానికి వెళ్ళింది. పూజచేయడంవల్ల జిడ్డోడుతున్న ఇత్తడి విగ్రహాల్ని నా తోడికోడలు చింతపండు, పీచు వేసి తోమేస్తోంది. ముందు వాటికి నూనెలు పట్టించి- తర్వాత ఇలా పీచుతో కడగట మేమిటా అని నవ్వొచ్చింది. మనుషులు తమ జీవితాల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారేమో! ముందు జిడ్డు పట్టించుకుని, తర్వాత తీరిగ్గా రోదిస్తూ 'పీచు' కోసం వెతకడం!

 

    టైమ్ చూసి అదిరిపడి పనిలోకి జొరపడ్డాను. కూర లేవీ తరిగి వుండకపోవడంతో చిరాకు వేసింది. విసుగుని దాచుకుంటూ స్టోర్ రూమ్ తలుపు తట్టాను. లోపలి నుంచి గొళ్ళెం పెట్టేసుందనుకుంటా. తోసినా రాలేదు. నిస్సహాయంగా అలాగే నిలుచుండి పోయాను.

 

    ఇంకోసారి ప్రయత్నిద్దామని తలుపు తట్టినా లాభం లేదు. ఏమిటీ అమ్మాయి? కొంపదీసి నా బావగారితో టూర్ కి కానీ చెక్కేయలేదుగా! ఆ ఆలోచనకి నాకే నవ్వొచ్చింది.

 

    ఆ గదికి అవతలివైపు కిటికీ వుంది. పోనీ అలా వెళ్ళి పిలిస్తే వినబడుతుందేమోనని అటుకేసి నడిచాను. అంతలో నా భర్త గదిలోనుంచి బయటికొచ్చాడు కళ్ళు నులుముకుంటూ. "ఆ అమ్మాయి నిద్ర లేచినట్లు లేదు" అని జవాబిచ్చి కదిలాను.

 

    "అదేమిటి!" అని అతనూ నా వెంటే వచ్చాడు.

 

    కిటికీ తలుపు రెక్కలు ఓరగా వేసున్నాయి. మెల్లగా తోసి పిలిచాను. లోపలికి తొంగి చూడడం నాకిష్టం లేదు. రెండు మూడుసార్లు పిలిచినా లాభం లేదు. మొహమాటంగానే కిటికీ రెక్కని పూర్తిగా లోపలికి తీసి పిలుస్తూ లోపలికి తొంగి చూశాను.

 

    అంతే! నా గొంతులోనుంచి వెలువడ్డ కేక దిగంతాలకు వ్యాపిస్తుంటే, ప్రపంచమంతా గిర్రున నా చుట్టూ తిరిగినట్టయింది.

 

    "ఏమైందేమైంది?" అని నా భర్త కంగారుగా పరుగెత్తుకు వచ్చి తూలిపడబోతున్న నన్ను పొదివి పట్టుకుంటూండగా నాకు స్పృహ తప్పింది. నాకు మెలకువ వచ్చేసరికి చాలా టైమ్ పట్టింది. నా ఆడపడుచు నా పక్కనే కూర్చుని వుంది. తల తిప్పి పక్కకు చూసేసరికి నా తోడికోడలు ఇంచుమించు నా పరిస్థితిలోనే వుంది. ఆవిడ మొహంలోనూ, మూసుకున్న కనురెప్పల చుట్టూవున్న గీతల్లోనూ కనిపించే విషాదం, దైన్యం చూసి నాకు దుఃఖం వచ్చింది. అంతులేని జాలి కలిగింది.

 

    నా అత్తగారు చేతిలో హార్లిక్స్ కప్పుతో గదిలోకి ప్రవేశించింది. ఆవిడ కూడా తనను తాను సంబాళించుకున్నట్లుగా కనిపించింది. ఆవిడ చంకనెక్కి, భయంగా బల్లిలా ఆమెనే అతుక్కుని బిక్కు బిక్కున చూస్తోంది నా కూతురు. న హృదయం ద్రవించిపోయింది.

 

    నేను తేరుకున్నాక ఒక్కొక్క విషయమూ మెల్లిగా తెలిసొచ్చింది. అది ఆత్మహత్య కాదనీ, నార్మల్ డెత్ అనీ డాక్టర్లు ధ్రువీకరించారు. చావుకి కారణం బ్రెయిన్ హెమరేజ్ అని రాశారు. కాబట్టి పోలీసు కేసు, ఇన్వెస్టిగేషనూ కాలేదు. అయితే ఆ సదరు డాక్టర్లు, పోలీసాఫీసార్లు నా కుటుంబానికి, ముఖ్యంగా నా బావగారికి మంచి స్నేహితులవడం కేవలం యాదృచ్చికం! మా బావగారు టూర్ నుంచి రాకుండానే ఇవన్నీ ఏర్పాటు చేశారు. మరో నాలుగు రోజులు గడిచాయి.

 

    ఒక రోజు సాయంత్రం- నా కూతురుని ఒడిలో కూర్చోబెట్టుకుని శూన్యంలోకి చూస్తున్న నాతో నా ఆడపడుచు కాస్త దూరంగా కూర్చుని- గుసగుసగా చెప్పింది. "చనిపోయేటప్పటికి తను గర్భవతి" అని.

 

    విన్నాక నేనేం షాక్ కాలేదు. ఆ అమ్మాయి మరణంకంటే ఆ అమ్మాయి గర్భం నాకు పెద్ద షాక్ కాదు.

 

                                                                   18

 

    మరుసటిరోజు నా బావగారు టూర్ నుంచి తిరిగి వస్తారు. నా తోడికోడలి చెల్లెలి ఆత్మహత్య, ఆ తరువాత పోలీసు కేసు మాఫీ, ఆ అమ్మాయి తాలూకు విషయాలు ఇంట్లో అప్పుడే మెల్లిగా మరుగునపడి మామూలు వాతావరణం చోటు చేసుకుంటోంది. నేనూ అ డెబ్బనుంచి కొద్దిగా తేరుకున్నాను. వెంటనే కాలేజీకి వెళ్ళడం ప్రారంభించాను.

 

    ఇంత జరిగినా- నా బావగారు టూర్ కాన్సిల్ చేసుకుని రాకపోవడం, తన 'స్నేహితురాలి' ఆఖరి చూపుకు ప్రాముఖ్యం ఇవ్వకపోవడం ఆయనపై విరక్తి పెంచింది. రేపు ఆయన ఎదురైతే ఎలా, ఏం మాట్లాడాలా అనే విషయం గురించి నేనాలోచించడం లేదు. నన్నో విధమైన నిర్లిప్తత ఆవరించింది.

 

    అయితే హఠాత్తుగా ఊహించని విధంగా తర్వాత రోజు మధ్యాహ్నం ఆయన వచ్చాడు. అతనితో వెళ్ళి- ఈసారి మేము కాన్ఫరెన్స్ హాలులో కూర్చున్నాం. బహుశా వాతావరణంలో వున్న గాంభీర్యానికి అనుగుణంగానేమో, నేనసలేమీ మాట్లాడలేదు. అలాగని అతను మాట్లాడుతుంటే తుంచేయాలనీ అనుకోలేదు. ఎందుకంటే మా సంబంధానికి కనీసం ఓ 'ముగింపు' ఇవ్వాలన్నా ఓసారి మాట్లాడుకోవడం అవసరం.

 

    "నేను పరమ దుర్మార్గుడిలాగానూ, ఆ అమ్మాయి ఆత్మహత్యకి కారణమైన మోసకారిగానూ, రేప్పొద్దున్న నిన్నూ అలాంటి స్థితిలోకి తీసుకువచ్చే నీచుడిలానూ నీకు కనిపిస్తున్నాను కదూ!" అన్నాడు. నేను మాట్లాడలేదు. చెప్పవలసినది ఏదో చెప్పేస్తే నా దారిన నేను గుడ్ బై కొట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అన్పించింది.

 

    తిరిగి అతనే అన్నాడు. "నువ్వు ఊహించుకుంటూన్నదంతా తప్పు. నువ్వు నిజమనుకుంటున్నదంతా అబద్ధం. ఇది ముందు గుర్తుంచుకో. ఆ తర్వాతే నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు".

 

    నేను నా చేతి గోళ్ళకేసి చూసుకుంటూ వుండిపోయాను. నాకెందుకో అక్కడి నుంచి బయటపడాలన్న కోరిక బలంగా కలుగుతోంది. అతను కాసేపు నాకేసి తదేకంగా చూశాడు. నా ముఖం చూసి అతనికే మనిపించిందో కానీ అతిమెత్తగా అన్నాడు.

 

    "దయచేసి అలా ఏమీ పట్టనట్లుగా మొహం పెట్టకు. నాకు చాలా బాధగా వుంటుంది. తార్కికంగా ఆలోచించు. నీకంటే  ఆ అమ్మాయి ఏ విషయంలో మెరుగని- నువ్వుండగా నేను తనతో స్నేహం చేస్తాను? చెప్పు. తనకి 'అమ్మాయి' అన్న అర్హత తప్ప మరింకేమైనా వుందంటావా?"

 

    "స్నేహం చెయ్యరు కానీ కార్లో పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతారు. అర్థరాత్రి ఆవిడ గదిలో మాత్రం గడుపుతారు కదూ!" మొహం మీద చరిచినట్లుగా ప్రశ్నించాను.

 

    "అవన్నీ చేస్తే స్నేహం చేసినట్టా?" అతను శాంతంగానే వున్నాడు.

 

    "నిజమే! స్నేహం కాదు, ఆనందం పొందడం! ఒక అమ్మాయి పల్లెటూరిదైనా, చదువులేనిదైనా సరే, మిమ్మల్ని ప్రేమిస్తోందన్న విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ అమ్మాయి తనంతట తాను ఆ ప్రేమని బహిర్గతం చేయకపోయినా, చేసే పరిస్థితుల్ని మీలాంటి వాళ్ళు కల్పిస్తారు. అంతవరకూ అందీ అందకుండా ఊరిస్తూ, వాళ్ళను రెచ్చగొడుతుంటారు. వాళ్ళ బలహీనతల్నీ, నిస్సహాయతనీ ఎక్స్ ప్లాయిట్ చేసి, ఓదార్పు పేరుతో వాళ్ళతో అనుబంధం పెంచుకుంటారు..."

 

    నేను చెప్తూనే వున్నాను. అతను నన్ను వారిస్తూ మధ్యలో కల్పించుకుని "ఛ....ఛ... అలాంటి సంబంధమేం లేదు మా మధ్య..." అనబోతుండగా "నేనూ అదే చెప్పబోతున్నాను. మీకు శారీరక సంబంధమే వుండి వుండకపోవచ్చు. ఆ అమ్మాయితో మీరు నాతో అన్నట్లుగా "ఐ లవ్యూ" అనుండకపోవచ్చు. కానీ తను మిమ్మల్ని ఆరాధిస్తోందన్న నిజం మీకు 'కిక్' ని ఇస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల్లో ఇంకో సంఖ్య పెరగడం మీ అహాన్ని సంతృప్తిపరుస్తుంది. తను మీ దృష్టిలో ఓ 'సంఖ్య'! వ్యక్తి కాదు. ఇదేకదా మీరు నాకు చెప్పాలనుకున్నది..." నేనంత తీవ్రంగా మాట్లాడగలనని నాకే తెలీదు.

 

    అతను కుర్చీలో వెనక్కువాలి నన్ను ఆసాంతమూ మాట్లాడనిచ్చాడు. ఆ తర్వాత అతను చెప్పింది నేను జీవితాంతమూ మర్చిపోలేదు.

 

    "నువ్వు చెప్పినదాంట్లో నిజం లేదని నేననను. ఆ అమ్మాయి నన్నారాధించిందో, లేదో నాకు తెలీదు. తను నామీద ఆధారపడడం అనేది నా అహాన్ని సంతృప్తి పరిచిందన్న విషయం నేను ఖండించలేను. నేను తనకో గాడ్ ఫాదర్ లా కనపించడం నువ్వన్నట్లు కిక్ ఇచ్చింది. అది మనిషి బలహీనత అనీ, ఇంకా చెప్పాల్సొస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కనీస మానసికావసరమనీ నేననుకుంటున్నాను. తప్పేముంది. దానివల్ల ఎవరికీ ఏమీ నష్టం లేదుగా..."

 

    నేను అతన్నే తదేకంగా చూస్తున్నాను. మనిషిలో బాగుండే బయటికి కనిపించని ఒక కోణాన్ని-కొత్తగా, విస్మయంగా, రవ్వంత జుగుప్సగా చూస్తున్నాను. అయితే అతని వాదన ఒక బాణంలా వచ్చి నాకే తగుల్తుందని నేనూ ఊహించలేదు. అతను కొనసాగించాడు.

 

    "మొదట నువ్వు నీ భర్తని ప్రేమించావు. అతని కోసం ప్రాకులాడావు. అతను నిన్ను నిర్లక్ష్యం చేస్తే జీవితం ఎడారే ననుకున్నావు. అంతలో నేను అదే పరిస్థితుల్లో నీకు కన్పించాను. ఇద్దరం ఒకరినుంచి మరొకరం ఓదార్పు పొందాం. ఈలోగా నీ కూతురు క్రమంగా నీ దినచర్యలో పెద్ద మొత్తాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. నువ్వు నాతోపాటు తనని కూడా 'ప్రేమించడం' మొదలుపెట్టావు. సంఘం దృష్టిలో నువ్వూ, నేనూ కూడా సంసారాలు బాగానే చేసుకుంటాం. ఇదంతా చూస్తుంటే నీకు ప్రేమ స్వరూపాలు ప్రతి స్టేజీలోనూ మారిపోతున్నట్లనిపించలేదూ..." అతను ఆగి సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అన్నాడు.

 

    "...నేను నువ్వు కావాలనుకున్న సమయంలో నీ కూతురికి అన్నం తినిపిస్తూ వుంటావు. కిటికీలోంచి వెన్నెల పడుతుండగా ఆర్తిగా నీ ఒడిలో కరిగిపోవాలనుకున్న క్షణంలో నువ్వు నీ భర్త పక్కన అటుతిరిగి పడుకునుంటావ్.." అతను నావైపుచూడకుండా తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు. "...అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటూనే వుంటావు. మనిద్దరికీ ఒకవైపు సమాజమూ, నైతిక నిబద్ధత కావాలి. మరోవైపు ప్రేమాకావాలి. అదంతా కేవలం పరస్పరావసరం అని నేనంటే- నీకిది రాతి హృదయపు వాదనలా కనిపిస్తుంది. నిజాయితీగా ఆలోచించి చూడు. నీ ప్రేమకన్నా నా ప్రేమ గొప్పదని నీకే అనిపిస్తుంది. ఎందుకంటే- కనీసం అందులో ఆత్మవంచన లేదు అవతలివారిని ఎత్తిపొడవడంలేదు. నువ్వు ఒప్పుకోని- కోలేని మరో నిజం చెప్పనా? ఏదో ఓ అద్భుతమైన క్షణంలో నీ భర్త తన తప్పులన్నీ తెల్సుకుని నువ్వు కావాలనుకుని వచ్చిన సమయంలో నువ్వు అతి తక్కువ 'గిల్ట్' తో నాకు గుడ్ బై చెప్పేసి అతనితో చెట్టాపట్టా లేసుకుని వెళ్లిపోతావు. నువ్వొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సమాజం నిర్దేశించిన మోరల్స్ నిన్నలా పురికొల్పుతాయి. ఆ ప్రాబబిలిటీ నా విషయంలోనూ వుంది. నా భార్య నేను కావాలనుకున్న విధంగా నన్ను చేరినప్పుడు నేనూ నిన్ను వదిలేస్తానేమో చెప్పలేను. అదే వివాహబంధం ప్రత్యేకత. నేను నీకు మొదటినుంచీ చెప్తుంది కూడా అదే..."   

 

    అతనింకా ఏదో చెప్తున్నాడు. నేను మాత్రం వినడం మానేశాను. అన్ని విషయాలు వదిలేస్తే 'నేన్నీకు మొదట్నుంచీ అదే చెప్తున్నాను, నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు' అనే అర్థంతో అతనన్న ప్రతీ మాటా నన్ను తీవ్రంగా గాయపర్చింది.

 

    ఆలోచిస్తే అతను చెప్పిందీ నిజమేనేమో! అతను మొదటి నుంచీ నన్నూ, నా భర్తనీ ఒకటి చెయ్యాలని ప్రయత్నించాడు. అందులో విఫలమైనంత మాత్రాన నేను వివాహబంధం పవిత్రతని కాలదన్ని ఇతనికి దగ్గరవ్వాలని లేదు కదా! నిజమే... అతను నన్ను ప్రేమించాడు. కానీ తనని ప్రేమించమని ఎప్పుడూ నన్నడగలేదు... నేనే అతన్ని ఎం....క...రే...జ్ చేశాను. అందుకు ప్రతిగా ప్రస్తుతం నేనతని ముందు వివాహబంధం లోని 'పవిత్రత' గురించి లెక్చర్ వినడానికి నిలబడవలసి వచ్చింది.

 Previous Page Next Page