Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 25


    "సారీ! ప్లెమింగ్ ఏదో పనిమీద పిలిస్తే వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడి మనిషోగాని తన రిసెర్చి వర్కులో సహితం అనుక్షణం నా అసిస్టెంట్స్ కావాలంటాడు."
    "మంచిదేగా అలా అన్యోన్యంగా ఉండటం" ఏమీ ఎరగనిదాన్లా అతి మామూలుగా అంది.
    "నేను క్లబ్స్ లోనూ, హోటల్స్ లోనూ డాన్స్ లు చేస్తున్నందుకు మనవాళ్ళలో చాలామంది నన్ను అసహ్యించుకున్నాడు. ఆధునిక భావాలున్న దానివి గనుక నువ్వొక్కదానివి నన్నర్ధం చేసుకున్నావు."
    "సారీ! నా ఆధునిక భావాలు నువ్వు చేసే కేబరే డాన్స్ లు చూసి హర్షించనూ లేదు. సమర్ధించనూ లేదు. ఆధునిక సంస్కారం రావాలని కోరుకోవటంతోపాటు ఆధునికత అంటే ఏమిటో సరిగా అర్ధం చేసుకోవాలి. సామాజిక ప్రగతికి- సర్వమానవాభ్యుదయానికి- దోహదం చేసేదే నిజమైన ఆధునిక సంస్కృతి. సామాజిక విధ్వంసనానికి దారితీసే ఆధునికతను ప్రోత్సహించకూడదు. ఆదిలోనే అణచేయాలి. కేబరే డాన్సులు సామాజిక పురోగతికి అవసరమని నేననుకోవడం లేదు." జేవురించింది దేవకి మొహం.
    "మీ ఆధునిక మహిళా మణులందరూ సరికొత్త ప్యాషన్ లలో అలంకరించుకొని నేను చేసే డాన్సులు చూడ్డానికి రావడం బాగుందేం?"
    "బాగుందని నేనన్నానా? మొన్న మొన్నటి దాకా ఇలాంటివి మన ఆంద్రప్రదేశ్ లో కూడా విరివిగా సాగుతున్నాయని నేనూహించనేలేదు. ప్రస్థుతం నేను తలపెట్టిన ప్రణాళిక పూర్తయిపోయాక లాయర్ యశోధరాదేవి గారి సలహాతో కేబరే డాన్సులు నిషేధించమని ఆందోళన ప్రారంభిస్తాము. మా మహిళా సంఘాలు తల్చుకుంటే సాధించలేనిదేముంది?" మాట్లాడలేక పోయింది దేవకి. వీళ్ళిద్దరి మాటలు లోపల్నించి వింటున్న వాడిలా మృదుల మాటలు పూర్తికాగానే లోపల్నించి తలుపు తెరుచుకుని ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు ఫ్లెమింగ్. యూరోపియన్ లకు సాధారణమైన తెలుపులో ఎరుపు కలిసిన శరీర ఛాయ, గెడ్డం బాగా పెరిగింది. కళ్ళకి నల్ల అద్దాల కళ్ళజోడుంది. అప్పుడప్పుడు అది తీసి చేత్తో పట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు అతని కళ్ళు ఏమాత్రం మతి స్థిమితం లేక తీవ్రమైన ఆందోళనతో సంచలిస్తూన్నట్లున్నాయి.
    "గ్లాడ్ టు మీట్ యూ!" అని చేతిని ముందుకు జాపాడు. ఆ చేతిని అందుకోకుండా నిరసనగా చూసింది మృదుల.
    "సారీ! ఆ రోజు జరిగిన సంఘటన మీరింకా మర్చిపోనట్లుగా ఉన్నారు. తాగిన మైకంలో భాగవతార్ పక్కన మిమ్మల్ని చూసి దేవకి అనుకొని తబ్బిబ్బు పడ్డాను.మనలో మన మాట. దేవకికి మీ భర్తగారి మీద ఇంకా మోజు పోనట్లుంది. మీరు హెచ్చరికగా ఉండాలి" వెకిలిగా నవ్వాడు. బదులుగా నవ్వలేదు మృదుల. సీరియస్ గా చూసింది. ఫ్లెమింగ్ పెదవుల మీది నవ్వు మధ్యలోనే ఎగిరిపోయింది. అతడు బయటికొచ్చినప్పట్నించీ దేవకి స్థిమితంగా కూర్చోలేక పోతోంది. కళ్ళల్లో మాత్రమేకాక ఆమె ప్రతీ చిన్న కదలికలోనూ ఆమె మనసులోని ఆందోళన స్పష్టంగా బయటపడుతోంది.
    "మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదండి" అన్నాడు ఫ్లెమింగ్. దేవకి వెంటనే, "నేనూ వస్తాను" అంది. ఫ్లెమింగ్, "నువ్వు రానక్కరలేదు." అన్నాడు తీక్షణంగా బుట్టలో ఇరుక్కుపోయిన నాగినిలా బుసలు కొడుతూ ఉండిపోయింది దేవకి. కొన్ని నిముషాలు ఆలోచించుకొంది మృదుల లేచి నిలబడి, "రండి డ్రాప్ చేద్దురుగాని," అంది చిరునవ్వుతో. దేవకి విభ్రాంతితో చూసింది కాని మృదుల కళ్ళు ఆమెకు ఏమీ చెప్పలేదు.
                               *    *    *
    పాతకాలపు సెకెండ్ హేండ్ పోర్డు కారు అగ్నిపర్వతం బద్దలవుతున్న లాంటి చప్పుళ్ళతో ఎగిరెగిరి పడుతూ గతుకుల గతుకుల రోడ్డుమీద ముందుకు సాగుతోంది. ఏ క్షణానికాక్షణం కారులో ఏ పార్టు కాపార్టు ఊడిపోయి బయటికి దొర్లిపోతుందేమౌనని భయం వెయ్యసాగింది మృదులకి. డ్రైవ్ చేస్తున్న ఫ్లెమింగ్ మృదుల వైపు తిరిగి, "మీరు భాగవతార్ తో చెప్పి మా దేవకికి డాన్స్ ప్రోగ్రాంలు ఇప్పించగలరా?" అన్నాడు.
    "నో! అలాంటి ప్రయత్నమేదీ నేను చెయ్యను. మొదటిది! కేబరే డాన్స్ ని ఎంకరేజ్ చెయ్యడం నాకిష్టం లేదు, రెండవది! భాగవతార్ ని ఏ విషయంలోనూ ఇన్ ప్లుయెన్స్ చెయ్యడానికి ప్రయత్నించను." కొంచెంసేపు మాట్లాడలేదు ఫ్లెమింగ్. అంతలో సడన్ గా మృదుల రెక్క పట్టుకుని గుంజుతూ, "అయితే మిమ్మల్ని మా యింట్లో బంధించి, భాగవతార్ దగ్గిర రేన్ సమ్ డిమాండ్ చేస్తాను. నాకు డబ్బు కావాలి" అన్నాడు. అతడి కనుగుడ్లు ఎరుపుగా తిరుగుతున్నాయి. త్వరలో ఉద్రేకానికి లొంగిపోతాడులా వుంది. మృదుల తన చెయ్యి విడిపించుకోడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా శాంతంగా- స్థిమితంగా, "నన్ను బలవంతం చెయ్యడానికి ప్రయత్నించకండి. ఆ రోజు హోటల్ నాగార్జునాలో నా దెబ్బ మర్చిపోయారా?" అంది. ఎర్రబడింది ఫ్లెమింగ్ మొహం.
    "మర్చిపోలేదు. కాని నువ్వు అందంగా ఉంటావని చిన్నపిల్లవని, మాకు ఎంతో కొంత సాయం చేస్తావని- నిన్ను తిరిగి దెబ్బకొట్టలేదు." జేబులోంచి పిస్టల్ తీసి మృదుల కణతలకి గురిపెట్టి, "ఇపుడు కారు వెనక్కి తిప్పుతున్నాను. ఏమాత్రం అరిచినా దీనిలో గుండు మీ కణతల్లో పేలుతుంది" అన్నాడు. మృదుల ఏమాత్రం ఖంగారు పడలేదు. అతడిని ప్రతిఘటించనూ లేదు. కారు వెనక్కి మళ్ళించడానికి రైట్ టర్న్ తీసుకోబోయాడు ఫ్లెమింగ్. "అరెరె! గేదెమీద పెట్టేలా ఉన్నారు కారు, ఏక్సిడెంట్ అవుతుంది" ఖంగారు ఖంగారుగా అంది మృదుల స్టీరింగ్ చేతిలోకి తీసుకుంటూ. ఇండియాలో అందులోనూ ఆంధ్రదేశంలో నడిరోడ్ల మీద జంతువులు విశృంఖలంగా తిరగడం అలవాటయిపోబట్టి అతడు కూడా ఖంగారుగా రోడ్డువైపు చూశాడు. ఆ అదనులో అతని చేతిలో పిస్టల్ తను తీసుకుంది. ఆమెకి పిస్టల్ ఉపయోగించడం రాదు. కొద్ది క్షణాలక్రితం ఫ్లెమింగ్ కణతలకి గురిపెట్టి, ట్రిగ్గర్ పైన చెయ్యివేసి, "చూశారుగా! పిస్టల్ ఇప్పుడు నా చేతిలో ఉంది. అదృష్టాలు ఇలాగే తారుమారు అవుతుంటాయి. తిన్నగా మా యింటికి పోనివ్వండి కారు" అంది. స్టీరింగ్ మీద ఫ్లెమింగ్ చేతులు బిగుసుకున్నాయి. అప్పుడు చూసింది అతడి రెండు చేతులపైన ఎవరో కత్తితో గీరినట్లుగా ఉన్న చారికలు. అలాంటి చారిక కుడి చెవి పక్కన చెంప వెనుక గూడా ఉంది. మెడ మీద మరొకటి. ఇతడ్ని ఎవరేనా- ఎప్పుడేనా చిత్రహింసలు పెట్టేరా? శరీరంమీద మిగిలిన భాగాల్లో కూడా చిత్రహింసల గుర్తులేమైనా ఉన్నాయా? సందేహిస్తూనే, "చేతుల మీద ఆ ఎఱ్ఱని చారలేమిటి?" అడిగింది. చూస్తూండగా ప్లెమింగ్ ముఖ భంగిమలు మారిపోయాయి. బిగుసుకున్నాయి ముఖంలో కండరాలు. క్రౌర్యం- కసి- ఉట్టిపడే కళ్ళతో ఆమెను చూసాడు. రక్తం చిమ్మేలా క్రింద పెదవి పళ్ళతో కొరుక్కున్నాడు. మృదుల అనుమానం ధృడపడింది. ఇతడు ఎప్పుడో - ఎక్కడో చిత్రహింసలనుభవించాడు. గభాల్న టాపిక్ మార్చేస్తూ, "నిరుత్సాహపడకు మైడియర్ ఫ్రెండ్! ఏదో ఒక రోజు నా అంతట నేనే నీ లోపలి గదుల్లోకి వచ్చేస్తాలే! అప్పుడు- అవసరమనుకుంటే - నీకు రేన్ సమ్ దక్కే ఉపాయం నేనే ఆలోచిస్తాను" అంది నవ్వుతూ.
    మాట్లాడలేదు ప్లెమింగ్. ఏదో భయంకర దృశ్యం కళ్ళముందు కదిలి మాయమైనట్లు ఒక్కసారి నిలువెల్లా జలదరించాడు. మృదుల డైరక్షన్స్ ఇస్తూంటే భాగవతార్ ఇంటిముందు కారాపాడు. పిస్టల్ అతడి ఒళ్ళోకి విసిరేసి. కారుదిగి "టా-టా" చెప్పింది మృదుల.
                                *    *    *
    "హల్లో అనంగ్! ఎప్పుడొచ్చావు మా యింటికి? భాగవతార్ లేడా? లోపలికొస్తూ ప్లాస్టిక్ పంది ముఖంలో ఉన్న వ్యక్తిని పలకరించింది మృదుల. ప్లాస్టిక్ ముఖంలోపల భాగవతార్ అసలు ముఖం మరింత వడిలి పోయింది. అయితే ప్లాస్టిక్ పందిముఖం తొడుక్కున్నవాడు అనంగ్ అన్నమాట.
    కుంటుతూ నడిచింది అనంగ్. కాబట్టి వీడియోలో సొట్టకాలుతో ఉన్నవాడు అనంగ్?
    అతని ఎదురుగా మరొక సోఫాలో కూర్చుంది.
    "మాట్లాడవేం? దెబ్బలు బాగా తగిలాయా? ట్రైబల్ లైఫ్ చూస్తానంటూ వచ్చి డ్రింక్ పార్టీకి ఎగబడినందుకు బాగా జరిగింది శాస్తి. తప్పదు వడ్లతోబాటు తట్ట ఎండవలసిందే. కాఫీ తాగుతావా?" వంటమనిషిని పిల్చి కాఫీ తెమ్మని చెపుతూంటే ఏండెటో వచ్చాడు. భాగవతార్ పక్కన కూర్చుంటూ, "రెండు కాపీలు చెప్పండి" అన్నాడు మృదులతో తరువాత భాగవతార్ వైపు తిరిగాడు.
    "సారీ గురువుగారూ! చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అయినా వెధవ కర్చీఫ్ కోసం మీరు కాళ్ళదగ్గిర ఒంగుంటారని ఎలా ఊహించగలను? ఏ వెయిటర్ ని తీసిమ్మన్నా తీసిచ్చేవాడు కదా! ఐ యామ్ వెరీ వెరీ సారీ ఎక్స్ ట్రీమ్ లీ సారీ" అన్నాడు.
    "ఏండెటో మాటలకి తెల్లబోయింది మృదుల. ఏమిటీ! నువ్వు అవతార్ వా? నువ్వు అనంగ్ అనుకుని నేను మాట్లాడుతూంటే కాదని చెప్పవేం? ఏం జరిగింది?" భాగవతార్ మాట్లాడలేదు కాని జరిగింది వివరించాడు ఏండెటో. చెప్తూచెప్తూ కష్టంమీద నవ్వు ఆపుకున్నాడు. మృదుల నవ్వలేదు. గౌరవం ఉట్టిపడేలా భాగవతార్ ని చూసి, "ఐ యామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ అవతార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అర్ధం చేసుకున్నావు. కర్చీప్ కిందపడితే నడుము ముందుకు ఒంగని రోగిలా వెయిటర్ ని పిలవకుండా నువ్వే తీసుకున్నావు. ఎంతో మంచిపని చేశావు. దెబ్బకేంలే. నిన్ను అవమాన పరచాలని ఎవరూ కొట్టింది కాదుగా. పొరపాటున తగిలింది. అదే తగ్గిపోతుంది" అంది. ఏండెటో మొహంలో కూడా నవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న గౌరవంతో, "అవునుసార్! మీ అంత నిగర్వంగా ఎవరూ ఉండరు. మీ స్థాయిలో ఉన్నవాళ్ళు పదిమందిలో తమ పనులు తాము చేసుకోవటం ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా ఇండియాలో. మీరు మాకు మార్గదర్శకులు. అయితే నేను ముందుగానే కుర్చీలో కూర్చున్న వ్యక్తితో, "ముందుకు ఒంగి కర్చీప్ తీసుకోబోతున్నాను," అని చెప్పిమరీ తీసుకుంటాను," వినయంగా అన్నాడు.
    మృదుల భాగవతార్ దగ్గిరగా వచ్చి కూర్చుని ప్లాస్టిక్ పందిముఖం తీసేసింది. ఒక కన్ను బాగా ఉబ్బి- పై పెదవి ఒక్కపక్కవాచి-చాలా ఫన్నీగా తయారయింది భాగవతార్ ముఖం. ఆ ముఖంచూసి మృదుల నవ్వలేదు. దెబ్బలు తగిలిన చోటచేత్తో ప్రేమగా నిమిరింది. ఆ వేళ్ళల్లోంచి తన నరాలలోకి ఏదో అమృతం ప్రసరించి నట్లయింది భాగవతార్ కి. వంట మనిషిచేత వేడినీళ్ళు పోయించిన హాట్ వాటర్ బేగ్ తెప్పించి దెబ్బల మీద తనే స్వయంగా కావడం పెట్టసాగింది. చాలా ఉపశమనంగా ఉందతనికి.

 Previous Page Next Page