బాగా మేఘాలు పట్టటంవల్ల అప్పటికే చీకటి పడుతూంది. చలిగాలి రివ్వున వీస్తూంది. శిధిలమయిన కోటను చీకటి దుప్పటిలా కప్పుతూంది.
మైలురాయికి కొంచెం దూరంలో స్మశానం వుంది. అక్కడ కూర్చుని వున్నాడు దార్కా.
రోడ్డుమీద వాహనాలు వెళ్ళడం లేదు. నిర్మానుష్యంగా వుంది. ముందుగానే చీకటి పడడంవల్ల శ్మశానం తన వాతావరణాన్ని పుంజుకొంటూంది. ఒక కీచురాయి ఒకసారి అరిచి, మళ్లీ నిశ్శబ్దానికి దోహదం చేసింది.
దార్కా రోడ్ వైపే చూస్తున్నాడు.
ఐదయింది.
దూరంనుంచి ఒక కారు వస్తూంది.
కారు స్పీడుగా వచ్చి ఆగింది. అతడు వూపిరి బిగపట్టాడు. కారు డోరు తెరుచుకుంది.
దార్కా లేచి నించున్నాడు.
కారులోంచి ఒక వ్యక్తి దిగేడు. అయిదున్నర అడుగుల ఎత్తువున్నాడు కారు దిగగానే అతడు దార్కా వద్దకు రాలేదు. అక్కడే నిలబడి ఒక క్షణం సూటిగా చూసేడు.
ఇద్దరికీ మధ్య వందగజాల దూరం కన్నా ఎక్కువ వుండదు.
ఆ వ్యక్తం నెమ్మదిగా దార్కా దగ్గరికి నడిచి రాసాగేడు. దార్కా కదలకుండా నిలబడి వున్నాడు.
రెండు నిమిషాల్లో దార్కా దగ్గరికి వచ్చాడు. షర్టు మోచేతులు వరకూ మడిచి వుంది. వయసు నలభైకి దగ్గరగా వుంటుంది. కానీ అంత ఉన్నట్టు కనబడడు. అతడి కళ్ళలో తీక్షణ కొట్టొచ్చినట్టు కనబడుతూంది. మొహం కరుగ్గా ఉంది.
దార్కా ఏదో అనబోయేడు. అంతలోనే అతడి మాటల్ని ఖండిస్తూ ప్రశ్న వినబడింది.
"ఎవరు నువ్వు?" స్మశానంలో ఆ ప్రశ్న తిరిగి ప్రతిధ్వనించింది.
దార్కా అతడివేపు చూశాడు. బిగించిన పళ్ళ మధ్యనించి తిరిగి అదే ప్రశ్న కర్కశంగా "ఎవరు నువ్వు?"
'మీరెవరు' -అనబోయేడు దార్కా. అనబోతూ అనబోతూ ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని గుర్తించి చప్పున అడుగు వెనక్కి వెయ్యబోయాడే గానీ క్షణం ఆలస్యం అయింది. విసురుగా వచ్చి గెడ్డం కింద తగిలిన దెబ్బ ఎంత బలంగా వుందంటే - ఆరడుగుల దార్కా కూడా దాన్ని తట్టుకోలేక పక్కకు పడ్డాడు.
అతడు లేవబోతూంటే బూటుకాలు వచ్చి డొక్కలో తగిలింది. ముందుకు తూలేడు., ఆ తరువాత రెండు నిమిషాలపాటు తగిలినచోట తగలకుండా అతడిమీద దెబ్బలు పడ్డాయి. సరీగ్గా ఊపిరి పీల్చుకోవటానికి కూడా సమయం ఇవ్వలేదు. కొడుతున్న వ్యక్తికి తెలుసు -అవతలి వ్యక్తి తన కన్నా బలవంతుడనీ ఏ మాత్రం వీలుచిక్కినా తనని అధిగమిస్తాడనీ అందుకే గుక్క తిప్పుకోకుండా కొడ్తున్నాడు.
దార్కా సమాధి పక్కన పడ్డాడు. ముందు సమాధి రాయికి కొట్టుకొని నుదురు చిట్లింది. అంతలో అతడి జుట్టుపట్టుకుని లేపి, తిరిగి కొట్టటంతో వెళ్ళి దుమ్ములో పడ్డాడు వంటినిండా ఒక్కసారిగా వందల ముళ్ళు గుచ్చుకోవడంతో ప్రాణాలు తోడేసినట్టయింది.
"తులసికీ, కాష్మోరాకీ సంబంధం ఏమిటి?" భుజం రెక్క పట్టుకుని లేపుతూ అడిగేడా వ్యక్తి.
దార్కా మాట్లాడలేదు.
"కాష్మోరాకీ, నీకూ సంబంధం"
మౌనం
"అసలు నువ్వెవరు?"
దీనికి జవాబు ఇవ్వలేదు దార్కా. అతడు ఎంత తప్పు చేసేడో అతనికి అర్ధమవుతూంది. పత్రికాఫీసుకు ఉత్తరం వ్రాయమని అంటే సరిపోయేది. కానీ ఏడు రోజుల్లోనే తులసి మరణిస్తుందని సమయం ఎక్కువగా లేదనీ ఇలా కలుసుకోవడానికి తొందరపడ్డాడు. అయినా ఆ కలుసుకునే స్థలం కూడా ఏ పత్రికాఫీసులోనే అయితే బావుండేది. ఇలా స్మశానానికి రమ్మని పిలవడం ఎవరికయినా అనుమానం కలుగుతుంది. ఎంత చదువుకున్నా తన అనాగరికత ఎక్కడికి పోతుంది. స్మశానానికి రమ్మని పిలవటం.
అంత బాధలోనూ అతడికి నవ్వొచ్చింది.
అతడికి నెమ్మదిగా నిస్సత్తువ ఆవరిస్తూంది. ముక్కులోంచి ధారాపాతంగా రక్తం కారుతోంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్లు మూతలు పడుతున్నాయి.
"మీ....మీ....మీరెవరూ?" అన్నాడు ఆర్చుకుపోతున్న గొంతుతో దార్కా.
అప్పటివరకూ కర్కశంగా వున్న అతడి మొహంలో కొద్దిగా నవ్వు కనబడింది.
"నేనెవరో నీకు కావాలా అయితే విను" అన్నాడు.
"నా పేరు అబ్రకదబ్ర. ఆశ్చర్యపోకు. జెర్మనీలో దెయ్యాలు పారదోలేవాణ్ని అబ్రకదబ్ర అంటారు. నా అసలు పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మిణ్"