Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 24


    "సరే! వెళ్తున్నా సార్!"
    "మళ్ళీ మళ్ళీ నీ మొహం నాకు చూపకు. నీ మొహం చూస్తేనే ఐశ్వర్యం చుట్టుకునేట్లుంది నాకు."
    "అలాగే సార్! కానీ వెళ్ళేముందు ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి."
    "ఏమిటది?"
    "నా పేరు శ్యామల్రావ్ సార్! మీరు ఉపయోగించే మిగతా పేర్లేమీ కాదు."
    "ఓ! అలాగా! సారీ మోహన్రావ్! ఏమిటో ఈ పేర్లతో నాకు చిన్నప్పటినుంచీ కన్ ఫ్యూజనే!"
    శ్యామల్రావ్ జుట్టు పీక్కుంటూ బయటకు నడిచాడు.
    ఆ సమయం చూసి ఆనందంగా పాట ప్రారంభించాడు వరహాల్రావ్. "పడవెళ్ళిపోతోందిరా- నా సామి - పడవెళ్ళిపోతోందిరా! ఆహు- ఆహాహు-ఆహు-ఆహాహు-ఆహు! పుట్టెడు దిగుళ్ళతో, పిడికెడు బాధలతో- పడవెళ్ళిపోతోందిరా- నా సామి!"
    సుధీర్ కుమార్ ఆనందంగా లేచి వరహాల్రావు నిలబడ్డ చోటకు వచ్చాడు. వరహాల్రావు అతనిని గమనించనట్లు పాట పాడసాగాడు.
    'సిటికెడూ సీకట్లతో- కడివెడు ఆకలితో - గుప్పెడూ గుండెతో - ఎడారంత మనసుతో- పడవెళ్ళిపోతోందిరా- నా సామి-'
    సుధీర్ కుమార్ ఆనందం భరించలేక తప్పట్లు కొట్టేశాడు "ఆహా! ఎంత అద్భుతంగా పాడావోయ్ వరహాలూ- ఇంత మంచి పాటను ఇంతకుముందెప్పుడూ నాకు వినిపించలేదేమోయ్?"
    వరహాల్రావ్ కన్నీరు తుడుచుకుంటున్నట్లు నటించాడు "ఇవాళ మనసు బావుండలేదండీ! అందుకని ఈ పాట గుర్తుకొచ్చిందండీ!"
    సుధీర్ కుమార్ కి అతని మీద జాలి కలిగింది "మనసెందుకు బావుండలేదోయ్?"
    "మా ఇంటికాడ్నుంచీ ఉత్తరం వచ్చిందండీ! మా పెద్దమ్మ వాళ్ళ చేపల వల తెగిపోయిందంటండీ! దాన్ని రిపేర్ చేయాలంటే వంద రూపాయలు కావాలంటండీ! పాపం నా దగ్గర ఆ డబ్బుంటే పంపించేవాడిని కదాని ఏడుపొచ్చిందండీ! వాళ్ళు పాపం సముద్రం ముందు ఆ పూరి గుడిశెలో కూర్చుని తిండీ తిప్పలు లేకుండా ఏం బాధలనుభవిస్తున్నారో ఏమో"
    సుధీర్ కుమార్ కి కూడా ఏడుపు వచ్చేసింది గానీ తమాయించుకున్నాడు.
    ఆయన ఠక్కున జేబులో నుంచి రెండు వందల నోట్లు తీసి అతనికిచ్చేశాడు. "చూడవోయ్ వరహాల్రావు! గుడిశెల్లో వుండేవాళ్ళు కంటతడి పెట్టడం నేను భరించలేనోయ్. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కల్తీలేని స్వచ్చమయిన జీవితాన్ని అనుభవిస్తుంటారోయ్. వెంటనే ఈ డబ్బు వాళ్లకు పంపించు. తాత్కాలికంగా వాళ్ళను ఆవరించిన ఆ బాధలు తీరిపోయేలా చేసెయ్" అనేసి బరువెక్కిన హృదయంతో మేడ మీదకు చేరుకున్నాడు.
    అక్కడ అంతకంటే విషాదకరమైన పాట మృదుల గదిలోనుంచి వినబడసాగింది. ఓహోహో గాలివానలో కాళరాత్రిలో పడవ ప్రయాణం, దారి ఏమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం... ఆ పాట వెనకే వెక్కి వెక్కి ఏడుస్తున్న చప్పుడు.  
    ఆయన కొద్దిసేపు కన్ఫ్యూజయిపోయాడు. తన మేడను పడవల కంపెనీ వాళ్ళెవరయినా తీసుకున్నారా అన్న అనుమానం కలిగింది కాసేపు. నెమ్మదిగా మృదుల గదిలోకి నడిచాడు.
    ఆమె అప్పటికే టేప్ రికార్డర్ ఆపేసి కన్నీరు తుడుచుకుంటోంది.
    ఆయనకి ఆమె మీద జాలి కలిగింది.
    "ఏమిటి మృదులా...ఏడుస్తున్నావా?"
    "ఆమె మాట్లాడలేదు "ఎందుకమ్మా ఆ పడవ పాటలు పాడుతున్నావ్? అదీ గాలి వానలో పడవ పాట ఏం జరిగిందమ్మా?"
    ఆమె చివాలున అతనివైపు చూసింది "నా జీవితం కూడా గాలి వానలో పడవలాగా అయ్యింది గనుక నేనా పాటే వింటాను, పాడతాను డాడీ..." అంది మళ్ళీ కెరటాల్లా వచ్చే దుఃఖం ఆపుకుంటూ.
    "కానీ జీవితం గాలి వానలో పడవలాగా ఎందుకయ్యింది?"
    "మీవల్లే డాడీ! నేను ప్రేమించిన విజయ్ ని చేసుకోడానికి వీల్లేదన్నారుగా మీరు?"
    "అతని పేరు విజయా? సంజయ్ కదూ?"  
    "కాదు."
    "ఎంత పొరపాటు జరిగిపోయిందో చూశావా? నేనింకా 'సంజయ్' అనుకుంటున్నాను."
    "తల్లిలేనిదాన్ని కాబట్టి నేనిలా పడవ పాట పాడాల్సి వస్తుంది. ఇదే మా మమ్మీ వుంటే విజయ్, నేనూ పెళ్ళి చేసుకోడానికి సంతోషంగా ఒప్పుకునేది."
    ఆయనను ఆ డైలాగ్ బాగా కదిలించింది. "ఆల్ రైట్ మృదులా! నువ్వూ, విజయ్ పెళ్ళి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఓ కండిషన్ మీద."
    "కండిషన్ మీదా? ఏమిటి కండిషన్?"
    "ఆరు నెలల్లో అతను నా ఆస్తినంతా ఆర్పేయగలగాలి. ఆరు నెలలయ్యేసరికి కటిక దరిద్రంతో మనందరం ఓ గుడిసెలోకి వెళ్ళిపోయి కోడిపిల్లలనూ, మేక పిల్లలనూ పెంచుకుంటూ అంబలి కాసుకుని త్రాగుతూ, వెన్నెల్లో బయట నులకమంచం వేసుకుని, సుక్కల్లో సెందురూడు పాట పాడుకుంటూ గడపాలి. అలా చేయగలిగితేనే ఆ రాజేష్ కి, నీకూ పెళ్ళి జరుగుతుంది. లేకపోతే జరగదు."
    మృదుల ఆనందంతో పొంగిపోతూ తండ్రివేపు చూసింది. "థాంక్యూ డాడీ!"
    "కండిషన్ నెంబర్ టూ"
    మృదుల తెల్లబోయింది "అదేంటి డాడీ...ఒకటే కండిషనన్నావుగా?"
    "అవును. ఒకటిలోనే వన్- బి ఇది."
    "ఏమిటది?"
    "మీ పెళ్ళి టైమ్ కి ముకేష్ కూడా గుడిసెల్లో కాపురం వుండాలి"
    "అతని పేరు ముకేష్ కాదు డాడీ!"
    "తెలుసు వీరేష్..."
    ఆమె తల పట్టుకుంది.
    "ఓ.కె. నేను వెళుతున్నాను. ఈ రెండు కండిషన్లూ 'పుల్ ఫిల్' చేస్తే పెళ్ళి జరుగుతుంది. లేకపోతే లేదు" ఆయన వెళ్ళిపోయాడు.
    మృదుల త్వరత్వరగా రడీ అయ్యి బయటకు పరుగెత్తింది.

 Previous Page Next Page