"ఐసీ" అంది ఆమె. అతను ఇంకా ఏం మాట్లాడతాడో ఊహించే ప్రతయ్నం చేస్తూ.
"వీడియోగ్రాఫర్ అంటే....ఫంక్షన్స్....మ్యారెజస్ అవీ తీస్తూ వుంటారా?" ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంది.
నవ్వాడతను.
లేదండి. ఐ హేండిల్ హైబ్యాండ్ కెమెరా!"
హై బ్యాండ్ కెమెరా....అంటే ఏమిటో....అది ఎందుకు వాడతారో....ఆమెకు తెలియదు. అర్ధం కాలేదు. హైబ్యాండ్ కెమెరా అంటే ఏమిటి అని అడగలేదు.
కాఫీ కప్స్ తీసుకువచ్చి టీపాయ్ మీద ఉంచాడు పనివాడు.
"తీసుకోండి" అంది ఒక కప్ అందిస్తూ.
"థాంక్స్" అన్నాడు అందుకుంటూ.
మౌనంగా సిప్ చేయసాగిందామె.
కాఫీ త్రాగటం పూర్తి అయ్యేవరకు ఇద్దరి మధ్య మాటలు లేవు.
ఖాళీ కప్ ని టీపాయ్ మీద వుంచి ప్రక్కనే వున్న చిన్న హేండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశాడు అతను.
అందులోనుండి ఒక వీడియో కేసెట్ బయటకు తీశాడు.
"ఇది తీసుకోండి" అన్నాడు ఆమె చేతికి యిస్తూ.
"ఏమిటి....ఇది?"
"వీడియో కేసెట్....మీ ఫ్యాషన్ షోకి సంబంధించిన కేసెట్....నాకు ఎంతగానో నచ్చినది యిది. ఇంతవరకు నేను చాలామందిని వీడియోగ్రాఫ్ చేశాను. ఐమీన్ మోడల్స్ ని....కానీ మీ అంత అందమైన మోడల్ ని షూట్ చేయటం, నాకు నా కెమెరాకు కూడా ఫస్ట్ టైమ్! మిమ్మల్ని వీడియోలో చిత్రీకరించడం ఓ అనుభూతిగా అనిపించింది. ఎలా చిత్రించానో మీకు చూపాలి అనిపించింది. అందుకే మీ యిల్లు వెదుక్కుంటూ వచ్చాను. ప్లీజ్! హెవ్ దిస్. ఈ కేసెట్ ప్లే చేసి చూడండి. ఆ తర్వాత అది ఎలా వుందో మీ అభిప్రాయం చెప్పండి. ఇది నా కార్డ్" అంటూ జేబులోంచి విజిటింగ్ కార్డు బయటికి తీసి ఆ వీడియో కేసెట్ మీద వుంచి ఆమె చేతికి అందించాడు.
"ఈ కేసెట్ మీకు నచ్చితే....ఈ రాత్రి ఎనిమిది గంటలకి, ఈ కార్డులోని నా నెంబర్ కు ఫోన్ చేసి చెప్పండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తూ వుంటాను. మీ ఆతిథ్యానికి థాంక్స్. బై" అంటూ క్షణంలో మాయం అయిపోయాడను.
ఆశ్చర్యంగా అతను వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయిందామె.
ఆ వ్యక్తి చాలా వింతగా అనిపించాడు.
తనని తాను పరిచయం చేసుకున్న తీరు, తనతో మాట్లాడిన పద్ధతి ఇంతవరకు అటువంటి వ్యక్తిని చూడలేదు.
కొందరు వ్యక్తులు చాలా ఫాస్ట్ గా వుంటారు_ అన్న మాటకు అర్ధం ఇతనే ఏమో అనిపించింది.
జరిగిన సంఘటన ఒక చిన్న కలలాగ అనిపించింది.
దృష్టిని చేతిలోని కేసెట్ వైపు మళ్ళించింది.
* * * * *
సోనీ కంపెనీ క్యాసెట్ అది.
విజిటింగ్ కార్డ్ ని టీపాయ్ మీద వుంచింది.
క్యాసెట్ తీసుకుని టి.వి. వైపు నడిచింది.
వి సి ఆర్ లో క్యాసెట్ ఇన్ సర్ట్ చేసి ప్లే బటన్ నొక్కింది.
బిజ్....మన్న శబ్దంతో కొద్ది క్షణాలు తెల్లని చుక్కలు టీవీ స్క్రీన్ మీద వచ్చాయి.
కొద్ది సెకన్ల తర్వాత వర్టికల్ స్పెక్ట్రమ్ బ్యాండ్ వచ్చింది.
ఆమెకు చాలా ఆసక్తిగా వుంది.
అదొక థ్రిల్ గా అనిపిస్తోంది.
ఎన్నోసార్లు తనని తాను వీడియో ఫిల్మ్ లో చూసుకుంది.
ఇంతకుముందు తను చేసిన ఫ్యాషన్ పెరేడ్స్ ని కూడా వీడియోలో చూసింది.
కానీ....ఇలా అపరిచిత వ్యక్తి ప్రత్యేకంగా వచ్చి....ఇవ్వటం అది చూడటానికి ఆమెలో ఆసక్తి పెరిగింది.
టి.వి.లో క్లోజ్ అప్ లో ఒక అందమైన కన్ను కనిపిస్తోంది. కన్ను ఎంత క్లోజప్ లో వుందంటే.... కంటి గ్రుడ్డులో అక్కడున్న లైట్ల రిప్లక్షన్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్లోమోషన్ లో ఆ కన్ను ఒకసారి అందంగా మూసుకుని తిరిగి తెరుచుకుంది. అలా అయినప్పుడు ఆ అందమైన కంటిరెప్పలు, ఆ రెప్పల మీద వేసిన మేకప్ తాలూకు బ్లూ షాడోస్....అందంగా కనిపిస్తున్నాయి.
'ఎవరిదీ అందమైన కన్ను? నాదా!?' ఒకింత సందేహం కలిగింది ఆమెలో.
అది జామ్ షాట్....
జామ్ బ్యాక్ అవుతోంది మెల్లగా.
ఈసారి రెండు కళ్ళూ....తర్వాత నాసిక, పెదవులు....చివరికి ముఖమూ అంతా తెరమీద ప్రత్యక్షమయ్యాయి.
ముఖం అంతా తెరమీద నిండుగా కనిపించిన మరుక్షణం, రెప్పలు మరోసారి అందంగా ఆర్పింది.
ఆమె అందమైన పెదవులు కొద్దిగా విచ్చుకొని ఆమె పలువరుస తళుక్కుమంది.
మైగాడ్! నేనింత అందంగా వున్నానా! అలా అనుకునే బదులు, నన్నెంతో అందంగా ఇతను కెమెరాలో చూపించాడా....అనుకోవటం సబబు అనిపించింది.
తెర మీద బొమ్మలు కదులుతున్నాయి.
* * * * *
చీకటి చిక్కగా విస్తరించుకొని వుంది ఆ గది నిండా.
ఆ చీకటిలో ఆ గదిలో వున్న వస్తువులేమిటో? ఆ గది పరిమాణం ఎంతో కూడా తెలియలేదు.
ఆ గదిలో ఒకవైపుగా మినుకుమినుకుమంటూ కనిపిస్తోంది ఓ ఎర్రని వెలుగు. ఏ వస్తువునూ ప్రస్పుటంగా చూడలేనంత చూడలేనంత చిన్న వెలుగు అది.
చిన్న శబ్దంతో తెరుచుకుంది ఆ గది తలుపు.
మరుక్షణం కొద్దిపాటి కాంతులు ఆ గదిలోకి ప్రసరించాయి.
రెండు జతల కాళ్ళు ఆ వెలుగుతో పాటే ప్రవేశించాయి ఆ గదిలోకి.
ఆ యిద్దరిలో ఒకరు మన్సూర్, మరొకరు శేషు.
కళ్ళు పెద్దవి చేసుకుని చుట్టూ కలయచూసిన వాళ్ళకి గదిలోని ఒక మూలగా వున్న మంచంమీద లీలగా పడుకొని వున్న వ్యక్తి కనిపించాడు.
ఆ మూలగా కనిపిస్తున్న ఎర్రని వెలుగు అతని చేతిలో వెలుగుతున్న సిగరెట్ గా గుర్తించగలిగారు.
"ఎవరిది?" కరుకుగా వినిపించింది బెడ్ మీద నుండి.
"నేను....మేము....మన్సూర్, శేషు" చెప్పాడు శేషు.
సిగరెట్ చివరి పఫ్ లాగి బట్ ని నేలమీద పడవేసి, మంచం మీద నుండి లేచి కూర్చుని కాలితో తొక్కి సిగరెట్టు ఆర్పివేశాడతను.
"మీకు ఎడమవైపు స్విచ్ బోర్డు వుంది" చెప్పాడతను. ఆ రోజు అతని వాయిస్ ఎప్పలాటిగ లేదు. బాగా గొంతు నొప్పితో బాధపడే వ్యక్తి స్వరంలా బరువుగా వుంది.
ఎడమవైపుకి కదిలి గోడవైపు పరీక్షగా చూశాడు మన్సూర్.
అందంగా కనిపించింది స్విచ్ బోర్డు.
దానిమీద చేయి వుంచి మొదటి స్విచ్ ప్రస్ చేశాడు.
ఆ గదిలో వెలుగు రాలేదు.
కానీ చిన్న శబ్దంతో తిరగసాగింది ఫ్యాన్.
దాని ప్రక్కన స్విచ్ నొక్కాడు. ఒక్కసారిగా వెలుగు ప్రవేశించింది అక్కడ.
అంత వెలుగు ఒక్కసారిగా మీద పడటం ఆ ముగ్గురికి కొద్దిక్షణాల పాటు యిబ్బందిగానే అనిపించింది.
మంచం మీద నుండి లేచాడా వ్యక్తి.
మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, నలిగిన దుస్తులు....లక్షల్లో స్మగ్లింగ్ చేసే వ్యక్తిలాగ అతను కనిపించలేదు.
కూర్చోమన్నట్లుగా చేయి చూపించాడు.
అక్కడే వున్న కుర్చీలలో కూర్చున్నారు వాళ్ళిద్దరూ.
ఆ వ్యక్తి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి.
"మీకు హెల్త్ బాగాలేదా?" అడిగాడు శేషు.
మాట్లాడలేదు అతను.
"మీరు సంజుని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో!" అడిగాడు మన్సూర్.
"షటప్" కరుకుగా అంది అతని కంఠం.
ఉలిక్కిపడి సర్దుకున్నాడు మన్సూర్.
"నాకు ఏ విషయం గురించి ఎంతసేపు ఆలోచించాలో తెలుసు" ఒకరకమైన హేళన ధ్వనించింది ఆ గొంతులో.
"సంజు ప్రోగ్రాం ఏ రోజు జరగబోతోందో తెలుసా?" అతనే అడిగాడు.
తెలియదన్నట్టు తల వూపాడతను.
"అసలు జరుగుతుందా?"
నిశ్శబ్దంగా కూర్చున్నారిద్దరూ.
అసహనంగా తల విదిల్చాడతను.
అదే సమయంలో ఆ గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది.
ఆ ముగ్గురి దృష్టి డోరు వైపు మళ్ళింది.
కొద్ది క్షణాల తరువాత లోపలికి ప్రవేశించాడు సెబాస్టియన్.
గంభీరముద్రలో కూర్చున్న ఆ ముగ్గురి ముఖాలవంక పరిశీలనగా చూశాడు. తనూ ఒక చైర్లో కూర్చున్నాడు.
"ఛీ....ఛీ....వారం రోజులుగా మన జాతకం బాగోలేదు" స్వగతాన్ని పైకి అన్నట్లుగా అన్నాడు సెబాస్టియన్. "అటు చూస్తే సంజు ప్రోగ్రాం ఆగిపోయింది. ఇటు చూస్తే నా ఇంటిమీద పోలీసు రెయిడ్ అయింది. దాదాపు రెండున్నర లక్షల రూపాయల నాటుబాంబులు పోలీసోళ్ళ సొంతం అయిపోయింది. అంతా లాస్....థూ" కసిగా అన్నాడు తిరిగి సెబాస్టియన్.