"థాంక్స్.....ఇంత జరిగాక కూడా నువ్వు నామీద ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే....." వరూధిని స్వరం.
".....పోలీసులు మనల్ని 'ఆ టైమ్' లో రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే బెదిరిపోయిన మాట నిజమే. కానీ నీ శరీరపు ప్రతి స్పర్శా నాలో యింకా మిగిలివుంది..... నేను ముద్దు పెట్టుకోవచ్చా వరూధిని?....." సుభాష్ కంఠం.
అందరూ నిర్వీణ్నులై ఆ సంభాషణ వింటున్నారు. అఖాతాలు పోంగలేదు. అగ్నిపర్వతాలు పేలలేదు. అంతా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దంలోంచి సంభాషణ వినిపిస్తూ వుంది. వరూధిని ఏడవటం మొదలు పెట్టింది. మిగతా వారికి యింకా పూర్తిగా అర్థంకాలేదు. ఈ లోపులో కాలేజీ స్నేహితురాలు ఒకామె అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. ఆ అమ్మాయి చేతిలో ఒక వాల్ పోస్టర్ వుంది. "వరూధినీ! నువ్వు దీక్ష మానెయ్యపోతే ఈ పోస్టర్లు వూరంతా అతికిస్తారట" అంది.
దాన్ని విప్పి చూస్తే- వెనుక టెంట్. అక్కడ నిలబడి వరూధిని......ఆమెని ముద్దుపెట్టుకుంటూ సుభాష్. క్రితం రాత్రి మెరిసింది ఆకాశం కాదు. ప్లాష్...... ప్రస్తుతం మాత్రం హృదయంలో పర్జన్య ఘోష, కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు మెరుపులు, రాజకీయ నాయకుడు వేసిన చదరంగపు టెత్తుకి- మేఘంతో ఢీ కొనవద్దు సుమా అన్న చిన్న హెచ్చరిక.
వరూధిని ఏడుస్తూ అంత చెప్పింది. రుక్మిణి కూడా ఏడుస్తూ కూతుర్ని శాపనార్థాలు పెట్టసాగింది. "బుద్ధిలేనిదానా! ఎంత వళ్ళుబలిసిందే నీకు. వాడు పిలిస్తే అలా అర్థరాత్రి వెళ్ళిపోవటమేనా" అని తిట్టసాగింది. నిఖిత మాత్రం వరూధిని అర్థం చేసుకున్నట్టు సానుభూతితో చూసింది. ఒక చిన్న అమ్మాయిని మంచి మాటల్తో ట్రాప్ చేయటం ఎంత సులువు. ఆ పోస్టర్ పరీక్షగా చూస్తేగానీ అందులో ముద్దు నుదుటిమీద పెట్టుకున్నట్టు కనపడదు. కానీ ప్రజలకి అదంతా అవసరంలేదు.
నిఖితకి ఇప్పుడు జరిగినదంతా అర్థమైంది.సుభాష్ తండ్రి మున్సిపల్ కౌన్సిలర్. సందీప్ తండ్రి కేంద్రంలో పలుకుబడి వున్న నాయకుడు. పైగా ఇద్దరిదీ ఒకేపార్టీ. అది చాలు, అది తెలియని పొట్టేలు ఒకేసారి రెండు కొండల్ని ఢీకొనాలనుకుంది. ఫలితం అనుభవిస్తోంది.
రుక్మిణి ఇంకా కూతుర్ని తిడుతూనే వుంది. "కాలేజీ అని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? పార్కుల్లో పోలీసులు పట్టుకునేదాకా వచ్చిందీ వ్యవహారం? ఒక్కడ్ని పెళ్ళాడటం కోసం టెంట్ వేసే దాని వెనకే ఇంకొకడిని ముద్దు పెట్టుకుంటావా. చావవే నిన్నెవడూ రక్షించలేడు......"
కూతురని కూడా చూడకుండా తిడుతోంది. మెటికలు విరుస్తోంది. ఆమె సామాన్య జనానికి ప్రతీక! రేపు ఈ వాల్ పోస్టర్లు గోడల్నిండా అంటించబడితే జనం ఆమెలాగే అనుకుంటారు.
.......నిఖితకి అకస్మాత్తుగా విషయం అర్థమైంది. ప్రత్యర్థులు పంపిన హింట్ ఇది! దీక్ష విరమించకపోతే వందల వందల క్యాసెట్ లు అందరికీ పంచబడతాయి. వేల వేల పోస్టర్లు అతికించబడతాయి. పెద్ద గొడవ కాకముందే విరమించుకొమ్మని హెచ్చరిక ఇది! ఆమె వరూధిని వైపు చూసింది.
వరూధిని ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆ షాక్ సుభాష్ వలన వచ్చిందో..... సందీప్ వలన వచ్చిందో తెలీదుగానీ- ఏ క్షణమయినా స్పృహతప్పి పడిపోయేలా వుంది.
కృష్ణమూర్తి ఒక్కడే కాస్త స్పృహలో వున్నట్టు కనపడ్డాడు. పరిస్థితి తనే సరిద్దిద్దాల్సిన అవసరం నిఖితకి కనబడింది. వయసులో చిన్నదయినా, పరిస్థితులే ఆమెకి పెద్దరికాన్ని ఆపాదించాయి.
"ఇంతకు పూర్వం నీకు సుభాష్ అనే వ్యక్తితో కూడా సంబంధం వుందని, డానికి రుజువులు కూడా తన దగ్గరున్నాయని అన్యాపదేశంగా చెబుతున్నాడు. డబ్బున్న అబ్బాయిల వెంటపడి ఎవర్నో ఒకర్ని ట్రాప్ చేయడమే నీ ధ్యేయంగా స్పష్టించారు".
రుక్మిణి, కృష్ణమూర్తిల మొహాలు పాలిపోయాయి. అమ్మాయిలంతా వున్నట్లుండి అలా వెనక్కి తగ్గటానికి కారణం మాత్రం వాళ్ళకు అర్థమైంది. వాళ్ళ ఆలోచనలు పసిగట్టినట్లుగా నిఖిత అంది- "సందీప్ చాలా డబ్బున్న వాడే కాదు, పలుకుబడి వున్నవాడు. మిగతావాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. ఎవరి సపోర్ట్ ఇక వరూధినికి వుండదు అంకుల్".
"అంటే నేనిక ఓడిపోయినట్లేనా?" వరూధినికి ఏడుపు ముంచుకొచ్చింది.
"అన్యాయాన్ని ఎదిరించి న్యాయం జరిగేలా పోరాడటం మంచిపనే, హర్షించదగ్గది వరూధిని. కానీ ఆ పోరాటానికి దిగేముందు అది విజయవంతం కావడానికి కావలసిన సరంజామా మన దగ్గరుందో లేదో చూసుకోవాలి. అది లేనప్పుడు నలుగుర్లో నవ్వులపాలవడం మాత్రమే మనకు మిగిలేది".
"ఇప్పుడేమిటి చెయ్యడం. వున్నట్టుండి దానంతట అది దీక్షవిరమిస్తే నిజంగానే నలుగురిలో నవ్వులపాలవుతాం" అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా.
"పోనీ ఒక పని చెయ్యండి అంకుల్".
"ఏమిటి?" ఆశగా అడిగాడు.
"మీ ఫామిలీ డాక్టర్ని పిలిచి మాట్లాడండి. వరూధిని ఆరోగ్యం బాగా క్షీణించిందని స్టేట్ మెంటిచ్చి వాళ్ళ నర్శింగ్ హొంలో అడ్మిట్ చెయ్యండి. రెండురోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్ళవచ్చు. అదే కారణం వల్ల ఆమెని దీక్ష విరమింపజేశారని అందరూ అనుకోనివ్వండి" అంది నిఖిత.
ఆ అయిడియా చాలా బావుందనిపించింది. కృష్ణమూర్తి డాక్టర్ కి ఫోన్ చెయ్యడానికి వెళ్ళాడు.
6
"అవినాష్, టీ త్రాగి త్వరగా రెడీ అవాలి. మనం పార్టీకి వెళ్ళాలి" పార్వతి టీ కప్పు అందించి హడావుడిగా వెళ్ళబోయింది.
"చాలా అలసటగా వుందమ్మా. నేను రాను. మీరు వెళ్ళండి" అన్నాడు టీ సిప్ చేస్తూ.
"పరమానందయ్యగారని పెద్ద ఇండస్ట్రియలిస్ట్, మీ డాడీకి బాగా కావలసిన వాళ్ళు" ఆవిడ కళ్ళల్లో మెరుపు అతడికి అర్థంకాలేదు. 'డాడీ' పేరు చెప్పగానే మరి మాట్లాడలేకపోయాడు. అవసరమైతే తప్ప ఆయన అతడిని పార్టీలకు రమ్మని బలవంతం చెయ్యడు. "ఏదో పాత డ్రెస్ వేసుకోకు. మొన్న కుట్టించిన కొత్త గ్రే కలర్ సూట్ వేసుకో" చెప్పి వెళ్ళింది పార్వతి.
ఇలాంటి శాసింపులకి - పదేళ్ళ వయసు వరకు అవినాష్ కి కోపం వచ్చేది. అది బయట పెట్టుకునే ధైర్యం లేక మరో రకంగా వ్యక్తపరచుకొని తృప్తిపడేవాడు . అతడి ఆత్మహత్యా ప్రయత్నం ఆ రకంగా జరిగిందే. ఆ తర్వాత ఆత్మ న్యూనతాభావం అతడిని నోరెత్తినివ్వలేదు. భయంతో ప్రతిదీ పాటించేవాడు. అతడికి తెలియకుండానే యిప్పుడది అలవాటుగా మారిపోయింది.
సూటు వేసుకుంటుంటే చిరాగ్గా అనిపించింది. లైట్ గా ప్యాంట్. షర్ట్ వేసుకుంటే బావుంటుందనిపించింది. సడెన్ గా అతనికి నిఖిత గుర్తొచ్చింది. "నీకు నచ్చని విషయం పైకి చెప్పే ధైర్యం లేనంతకాలం నువ్వు మారలేవు. ఎదుటివారికి హాని కలిగించనిదీ, నీ తృప్తికి సంబంధించినదీ అయినప్పుడు అది అమల్లో పెట్టకపోవటం వట్టి పరికితనం" అంటుందామె. వింటుంటే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. కానీ ఆచరణలో పెట్టాల్సి వచ్చేసరికి ఏదో బెరుకు! ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటాడు.
"అవినాష్ ఇంకా కాలేదా?" తండ్రి అరుపుకి బయటకు పరుగు పెట్టాడు అవినాష్.
* * *
పార్టీలో ఎక్కువ జనంలేరు. పరమానందయ్యగారి పెద్దకూతురు, అల్లుడు నెలరోజుల హాలిడే కోసం అమెరికానుంచి వచ్చారు. వాళ్ళు కాక ఆయన తమ్ముడి కుటుంబం మాత్రం వున్నారు.
"మా పెద్దమ్మాయి ఇంజినీరు, చాలా ఇంటలిజెంట్. ఆమెరికాలో మంచి ఉద్యోగంలో వుంది. రెండో అమ్మాయి నందినికే చదువు వంట బట్టలేదు. ఇంటర్లో ఆపేసింది. కానీ మిగతా విషయాల్లో చాలా చురుకు. అది లేకపోతే ఇల్లు చిన్నబోతుంది" గర్వంగా చెప్పాడాయన.
"మా వాడు కూడా చాలా బ్రిలియంట్. టాటా కన్సల్టేన్సీలో జాబ్ వచ్చినా మమ్మల్ని వదిలి వెళ్ళటం యిష్టంలేక మానేశాడు. ఒక్క చెడు అలవాటుకూడా లేదు" శంకరం అంతకంటే గర్వంగా పరిచయం చేశాడు.
"అయితే మన మధ్య దేనికి? అమ్మాయి నందినీ- అవినాష్ కి మన ఇల్లు చూపించు" డ్రింక్స్ కలుపుతూ అన్నారాయన.
"రండి" అంది నందిని చిరునవ్వుతో. అవినాష్ ఇబ్బందిగా తల్లి వైపు చూశాడు.
"సిగ్గు దేనికి అవినాష్! వెళ్ళు" అంది పార్వతి కళ్ళతోటే ఆజ్ఞాపిస్తూ. అవినాష్ కి లేవక తప్పలేదు. నందిని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ముందుకి నడిచింది.
ఇల్లు చాలా బావుంది. పక్కన అమ్మాయి మనిషి రూపంలో వున్న వసపిట్టలా వాగుతోంది. మైకేల్ జాక్సన్ పేరు చెప్తేనే ఊగిపోతోంది. అతడి లేటెస్ట్ ఆల్బమ్ నించి, అతడి కొచ్చిన చర్మవాధి వరకు అన్నీ వివరంగా చెప్పుకుపోతుంది. ఫోన్ మోగడంతో ఆమె వాగుడుకి బ్రేక్ పడింది.
గోడలమీద ఆయిల్ పెయింటింగ్స్ చూడటంలో నిమగ్నమైపోయాడతను. నందిని కంఠం గట్టిగా వినబడుతోంది.
.....బెంగుళూరుకి ప్లయిట్ లోనా? గంటలో వెళ్ళిపోతాం..... వట్టి బోర్....... ట్రెయిన్ లోనే బావుంటుంది. బాగా ఎంజాయి చెయ్యొచ్చు.......రిజర్వేషన్ లేదటనా? వెయిటింగ్ లిస్ట్ లో తీసుకో. వంద రూపాయలు పడేస్తే సీట్లు, బెర్త్ లు అన్నీ దొరుకుతాయి" అంటోంది నందిని ఫోన్లో.
అవినాష్ కి మళ్ళీ నిఖిత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. బెంగుళూరు నుంచి రైల్లో వస్తున్నప్పుడు ఆమెతో మాట్లాడిన తొలి అనుభవం గుర్తొచ్చింది. అన్నీ వున్న విస్తరాకే అణిగి మణిగి వుంటుందన్న సూక్తి గుర్తొచ్చింది.
* * *
మంచినీళ్ళ కోసం ముందు గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయాడు అవినాష్. తల్లీ తండ్రి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
"అమ్మాయి పెద్ద అందగత్తె కాకపోయినా భోళామనిషి, నాకు బాగా నచ్చింది". అంది పార్వతి.
"అవును. డబ్బున్న పిల్లనన్న అహం ఏ కోశానా లేదు. చాలా కలివిడిగా తిరిగింది కదూ" అన్నాడు శంకరం.
"మామూలు 'డబ్బు' అనకండి. అదొక జమీందారీ సంపదలావుంది. వాళ్ళు ఒక గదికి పెట్టిన ఖర్చు మనం మొత్తం ఇంటికి ఖర్చు చెయ్యలేకపోయాం".
"పెద్దమ్మాయి ఇండియా తిరిగి వచ్చే ప్రసక్తిలేదు. అక్కడే వాళ్ళకు బోలెడు ఆస్తివుందట. ఇక్కడున్నదంతా చిన్నపిల్లకే"
"అలాగే, అయితే మరీ అదృష్టం. ఇంతకీ ఆయన మన వాడి ప్రస్తావన తెచ్చారా?" పార్వతి స్వరంలో ఆదుర్దా.
"అవినాష్ ఆయనకు బాగా నచ్చాడు. మిగతావాళ్ళ అభిప్రాయం కూడా అడగాలిగా. వారం తర్వాత కలవమన్నాడు".
"వాళ్ళు ఒప్పుకుంటే బావుండునండీ. అది మన అదృష్టం అనుకోవాలి. వాళ్ళు సరేనంటే అందరూ తిరుపతి కొండకు వెళ్దాం" అంటూ అప్పటికప్పుడే మొక్కేసుకుంది పార్వతి.