"మీ భార్యకు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని కలిశాను. అధి దొంగ సర్టిఫికెట్టనీ_డబ్బుకోసం అలాంటివి తను చాలా ఇస్తూంటాననీ ఆయన అన్నాడు" అన్నాడు ఉత్పల్ కోపంగా.
డాక్టర్ విలాస్ ఏ మాత్రమూ తడబడ లేదు సరికదా ముఖంలో వేదన కనిపించింది.
"మీరు నన్ను అనుమానిస్తున్నారు. ఇది నాకు చాలా అవమానం" అన్నాడు విలాస్.
"నేను మిమ్మల్ని అవమానించలేదు" అన్నాడు ఉత్పల్.
"నేను చెప్పిన విషయంపై నమ్మకం లేక నేకదా మీరు డాక్టర్ వద్దకు నిజానిజాలు తేల్చుకుందామని ప్రయత్నించారు" అన్నారు విలాస్.
"లేదు. మీరు పూర్తిగా పొరబడ్డారు" అన్నాడు ఉత్పల్ "నేను మీ భార్య ఆరోగ్యంపట్ల ఆందోళన చెందుతున్నాను. ఈ వయసులో ఇటువంటి అనారోగ్యం ఇన్నేసి రోజులు కొనసాగడం చాలా ప్రమాదం. అధి ఏ క్యాన్సర్ కయినా దారితీయవచ్చును. ఆమెకు సరయినవైద్య సదుపాయం జరగాలి. అందుకే ముందు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ని కలుసుకున్నాను తీరా చూస్తే ఆయన ఇలా చెప్పాడు..."
"అలా చెప్పాడా?" అన్నాడు విలాస్.
"ఊఁ"
"నిజంగా అలా చెప్పాడా?" అన్నాడు విలాస్.
"నేను అబద్దం చెబుతున్నానని అనుమానంగా ఉంటే మనమిద్దరమూ కలిసే ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు" అన్నాడు ఉత్పల్. అధి సవాలు చేస్తున్నట్లుగా ఉన్నది.
"వద్దు. నాకు మీ మాటలమీద నమ్మకమే.....కానీ..." అంటూ విలాస్ మాటలురాక ఆగిపోయాడు.
"చెప్పండి....ఆగిపోయారేం?"
"ఉండండి....ఆవేశంలో నాకుమాటలు రావడం లేదు."
"ఆవేశమెందుకు?"
"జరిగిన మోసమేమిటో తెలిస్తే నాకంటే రెట్టింపు ఆవేశం మీకు వస్తుంది" అన్నాడు విలాస్ వుద్రేకంతో ఊగిపోతూ.
ఉత్పల్ ఆశ్చర్యంగా __"మోసమూ-ఎవరు చేశారు?" అన్నాడు.
"నా భార్య."
ఉత్పల్ కంతా అయోమయం అనిపించింది. "మీరు చెప్పేదేమిటో నాకు అర్ధం కావడంలేదు"
"ఆ మెడికల్ సర్టిఫికెట్ తెచ్చింది నేను కాదు."
"మరి..."
"నా భార్య తనకు ఆరోగ్యం సరిగాలేదని ఇన్నాళ్ళ నుంచీ నన్ను కూడా దరికి రానివ్వడం లేదు. మీకు నిజం చెప్పేస్తున్నాను. వివాహం అయిందికానీ ఇంతవరకూ ఇద్దరం కలుసుకోలేదు. చెప్పుకుంటే సిగ్గు"
"అంటే....?"
"ఆమె అమాయకమయిన ముఖం చూసి అంతా నిజమేనని నమ్మాను. ఇప్పుడనిపిస్తున్నది_ఇందులో ఏదో కుంభకోణం ఉన్నది."
ఉత్పల్ కూడా ఆదుర్దాగా "ఏం జరిగిందంటారు?" అన్నాడు.
"నా అనుమానం ఇందులో ఏదో ప్రేమవ్యవహారం ఉన్నదని తాను బహుశా పెళ్ళికిముందే ఎవర్నో ప్రేమించి వుంటుంది. ప్రియుడికోసం తన పవిత్రతను కాపాడుకుంటూ వుంటుంది పూర్వం కథల్లో చదివారుగా? రాజకుమార్తెలు, పతివ్రతలు ఏవో వ్రతాల పేరు చెప్పి పరాయి మగాడ్ని దూరంగా వుంచుతూండేవారు. సంప్రదాయంలో పుట్టి పెరిగిన పిల్లగదా ఏం తెలిసినా తెలియకపోయినా ఇలాంటివి తప్పక తెలుస్తాయి.
ఉత్పల్ కి ఇది నిజమేనా అని అనుమానం వచ్చింది. కానీ విలాస్ ఎంత ఆవేశంలోనూ, కోపంలోనూ ఉన్నా డంటే అధి నటన కాదనిపించింది. ఒకవేళ అది నటనే అది నటనే అయినా తన అనుమానాన్ని ఆ క్షణంలో బయటపెట్టడం మంచిదికాదని అతడికి అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖంచూసి అతడు భయపడ్డాడు.
"ఇప్పుడేం చేస్తారు?"
"భర్తనుంచే పవిత్రతను కాపాడుకోవాలనుకున్న ఆడదాన్ని క్షమించకూడదు. తగిన విధంగా బుద్ది చెప్పాలి. ఆమెచేత నిజం కక్కిస్తాను...కానీ ఎంత బాగా నటించింది? శోభనంరోజు నేను దురదృష్టవంతురాల్ని. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నాను అని బుడి బుడి రాగాలు తీస్తూంటే నిజమేననుకుని ఓదార్చాను కూడా" అంటూ వాపోయాడు విలాస్.
ఉత్పల్ కు విలాస్ మీద జాలివేసింది. "అయితే ఈ రోజు ఆమెను సొసైటీకి తీసుకుని వస్తారా?"
"ఈ రోజు కాదు- రేపు" అన్నాడు "ముందు నేను ఆమె చేత నిజం కక్కించాలి. ఆ తర్వాత ఆమె భావించే పవిత్రత ఎంత అర్ధవిహీనమైనదో తెలియజెప్పాలి అందుకు మీకే అవకాశం ఇస్తాను."
ఉత్పల్ ముఖం వెలిగింది. అతడు జరిగిందంతా మర్చిపోయాడు.
మర్నాడు ఉత్పల్ శ్రీమతి విలాస్ రాకకోసం ఎన్నో కలలు కంటూ, ఊహల్లో తేలిపోతూ ఎదురుచూడసాగాడు. కానీ సొసైటీకి డాక్టర్ విలాస్ మాత్రమే వచ్చాడు.
ఉత్పల్ కు కలిగిన నిరుత్సాహమింతా అంతా కాదు.
"ఒంటరిగా వచ్చారేం డాక్టర్?" ఇన్నాడతను చిరుకోపంతో.