Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 22


    "ఏమిటో మా యింట్లో ఏం చేసుకున్నా మీకు పెట్టకుండా తినబుద్ధి కాదు."
    "అది మీ మంచితనం"
    ఈ లోకములో ఇలాంటివాళ్ళు మంచివాళ్ళుగా గుర్తించబడుతూ వుంటారు.
    రాధాప్రియ స్టయిల్ గా నవ్వింది.
    "నన్నడిగితే వెనకటి స్వీట్సే రుచిగా వుంటాయంటాను. మైసూర్ పాక్, జిలేబి, బూంది లడ్డూ_ యిప్పుడంతా ఫాషన్లెక్కువయిపోయి కళాఖండి, గులాబ్ జాం, రసగుల్లా, రసమలాయి... అందులో ఇన్ స్టంట్ లొచ్చేసాయి.
    కాసేపు తినుబండారాల గురించి చవులూరించే సంభాషణ సాగింది.
    తర్వాత రాధాప్రియ తనకిష్టమైన చాడీల వైపు టాపిక్ మలుపు తిప్పింది.
    చాడీలు చెప్పటం రాధాప్రియ కెంత యిష్టమో, వినడమూ సత్యాదేవికంత ఇష్టమే.
    మెయిన్ టాపిక్ సుజాత. ఆవిడకి అహంకారం. ఎవరితో మాట్లాడదు. పలకరిస్తే పలుకుతుంది. లేకపోతే పలకదు. ముఖ్యంగా మరిది...ఆ వినోద్ గాడితో చాలా క్లోజ్ గా వుంటుంది. అబ్బబ్బబ్బ...వాళ్ళిద్దరి మధ్యా జరిగే దృశ్యాలు చూడలేక తనకి చచ్చిన చావుగా వుంది. అలాంటి పొరుగుతో తనలాంటి పతివ్రతకు బతకటం కష్టంగా వుంది. ఆ వినోద్ గాడు దృష్టి అసలే అందగత్తేమో, తనమీద కూడా పడింది.
    మొగవాళ్ళు యింట్లో ఉన్న టైమూ వుంటుంది, లేని టైమూ వుంటుంది. అదును చూసుకుని ఇంట్లో దూరి అఘాయిత్యమేమయినా చేస్తే...అమ్మో! తలుచుకుంటేనే వళ్ళు జలదరిస్తోంది...
    ఆ తర్వాత మాధురి. దాని తళుకులు, బెళుకులు... ఓహాహా! చూడలేక తనలాంటి సంసార స్త్రీల కసహ్యమేసి పోతోంది. అంతేకాదు. ఇంటి యజమానురాలయినందుకు సత్యాదేవిని గౌరవించాలి కదా. ఏమిటి ఆవిడ చూపిస్తోన్న గౌరవం? ఎప్పుడన్నా ఆప్యాయంగా పలకరించిందా? స్వీట్లూ అవీ తయారు చేసినప్పుడు పట్టుకొచ్చి యిచ్చిందా?
    అలా...వాక్ప్రవాహం సాగినాయి సత్యాదేవికి పూనకమొచ్చేట్లు చేసింది.
    ఆ కోపముతో సత్యాదేవి సుజాత పట్ల ద్వేషం పెంచుకుంది.
    సుజాత వాళ్ళకు మంచినీళ్ళు అవసరమొచ్చినప్పుడు మోటారు వెయ్యకపోవడం, దానికి ఏవేవో సాకులు చెప్పటం ఆ బట్టలు అక్కడ ఆరేశారనటం, యీ అంట్లు యిక్కడ తోమారనటం... యిత్యాది వెకిలి కళలన్నీ ప్రదర్శించింది.
    కొంతమందికి ప్రక్కవాళ్ళ మీద ఏదో ఆధిపత్య ముందనుకోవటం, దారుణంగా విసిగిస్తూ వుండటం_వీటిల్లో గొప్ప థ్రిల్ అనుభవిస్తూ వుంటారు.
    సుజాత నాలుగయిదు రోజులు ఓపికపట్టి ఒకనాడు యింట్లో మంచినీళ్ళు లేకపోయేసరికి కోపమాపుకోలేక సత్యాదేవి దగ్గర కొచ్చింది.
    "ఏమిటిలా చేస్తున్నారు?" అని నిలదీసి అడిగింది.
    సుజాతలోని వర్చస్సు, హుందాతనం చూసి సత్యాదేవి కొంచెం బెదిరింది. అయినా సాధ్యమైనంత బింకంగా వుండటానికి ప్రయత్నిస్తోంది.
    "ఏమిటి చేస్తున్నాను?"
    మోటారు తూచితూచి వేస్తున్నారు. మీరూ, ఈ ప్రక్కవాళ్ళూ పట్టుకుంటేగాని మా యింట్లోకి నీళ్ళు రావు. మాకొచ్చే సమయానికి మోటారు ఆపేస్తున్నారు."
    "ఇక్కడి పద్ధతులంతేమరి"
    "అంటే అంటే? మీరు ఇంటి ఓనరు కదా అదోగొప్ప హోదా, పదవి అనుకోకండి. మేము మీరు కోరినంత అద్దె ఇచ్చి వుంటున్నాం. మీ అవసరాల కోసం మీరు అద్దెకిచ్చారు. మా అవసరాల కోసం మేము వుంటున్నాం. మా కలధర్ట్సు చూసే బాధ్యత మీకుంది. మంచినీళ్ళు లేకుండా చేసి, కరెంటు లేకుండా చేసి, బట్టలు ఉతకటానికి ఆరెయ్యటానికి సరైన ప్లేస్ మ్రినైడ్ చెయ్యటానికి అక్కడ ఉతక్కూడదనీ, యిక్కడ ఆరెయ్యకూడదనీ ఏమిటీ ఆంక్షలు?"
    "మీ పద్ధతులు నాకూ నచ్చలేదు. మేన్నెస్ అయినప్పుడు కలుపుకోవటం, ఆడపిల్ల అలా యిష్టమొచ్చినట్లు తిరగటం..."
    "డోంట్ టాక్ నాన్సెన్స్" అంది సుజాత.
    సత్యాదేవి అదిరిపడి బిత్తరపోయి చూస్తోంది.
    "ఈ కలుపుకోవటం, మా ఇష్టమొచ్చినట్లు మేము సంచరించటం మా అంతరంగిక విషయాలు. దీనివల్ల మిమ్మల్నేమీ యిబ్బంది పెట్టిందిలేదే. మిమ్మల్ని రాసుకుపోసుకు తిరిగి మీ పవిత్రత పాడుచెయ్యటంలేదే, మేమేం డిసిప్లెన్ లేకుండా ప్రవర్తించలేదే. అసభ్యంగా బిహేవ్ చెయ్యటంలేదే."
    "నా దృష్టిలో అది అసభ్యం"
    "మీ దృష్టికి నేను వెయ్యీ యివ్వాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ తారీఖుకల్లా ఖచ్చితంగా అద్దె పే చేస్తున్నాము. మేము అవసరానికి మోటారు వెయ్యమంటే వెయ్యాలి. మా కనీసపు సౌకర్యాలకు ఎలాంటి అవరోధం కలిగించకూడదు."
    "ఆజ్ఞాపిస్తున్నారా?"
    "మీ బాధ్యత గుర్తుచేస్తున్నాను."
    "ఇలాంటి పేచీకోరు మనుషులంటే నాకిష్టం వుండదు. మీరిలా డిమాండ్లూ, కమాండ్లూ చేసే పక్షంలో మా ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోవాల్సి వుంటుంది."
    "నేను డిమాండ్లూ, కమాండ్లూ చేయటం లేదు. ఒకరి జోలికి రాకుండా మా దార్న మేముంటున్నాం. ఇలా అర్థం పర్థం లేకుండా అధికారం చలాయిస్తే మీరు ఇల్లు ఖాళీ చేయించలేరు సరికదా, దుష్ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అని సుజాత విసురుగా వెళ్ళిపోయింది.
    సత్యాదేవి అవమానభారంతో కృంగిపోతూ ఏడుపు మొహం పెట్టుకుని మొగుడు దగ్గరకెళ్ళింది.
    అతనికి డబ్బు సంపాదించటం, ఇంట్లో కావాల్సిన సుఖాలమర్చటం మినహాయించి సమస్యల్లో తలదూర్చటమిష్టముండదు.
    "అంతా విని చూస్తూ ఊరుకుంటారేమిటి?" అంది.
    "ఇది ఆడవాళ్ళ వ్యవహారం, ఇందులో నేను కల్పించుకోవటానికేముంది?"
    "మన ఇంట్లో వుండి నన్నెదిరిస్తుందేమిటి?"

 Previous Page Next Page