Previous Page Next Page 


    "నేనలా అనను. నువ్వు నన్నర్థం చేసుకునేరోజు రాకపోదు."
    ప్రశాంతమైన చిరునవ్వుతోనే సమాధానమిచ్చింది ఉమ.
    శోభ చిరచిరలాడుతూ వెళ్ళిపోయింది.
    పెళ్ళికొడుకు తన చెల్లెలి పెళ్ళికోసమే మూడువేలూ అడిగాడుట. చెల్లెలి పెళ్ళయితేకాని తను చేసికోడుట! కట్నం ముందుగానే ఇవ్వమని కోరాడు.
    "ఎంతమాత్రం వీల్లేదు. అయినకాడికి కట్నం తీసుకుని ఏవేవో పేచీలు పెట్టుకు కూర్చుంటే..." విరుచుకుపడింది శోభ.
    అసలే చికాగ్గా ఉన్న ప్రభాకరం మనసు శోభ మాటలతో భగ్గుమంది. శోభ కాదన్నదానిని అవుననగలగటం ప్రభాకరానికి చాలా సంతోషకరమైన విషయాల్లో ఒకటి. ఈ రకంగానైనా తన ఆధిక్యత నిరూపించుకోవాలని తాపత్రయం కావచ్చు.
    "ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు శోభా! మనం ఆడపెళ్ళివాళ్ళం. కొంత తలవంచక తప్పదు."
    "ఆడపెళ్ళి వాళ్ళమయినంత మాత్రాన వాళ్ళాడించినట్లల్లా ఆడటమేనా? మనం మాత్రం మంచిచెడ్డ ఆలోచించుకోనక్కర్లేదా?"
    "చచ్చినట్లు తలవంచాలి. బంగారుచెల్లీ! మనం ఇప్పుడుంటున్న సంఘం నువ్వు కలలు కంటున్న సంఘంగా మారటానికి ఇంకా ఎన్ని తరాలు గడవాలో చెప్పలేను."
    వెక్కిరింతగా నవ్వి వెళ్ళిపోయాడు ప్రభాకరం. పెళ్ళికొడుక్కి మూడువేలూ అందాయి. అతని చెల్లెలి పెళ్ళికి శుభలేఖ పంపించాడు. ప్రభాకరం వెళ్ళొచ్చాడు కూడా!
    ఉమ పెళ్ళి ముహూర్తం నిశ్చయమయిపోయింది. పెళ్లి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. శోభ మనసులో ఏదో అశాంతిగా ఉంది. హృదయం ఏదో కీడును శంకిస్తోంది. "ఈర్ష్యా" అని తనను తాను ప్రశ్నించుకొంది. కాదు - ఉమను చూసి ఈర్ష్య పడేటంత క్షుద్రమైనది కాదు తన మనసు. వ్యాపార ధోరణిలో సాగే ఈ వివాహానికి హర్షించలేకపోతూంది. ఇందువల్ల ఆమె సుఖపడుతుందని నమ్మలేకపోతూంది. మొగపెళ్ళివారందరూ విడిదికి రావటం, వాళ్ళకు మర్యాదలు చెయ్యటం వీటితో సతమతమయిపోతున్నారందరూ. శోభ కూడా పెళ్ళిసందడిలో కలిసిపోయింది. మనసు సరిపెట్టుకుని ఉమ సుఖపడాలని మనసారా కోరుకుంటూ తనే స్వయంగా ఉమ నలంకరించింది. ఉమ ముఖంలోకి పరిశీలనగా చూసింది. క్రొత్తపెళ్ళికూతురి ముఖాన్ని ఎందరెందరో కవులు ఎన్నెన్నో విధాలుగా వర్ణించారు. కాని ఇప్పటి ఉమ ముఖం ఆ వర్ణనలతో దేనితోనూ సరిపోదు. ఆమె బుగ్గలలో కెంపులు లేవు. పెదవులు చిరునవ్వు నణచుకోవటంలేదు. కనురెప్పలు సిగ్గుతో కలలతో అల్లల్లాడటం లేదు. పెదవులు శాంతంగా నవ్వుతున్నాయి. కళ్ళు స్థిరంగా వెలుగుతున్నాయి. నిరంతర తపశ్చర్యలో ఉన్న సర్వంసహాదేవి మానవాకారం దాల్చినట్లున్నది ఉమ.
    స్థిరచిత్తంతో గౌరిని పూజిస్తున్న ఉమ మనోహరాకృతి చూసి గర్వంతో పొంగింది శోభ హృదయం. "ఈ నా చెల్లెలు ఆణిముత్యం. ఆ వరుడు మహా అదృష్టవంతుడు." అనుకుంది తనలో తాను.
    ఉన్నట్లుండి పెళ్ళిపందిట్లో హాహాకారాలు చెలరేగాయి. అందరూ గొడవగా తిరుగుతున్నారు. శోభ ఒక్క అంగలో అక్కడికి చేరుకుంది.
    కొందరేడుస్తున్నారు.
    కొందరు శాపనార్ధాలు పెడుతున్నారు.
    కొందరు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు.
    ఒక అరగంట ప్రయత్నించగా శోభ గ్రహించిన సారాంశం-
    పెళ్ళికొడుకు మాయమయిపోయాడు. అంటే పారిపోయాడు. తనకీ పెళ్ళి ఇష్టంలేదనీ, అదివరకే ఇంకొక పేదపిల్లకి మాట ఇచ్చాననీ, చెల్లెలి పెళ్ళికోసం తప్పనిసరిగా ఈ పెళ్ళి కొప్పుకున్నాననీ, ఈ పెళ్ళి వల్ల ఇద్దరు స్త్రీల జీవితాలు నాశనం చేసినవాడనవుతాననీ, పిరికిగా పారిపోతున్నందుకు మన్నించమనీ, తను తీసుకున్న మూడువేలూ వడ్డీతో సహా సాధ్యమైనంత త్వరలో తీరుస్తాననీ ఉత్తరం వ్రాసి మరీ వెళ్ళిపోయాడు.
    కామాక్షమ్మ మొదటిసారిగా ఫిట్ వచ్చి పడిపోయింది. విసురుగా ప్రభాకరం దగ్గరకెళ్ళింది శోభ. జీవం ఉందా, లేదా అనిపించేలాగా పాలిపోయిన అన్న ముఖం చూసి తల వాల్చేసుకుంది.
    "తిడతావా? కొడతావా? నీ యిష్టం" శోభవంక ధీనంగా చూసి అన్నాడు ప్రభాకరం.
    జ్ఞానం వచ్చాక మొట్టమొదటిసారిగా అన్నను ఆప్యాయంగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది శోభ.
    ముహూర్తం వేళ మించిపోతూందని పురోహితులు తొందరపెడుతున్నారు.
    "ఈ పెళ్ళాగిపోతే ఇంత ప్రయత్నం మళ్ళీ మనవల్లవుతుందా?"
    నిస్పృహగా కూలబడింది పార్వతి.
    "ప్రయత్నం మాట సరేనమ్మా! ఒకసారి పెళ్ళికూతురిని చేసిన పిల్లని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు?" సాగదీసింది ప్రభాకరం మేనత్త వర్ధనమ్మ.
    "ఏవిఁటండీ?" 'ఏదీగతి?' గొంతులో ఏడుపును గుండెల్లో దాచుకుంటూ ప్రభాకరాన్నడిగింది పార్వతి.
    "నన్నేమీ అడక్కండి. నేను మనిషిని కాను. నాకు మెదడు లేదు. ఆలోచన లేదు. మీరంతా ఏం చెయ్యమంటే అది చేస్తాను."
    అమ్మలక్కలంతా పోగయి ఫలహారాలు తింటూ వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. శోభ కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి.
    కామాక్షమ్మ ఫిట్ లోంచి తేరుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది.
    "నీ బాధ చూడలేకపోతున్నా వదినా" దగ్గిర చేరింది వర్ధనమ్మ.
    "భగవంతుడు నా నుదుట్న బాధలే వ్రాశాడమ్మా! నా ప్రాణాలు ఎందుకున్నాయో తల్లీ" కామాక్షమ్మ తల గోడకేసి కొట్టుకుంది.
    "ఏవిఁటది వదినా?" అంటూ కామాక్షమ్మను పొదివి పట్టుకుంది వర్ధనమ్మ.
    "మీరంతా ఇంత బాధపడుతూంటే చూడలేకపోతున్నాను. పోనీలెండి. విచారించకండి. ఈ ముహూర్తానికే మా చలపతికి చేసుకుంటాను ఉమను..."
    ఉదారంగా ప్రకటించింది.
    పెళ్లిపందిరంతా ఒక్కసారి ఉలిక్కిపడింది.
    "ఒకటో క్లాసులో ఒక్కేడూ, రెండో క్లాసులో రెండేళ్ళూ" పద్ధతిలో చదివి, ఎలాగో ముప్పైయేళ్ళకు మెట్రిక్ వరకూ కొట్టుకొచ్చి అది దాటలేక అక్కడితో ఆగిపోయి వెఱ్ఱిబాగులవాడుగా, చవటగా ప్రపంచ ప్రసిద్ధిగన్న వ్యక్తి చలపతి. ఒకసారతణ్ని చూసిన వ్యక్తులు మరొకసారి చూడలేనంతటి రూపు రేఖా విలాసాలు.

 Previous Page Next Page