సుందరం తడబడుతున్న కంఠంతో "నిద్రరావటంలేదు జ్యోతి. నేను... రేపు..." అంటున్నాడు.
"లైటు వేస్తాను" అంది జ్యోతి.
"ఉహు. వద్దు నేను రేపుప్రొద్దున వెళ్ళిపోతున్నాను. మళ్ళా నాలుగయిదు నెలలకుగాని కలుసుకోం. నీకు దిగులుగా లేదూ?"
ఆమె బాధగా "ఏంచెయ్యను?" అంది.
అతనామె దగ్గరగా వచ్చి ఆమె చేతిని తనచేతిలోనికి తీసుకున్నాడు.
ఈ అర్థరాత్రి సమయం ఎవరికీ తెలియని సన్నివేశం. ఊహకు దగ్గరగా వచ్చే ప్రవర్తన.
ఆమెకాళ్ళు వణికాయి. గుండె కొట్టుకుంది. "మీకు దణ్ణం పెడతాను వెళ్లిపొండి" అంది బ్రతిమాలుతూ.
అతను జవాబు చెప్పకుండా ఆమెకళ్ళలోకి తమకంగా చూశాడు.
ఆమెకర్థమయింది. "మావాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు కాదన్నారు మరి?" అని అడిగింది సిగ్గుని పారద్రోలుకుని.
పెళ్లి అయిపోగానే వియ్యపురాలు వచ్చి లలితమ్మగారితో గుసగుసలాడింది. ఆవిడ దగ్గరకొచ్చి "ఏమంటావురా?" అని అడిగింది. సుందరం పెద్దపెట్టున విసుక్కుని "నా చదువు పూర్తయేదాకా అలాంటివేమీ పెట్టబోకమ్మా గోల" అన్నాడు. ఆవిడ మళ్లా వెళ్లి ఆ మాటే చెప్పింది.
"అప్పుడు... నాకు తెలియలేదు. నువ్వు నా హృదయమంతా ఆక్రమించుకుని కూర్చున్నావు. ఈ స్వల్పవ్యవధిలో ఇంత పరిణామము ఎలా కలిగిందో నాకూ తెలీదు."
తనచేతిలో అతనిచెయ్యి వొణుకుతూ వుండటం ఆమె గమనించింది. "రేపు ఉదయం మాట్లాడుకుందాం. మీ గదికి వెళ్ళరా?" అన్నది ప్రాధేయ పూర్వకంగా.
అతను తనచేహ్తిని విడదీసి మెల్లగా ఆమె భుజంపైన వేశాడు. ఇద్దరికీ భయంగా వుంది. ఇద్దరి శరీరాలు కంపిస్తున్నాయి. ఇద్దరూ అస్పష్టమైన దశలో వున్నారు.
అతని కామెను హృదయానికి గట్టిగా హత్తుకోవాలనిపిస్తోంది. కాని అది తప్పుక్రింద అప్పట్లో చెయ్యరాని పనిక్రింద... అలా చెయ్యటానికి మనస్సు నిరాకరిస్తోంది. ఎలాగో తెలియటల్లేదు.
"ఒక్కసారి నిన్ను హృదయానికి అదుముకోవాలని వుంది జ్యోతి!" అన్నాడు తడబడే గొంతుతో.
ఆమెకేమనటానికి తోచలేదు. అతను తన పెనిమిటి. గట్టిగా ఏదీ చెప్పటానికి నోరు రావటంలేదు. ఏమయినా అతనిక్కడనుంచి వెళ్ళిపోవటం తనకు కావాలి, పెద్దవాళ్ళకు తెలియకుండా-
"ఒక్కసారి అదుముకొని వొదిలేయండి" అన్నది విధిలేక.
అతడామెను బిగియారా కౌగలించుకున్నాడు. అపూర్వమైన యీ అనుభవం. చీకటి, వెలుతురు, నిశ్శబ్దం, ఇద్దరి వంటరితనం, ఇన్నాళ్ళ అజ్ఞాత ప్రేమ. అలాంటిదే ఆవేశం. జీవితపు చిత్రం. ఆలోచనలు నిలిచిపోయినయ్.
"వెళ్ళండి. యింక వెళ్ళండి" అనే ఎవరికీ వినిపించని జ్యోతి వేడికోలు నిష్ప్రయోజనమయి క్రమంగా ఆ కౌగిలిలో మూగపోయింది.
* * *
తెలతెలవారుతుండగా తనగదిలో మెలకువ వచ్చింది సుందరానికి. తను ఎప్పుడు అక్కడినుంచి నడిచి వచ్చాడు? అతనికి ఆశ్చర్యం కలిగింది.
మరుక్షణంలో అతను నిలువునా వొణికాడు.
తను ఎంత తొందరపడినాడు! ఇన్నాళ్లు తీసుకున్న జాగ్రత్త క్షణికావేశంలో ఎలా మరిచిపోయాడు! తను ఏ స్థితిలో వున్నాడో తెలుసుకోకుండా, తన శరీరతత్వం మరిచిపోయి, పెద్ద వీరుడిలా... మామూలు మనిషిలా.
అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
జ్యోతి కాఫీ తీసుకువచ్చింది. అతనివంక తల ఎత్తి చూడలేకపోతోంది. అతనికి తన చర్య భయంకరంగా తోచింది. నిజస్థితిని దాచిపెట్టి ఆమె జీవితానికి అన్యాయం చేశానని కుమిలిపోయాడు.
అతను మాట్లాడకుండా కాఫీ తాగసాగాడు. ఆమె తలవంచుకుని నిలబడి బొటనవ్రేలితో నేలను రాస్తోంది.
అతను కాఫీ త్రాగటం ముగించి "గ్లాసు యిదిగో జ్యోతి!" అన్నాడు.
ఆమె హటాత్తుగా తల ఎత్తింది. ఆమె కళ్ళు ఏడ్చిఏడ్చి ఎర్రగా వున్నాయి. ఎంత తుడుచుకున్నా పోని చెంపలమీది చారలు, ఆ చారలక్రింద కొత్తగా ఏర్పడిన కాంతిరేఖలు అంత దుఃఖంలోనూ ఆమె సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.
"మీరు వెళ్ళిపోతారా?" అంది గాద్గదికమయిన కంఠంతో జ్యోతి.
అతని గుండెల్లో ముల్లు విరిగినట్లయింది. "ఏం చెయ్యను జ్యోతి మరి" అన్నాడు వ్యాకులపాటుతో.
"నన్ను విడిచి ఎలా వెళదామనుకున్నారు మీరు?" అని వెక్కి వెక్కి ఏడ్చేసింది జ్యోతి.
* * *
యీ భూమ్మీద ఒకరకం మనుషులుంటారు. వాళ్ళు అనుక్షణము ఎన్నో చెయ్యాలని తహతహలాడుతూంటారు. కాని చెయ్యలేరు, చెయ్యలేరని తహతాహలాడటం మానరు. ఉండి ఉండి ఇహ పట్టుదలతో చేశారా విపరీత పరిణామాలు.
అలాంటివాడే సుందరం.
అతను భార్యను తనతో తీసుకుపోవాలనీ, ఆమెతో కలిసి వుండాలని ఎంతో అనుకున్నాడు. కాని ఓ నిర్థారణకు రాబోయేసరికి ఎన్నో ఆటంకాలు కళ్ళముందు కనిపించసాగాయి. ఆనాటి విషయం యింకెవరికీ చెప్పవద్దని జ్యోతి దగ్గర మాటతీసుకుని బయలుదేరాడు. అతను కాకినాడనుంచి విశాఖపట్నం బయలుదేరుతూండగా తల్లి మరోసారి అడిగింది. "వాళ్ళా విషయం ఏమయినా ఉత్తరం రాస్తే నువ్వు చెప్పినమాటే రాయమంటావురా?" అని. "ఆహా, ఇప్పుడు ఏం వీల్లేదు" అని గట్టిగా చెప్పి రైలు ఎక్కాడు బుద్ధిమంతుడు సుందరం.
అతను విశాఖపట్నం వెళ్ళి చేసిన మొట్టమొదటి పనేమిటంటే గబగబ డాక్టరు దగ్గరకు పోయాడు. తను వెళ్ళి పరీక్ష చేయించుకున్న స్పెషలిస్టుతో 'సార్!' ఓ సంవత్సరం క్రితం మీరు నాకు పరీక్షచేసి టి.బి. వుందని చెప్పారు. మళ్ళీ ఒకసారి చూసి నేను ఏ స్థితిలో వున్నానో చెబుతారా?" అంటూ ఆయన ముందు నిలబడ్డాడు. అతని మనస్సు వెయ్యి శంకలతో నిండివుంది. భయాలూ, అనుమానాలూ పీడిస్తున్నాయి. జీవిత సమస్య ఇది. తనని చివరకు ఎలా తేలుస్తుందో?