Previous Page Next Page 
శారద పేజి 21


    "కానీ ఇది మద్రాస్. ఇక్కడి డాక్టర్లు సాధారణులు కారు."

    చిన్నక్క భయం తీరినట్లు కనబడలేదు. కంపించిపోతోంది. ఆపరేషన్ జరిగేముందు బావ ఆమెను దగ్గరకు రమ్మని సంజ్ఞచేశాడు. ఆమె తడబడుతూ నడిచివెళ్ళింది. నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టి ఒకరినొకరు అవలోకించుకున్నారు. కానీ ఆ చూపులు ఏమీ మాట్లాడుకున్నట్లు లేదు. ఈ భావం రవిని జంకించింది. భార్యాభర్తలు వాళ్ళు. విడిపోతామేమోనని హడలిపోతున్నారు. వేగంగా అతని ముఖం రక్తహీనమైంది.

    ఆపరేషన్ జరుగుతున్నంతసేపూ తమ్ముడిఒళ్ళో శిరస్సువాల్చి కళ్ళు మూసుకుని పడుకునివుంది. శారద. ఆమె హృదిలో ఎలాంటి భావ తరంగాలు చెలరేగుతున్నాయో అతనెరుగడు. నూతన భావోద్వేగంతో స్పందించిన అతడి దుర్భలశరీరం, ఈ రక్త బంధువుయొక్క అత్యంత ప్రీతిపాత్రమైన స్పర్శతో ఒకింత శాంతపడుతోంది. ఆమెపట్ల శ్రద్ధాభక్తులతో, వాత్సల్యంతో, మమతతో హృదయక్షేత్రంలో ఏమూలో ఉదయించిన సౌఖ్యగరిమ క్రమక్రమంగా పరాకోటి నందుకుంది. కొంచెం కొంచెంగా ఆమె చెవులమీదికి వంగాడు. "చిన్నక్కా!" అన్నాడు ప్రియంగా.

    శారద పలకలేదు. కానీ అతడి ఒడిలో ఆమె తనూలత వడివడిగా చకితమైంది. ఆతురత అధిగమించి మరోసారి పిలిచేందుకు ఆయత్తపడేలోపునే లోపలనుంచి నర్స్ వచ్చి ఈ దృశ్యంలో తొణికిసలాడుతున్న మార్ధవాన్ని అనుభవించే ఓర్పు చూపలేక చప్పున శుభవార్త అందించి స్తబ్దురాలుగా వున్న ఇద్దరినీ సంభ్రమంలోకి తరిమింది. మాటాపలుకూ లేకుండా ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు లోపలికి ఇంచుమించు పరిగెత్తారు. శోకంలోంచి నాకంలోకి వలె.

                                        *    *    *

    "శారదా!" అన్నాడు గోవిందరావుగారు పరుపుమీద పడుకుని వుండి, పాలిపోయి కృశించివున్న ఆయన పెదాలపై హిమగిరిపై ఉదయించిన చంద్రరేఖలా ఓ హాసరేఖ ఆవిర్భవిస్తోంది.

    ఆ సమయానికి ఆమె పాలు అందిస్తోంది నోటికి. "త్రాగండి" అంది.

    ఆయన నీరసంతోకూడిన ఓ చూపు ఆమెపైకి పోనిచ్చి "నేనిలా బ్రతికి బయటపడతానని కలలోకూడా అనుకోలేదు శారదా!" అన్నాడు శోకమిళితమైన క్షీణస్వరంతో.

    రవి కిటికీలోంచి బయటికి పరికిస్తున్నవాడల్లా ఈ వాక్యంవిని, వెనుదిరిగి నవ్వుతూ "కలలో అనుకున్నా అవి నిజాలుకావు. అందుకే ఇలా జరిగిందని అనుకోకూడదూ? ముందు పాలుత్రాగు" అన్నాడు.

    "అజీర్ణం చేస్తాయోమో?" అన్నాడాయన భయంభయంగా.

    "హహ్హా, ఇహ ఆ రోజులు పోయినాయి. నువ్వు ఉక్కు తునకవి కాబోతున్నావు. డాక్టరుగారు చెప్పారు" అన్నాడు రవి.

    "నిజంగానా?" అనడిగాడు ఆశగా.

    తర్వాత పాలుత్రాగటం పూర్తిచేశాక "ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళుండాలో గదా?" అని మెల్లగా పలికాడు విసుగుతో.

    "ఇప్పటికి వారం రోజులు వచ్చి. కనీసం పదిరోజులు..."

    "ఊ" అని గొణిగి భార్యవైపు చూపు నిగుడించి "ఈ జబ్బు వచ్చినప్పటి నుంచీ రాత్రింబవళ్ళూ నా దగ్గరే కాపలాకాసి సకలోపచారాలూ చేశావుకాదా!" అని జాలిగా "చిక్కి శల్యమైపోయినావు" అన్నప్పుడు అతని కంఠం వణికింది.

    శారద ఏమీ మాట్లాడలేదు. ఆయన పాలు త్రాగి గ్లాసు అవతలకు త్వరత్వరగా తీసుకుని నిష్క్రమిస్తున్నప్పుడు బావ మాటలువిని, వివర్ణమైన వదనంతో శల్యావశిష్టమై వున్న ఆమె రూపంకేసి తదేకంగా చూసిన రవి తల ప్రక్కకి త్రిప్పుకున్నాడు బాధగా.

    రెండురోజులు గడిచాక మధ్యాహ్నం నాలుగు గంటలవేళప్పుడు గోవిందరావుగారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు.శారద పాలభాగంపై ఆవరిస్తూన్న స్వేదబిందువుల్ని తన సుకుమారమైన చేతుల్తో తుడిచి, కుర్చీలో కూర్చుని, అదే వ్యక్తికేసి రెప్పవాల్చకుండా చూసింది. తరువాత ఒక ప్రక్కకు జరిగి కుర్చీ చేతిమీద ఒకచేతిని ఆనించి, దానిపై ముకుళిత ముఖపద్మాన్ని బలహీనంగా వాల్చి ఏదో సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది.

    ఓ పావుగంట గడిచాక రవి ఆ గదిలోకి ప్రవేశించేసరికి ముందుకువాలి వున్న చిన్నక్క శిరస్సు హస్తద్వయంలో సంఛన్నమైవుండటం చూసి ఉలిక్కిపడ్డాడు. "చిన్నక్కా!" అని పిలిచాడు ఆమెను సమీపిస్తూ.

    ఆమె కంగారుతో లేవబోయి వెనువెంటనే తన స్వరూపం తమ్ముడు ఎక్కడ పసిగట్టి వేస్తాడోనన్న భయంతో ఆగిపోయి "వచ్చావా?" అనడిగింది తల ఎత్తలేక.    

    "వచ్చాను. నువ్వింకా ఇలానే వున్నావేం? నేను చెప్పింది మరచిపోయావా?" అంటూ ముందుకు వచ్చి ఆమెనుచూసి దిగ్భ్రాంతితో "ఇదేమిటి? ఏం జరిగింది?" అన్నాడు వ్యాకులపాటుతో.

    ఇహ తేటతెల్లమైపోయిందన్న నిర్ణయభావంతో ఓ శుష్కహాసం ఉదయింప చేసుకుని "ఏమీలేదు. కళ్ళు ఎర్రబడ్డాయి" అంది. కానీ "ఇదేమిటి, ఈ సమాధానం?" అని తక్షణం ఆత్మపరీక్ష చేసుకున్న తరుణాన ఆ శుష్కహాసమూ దరిదాపుల్లో లేకుండా అంతరించిపోయింది.

    ఈ అవివేకపు మాట రవిని చివుక్కుమనిపించింది. ఇంక త్రవ్వకూడదనుకున్నాడు. "బావ నిద్రపోతున్నట్లుందే?" అన్నాడు.

    చిన్నక్క తల ఊపింది.

    "మరి బయల్దేరుదామా?"

    ఆమె చాలా సంకటంలో పడినట్లు చాలాసేపు మెదలకుండా ఊరుకుని "వారిని విడిచి....." అంది.

    "బావ వెళ్ళమని చెప్పాడుగా......?"

    "చెప్పారు కానీ...."

    రవి ఓర్మి నశించి "అబ్బ! నీదంతా మరీ చాదస్తం చిన్నక్కా! ఇలా గుమ్మందాటి బయటకు పోకపోతే అసలు ప్రపంచాన్నికూడా మరిచిపోతావు. ఐనా నర్స్ జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. రా!...." అన్నాడు.

    మళ్ళీ ఓ నిముషం తటస్థంగా గడిపి శారద "పద" అంది.

    "అదేమిటి? ఇలాగేనా? బట్టలేం మార్చుకోవూ?" అని రవి ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు.

    తల దువ్వుకోలేదు. ఉదయం ధరించిన చీరె నలిగి బాగా ముడుతలు పడిపోయింది. కనీసం ముఖమైనా రుద్దుకోకపోవటం చేత ఆలోచనలు ఏర్పరచిన విషాదఛాయలు వాటితాలూకు కన్నీటిచారలూ! వేటికో అందుకోలేని ఆగాధాలకు సాదృశ్యంగా అలానే నిలబడివున్నాయి. కానీ, ఆమె నిస్సంకోచంగా అదేవిధంగా బయల్దేరడానికి సిద్ధపడింది. రవి మాటలకు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూస్తూ నిల్చుంది.

    అతను కొంచెంసేపు తటపటాయించి ఎక్కువసేపు యోచించలేక "రా, చిన్నక్కా!" అన్నాడు. ఆమె కదిలింది అస్పష్టంగా.   

 Previous Page Next Page