Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 21


    "కాలేదు.... కన్విన్స్ చేశారు" అంది విజూష.

 

    "ఇప్పటికయినా మీకు అర్దమై వుండాలి"

 

    "ఏమిటి?"

 

    "నేనేదయినా చెప్పి ఒప్పించగల సమర్దుడ్నని"

 

    ఉలికిపాటుగా చూసింది.

 

    ఇందాకతను కామెంట్ చేసినందుకు ప్రతిగా ఇప్పుడిలాంటి ప్రయోగం చేశాడా....

 

    అసలు రుత్వి వ్యక్తిత్వం ఏమిటి?

 

    ఏ కోణంలో అయినా తను గొప్పవాడే అని తనముందు నిరూపించుకుంటున్నాడా?

 

    లేక....

 

    తనను గాఢంగా ఇంప్రెస్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడా.....

 

    "సో... ఇప్పటికయినా నాకో విషయం అర్దమైంది" అంది కారును ఇందిరా పార్క్  పార్కింగ్ లో ఆపుతూ.

 

    కేజువల్ గా చూస్తున్న రుత్వితో అంది - "మీరు నిజాన్ని అబద్దంగా అబద్దాన్ని నిజంగా మార్చి చెప్పగలరు... చెప్పి ఒప్పించగలరు."

 

    "నిజానికీ అబద్దానికీ చాలా దగ్గిర సంబంధం వుంది విజూషా! సంబంధంకాదు రెండింటి మధ్య దూరం లేదు విడదీసే సన్నని సరళ రేఖ తప్ప."

 

    ఇది మరో కొత్త నిర్వచనంలా అనిపిస్తుంటే నిజానికి లోతుగా వెళ్లాలని లేకపోయినా అడిగింది "మరికాస్త వివరంగా చెబితే బెటరు. "    

 

     అది యధాలాపంగా కాదు నిజానికి అతడు మాట్లాడుతుంటే ఆమెకు  వినాలనిపిస్తుంది.

 

    ఇలా ఎందుకు అనిపిస్తున్నదీ ఆమెకి అర్దం కాని విషయమే!

 

    పార్కింగ్ ఏరియాలోనుంచి పార్కు పొదల మధ్యకి నడుస్తూ

 

    "మీలాంటి ఓ అందమయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ అబ్బాయితో ఏడాది కావడం పూర్తయింది.

 

    అప్పుడు ఆ భార్యామణి పూర్వం నన్ను, రంభ, సౌందర్య, మాధురిదీక్షిత్ అనేవారు.

 

    పెళ్లయ్యాక మాటవరసకయినా అలా అనడంలేదేం అని అడిగిందట.

 

    దానికి ఆ భర్త పెళ్లయ్యాక అబద్దాలు మాట్లాడటం మానేశాను అన్నాడట" రుత్వి చెబుతున్నదింకా పూర్తికానేలేదు.

 

     పకాల్న నవ్వింది విజూష.

 

    నిజానికి, అబద్దానికీ మధ్యనున్న సన్నని సరళరేఖలా కనిపించాడు రుత్వి.

 

    "మీరు నా మొహం వాచేట్టు ఓ కౌంటర్ వేయకుండా కేవలం నవ్వేసి వూరుకున్నారేంటి" అన్నాడు.

 

    "కౌంటరా... " విస్మయంగా అంది.

 

    "నేను మీ అంత మాటకారిని కాను."

 

    ఓ పొదవారన కూర్చుంటూ. "అయినా మీరు జోక్ చెపితే నేను కౌంటర్ ఎందుకు వేయాలి?" అడిగింది.

 

    "కనీసం కౌంటర్ లాంటి జోక్ వేయొచ్చుగా."

 

    ఆమెనే అర్దంకానట్టు చూస్తుంటే మళ్లీ రుత్వి చెప్పాడు.

 

    "ఓ గాడిద మెడకి తాటుకట్టిన ఓ యువకుడు ఆ గాడిదని రోడ్డుమీద ఈడ్చుకుపోతున్నాడట. అది ఓ పట్టాన కదలడం లేదు."

 

    చాలా ఆసక్తిగా వింటున్నది విజూష.

 

    "ఇంతలో  అదే రోడ్డుమీద ఓ మిలటరీ సోల్జియర్ వెళుతూ ఆ యువకుడ్ని వుడికించాలని అన్నాడట.


 
    ఏంటి మాస్టారూ! మీ తమ్ముడ్ని అలా తాడు కట్టి లాగుతున్నారూ అని.

 

    దానికి ఆ యువకుడు సింపుల్ గా యిచ్చిన కౌంటరేమిటో తెలుసా? మరేం లేదు సోల్జియర్ గారూ!

 

    వదిలిపెడితే మిలటరీలో చేరిపోతానంటున్నాడు మీ తమ్ముడు అని"

 

    నవ్వాపుకోలేకపోయాడు రుత్వి.

 

    అదికాదు పడీపడీ నవ్వింది.

 

    బహుశా ఆమెకు జ్ఞానం తెలిసాక అంతగా నవ్వడం యిదే తొలిసారి.

 

    సెన్సాఫ్ హ్యూమర్ వున్న మగాడు కూడా అనుకుంది విజూష రుత్విని చూస్తూ.

 

    అలా ఎంతసేపు నవ్విందో ఆమెకే గుర్తులేదు.

 

    చివరగా కళ్లొత్తుకుంది ధారగా జారిన కన్నీళ్లను తుడుచుకుంటూ....

 

    "ఇప్పటికి నాకు అర్దమైంది విజూషా!"

 

    "ఏమిటి?"

 

    "నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఆత్రేయ ఎందుకన్నాడో"

 

    ఆమె తలవంచుకుంది.

 

    నిశ్శబ్దాన్ని నెమరువేసుకుంటున్న మనసు యిక్కడ ఓ యువకుడి సన్నిధిలో

 

    సముద్రహోరుని, ప్రకృతి ఘోషనీ మాటకట్టుకుని స్మృతుల పూసల లోపలికి ప్రేమదారాన్ని తొడుగుతూ తెలిపి వెన్నెల పుప్పొడిని రుచిచూసి పలకరించిపోతూంది.

 

    "అసలు కన్నీళ్ళు ఎందుకొస్తాయంటారు?"

 

    విజూష మౌనాన్ని చీల్చుతూ అడిగాడు.

 

    విభ్రాంతిగా చూసింది విజూష.

 

    కావాలని అలాంటి ప్రశ్న వేసాడో లేక ఏదో మాట్లాడాలి కాబట్టి అలా అన్నాడో ఆమెకి అర్దంకాలేదు.


 
    "నేను సీరియస్ గానే అడుగుతున్నాను."

 

    "అంటే ఆడపిల్లలు ఎక్కువగా కన్నీళ్ళెందుకు పెట్టుకుంటారని అడుగుతున్నారా"

 

    "మీరు ఆ జాతి అమ్మాయిల్లోకి రారని నాకు తెలుసు విజూషా"

 

    గర్వంగా అనిపించింది విజూషకి.

 

    తనను అందరి అమ్మాయిల్లో ఒకతెగా కాక భిన్నంగా ఆలోచించటం నిజంగా ఆనందమనిపించింది.

 

    "అయినా కన్నీటికి లింగభేదం లేదు. ఏడ్చింది మగవాడియనా ఆడపిల్లయినా కన్నీరు మాత్రం వుప్పగానే వుంటుంది."

 

    రుత్ని ఆగాడు క్షణంపాటు.

 Previous Page Next Page