"ఆ విషయం కనుక్కోవదానికే కదా మీ డిపార్ట్ మెంట్ వున్నదీ!" సెటైరికల్ గా అన్నాడు రే.
తను వచ్చింది ఆ విషయం చెప్పడానికి కాదన్నట్టు సి.బి.ఐ. చీఫ్ చిన్న గొంతులో ".... ఆనకట్టల నిర్మాణంలో జరిగిన అవకతవకల గురించి ఎంక్వయిరీ ప్రారంభించమని ప్రధానమంత్రి కార్యాలయంనుంచి ఈ రోజే సూచనలు వచ్చాయి" 'ఆ విషయం మీకు చెప్పడానికొచ్చాను' అన్నట్టు అనేసి వెళ్లిపోయాడు.
భరత్ మొహం వివర్ణమైంది.
అయితే ఒకటి మాత్రం నిజం. ఆనకట్టల నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో తననెవరూ ఇరికించలేరని అతడికి నిశ్చయంగా తెలుసు. అతడు భయపడేది అందుకు కాదు. ప్రధానమంత్రికీ, తనకీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు పొడచూపుతున్నాయన్న విషయం అతడూ గ్రహిస్తున్నాడు.
'ఇప్పుడు ప్రధానమంత్రి పావు ముందుకు జరిపాడన్న మాట! అయితే ఈ ఎత్తువల్ల జరిగే నష్టం ఏమీ వుండదు. ఇక ముందు మాత్రం జాగ్రత్తగా వుండాలి' అనుకున్నాడు.
అతడు ఆలోచనలో పడడం చూసి సంకల్పనాథ్ అన్నాడు. "....నువ్వేమీ దిగులు చెందకు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కదా! ఈలోగా సి.బి.ఐ. ఏమీ నిరూపించలేదు. వాళ్ళెంత లోతుగా శోధించినా మనిద్దరి శాఖల్లో ఒక చిన్న పాయింట్ కూడా పట్టుకోలేరు."
"నువ్వు చెప్పింది నిజమే! అయితే మన జాగ్రత్తలో మనం వుండాలి" తేలికపడిన మనసుతో అన్నాడు భరత్.
అదే సమయానికి తలుపు ధడేలున తోసుకుని లోపలికి వచ్చాడు హరిస్వామి. అతడు గడగడా వణుకుతున్నాడు. మొహం అంతా చెమటలు పట్టి వున్నాయి.
ఏ మంత్రి రహస్య సమాలోచనలో మందిరంలోకి అయినా అలా స్వంతంత్రంగా వెళ్ళిపోగలిగే చనువూ, అధికారం హరిస్వామికి వున్నాయి. పేరుకి మాత్రం అతడు భగవంతుడి మనిషి. అసలు విషయం అదికాదు. దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య అతడు వ్యవహారం నడుపుతూ వుంటాడు. మూడో కంటికి తెలియకుండా ఆర్థికపరమైన లావాదేవీలకి మధ్యవర్తిత్వం వహిస్తాడు. అత్యున్నత వర్గాల్లో ఇది చాలా ముఖ్యమైనది. రాజకీయ నాయకులు తాము బయటపడకుండా తెరచాటున వుండి వ్యవహారాలు నడిపించడానికి హరిస్వామి లాంటి నమ్మకమైన వ్యక్తులు చాలా అవసరం. అతడు కూడా అంతే నమ్మకంగా గత రెండు దశాబ్దాలుగా ఆ బ్రోకరు పని చేస్తూ రాజకీయ నాయకులందరికీ తలలో నాలుకయ్యాడు. వారి జీవిత విధానాల్నీ, భవిష్యత్ కార్యక్రమాలనీ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాడు.
అటువంటి హరిస్వామి నిలువెల్లా వణికిపోతూ వళ్ళంతా చెమటలతో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మంత్రులిద్దరూ ఆశ్చర్యపోయారు.
"ఏమైంది?" అని అడిగాడు భరత్.
"ఈ రోజు పేపరు చూసారా? వినాయకుడు పాలు తాగాడు!" రొప్పుతూ అన్నాడు స్వామి.
"ఈ హడావుడిలో పడి పేపర్ చదవడమే కుదర్లేదు. పాలు తాగడం గురించి విన్నానంతే! దానికింత కంగారెందుకు?"
"ఆ పాలు తాగించింది ఎవరో తెలుసా?"
"ఎవరు?"
"మరణించిన మంగళ్ సింగ్!"
రిగ్గింగ్ చేస్తూ పొరపాటున ప్రత్యర్థి గుర్తుమీద ముద్ర వేసిన అభ్యర్థిలాగ- తల తిరిగిపోయేటంత అయోమయంతో హరిస్వామి వేపు చూసారు ఇద్దరు మిత్రులూ!
"మరణించినవాడు పాలు తాగించడం ఏమిటీ?"
చేతబడి చేసేవాడు ఆఖరి మంత్రం చదివినట్టు గంభీరంగా "....మంగళ్ సింగ్ మళ్లీ పుట్టాడు" అన్నాడు హరిస్వామి.
"మంగళ్ సింగా? నువ్వు చెపుతున్నది కూడా మంగళ్ సింగ్ గురించేనా?"
"అవును. పాతిక సంవత్సరాల క్రితం చంబల్ వాలీలో ఉన్న మంగళ్ సింగ్ గురించే! అంధ్రప్రదేశ్ లో బృహస్పతి అనే కుర్రాడికి గతజన్మ గుర్తొచ్చిందట!! అతడే మంగళ్ సింగ్!!! గత జన్మ పాపాల పరిహారార్థం మానవసేవకై మళ్ళీ పంపించాడట యమధర్మరాజు" అన్నాడు హరిస్వామి.
"నేను చచ్చినా నమ్మను" అన్నాడు సంకల్పనాధ్. ఆర్.బి.ఎల్. భరత్ కళ్ళప్పగించి, నోటమాట రానట్టు వాళ్ళిద్దరి వేపూ చూస్తున్నాడు. అతడి మొహంలో అప్పటికే ప్రేతకళ వచ్చేసింది.
"మీరు నమ్మినా, నమ్మకపోయినా అది మాత్రం నిజం" అన్నాడు హరిస్వామి ఉరఫ్ ఇబ్రహీంఖాన్.
"....గత జన్మ గుర్తొచ్చి, ఆ చరిత్రంతా చెప్పిన దాఖలాలు పూర్వపు పురాణాల్లోనూ, ప్రస్తుత చరిత్రలోనూ బోల్డన్ని చూపిస్తాను. అమెరికాలో చచ్చిన ఆటోడ్రైవర్, ఆముదాలవలస ఆటోమొబైల్ ఫ్యాక్టరీ వర్కర్ గా పుట్టడం నాకు తెలుసు."
"అమెరికాలో ఆటోలూ, ఆముదాలవలసలో ఆటో ఫ్యాక్టరీలు లేవు బాబా!" సంకల్పనాధ్ ఎగతాళి చేసాడు.
"మీలాంటి మూర్ఖులు దేవుడి అస్తిత్వాన్నే ప్రశ్నిస్తే నేను చెప్పగలిగేది ఏమీలేదు."
"గతజన్మలో నువ్వెవరివి?"
"నేను స్వచ్చమైన గోవును."
"మరి మేము?" సంకల్పనాధ్ అడిగాడు.
"నువ్వు గతజన్మలో తెలువి. ఈ భరత్ జెర్రి" అన్నాడు హరిస్వామి.
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?"
"అలాంటి జంతువులే- మరు జన్మలో మానవులై రాజకీయాల్లో చేరతాయి."
టెన్నిస్ ప్రేక్షకుడిలాగ అప్పటివరకూ అటూ ఇటూ తలతిప్పుతూ వారి సంభాషణ అయోమయంగా వింటున్న రాంభగవాన్ లక్ష్మణ్ భరత్- అప్పుడే స్పృహలోకి వచ్చిన వాడిలా ఒక్క ఉదుటున సోఫాలోంచి వాళ్ళిద్దరి మధ్యకి గెంతి, అన్నాడు-
"అసలు విషయం ఆలోచించడం మానేసి, పాముల గురించీ, తేళ్ళ గురించీ చర్చించాలంటే మిమ్మల్నిద్దర్నీ షూట్ చేస్తాను" అని హరిస్వామి వేపు తిరిగాడు. "....నువ్వు గత జన్మలో పవిత్రమయిన గోవువా? నిన్న రాత్రే కదా నాతోపాటు బీఫ్ కావాలని తెప్పించుకుని తిన్నావ్!"
సంకల్పనాధ్ కల్పించుకుని "మనం ముగ్గురం అనవసరంగా ఆవేశపడి పోతున్నాం. ఎవడికో గతజన్మ గుర్తొచ్చిందనుకుందాం.... తను ఒకప్పుడు డాకూ మంగళ్ సింగ్ అన్నాడు.... అది నిరూపించడం కోసం వాడు రెండు మూడు ఉదాహరణలు కూడా చెప్పి ఉండవచ్చు."
"వినాయకుడితో పాలు కూడా తాగించాడు" పక్కనించి అన్నాడు హరిస్వామి.
"పాలు తాగించకపోతే పరమాన్నం కూడా తినిపించనీ.... దానివల్ల మనకి వచ్చే నష్టం ఏమిటీ?"
"నీకింకా అర్ధంకాలేదా సంకల్పనాధ్?" రంకె వేసినట్టు అరిచాడు రాంభరత్. "....ఇంత ముందు చూపులేని వాడివి రాజకీయ నాయకుడివి ఎలా అయ్యావ్? మనం 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' అన్న విషయం మర్చిపోయావా? డాకూ మంగళ్ సింగ్ ముఖ్య అనుచరుడైన త్రిలోకనాధ్ యాదవ్- పేరు మార్చుకుని ప్రస్తుతం సంకల్పనాధ్ రే అయ్యాడనీ, అప్పటి జానకి రాంభగత్ నైన నేను- ప్రస్తుతం రాంభగవాన్ లక్ష్మణ్ భరత్ పేరుతో చలామణి అవుతున్నాననీ- 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' లో నాలుగో వాడైన ఇబ్రహీంఖాన్- మతం కూడా మార్చేసుకుని ఈ హరిస్వామిగా రూపాంతరం చెందాడనీ తెలిస్తే ఏమవుతుందో ఊహించావా?"
"వాడెవడో బృహస్పతి చెప్పడం కాదు. మొత్తం అంతా ఆవేశంలో నువ్వే చెప్పేసేలాగున్నావ్!"
"వెటకారాలు చాలించు. ఒకప్పటి చంబల్ వాలీ బందిపోటు దొంగల్లో ఇద్దరు- ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో వున్నారని తెలిస్తే అగ్నిపర్వతం బద్ధలైపోదూ? ప్రజలు మనల్ని బ్రతకనిస్తారా?"
"బ్రతకనిస్తారు" అన్నాడు సంకల్పనాధ్. "....అయినా అసలు మనం ఎవరిమో అతడికి ఎలా తెలుస్తుంది?"
"అయితే ఏమిటటా? వాటిని చూడగానే ఆ బృహస్పతి గుర్తు పట్టేసి 'ఇదిగో .... వీళ్ళే .... పాతిక సంవత్సరాల క్రితం నా అనుచరులు' అంటాడా? వెంటనే ప్రజలు మనమీద దండెత్తుతారా? అసలు ఈ గతజన్మ గుర్తు రావటమన్నదే పెద్ద బోగస్ వ్యవహారం. పునర్జన్మలు లేవు."
"ఉన్నాయ్.... ఉన్నాయ్.... ఉన్నాయ్" పునరుద్ఘాటించాడు హరిస్వామి.
"సరే ఉన్నాయనుకుందాం! నువ్వు చెప్పినట్టే అతడు మన విషయం వెల్లడి చేసాడనుకుందాం. మనకేం తెలీదని మనం అంటాం. అయిపోయిందిగా!"
ఆర్.బి.ఎల్. భరత్ కల్పించుకుని "సంకల్పనాధ్ చెప్పింది కరెక్ట్ గానే ఉందిగా స్వామీ! ఆ బృహస్పతి గాడేదో చెప్పెయ్యగానే ఏమీ అయిపోదుగా!! ప్రజలు నమ్మడం వేరు. కోర్టులు మనమీద కేసు బుక్ చేయడం వేరు. ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కోసం మొన్న మీటింగ్ లో నేను జనంలోంచి ఒకణ్ణి పిలిచి నాటకం ఆడలేదూ! అదే విధంగా రాజకీయాల్లోకి రావడం కోసం ఆ బృహస్పతిగారు నాటకం ఆడుతూ ఉండి ఉంటాడు" అన్నాడు.
"వాడివల్ల మనకి వచ్చే ప్రమాదం ఏదీ లేదంటారు?" 'అదే మీ ఆఖరి మాటా' అన్నట్టు అడిగాడు హరిస్వామి.
"నిశ్చయంగా ఏమీలేదు...." ముక్తకంఠంతో అన్నారు యిద్దరూ. భరత్ మొహం మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు. పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయిన ఫీలింగ్ కలిగింది. సంకల్పనాధ్ చెప్పిన దాంట్లో తర్కం అర్ధమై కాస్త స్థిమిత పడ్డాడు. అయితే అది ఎక్కువకాలం నిలవలేదు. హరిస్వామి కళ్ళు మూసుకున్నాడు.
"దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావా స్వామీ?"
"కాదు. మీరు కేవలం రాజకీయ నాయకుల స్థాయిలోనే ఎందుకు ఆగిపోయారో, మిమ్మల్ని ఆడించే సూత్రధారుణ్ణి నేనెందుకు అయ్యానో ఇప్పుడు అర్ధమైంది."
"స్వోత్కర్ష మాని అసలు విషయం చెప్పు."
"బృహస్పతికి గతజన్మ గుర్తొచ్చిందే అనుకుందాం. అతడు నిజంగా ప్రజాసేవ చేసే ఉద్దేశ్యంతోనే ఉన్నాడనుకుందాం. తన మంచితనం నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఎన్నో అరాచకాలు చేసిన తన సహచరుల పాతబతుకు బయట పెడుతున్నానంటాడు. చంబల్ వాలీలో దోపిడీలు చేసి లక్షలు సంపాదించిన ముగ్గురూ, ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి - ప్రస్తుతం రాజకీయ నాయకులై మరోరకం దోపిడీలు ప్రారంభించి కోటీశ్వరులు అయ్యారని ప్రజలకు వెల్లడి చేస్తాడు. ఆ తరువాత మనం ముగ్గురం తీహార్ జైల్లో కిరణ్ బేడీ సంస్కరణలు అమలు జరుగుతున్నాయో లేదో చూస్తూ ఏడవాలి."
"కేవలం బృహస్పతి ఆరోపణలమీద మనల్ని జైల్లో పెట్టరు."
"ఫోటోలు....ఫోటోల విషయం మర్చిపోతున్నావ్ సంకల్పనాధ్! ఫోటోలూ, డైరీలూ ఉన్నాయి. డాకూ మంగళ్ సింగ్ తో కలిసి మనం పనిచేసిన రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయావా? రేప్ చేసిన ఆడాళ్ళని కౌగిలించుకుని ఫోటోలు తీయించుకున్నాం. శవాల్ని కాళ్ళదగ్గర పెట్టుకుని తీయించుకున్న ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా డైరీ.... సింగ్ డైరీ.... ఆ మంగళ్ సింగ్ డైరీలో ఎప్పుడెప్పుడు ఎవరిని చంపిందీ, ఎంతెంత కొల్లగొట్టిందీ వివరంగా వ్రాయబడి వుంది."
రాంభరత్ రక్తపోటు పెరగడం ప్రారంభించింది. మనిషి బలంగా శ్వాస తీస్తూ రొప్పుతున్నాడు. ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో పదవి పోగొట్టుకున్న ముఖ్యమంత్రికి- తీసుకున్న లంచమంతా పార్టీ ఫండ్ గా జమచేయమని రహస్యపు తాఖీదు వచ్చినప్పుడు ఎలా కంగారుపడతాడో అలా ఉంది రాంభరత్ పరిస్థితి! అయితే హరిస్వామి దానిగురించి పెద్దగా పట్టించుకోకుండా చెప్పడం కొనసాగించాడు.