Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 21


    "పాయింట్లా! పాయింట్లేమిటి?" అన్నాడు వేణు అర్ధంకాక.

    "ఉదాహరణకి హీరోయిన్ క్రింద హాల్లో కూర్చుని ఉంటుంది. పై మెట్టు మీద నుండి నువ్వు దిగి వస్తుంటావ్. పైబటన్లు రెండూ పెట్టుకోవు. నీ చూపులు నిర్లక్ష్యంగా ఎటో చూస్తుంటాయి. రాత్రంతా నిద్ర లేనట్లు నీ కళ్ళు అలసటను సూచిస్తూంటాయి. హాల్లో వున్న వాళ్ళనెవర్నీ గమనించకుండా నువ్వు కారెక్కి విసురుగా వెళ్ళిపోతావు."

    "ఎక్కడికి?" అన్నాడు వేణు.

    "ఎక్కడికో నాకూ తెలీదు. ఒక నవల్లో మొత్తంమీద ఇరవైసార్లు అలా వెళ్ళిపోయాడు హీరో. ఇంట్లో ఎవరూ అతని గురించి పట్టించుకోరు. రాత్రిళ్ళు ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికీ తెలీదు. ఒక్క హీరోయిన్ మాత్రమే అతడిపట్ల లోలోపల సానుభూతి చూపిస్తూ ఉంటుంది. ఒక రోజేం జరుగుతుందంటే...."

    "ఏం జరుగుతుంది?"

    "ప్రొద్దున్న ఎనిమిదింటికి నీ గదిలో ప్రవేశిస్తుంది. రాత్రి ఆలస్యంగా వచ్చి నువ్వు సోఫాలో పడుకుని ఉంటావు. కాళ్ళకి సాక్సు కూడా అలాగే ఉంటాయి. విశాలమైన నీ పచ్చటి నుదుటిమీద ముంగురులు అస్తవ్యస్తంగా పడివుంటాయి. నీ కళ్ళలో కనబడుతున్న ఒంటరితనానికి ఆమె కరిగిపోతుంది."

    "కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే కళ్ళలో ఒంటరితనం ఎలా కనబడుతుంది?" అని అడిగాడు వేణు.

    "ప్రేమించిన ఆడదానికి అన్నీ కనబడతాయి. నువ్వు మధ్యలో అడ్డురాకు. ఆమె ఒంగి నీ కాలి మేజోళ్ళు తీయడానికి ప్రయత్నిస్తుంది."

    "ఒక్క ప్రశ్న!" అన్నాడు వేణు.

    "ఏమిటి?"

    "హీరో రాత్రి తాగి వచ్చాడా?"

    "లేదు. బిజినెస్ వ్యవహారాల్లో మునిగి అలసిపోయి వచ్చుంటాడు. అలాగే సోఫాలో కూలబడిపోయాడన్నమాట!"

    "అంటే మేజోళ్ళు తీయటానిక్కూడా ఓపికలేదా?"

    "లేదు."

    "బూట్లు తీయడానికి?"

    ప్రసాదరావు తడబడి "ఉంది" అన్నాడు.

    "బూట్లు తీయడానికి ఓపికున్నవాడికి మేజోళ్ళు తీయడానికి ఓపికెందుకుండదు?"

    "మరీ ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయడానికి ఇదేం అసెంబ్లీ అనుకున్నావా? తెలుగు పాఠకుడిలా నోరు మూసుకుని నే చెప్పేదంతా విను.... ఎక్కడివరకూ వచ్చామా?"

    "నుదుటిమీద ముంగురులు నాట్యం చేయడం వరకూ."

    "కరెక్టు! ఆ ముంగురులను పైకి సర్దాలన్న కోరికను బలవంతం మీద అణచుకుంటుంది హీరోయిన్."

    "ఇక్కడో చిన్న చిక్కుంది" అన్నాడు వేణు.

    "ఏమిటి?"

    "నాది రాజ్ కపూర్ క్రాఫ్. పడితే జుట్టంతా ముందుకు పడుతుంది. లేకపోతే అంతా వెనక్కుంటుంది ఎలా?"

    "బ్రిల్ క్రీమ్ తో ఎడ్జస్టు చేద్దాంలేవయ్యా!"

    "అసలు మీరు తప్పు పంథాలో ఆలోచిస్తున్నారని నా ఉద్దేశ్యం" అన్నాడు వేణు తన అభిప్రాయం సూటిగా చెబుతూ.

    "మీరు చెప్పిన ఉదాహరణంతా హీరో డబ్బున్నవాడై హీరోయిన్ కి డబ్బుల్లేక వాళ్ళింట్లో ఆయాగా చేరితేనే వస్తుంది. ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నది నేను_ఆవిడ కాదు."

    "అయితే జ్వరం" అన్నాడు ప్రసాదరావు.

    "వ్వాట్!"

    "నీకు జ్వరం వస్తుంది. మూడ్రోజులు మూసిన కళ్ళు తెరవకుండా ఔట్ హౌస్ లో పడి ఉంటావు. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ నెత్తిమీద గుడ్డతో...."

    "నెత్తిమీద గుడ్డా?"

    "అదేనయ్యా! నుదుటిమీద యూకలిప్టస్ గుడ్డతో నీ ప్రక్కన స్టూల్ మీద హీరోయిన్ కూర్చుని వుంటుంది."

    "నాన్సెన్స్!" అన్నాడు వేణు.

    "చూడు వేణూ! ప్రేమలో నాన్సెన్స్ అన్న పదానికి అర్ధంలేదు. నిన్నూ, ప్రేమనీ ఎలా కలపాలా అని తెలుగు సాహితీ ప్రపంచంలో ఈ మధ్య వచ్చిన మణిపూసలైన ముప్పై నవలలు చదివాను. అందులో ఇరవయ్యారు నవలలో హీరోకో, హీరోయిన్ కో జ్వరం వచ్చి...."

    "నెత్తిమీద గుడ్డేసుకున్నారు. అంతేనా? చూడండి ప్రసాదరావుగారూ! మిగతాం మిగతా విషయాల్లో మీరు తెలివైనవాళ్ళేగానీ ఈ ప్రేమ విషయంలో మాత్రం మీకేం తెలీదని నా ఉద్దేశ్యం. లక్షరూపాయల కాంట్రాక్టును ఒప్పుకున్నాను కాబట్టి ఆ అమ్మాయిని ట్రాప్ చెయ్యడం ఎలాగో నాకు వదిలిపెట్టండి. అంతా నేను చూసుకుంటాను. మీరు నాకు చేయగలిగిన సహాయం ఒక్కటే!"

    "ఏమిటి?"

    "తెలుగు నవల్లు చదివి నాకు సలహా చెప్పటం మానెయ్యడం. అదీగాక మిస్ ప్రేమ తెలుగు నవలా కథానాయికంత తెలివితక్కువది కాదని నా ఉద్దేశ్యం."

    "అంత ధీమాగా ఎలా చెప్పగలవ్?"

    "నిన్న సాయంత్రం నాకు జగపతిరావు అప్పాయింట్ మెంటు ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దీన్ని దయానందం తీవ్రంగా వ్యతిరేకిస్తాడని నాకు తెలుసు. నాకు ఉద్యోగం వచ్చిందీ అంటే దానికి కారణం ప్రేమే అయి ఉండాలి. తాగి ఫ్యాక్టరీలో మిషన్ పాడుచేశానన్న కారణంగా నన్ను ఉద్యోగంలోనుండి తొలగించారు. అటువంటివాడికి తిరిగి ప్రేమ ఉద్యోగం ఎలా రికమెండ్ చేసింది? అన్న అనుమానం నాకొచ్చింది. అప్పాయింట్ మెంటు ఆర్డరు అందుకోగానే సర్ జగపతిరావు బహద్దూర్ పర్సనల్ అసిస్టెంట్ హోదాలో నా పేరు చెప్పకుండా ఫ్యాక్టరీ పర్సనల్ మేనేజర్ కి ఫోన్ చేశాను. మనిద్దరం ఊహించలేని విషయం ఒకటి జరిగింది."

    "ఏం జరిగింది?" అని అడిగాడు ప్రసాదరావు ఉత్సుకతతో.

    "నాకు ఉద్యోగం రికమెండ్ చేయటానికి ముందే ప్రేమ అతడికి ఫోన్ చేసి ఆ రోజు నిజంగా నేను తాగి ఉన్నానో లేక కేవలం ఉద్యోగం తీసివేయడం కోసం ఈ నేరం నా మీద వేశారో కనుక్కుని సంతృప్తి చెందిన తర్వాత, నాకు ఉద్యోగం ఇప్పించింది."

    ప్రసాదరావు స్తబ్దుడయ్యాడు.

    వేణు నవ్వుతూ, "ఏం? ఆమె తెలివితేటలు చూస్తూంటే నోటమాట రావటంలేదా?" అని అడిగాడు.

    "నాకు నోటమాట రాకపోవడానికి కారణం ఆమె తెలివితేటలకు కాదు. ఆవిడ పర్సనల్ మేనేజర్ కి ఫోన్ చేసిందో లేదో అన్న ఆలోచన వచ్చి నువ్వు పర్సనల్ మేనేజర్ కి ఫోన్ చేయడం అన్న ఆలోచన ఉంది చూశావ్ అది గొప్ప ఆలోచన. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరిందబ్బాయ్. సంవత్సరంలోగా ఈ జగపతిరావు బహద్దూర్ కి మనవడు పుట్టడము ఖాయం. బహద్దూర్ గాడు పిచ్చెక్కి వీధిన పడడం అంతకన్నా మరీ ఖాయం. గో ఎ హెడ్ మై బోయ్!"


                                                      *    *    *    *


    అనుకున్నంత సులువుగా ప్లాన్ అమలు జరిగేలా కనబడలేదు. వాళ్ళనుకున్నట్టు (నవలలోలా) ప్రేమని ఇంప్రెస్ చెయ్యడానికి టైమ్ దొరికేది కాదు. జగపతిరావు కేవలం కూతురి మాట మీదే పర్సనల్ అసిస్టెంటును తీసుకోలేదు. నిజానికి అతని దగ్గర ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్లు చెయ్యాల్సినంత పని ఉంది. ఇచ్చిన జీతానికి రెట్టింపు పని వేణు దగ్గర్నుండి పిండేవాడు. దానితో వేణు బాగా నలిగిపోయాడు.

    "ఇదేదో సరదాగా నడిచే కథనుకున్నాను. కానీ గొప్ప ట్రాజిడీ కాబోతుంది. ఈయన దగ్గర ఎల్టీసీగా పనిచేయటం తప్ప నేను సాధించేదింకేమీ ఉండేటట్లు కనబడడంలేదు" అని ప్రసాదరావు దగ్గర వాపోయాడు.

    ఎక్కువ కలత చెందినవాడు ప్రసాదరావు. ఏదో బ్రహ్మాండమయిన ప్లాన్ చేసి పరమపద సోపానంలో పావును తోసినట్లు వేణుని ఎలాగైతేనేం శత్రువ్యూహంలో చొరబడేటట్లు చేశాడు. కానీ నెల రోజుల్నుండీ కథ అక్కడే ఆగిపోయింది. ఫ్యాక్టరీలో పనిచేసే వాడల్లా ఆఫీసులో పని చేస్తున్నాడే తప్ప అంతకన్నా సాధించిన దేమీలేదు. అన్నిటికన్నా ఘోరాతిఘోరమైన విషయం ఏమిటంటే ఈ నెల్రోజుల్లో ఒక్కసారి కూడా ప్రేమా, వేణూ కలుసుకోలేదు. రోజురోజుకీ ప్రసాదరావు కుంచించుకు పోసాగాడు. ఇందులో వేణూని తప్పు పట్టడానికి కూడా ఏమీలేదు. ప్రేమని ఆకర్షించడానికి ఇంతవరకూ ఒక్క చిన్న ఛాన్సు కూడా రాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వారి ప్లాను మరింత ముందుకు సాగేటట్లు తోచలేదు.

    అలాంటి అద్భుతం ఒకటి వేణు పనిలో చేరిన నెలా పదిహేను రోజుల తర్వాత జరిగింది.

   
                      *    *    *    *


    "రేప్పొద్దున్న నాలుగింటికి మనం మన సిరామిక్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అక్కడ పదకొండింటికి బోర్డు మీటింగ్ వుంది. తెల్లవారుజామున బయలుదేరితే తప్ప ఆ టైమ్ కి చేరుకోలేం. నాలుగింటికల్లా వచ్చేసేయ్!" అన్నాడు జగపతిరావు వేణుతో.

    అప్పుడు వచ్చింది వేణుకి ప్లాష్ లాంటి ఆలోచన. మొహంలో అది కనబడనీయకుండా, అలాగే సరే!" అన్నాడు.

    "రేపు బోర్డు మీటింగ్ లో డైరెక్టర్లందరికీ ఈ రిపోర్ట్ కాపీలివ్వాలి. ఐదు కాపీలు టైపు చేయించు" అని ఒక కాగితాలకట్ట యిచ్చి వెళ్ళిపోయాడు.

    వేణు చేతిలో కాగితాలవంక చూశాడు. మొత్తం రెండువందల పేజీలు. టైమ్ చూసుకున్నాడు. ఐదయ్యింది. వెంటనే ప్రసాదరావు దగ్గరికి బయలుదేరాడు.

    "వెరీగుడ్! వెరీగుడ్ అబ్బాయ్! ఇలాంటి ఛాన్సుకోసమే చూస్తున్నాను" అన్నాడు ప్రసాదరావు ఆనందంతో తబ్బిబ్బవుతూ.

    "ఛాన్సేవిఁటి?"

    "రాత్రంతా కూర్చుని నువ్వు ఈ కాగితాన్ని టైప్ చేస్తావ్. రెండొందల పేజీలూ తెల్లారేసరికి నీట్ గా టైప్ చేసి ఉంచుతావు. నీ కళ్ళు నిద్రకు జోగుతూ ఉంటాయి. అయినా వాటిలో కర్తవ్యం ప్రతిబింబిస్తూ వుంటుంది. తండ్రిని కేంప్ కు సాగనంపడానికి వచ్చిన ప్రేమ అంత అలసటతో నిలబడ్డ నిన్ను చూచి జాలితో కరిగిపోయి, 'రాత్రంతా మేలుకొని టైప్ చేశావా వేణూ!' అంటుంది. ప్రేమకి మొదటి స్టెప్ ఆసక్తి అయితే రెండో స్టెప్ జాలి. గో ఎ హెడ్" అన్నాడు.

    "నేనా? రాత్రంతా మేలుకోవడమా? టైప్ చెయ్యడమా? నాన్సెన్స్" అన్నాడు వేణు.

    "కానీ ప్రేమని ఇంప్రెస్ చెయ్యాలి అంటే...."

    "చూడండీ! ఈ ప్లాన్ లో నాకెంత ఇంటరెస్ట్ ఉందో మీకు అంతే ఉండాలి. రాత్రంతా నేను మేలుకోవటం ఇంపాజిబుల్. నాలుగు ఇన్ స్టిట్యూట్ లకి వెళ్ళి ఏభయి కాగితాల చొప్పున ఇచ్చి ఎంత రాత్రయినా టైప్ చేయించి తీసుకురండి. నేను మీ రూంలోనే పడుకుని ఉంటాను. వచ్చి లేపండి."

    "నేనా?" అన్నాడు ప్రసాదరావు.

    "ఆఁ మీరే.... స్వయంగా బైదిబై మీ గదిలో అమృతాంజనం ఉందా?"

    "ఉంది. ఎందుకు?"

    "తెల్లవారుజామున లేచి ఎదురింటికి వెళ్ళేటప్పుడు కళ్ళల్లో పెట్టుకోవడానికి. రాత్రంతా మేలుకున్నట్టు కళ్ళు ఎర్రగా ఉండాలి కదా!"

    ప్రసాదరావు గొణుక్కుంటూ కాగితాలు పట్టుకుని బయటకు నడిచాడు.

    లోపల్నుంచి వేణు అరిచాడు__ "జగపతిరావు ఆఫీసులోది రెమింగ్ టన్ టైప్ మిషన్. వోల్డుటైప్. వీలైనంతవరకూ అలాంటి మిషన్ల మీదే టైప్ చేయించండి."

    ఆ తర్వాత శుభ్రంగా భోంచేసి నిద్రపోయాడు. ప్రసాదరావు తిరిగి వచ్చేసరికి రాత్రి ఒంటిగంటయ్యింది. "ఇవిగో కాగితాలు" అంటూ ఇచ్చాడు. వేణు తెల్లవారుజామున నాలుగింటికి అలారం పెట్టుకొని నిద్రలేచాడు. ఆ చప్పుడికి ప్రసాదరావు కూడా నిద్ర లేచాడు.

    "నే వెళ్ళొస్తాను" అన్నాడు.

    "అబ్బాయ్! ప్రేమ చూస్తూండగా నువ్వీ కాగితాలిస్తే బాగుంటుందేమో?"

 Previous Page Next Page