Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 20

    "ఐడింటిఫికేషన్ ప్లీజ్!"

    డ్రైవరు పక్కన కూర్చున్నతను  పేపర్లు తీసి యిచ్చాడు. డిఫెన్సు మినిస్ట్రీకి  సంబంధించిన  పేపర్లు అవి. కొన్ని సామాన్లు పంజాబ్ లోని మిలటరీ పోలీసులకు అందించమని యిచ్చిన ఉత్తర్వు. పేపర్లు అన్నీ సరిగానే ఉన్నాయి.

    కాని ఇన్ స్పెక్టర్ కు ఎందుకో తెలియని అనుమానం.

    "మెయిన్ రోడ్డు వదిలి ఈ వైపు వెళుతున్నారేం?" అడిగాడు.

    "వెహికల్ కొంచెం ట్రబులిస్తోంది సర్! మెయిన్ రోడ్ మీద ఈ టైంలో  లారీలు, టైలర్లు చాలా స్పీడుగా వస్తుంటాయి. చెక్ పోస్టుకు  దగ్గరలో మళ్ళీ మెయిన్ రోడ్ లోకి  తిప్పుతాను సాబ్!" అన్నాడు డ్రైవరు.

    ఇన్ స్పెక్టర్ ట్రక్ లోకి చూశాడు. పాలిధిన్ సంచులు నీట్ గా సర్ది ఉన్నాయి.

    పేపరు మరోసారి చూసి ట్రక్ నంబరు, వివరాలు డైరీలో నోట్ చేసుకున్నాడు.

    "ఇక మీరు వెళ్ళొచ్చు" అన్నాడు,

    ట్రక్ బయలుదేరింది మెల్లిగా. ఇన్ స్పెక్టర్ బుల్లెట్ స్టార్ట్ చెయ్యలేదు.

    జేబులోంచి వాకీ టాకీ తీశాడు. అతడేదో మాట్లాడబోయే లోపులో కదులుతున్న ట్రక్ లోంచి రెండు గన్స్ పైకి లేచాయి. అతడూ, అతడితో పాటూ వచ్చిన మరో పోలీసు అధికారీ చప్పుడు కాకుండా నేల కూలారు.

    పది నిముషాల తర్వాత వాళ్ళ మోటారు సైకిలుతోపాటు యిద్దరి శవాలూ ఒక లోయలోపడ్డాయి.

    ఇన్ స్పెక్టర్ డైరీ డ్రైవరు జేబులో భద్రంగా వుంది.

   
                         *    *    *


    "అయితే తర్వాత గిరిధర్ కు జరిగిందేమీ గుర్తుండటంలేదన్న మాట" అన్నాడు డాక్టర్ రామకృష్ణ సాలోచనగా.

    పద్మజ ఆయన క్లినిక్ కు వచ్చింది. రాత్రి ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరితోనైనా  మాట్లాడితేగాని  మనసు శాంతించేలా  లేదు! మళ్ళీ మరో అనుమానం - ఈ విషయం అప్పుడే బయటివాళ్ళకు చెప్పాలా వద్దా అని! హిమజకు చెప్పాలంటే దానికి వీటిలో నమ్మకంలేదు. హేళనచేస్తుంది. చివరకు డాక్టర్ రామకృష్ణకి ఫోన్ చేసింది.

    "పెళ్ళయిన నాలుగురోజులకే సైకియాట్రిస్టుతో పనేమిటి?" అని నవ్వాడాయన.

    విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు.

    "అవును, తర్వాత నాకేమయింది అని నన్నే అడుగుతున్నారు. మొదటిసారి తోటలో అదంతా నాభ్రమే అనుకున్నాను. కాని రాత్రి అంతా నిజమని రూడి అయింది. అసలిదంతా ఏమిటి? నాకు చాలా భయంగా వుంది. శేఖరం నట్టింట్లో చనిపోవడంతో యింట్లో శాంతి చేయించి పూజలు కూడా చేయించాను."

    "ఏమిటంటే ఇప్పుడేం చెప్పలేనమ్మా. ఒకసారి గిరిని పరీక్షించాలి. కాని యిప్పుడే రమ్మనడం బాగుంటుందా?"

    "వద్దు. వెంటనే వద్దు. సమయానుకూలంగా నేనే చెప్తాను."

    "సరే అయినా  గిరికి, సోమశేఖరానికి ఎప్పటినుంచీ పరిచయం?"

    "నాకు తెలిసినంత వరకు వాళ్ళకు పరిచయం లేదసలు, గిరి నాతో కలిసిన చాలా రోజులవరకూ, శేఖరం ఊళ్ళోలేడు, శేఖరం చనిపోయినప్పుడు గిరి ఊళ్ళోలేడు. ఒకరికొకరి పరిచయం లేనట్టే...."

    "మరి అతని మాటలు శేఖరం మాటల్లా ఉన్నాయంటున్నావు?"

    "అదే ఆశ్చర్యం! ఆ సమయంలో అతని స్వరం అచ్చం శేఖరం స్వరంలా వుంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. తల ఎగరెయ్యడం, పెదవి విరిచి మాట్లాడడం.... అతని ప్రవర్తన చూస్తుంటే అంతవరకూ  నేను చూసింది అసలు నిజమేనా, లేక భ్రమ పడ్డానా అనిపించేటట్లుగా చేస్తుంది."

    "ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇప్పుడే ఏమీచెప్పలేను" పద్మజ వైపు సాలోచనగా చూశాడాయన.

    "ఒకవేళ సైకలాజికల్ గా నేనే భ్రమపడుతున్నానంటారా."

    "కాకపోవచ్చు. అన్నట్లు మీరివ్వాళ   బెంగుళూరు వెడుతున్నారు గదూ?"

    "ఊ, వెళుతున్నాం, మానేయడం మంచిదంటారా?"

    "వద్దు. స్థలం మార్పు అవసరమే. వెళ్ళండి. అక్కడ అతని ప్రవర్తన ఎలాగుందో గమనించు రాగానే ఫోన్ చేసి చెప్పు."


                         *    *    *


    "హలో! నేను పద్మజని" బెంగుళూర్ నించి రాగానే ఫోన్ చేసింది పద్మజ, డాక్టర్ రామకృష్ణకి.

    "హౌ ఆర్ యూ పద్మజా? ట్రిప్ ఎలా జరిగింది?" అడిగాడు.

    "బాగానే ఎంజాయ్ చేశాం. కాని రెండుసార్లు మాత్రం అలాగే జరిగింది."

    "ఏమన్నాడు?"

    "ఏమీ లేదు! 'నా ఆత్మ మీ చుట్టే తిరుగుతుంటది  మీ రెక్కడున్నా. నేను మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటాను' అని మాత్రం అన్నాడు."

    "సరే, ఒక పని చెయ్యి. న్యూయియర్ ఈవ్ కి ఇంట్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను. బయటవాళ్ళెవరూ  ఉండరు, దగ్గర స్నేహితులే అప్పుడు గిరితో క్యాజువల్ గా మాట్లాడటానికి వీలవుతుంది. అతనికీ అనుమానం రాదు. మీ యిద్దరూ రండి."

    "అలాగే తప్పకుండా వస్తాం" ఆమె కంఠంలో కాస్త రిలీఫ్.


                        *    *    *   

   
    "చీర్స్!"

    "ఈ చీర్స్ అన్నది యెలా మొదలయిందో తెలుసా? పాతకాలంలో అందరికీ భయం ఉండేదట. తమ డ్రింక్స్ లో విషం కలిపారేమోనని" అందుకే చీర్స్ పేరుతో గ్లాసుల్ని టచ్ చేస్తూ తమ డ్రింక్ ను అవతలి వాళ్ళ గ్లాసులో వొంపేవారట."

 Previous Page Next Page