Previous Page Next Page 
జయ - విజయ పేజి 20


    ఇది నేను తొందరపాటుతో, కేవలం అందానికి ఆకర్షణకు లోబడి తీసుకున్న నిర్ణయం కాదు. మనం ఒకరినొకరు ఈ కొద్దిరోజులుగా ఉత్తరాల ద్వారా పూర్తిగా అర్థంచేసుకున్నామని నా అభిప్రాయం.
    మనిద్దరి ఆలోచనలూ, అభిప్రాయాలూ చాలావరకూ ఒకేవిధంగా వున్నాయి. మనిద్దరి మనస్తత్వాలూ ఇంచుమించుగా ఒకటే. ఇకపోతే మన రూపాలు. మీరు నాకు ఎంతగా నచ్చారో మళ్ళీ రాయనవసరం లేదుగదా? అయితే నేను మీకు నచ్చానో లేదో తెలీదు. నచ్చకపోతే మనం స్నేహితులుగానే మిగిలిపోయామనుకోండి. నాకు మీతో జీవితం గడిపే అదృష్టం లేదు అనుకుంటాను. ఇంతకంటే యింకేం రాయను?
    నన్ను కరుణిస్తారనీ లేదా క్షమిస్తారని ఆశిస్తూ,
                                                                 మీ
                                                             చంద్రకాంత్.
    ఆ ఉత్తరం చదువుతూనే విజయ మనసంతా అల్లకల్లోలమైపోయింది. తను చేసిన అనాలోచితమైన పిచ్చిపని మూలాన ఇప్పుడీ ఘోరం జరిగిపోయింది. అతను జయే తనకు ఉత్తరాలు రాస్తున్నది అనుకుని ఆమె రూపానికి ఆకర్షింపబడ్డాడు. తనే విజయ అని తెలిస్తే అతను జయ రూపం వల్ల ఆకర్షింపబడేవాడా? ఊహు! అలా జరగడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు తనే విజయనీ, అతను మోహించింది జయననీ తెలిస్తే అతనేం చేస్తాడు? అతని ఆలోచన
    జయను తనే అనుకుని ఎంత ప్రగాఢంగా ప్రేమిస్తున్నాడో తన కర్ధమవుతూనే వుంది. ఇప్పుడు నిజం బయటపడితే అతనెంతగా అప్సెట్ అవుతాడు?
    "ఏమిటక్కా. ఆ ఉత్తరం పట్టుకుని ఆలోచిస్తున్నావ్? ఎవర్రాశారది? చంద్రకాంత్ గారేనా?" ఆత్రుతగా అడిగింది జయ.
    "అవును."
    "ఏమని రాశారు?"
    "ఇప్పుడో పెద్ద సమస్య వచ్చిపడిందే జయా!"
    "ఏమిటది?"
    "ఈ ఉత్తరం చదువ్! నీకే తెలుస్తుంది!" ఉత్తరం ఆమెకిస్తూ అంది జయ.
    జయ ఉత్తరం అందుకుని త్వరత్వరగా చదవసాగింది. చదువుతూంటే ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్.మనసులో కలవరం ప్రారంభమైంది.
    "ఇదేమిటక్కా ఇలా జరిగింది?" అంది అక్కడే కుర్చీలో కూలబడుతూ.
    "నిజంగా నేనెంత తెలివితక్కువ పని చేశానో ఇప్పుడర్థమవుతోంది" నెమ్మదిగా మాట్లాడింది విజయ.
    "అవునక్కా! నేను వద్దని మొత్తుకుంటున్నా వినలేదు నువ్వు!"
    ఇద్దరూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు.
    "అక్కా! నిన్నో విషయం అడగనా?"
    "ఏమిటది?"
    "నువ్వు చంద్రకాంత్ గారిని ప్రేమించావా?"
    ఆమె ఉలిక్కిపడింది.
    వెర్రిదానిలా జయవంక చూస్తుండిపోయింది జవాబివ్వకుండా! ఆమె మనసులో ఆలోచనలు సముద్ర తరంగాల్లా ఉవ్వెత్తున ఎగసిపడసాగినాయి.
    తను చంద్రకాంత్ ని ప్రేమించిందా?
    అతనికీ తనకూ మధ్య ఉత్తరాల ద్వారా ఏర్పడ్డ బంధం ప్రేమకు సంబంధించినది కాదా?
    తను అనుకొంటున్న ఆత్మీయత, అభిమానం వీటన్నిటి పర్యవసానము ఏమిటి? ప్రేమేగా?
    అతని ఫోటో చూచిన మరుక్షణం నుంచీ తన రూపాన్నే పదేపదే ఎందుకు గుర్తుతెచ్చుకుంటోంది. ప్రతిరోజూ ఆ ఫోటోని ఒక్కసారయినా చూడకుండా ఎందుకు ఉండలేకపోతోంది.
    అతను రాసిన ఉత్తరాలను పదేపదే ఎందుకు చదువుకుంటోంది.
    ఇవన్నీ అతనిమీద తనకున్న ప్రేమను చాటటము లేదూ? అతనిని తనెంత గాఢంగా ప్రేమిస్తోందో తెలియజెప్పటం లేదూ? తనకు తెలీకుండానే తను అతనివేపు ఎంతగా ఆకర్షింపబడిందీ స్పష్టమవటం లేదూ?
    "నా దగ్గర కూడా రహస్యమేనా అక్కా?" తిరిగి అడిగింది జయ.
    "ఏమోనే! నీకే తెలీటంలేదు. ఆయనంటే నాకెంతో ఇష్టం! ఒకవేళ అదే ప్రేమంటే నేనేం చెప్పలేను."
    జయ నవ్వింది.
    "పోనీ ఓ పని చేయరాదూ?"
    "ఏమిటి?"

 Previous Page Next Page