Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 20


                           ఇదే ప్రజాస్వామ్యం
    రష్యాలో డెమొక్రసీ మట్టి కొట్టుకుపోయేట్టుందన్న విషయం తెలీగానే మేమంతా ఆనందంగా మా కాలనీలో మీటింగ్ పెట్టాం! ఎందుకంటే రష్యాలో ప్రజాస్వామ్యం కూలిపోతే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే అవుతుందని మా ఆశ.
    మామూలుగానే సాయిరామ్ ఉత్సాహంగా మైక్ అందుకున్నాడు. "అయినా రష్యాలో డెమొక్రసీ ఏమిటండీ నా తలకాయ! దాన్నసలు డెమొక్రసీ అని ఎవరయినా అంటారా? ఎల్సిన్ పార్లమెంట్ ని డిజాల్వ్ చేశాడనుకోండి! అంతమాత్రాన మిగతా పార్లమెంట్ వాళ్ళంతా కలిసి ఎల్సిన్ ని ఇంపీచ్ మెంట్ చేస్తారా? అసలు ప్రజాస్వామ్యంలో ఇంపీచ్ మెంట్ ఏమిటి? వాళ్ళకేమయినా బుద్ధుందా?"
    మా వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. రంగారెడ్డి వేదికమీదకొచ్చాడు. అందుకే మనది ప్రపంచంలోకెల్లా సిసలయిన ప్రజాస్వామ్యం అని మనం, మన గవర్నమెంటు ఎంతోకాలం నుంచి నెత్తి నోరు పెట్టుకుని చెబుతున్నాం! మిగతా దేశాలు మన ప్రభుత్వం మాట నమ్మకపోతే పోనీండి! ఆ సంగతి మనకనవసరం! మనది సరయిన డెమొక్రసీ కాబట్టే మన పార్లమెంట్ ఇంతవరకు ఒక్కరిని కూడా ఇంపీచ్ చేయలేదు.
    ఎంతటి అవినీతిపరులయినా సరే మన పార్లమెంట్ ఉదాత్తంగా వదిలేసింది. ఎంతమంది రాజ్యాంగపరంగా ఎన్ని నేరాలు చేసినా సరే మన పార్లమెంట్ వారికి జై కొడుతోంది. జస్టిస్ రామస్వామి కేసు తీసుకోండి, ఎన్నికల కమీషనర్ శేషన్ ని తీసుకోండి, పార్లమెంటుకి ఎదురు తిరిగిన ప్రెసిడెంట్లని తీసుకోండి! అందరికీ జేజేలు పలుకుతోంది మన పార్లమెంట్" రంగారెడ్డి ఉపన్యాసానికి మరిన్ని తప్పట్లు మోగ్రాయి.
    "అసలు మన డెమొక్రసీ పద్ధతే వేరండి! వాక్ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యంలో ఓ ముఖ్యాంశం అని అన్నారు. మిగతా దేశాలన్నీ ఆ మాటకు పెడర్థాలు తీసి వాక్ స్వాతంత్ర్యం అంటే నిజంగా స్వేచ్చగా భావ ప్రకటన అనుకుంటున్నారు. కానీ ఆ మాటకు అసలయిన అర్థం కేవలం మనదేశానికి మాత్రమే తెలుసు. వాక్ స్వాతంత్ర్యం అంటే ప్రభుత్వం, పోలీసులు మాట్లాడతారు. ప్రజలుంటారు అని అర్థం! ఆ మాత్రం కామన్ సెన్స్ లేకే రష్యాలో డెమొక్రసీ చావుదెబ్బతింది" అన్నాడు గోపాల్రావ్.
    సాయిరామ్ మళ్ళీ మైక్ అందుకున్నాడు.
    "నన్నడిగితే మన ప్రజాస్వామ్యం చూసి మిగతా దేశాలన్నీ బుద్ధి తెచ్చుకోవాలి అంటాను. నిజాలు చెప్తే ఏ ప్రజాస్వామ్యం అయినా ఎంతోకాలం నిలబడదు! అందుకే మన టీ.వీలు, రేడియోలు ఛస్తే నిజం చెప్పవు"
    "అవును! అవి నిజాలు చెప్పకూడదు - ప్రజాస్వామ్యంలో టీ.వి.లే కాకుండాపత్రికలవాళ్ళు కూడా నిజాలు వ్రాయకుండా మన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి! లేకపోతే పత్రికల వల్ల కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు రావచ్చు" రహస్యంగా అన్నాడు జనార్ధన్.
    "పత్రికలవాళ్ళ నోరు ఎలా నొక్కుతావయ్యా? వాళ్ళు గవర్నమెంట్ చెప్పే అబద్ధాలు నమ్మరు కదా!" ఎవరో అరిచారు.
    అందుకే మన రాజ్యాంగంలో ఒక అద్భుతమయిన ఏర్పాటు చేశారు మనవాళ్ళు! ఉదాహరణకు ఏదైనా నిజం బయటకు రాకూడదని ప్రభుత్వం అనుకుందనుకోండి! వెంటనే ఆ విషయం కోర్టులో పడేస్తారు. కోర్టు విచారణలో వున్న విషయాల గురించి పత్రికలవాళ్ళు వ్రాయకూడదు.
    కనుక నిజం ఇంక ఛస్తే బయటకు రాదు. సరే మన దేశంలో కోర్టుల సంగతి అందరికీ తెలిసిందే కదా! ఆ కేసు జడ్జిమెంట్ వచ్చి నిజం బయటపడేసరికి ఇరవైఏళ్ళు పడుతుంది.
    అంతే! అప్పుడా నిజం తెల్సినా ఒకటే. తెలీకపోయినా ఒకటే- ఉదాహరణకు పుట్టపర్తి ఆశ్రమం కేసు తీసుకోండి! నిందితులు లొంగిపోయాక వాళ్ళు ఒక్క ముక్క కూడా పత్రికల వాళ్ళతో మాట్లాడనీకుండా ప్రభుత్వం ఎంత అద్భుతంగా మేనేజ్ చేసిందో చూడండి!"
    తప్పట్లు మార్మోగిపోయినయ్.
    "ఇవే కాదు, ఇంకా చాలా నిజాలు బయటపెట్టే అధికారం పత్రికలవాళ్ళకు లేకుండా ఎన్నో అద్భుతమయిన ఉపాయాలు మనకున్నాయి. పార్లమెంట్ లో జరిగే బూతు యుద్ధాలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు, జడ్జీలు, న్యాయస్థానాల గురించి ఒక్క ముక్క వ్రాసినా సరే ఆ పత్రికలను మూసిపారేసే హక్కు మన ప్రభుత్వానికి వుంది. అంతేకాదు పోలీసులక్కూడా నిజాలను దాచి ఉంచే హక్కు వుండబట్టే ఎన్నో నిజాలను మనం దాచి ప్రజాస్వామ్యాన్ని ఇంతవరకూ కాపాడుకోగలిగాం!"
    "పోలీసులకు నిజాన్ని దాచే హక్కు వుందా?" ఆశ్చర్యంగా అడిగాడు మా కాలనీలో కొత్తగా అద్దెకు దిగిన కానిస్టేబుల్ కనకారావ్.
    "వుండబట్టే కదా? వాళ్ళు అరెస్టు చేసి దాచేసిన మనుషులు ఏమయ్యారో తెలుసుకోవడం కోసం దేశమంతా కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు ఎప్పుడూ వేస్తూనే వున్నారు. అలాగే పుట్టపర్తి ఆశ్రమంలో దారుణాలు జరిగిన పన్నెండు గంటల వరకు పోలీసులు ఆ విషయం బయటకు రానీకుండా ఆపేశారు. మత కల్లోలాలలో హస్తం వున్న రాజకీయ నాయకుల పేర్లు కూడా వారు బయటపెట్టకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సి.బి.ఐ. సంగతి సరే సరి! నిజాలను సమాధి చేయడంలో మన సి.బి.ఐ.కున్న పేరుప్రఖ్యాతలు ప్రపంచమంతా తెలుసు.
    హర్షద్ మెహతా. బో ఫోర్స్ నిజాలను ఇంతకాలం బయటకు రానీకుండా కాపాడడం వల్లే మన ప్రజాస్వామ్యం కూలిపోకుండా నిలబడింది" అన్నాడు రంగారెడ్డి. అందరూ మళ్ళీ తప్పట్లు కొట్టారు.
    "భారత ప్రజాస్వామ్యం జిందాబాద్! పోలీసులు జిందాబాద్" అన్న అరుపులు మిన్నుముట్టాయి.
                            *    *    *

 Previous Page Next Page