ఆనందపురం ఉత్తరదిశగా కొండలమీద వ్యాపించిన ఈ అడవులు చాలా దట్టమైనవి. చుట్టుప్రక్కల ఊళ్ళనుండి కొంతమంది యువకులు ఇక్కడ జంతువుల్ని వేటాడటానికి వస్తూంటారు అప్పుడప్పుడూ. మూడు నాలుగేళ్ల క్రితం ఆ అరణ్యంలో ఓ పెద్దపులిని కాల్చి చంపారు. ఆ తర్వాత పెద్ద పులులెప్పుడూ అక్కడ సంచరించిన వర్తమానం లేదుగాని, చిరుతలు యధేచ్చగా విహరిస్తూ జంతునష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రతీతి.
శాయి కొండఎక్కి తుపాకి భుజాన వ్రేళ్లాడుతుండగా పైకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కసారి ఎత్తయిన బండలు అడ్డువచ్చి దారి దుర్గమ మవుతూ ఉంటుంది. బూట్లు వేసుకున్న కాళ్లు జారిపోతూ ఉంటాయి.
ఉదయం పదిదాటి ఉంటుంది. ఎండ తీక్షణంగా ఉండి, నెత్తి మాడ్చేస్తున్నది. దప్పిక అయితే త్రాగటానికి గ్రుక్కెడు నీళ్ళుకూడా అక్కడ లభించవు. శాయి పైకి వెళ్ళిపోతున్నాడు.
కోతులు ఒక చెట్టుమీదనుంచి మరో చెట్టుమీదకి గెంతుతూ కిచకిచమని శబ్దాలు చేస్తున్నాయి. చిన్న చిన్న జంతువులేవో అతని అలికిడి విని గబగబ చెట్ల చాటునుండి పరిగెత్తుతున్నాయి.
ఉన్నట్టుండి వళ్ళు జలదరించేటట్లు పులి అరుపు వినిపించింది. ఒక్కక్షణం అతను అప్రతిభుడై నిలబడిపోయాడు. అంతలోనే చప్పుడు తేరుకుని ఆ అరుపు ఎటునుంచి వచ్చిందా అని ఆలోచించాడు. ఇంతలోనే గుండెలదరిపోయేటట్టు మళ్ళీ వినిపించింది. అతనున్న చోటకు ఎడమవైపు నుండీ వస్తున్నది. ఇహ శాయి ముందూ వెనుకా ఆలోచించకుండా శబ్దం వచ్చిన దిశకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు కాలుజారి క్రిందపడ్డాడు. ముళ్ళపొదలు అతని శరీరానికి గీసుకుని రక్తం కారుతూ జివ్వుమంటున్నది. అయినా లెక్క చేయకుండా, అతివేగంగా ముందుకు పరిగెత్తాడు.
ఎదురుగా పెద్ద బండరాయి అడ్డువచ్చింది. చాలా సన్నగా ఉండి కాలుపెడితే జారిపోతోన్నది. రెండు మూడుసార్లు దానిమీదగా ఎక్కడానికి ప్రయత్నించి విఫలుడై చివరకు ప్రక్కనున్న ఓ చెట్టుకొమ్మ ఆధారంగా చేసుకుని దాన్ని గట్టిగా పట్టుకుని పైకి ఎగబ్రాకి కష్టంమీద అవతలకు చేరుకున్నాడు.
లేచి నిలబడి తలెత్తుతూ అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసి స్తంభించి పోయాడు శాయి.
పంచకట్టుకుని గోచి బిగించి, వొంటిన చొక్కాలేకుండా నల్లగా మెరిసే శరీరంతో ఉన్న ముప్పయి అయిదేళ్ళ వ్యక్తి ఒకడు చేత గొడ్డలి పట్టుకుని ప్రాణాలకు తెగించి నిలబడివున్నాడు. అతనికి ఏడెనిమిది గజాల దూరంలో ఓ పెద్ద బండరాయిమీద చిరుతపులి ఒకటి నిల్చుని ఉండి, అతనివంక క్రూరంగా చూస్తూ అతనిమీదకు లంఘించటానికి సిద్ధంగా ఉంది.
శాయి విభ్రాంతినుండి తేరుకుని తుపాకి చప్పున చేతిలోకి తీసుకోబోతున్నాడు. కాని కనురెప్పపాటులో చిరుత ఒక అరుపు అరచి ఒక్క ఉదుటున ఆ వ్యక్తిమీదకు లంఘించింది. ఆ వ్యక్తి భయపడకుండా అలానే నిలబడి పులిని తనమీదకి ఉరికిన సమయానికే బలమంతా ఉపయోగించి గొడ్డలిని గాలిలోకి ఊపాడు. కాని అతను యెంత సమయస్ఫూర్తితో ఎంత గురిచూసి ఆయుధాన్ని ఉపయోగించినా అతని దురదృష్టంకొద్దీ అది గురితప్పి దానికి తగల్లేదు. మరుక్షణంలో తనమీద పడిన బరువుకు తట్టుకోలేక అతను క్రిందపడిపోయాడు గొడ్డలి ప్రక్కకి పడిపోయింది. పులి పంజా యెత్తి అతని ముఖంమీద కొట్టబోతోంది.
శేషశాయి తుపాకీగుండు గురి వృధాకాలేదు. మరుక్షణంలో చిరుత ఆ వ్యక్తిని వదిలి ప్రక్కకు పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నది. దాని శరీరం నుండి రక్తం ధారలు కట్టింది. శాయి తాత్సారం చెయ్యకుండా దాని వంక గురిచూసి మరోసారి కాల్చాడు. అంతే, ఆ జంతువు ఆఖరి శ్వాసవిడిచి యిహ చలనం లేకుండా పడిపోయింది.
శాయి ఆ పడివున్న వ్యక్తి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి అతనులేచి వళ్ళు దులుపుకుని, క్రిందపడిపోయిన గొడ్డలి అందుకుంటున్నాడు. శాయి అతన్ని సమీపించగానే కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చేతులు జోడించి "నమస్కారం దొరా! ఇయాల మీరు నాకు ప్రాణదానం చేశారు. మీ మేలు జన్మజన్మలకూ మరిచిపోను" అన్నాడు.
శాయికి ఆ మనిషిని ఎక్కడో చూసినట్లనిపించింది. "నువ్వు..." అని ఆగాడు.
"నన్ను గంగరాజు అంటారండీ, మిమ్మల్ని చిన్నతనం కాడినుంచీ ఎరుగుదును. మీరు నన్ను చూసి ఉంటారుగాని, తమరికాడి కెప్పుడూ రాకపోవటం చేత నేను తెలిసుండను. ఏటవతల తాటి మొగల్లో పాకేసుకుని ఉంటున్నాను. కట్టెలు కొట్టుకోవటానికి అప్పుడప్పుడూ ఈ అడవిలోకి వస్తూంటాను చిరుతలు తిరుగుతున్నాయని యినటమేఆని తస్సదియ్య ఇంతవరకెప్పుడూ ఎదురుపడలా. ఇయాల దొరా, మీరుగినా రాకపోతిరీ దాని తల్లి సిగ తరగా పులి నన్ను పొట్టనేసుకుని ఉండేది" అన్నాడా మనిషి. అంతటి ప్రాణాపాయం నుండి బయట పడినాగాని అతన్లో ఎక్కడా గగుర్పాటుగానీ, భయంగానీ గోచరించలేదు. ఏదో సామాన్య విషయం జరిగినట్లు సరదాగా మాట్లాడుతున్నాడు.
అతని ధైర్యానికి శాయి సంతోషించి, భుజంమీద తట్టి క్రిందపడి ఉన్న చిరుత దగ్గరకు వెళ్ళి పరిశీలిస్తున్నాడు.
"ఎండ నెత్తిమీదికి వస్తున్నది. ఇంటికి పోయేసరికి చాలాతడవు అయ్యేట్లుంది. ఇహ మరలిపోదాం దొరా! దీన్ని నేను మోసుకొస్తాను." అంటూ గంగరాజు గొడ్డలి క్రింద పెట్టి ఆ జంతువును రెండు చేతుల్తో ఎత్తుకుని భుజాలమీద వేసుకుని, వొంగి తాన ఆయుధం తీసుకుని "పోదామా దొరా!" అన్నాడు.
ఇద్దరూ మెల్లగా క్రిందికి దిగి రాసాగారు. దారిలో గంగరాజు తన గురించి చెప్పాడు. తన భార్య అయిదు సంవత్సరాల క్రితం చచ్చిపోయింది. అప్పట్నుంచీ తను వంటరి. ఈ ప్రపంచంలో తనకు నా అన్న వాళ్ళెవరూ లేరు. రెండెకరాల కొండ్ర ఉంది. అది సాగుచేసుకుంటూ దాని దాపులోనే ఊరిబయట పాకేసుకుని, ఒంటరిగా నివసిస్తున్నాడు. తనకి అన్ని దురలవాటులూ ఉన్నాయి. తానంటే ఊళ్ళో చాలామందికి పడదు. అయినా తాను లక్ష్యం చేయడు.
కొండ దిగి క్రిందికి వచ్చాక, శాయి రోజూ వచ్చేదారిన కాకుండా కొంతచుట్టూ త్రిప్పి, కొత్తదారిన తీసుకువెళ్ళి ఊరికి సంబంధం లేకుండా వంటరిగా కట్టుకున్న తన పాకని చూపించాడు. పాక విశాలంగా ఉంది. రాత్రుళ్ళు అంత ఏకాంత ప్రదేశాన ఒంటరిగా ఎలా గడుపుతాడో గంగరాజుకే తెలియాలి.