Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 19


    ద్విజోత్తమా, మన పక్షమున పోరాడు ప్రధాన వ్యక్తులను తెలియపరతును. వారు వీరులు. మన సేనా నాయకులు.
        భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః
        అశ్వత్దామా వికర్ణశ్చ సౌమదత్తి స్థదైవచ|| 8

        
        అన్యేచ బహవశ్శూరాః మదర్దేత్యక్త జీవితాః
        నానాశాస్త్ర ప్రహరణాః సర్వేయుడ్డ వికారదాః 9

    మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు - వీరు యుద్దమున విజయులు, అశ్వద్దామ, వికర్ణ, సోమదత్త పుత్రులు, ఇంకను ఎంతోమంది వీరులు, మనకొరకు ప్రాణాలర్పించుటకు సిద్దముగా యున్నారు. వీరు అనేక శాస్త్రాస్త్రములు తెలిసినవారు. యుద్ద విద్యలో నిపుణులు.
    
        అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్
        పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ 10

    భీష్మునిచే రక్షితమగు మనసేవ అపరిమితము. భీముని రాక్షనలోని పాండవసేన పరిమితమైనది.
    
    దీపిక:
    
    దుర్యోధనుడు ద్రోణునికి సేనా సంఖ్య విషయములో విశ్వాసము కలిగించుచున్నాడు. వాస్తవముగా పాండవసేన సంఖ్యా వరముగా తక్కువే ఐనను, దుర్యోధనుడు చెప్పినట్లు అందరు అతిరథ మహారథులే.
    తన సేనను గూర్చి చెప్పునపుడు దుర్యోధనుడు ఒక్క మహారథుని గూర్చి గూడా చెప్పలేదు. తన సేనలోని ముఖ్యులు అను చెప్పువారిలో విశేషణములు వాడినాడు.
    1) తను కొరకు ప్రాణాలు అర్పించువారు
    2) యుద్ద విద్యావిశారదులు
    తనసేన మీద, దుర్యోధనునకే విశ్వాసమున్నట్లు కనిపించలేదు. అతడు ద్రోణునికి విశ్వాసము కల్గించుచున్నాడు. ఇది 'కుంటివాడు, గ్రుడ్డివానిపై ఎక్కుట' వంటిది.
    
        ఆయనేషు చ సర్వేషు యథా భాగమస్థితాః
        భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి 11
    ఎవరెవరి స్థానములలో వారు ఉపస్థితులగుదురుగాక మీరందరును భీష్ముని మాత్రము రక్షించవలసియున్నది.
    
    దీపిక:
    
    దుర్యోధనునిలో భయము ప్రత్యక్షరమున కనిపించుచున్నది. భీష్ముడు సేనను రక్షించవలసిన వాడు. అట్టి భీష్ముని రక్షించమని ద్రోణుని అడుగుచున్నాడు. అట్లానిన దుర్యోధనునకు, అపజయము భయము పట్టినట్లు కనుపించుచున్నది.
    దుర్యోధనుని భయమునకు కారణము శిఖండి. పూర్వము స్త్రీగా యుండి పురుషుడైనవాడు శిఖండి. అటువంటివాడు కనిపించినచో, భీష్ముడు అస్త్రసన్యాసము చేస్తాడు. అది దుర్యోధనునకు అపజయమే గదా!
    శిఖండి కథావిధానం బెట్టిదనిన-
    
                                        శిఖండి కథ
    
    ఇందుకు సంబంధించిన పూర్వ కథ మహాభారతములో, ఆదిపర్వము నందు ఉంది.
    శంతనుడు గంగవలన భీష్మునికన్నాడు. శంతనుడు సత్యవతిని వివాహమాడినాడు. ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను పుత్రులు కలిగినారు. శంతనుడు స్వర్గస్థుడు అయినాడు. చిత్రాంగదుడు స్వల్పకాలములోనే మరణించినాడు. మిగిలినవాడు విచిత్రవీర్యుడు. అతడు చిన్నవాడు. అయినను అతనికే పట్టము కట్టినాడు భీష్ముడు. రాజ్యపాలనము చేసినాడు.
    విచిత్రవీర్యునకు వివాహపు వయసు వచ్చినది. కాశీరాజు తన కన్యలకు స్వయంవరము ప్రకటించినాడు. భీష్ముడు అది తెలుసుకున్నాడు. కాశీ రాజ్యమునకు వెళ్ళినాడు. అక్కడికి అనేకమంది రాజులు వచ్చినారు. వారందరు చూచుచుండగా కాశీరాజు పుత్రికలు అయిన అంబ, అంబిక, అంబాలికలను పట్టుకొని రథమునందు ఎక్కించుకున్నాడు. రాజాలందరు భీష్ముని ఎదిరించినారు. భీష్ముడు వారిని అందరిని ఓడించినాడు. కన్యలను తీసుకొని హస్తినకు బయలుదేరినాడు. మార్గమున సాల్వుడు అడ్డుకున్నాడు అతనిని ఓడించి కన్యలను హస్తినకు చేర్చినాడు.
    తెచ్చినవారు ముగ్గురు కన్యలు అంబ, అంబిక, అంబాలిక. వానిలో అంబ తాను సాల్వుని ప్రేమించినానని అన్నది. సాల్వుడు సహితం తనను ప్రేమించినాడు. అందువలన తాను విచిత్రవీర్యుని వివాహం ఆడనని భీష్మునితో చెప్పినది. భీష్ముడు అంబ మాట మన్నించినాడు. ఆమెను విడిచిపుచ్చినాడు.
    అంబ హస్తిన నుండి బయలుదేరినది. ఆమె సుబల దేశము చేరినది. సాల్వుని చూచినది. తనను పెళ్ళాడమని కోరినది.
    "అంబా! భీష్ముడు నన్ను ఓడించినాడు. నిన్ను తీసుకునిపోయినాడు. ఇప్పుడు నిన్ను నేను భార్యగా గ్రహించలేను. నీవు మరొకరి దానవు అయినావు" అన్నాడు.
    అంబ మనసు చితికినది. ఆమె అనేక విధముల సాల్వుని ప్రార్దించినది, సాల్వుడు వినలేదు. ఆమెను వెళ్ళగొట్టినాడు.
    అంబ మనసున అవమాన జ్వాల రగిలినది. ఆమె సాల్వుని తప్పు పట్టలేదు. భీష్ముడే ఇందుకు కారణము అని నిర్ణయించినది. భీష్ముని మీద నిప్పులు చెరగినది. భీష్ముని సాధించవలెనని ప్రతిన పూనినది. ప్రతిజ్ఞ చేసినది.
    భీష్ముడు మహావీరుడు. ఏ రాజులు గెలువలేరు. ఈ విషయమును అంబ గ్రహించినది. తపస్సు చేసి సాధించవలెనని నిర్ణయించినది. మునులు నివసించు పుణ్యభూమికి వెళ్ళినది. తన గోడు వెళ్ళపోసుకున్నది. తాను తపస్సు చేతునని, తపోమహిమతో భీష్ముని సాధింతునని విన్నవించినది. మునులు ఆమె విన్నపమును అంగీకరించలేదు.
    అప్పుడు అక్కడికి 'హోత్రవాహనుడు' అను రాజర్షి వచ్చినాడు. అతడు అక్కడ అంబను చూచినాడు. ఆమె కథ విన్నాడు. ఆమె తనకు దౌహిత్రి అని తెలుసుకున్నాడు. "అంబా! నీవు పరశురాముని ఆశ్రయింపుము. అతడు నిన్ను రక్షించును. ఆపదల నుండి కాపాడును" అన్నాడు. అంబ పరశురాముడు ఉండు మహేంద్ర పర్వతమునకు వెళ్ళుటకు నిశ్చయించినది.
    ఆ రోజు ఆకృత ప్రవణుడు అక్కడికి వచ్చినాడు. పరశురాముడు తన శిష్యులతో రేపు ఇక్కడికి వచ్చునని చెప్పినాడు.
    అంబ రేపటి కొఱకు ఎదురు చూచినది. ఆ రాత్రి ఆమెకు నిదురలేదు. ఎదురుచూచిన రేపు వచ్చినది. పరశురాముడు విచ్చేసినాడు. హోత్రవాహనుడు అంబను పరశురామునకు చూపినాడు. ఆమె వృత్తాంతమును తెలియబరచినాడు. సాయము చేయవలసినది అని అభ్యర్ధించినాడు.
    "మహాత్మా! పరశురామదేవా! నీవు కృపాసముద్రుడవు. నిన్ను ఆశ్రయించిన వారి దుంఖములు పోగొట్టెదవు. రక్షింతువు. నాకు కలిగిన అవమానము పోగొట్టుము. నన్ను రక్షింపుము" అని ప్ర్రార్ధించినది అంబ.
    పరశురాముడు ప్రసన్నుడు అయినాడు. అన్నాడు
    "అంబా! నీకు కలిగిన అవమానము రెండు విధములుగా తోచుచున్నది. సాల్వునకు బుద్ధిచెప్పి నీకు అనుకూలింప చేయవలెనా? భీష్మునకు బుద్ధిచెప్పి సమ్మతింప చేయవలెనా? ఏది చేయవలెనో చెప్పుము" అని పరశురాముడు అడిగినాడు.
    "దేవా! సాల్వునితో నాకు పనిలేదు. భీష్ముని విషయముననే కోపము కలిగి ఉన్నాను. భీష్ముని సమ్మతింపచేసిన చాలును" అని అంబ ప్రార్దించినది.
    "అంబా! భీష్ముడు నాకు శిష్యుడు. నా మాట వినకపోడు. వినకున్న నా బాణములతో భీష్ముని పడగొట్టెదను" అన్నాడు. పరశురాముడు. కురుక్షేత్రమునందలి సరస్వతీ తీరమునకు చేరినాడు. భీష్ముని పిలిపించినాడు. భీష్ముడు వచ్చినాడు. "భీష్మా!" పరశురాముడు గోపమున అన్నాడు. "నీవు అంబను అవమానించినావు. ఈమెను నీ తమ్మునకు ఇచ్చి పెళ్ళి చేయుము. లేదా నాతో యుద్దమునకు సిద్దము అగుము".

 Previous Page Next Page