ఆ మధ్య ఒకసారి ఎవరో ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ విషయంకూడా నేను అంతగా పట్టించుకోలేదు. మనుషుల ముఖాల్లోకి చూడడం, ఊరికినే వెంటపడడం నేను మానేశాను. ఓ సాయంత్రం నాగదిముందు వసారాలో కుర్చీవేసుకుని కూర్చుని వీధిలోకి భావశూన్యంగా చూస్తున్నాను. పాణీ! వంటరితనం అదోరకంగా వుంటుంది కదూ! మనం ఏ పనిచేస్తున్నా మననెవరో పొంచిచూస్తున్నట్లు వుంటుంది. భోజనంముందు కూర్చుంటే ఎవరికోసం తింటున్నామనిపిస్తుంది. ఉన్నట్లుండి మనమీద మనకు జాలికలుగుతూ వుంటుంది. ఇంతలో క్రిందనుంచి మృదుమధురగానం వినిపించింది. తలత్రిప్పి చూశాను. క్రిందవాళ్ళ వసారాలో చాపమీద ఆ క్రొత్తగా వచ్చిన ఆడపిల్లలు కూర్చుని పాడుతున్నారు. కొంచెం దూరంలో గుమ్మంమీద ఓ ఇరవై, ఇరవై రెండేళ్ళ స్త్రీ కూర్చుని వుంది. నేను అటు చూసేసరికి వాళ్ళు ముగ్గురూ అప్పుడే ఎందుకో నావంక చూశారు. అయినా వాళ్ళు పాడటం ఆపలేదు. తియ్యగా, మలయమారుతం వీస్తున్నట్లుగా, గులాబీ హృదయంలో గులాము చిందుతున్నట్లుగా పాడుతున్నారు. నేను సభ్యతకూడా పాటించకుండా అలా కళ్ళప్పగించి చూస్తూ పాట ఆలకిస్తున్నాను. వింటూంటే మనసంతా సంపుల్లమానంగా, అమాయకంగా, ఏదో మకరందం గ్రోలిన మధురాను భూతిలా వుంది. అలా చాలాసేపు గడిచిపోయింది. ఆ ఇద్దరూ చిన్నవాళ్ళే. పాడేదికూడా శాస్త్రీయ సంగీతం కాదు. లలిత సంగీతమే. పాటకూ పాటకూ మధ్య నవ్వుకుంటూ, ఏదో ఛలోక్తులు విసురుకుంటూ, మధ్యమధ్య నాకేసి చూపులు విసుర్తూ మొత్తంమీద మంచి చొరవగా, ఉషారుగా ఉన్నారు. ఇంక కనుచీకటి పడసాగింది. వాళ్ళు ఎప్పుడో మెల్లగా పాట ఆపేశారు. ఏదో మగతలో వుండిపోయినానేమో, కాసేపటికిగాని ఈ విషయం తెలిసిరాలేదు. చూసేసరికి వాళ్ళు ముగ్గురూ ఏదో కబుర్లలో పడివున్నారు. నాకు ఎక్కడనుంచో మళ్ళీ భూమ్మీదకు వచ్చినట్లయింది. ఇంతలో నా గదిలో పనిచేసే మనిషి కూజాతో నీళ్ళు పట్టుకురావడానికి పైకి వచ్చింది. "ఎవరు పాంచాలీ ఆ పిల్లలు?" అనడిగాను. "వాళ్ళా బాబూ! చుట్టాలండీ. రేడియోస్టేషన్ లో రేపు పాడాలంట... అందుకని వచ్చారు" అన్నది. "ఆపేశారేం?" అన్నాను. "ఏమో బాబూ! పాడమని చెప్పేదా?" అంది నవ్వుతూ. అన్యమనస్కంగా వుండి "ఊ" అన్నాను. ఓ క్షణం గడిచాక నా పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకున్నాను. ఎంత అప్రతిష్ట! గుమ్మంలో కూర్చున్న స్త్రీ ఆఫీసరుగారి భార్య అయివుంటుంది. నన్నుగురించి ఏమనుకుంటుంది? కాని ఏంలాభం? సమయంమించిపోయింది. అప్పటికే పనిమనిషి వెళ్ళి ఈ కోరిక వాళ్ళకు చాటింది. అందులో ఓ అమ్మాయి గట్టిగా "ఏం పాటకావాలో అడుగు" అంది నవ్వాపుకుంటున్న కంఠంతో. పాంచాలి క్రిందనుంచి "యేంపాట పాడమన్నారు బాబూ!" అని అరిచింది. 'ఓసీ సిగ్గుమాలినదానా!" నేను బిక్కచచ్చిపోయాను. ఆ సమయంలో లేచి లోపలికి పోవాలనికూడా తట్టలేదు. అలాగే కుర్చీలో అంటుకుపోయి, తల త్రిప్పుకుని వీధిలోని దీపంకేసి చూడసాగాను."
"సరే" ఆమె పాడసాగింది. రెండోపిల్ల నవ్వుతూ ఊరుకుంది. ఈ సంఘటన ఏదో విపరీత పరిస్థితుల్లోకి దారితీస్తుందని అప్పుడు నేను కలగనలేదు. అసలు వాళ్ళిద్దర్నీ చూసినప్పుడే మరిచిపోయాను. మరునాటి సాయంత్రం వాళ్ళు అక్కడనుంచి వెళ్ళిపోయారు కూడా. ఆ రాత్రి డాబామీద కాస్త విహరిద్దామని వెళ్ళాను. పిట్టగోడదగ్గర చీకటిలోయెవరో నిల్చుని వున్నారు. అలికిడికి తలత్రిప్పి చూసేసరికి నేను కంగారుపడి, ఇవతలకు వచ్చేయబోయాను. ఆఫీసరుగారి భార్యకూడా తొట్రుపాటుపడి ఇవతలకు రాబోయింది. ఇద్దరం ఇంచుమించు ద్వారం దగ్గరకు వచ్చాము. "క్షమించండి" అని నేను ప్రక్కకి తప్పుకున్నాను. ఆమె నా ముఖంకేసి రెప్పవాల్చకుండా ఓ క్షణం చూసి క్రిందికి దిగి వెళ్ళిపోయింది. ఆఫీసరుగారు ఊళ్ళో లేరు. ఆమె నన్ను ఆపార్థం చేసుకుని, ఆయన వచ్చాక ఏమయినా ఫిర్యాదు చేస్తుందేమోనని భయపడిపోయాను. భోజనానికిపోతూ తలవంచుకుని మెట్లుదిగి, క్రిందిదాకా వచ్చాక ఏదో తోచి తలత్రిప్పి వాళ్ళ గుమ్మంవైపు చూశాను. ఆమె అక్కడ నిలబడి నా వంక కళ్ళప్పగించి చూస్తోంది. నా సైకిలు మెట్లక్రింద వుంది. అది తీసుకుందామని బుర్ర వంచుకుని ఎలాగో వెళ్ళేసరికి తాళం వేసి వుంది. తాళం చెవి కనబడలేదు. నేను జేబు తడుముకుంటూ వుండేసరికి ఓ మృదుమధురకంఠం వెనుకనుంచి వినిపించింది. "పాంచాలీ! తాళం నేనే వేయించి, తాళంచెవి ఇంట్లో పెట్టాను. అసలే కొత్తసైకిలు. ఇంత అజాగ్రత్తగా వుంటే ఎట్లా? ఇదిగో ఇచ్చిరా." నేను అనుకోకుండా అటుకేసి చూశాను. తలుపుకి ఆనుకుని నిలబడివుంది. ఆమె సుందరమైన దివ్యమంగళరూపం వసారాలో వెలుగుతూన్న లైటుకాంతిలో స్వచ్ఛమయిన బంగారంలా నిగనిగమని మెరుస్తోంది. స్విన్నమూ, స్నిగ్థమూ అయిన ఆమె మధురదరహాసం చూసి నేను చకితుడ్నై. పాంచాలి తెచ్చిఇచ్చిన సైకిలు కీ తీసుకుని ఎలాగో బయటపడ్డాను. ఇంతవరకూ ఆమెనెప్పుడూ అంతపరీక్షగా చూడలేదు. ఓ దేవతలా, అతీతులైన పురుషులకోసం శిల్పి చెక్కిన ప్రతిమకు ప్రాణం పోసినట్లుగా వుంది. ఆమెను చూస్తూ ప్రపంచాన్ని మరిచి ఎన్ని గంటలయినా గడపొచ్చు."
"కాని...! విధి పాణీ! అంత అందమైన మనుషుల్లోనూ దేముడు ప్రలోభం ఎందుకు ఉత్పన్నం చేస్తాడో నాకర్థంకాదు. అసలు అందరిలో ప్రలోభం దాగియున్న ఓ చిన్నారి అంశమేమో! నిన్న ప్రొద్దున... నేను కాఫీ త్రాగివస్తూ నా గదిలో ఓ ఉత్తరం పడివుండటం చూశాను. అంత భయం నాకిదివరకెన్నడూ కలుగలేదు. ఏదో పాపం చేస్తున్నాననిపించింది. ఆ ఉత్తరం చదవకుండానే ముక్కలు ముక్కలుచేసి, అక్కడ్నుంచి పారిపోదామనిపించింది. కాని ఇంతలో ఏదో ఆకర్షణ. విప్పి చూశాను."
"పాణీ! ఆమె పేరు 'వాణి'
"ఆడవాళ్ళు ఎంత అందంగా ఉత్తరం రాస్తారనుకున్నావ్? చదువుకోనివాళ్ళ అమాయకత్వం అక్షరాల్లో మరింత ముద్దుగా బయటపడుతుంది. అవి అక్షరాలుకాదు పువ్వులు, సన్నజాజులు. స్త్రీ పురుషుడికి ఎప్పటికప్పుడు ఓ నూతనమే పాణీ! మనం అసహ్యం అనేది మరిచిపోయేది ప్రపంచంలో ఒక్క స్త్రీమూర్తి దగ్గరే. కాని కొంచెం సంకుచితమైన భావాలు, అంత ముచ్చటైన భావాలు నా యీ సంకుచితమైన హృదయంతో ఇప్పుడు రాయలేను. మరో విషయం పాణీ! స్త్రీ వున్నంత సిన్సియర్ గా మనం ఎంత ప్రయత్నించినా వుండలేమనిపిస్తుంది. ఉన్నామనుకున్నా అది ప్రయత్నమే అవుతుంది. అసలు అంతులోతు మనం భరించలేమనుకుంటా."
"నేనేం చెయ్యను చెప్పు పాణీ! ఆమె నన్ను కలుసుకుంటుంది ఇవాళో రేపో. ఏం మాట్లాడను నేను? పల్లెటూరివాడిని... అంత పవిత్రమూర్తితో సున్నితంగా ఎలా సంభాషించను? నాకెందుకీ శిక్షలు? అనుభవానికి హద్దులు లేవంటారు. నిజమేనా? ఈ పరిస్థితిలో నువ్వుంటే ఏం చేసేవాడివి పాణీ! పాపాలు చెయ్యకుండా బ్రతకటంకన్న ఆత్మహత్య చాలా తేలికని నా ఉద్దేశ్యం. ఎప్పుడూ ఇంత అలజడిలేదురా."