తరువాత కాయలు బేరంచేసి వందమామిడికాయలు తీసుకుంది సీతారత్నం.
ఆవిడ కాయలు ఇలా కొందోలేదో అలా ఒక అయిదారుమంది పరుగెత్తుకు వచ్చి ఆమె మీద పడి చెయ్యొకడూ , కాలొకడూ, చీరా చెంగొకడూ లాగెయ్య సాగారు.
"ఇదేంటి!... నేను కాయలు ఎంచుకోకుండా కొన్నానుగా!... ఇలా ఎందుకు చేస్తున్నారు?" కంగారుగా అడిగింది సీతారత్నం రంగయ్యని.
రంగయ్య ఫక్కున నవ్వాడు.
"బలేవోరమ్మా మీరు... ఈళ్లు మిమ్మల్ని పట్టుకుని అందుకు లాగడం లేదు... కాయలు ముక్కులు కొట్టి ఇవ్వడానికి ఆళ్లకి ఇవ్వమని అడుగుతున్నారు..."
"నాకివ్వండమ్మా... నాకే ఇవ్వండమ్మా..." అంటూ మళ్లీ పీకడం మొదలుపెట్టారు.
వాళ్లలో ఒకడితో బేరం కుదుర్చుకుని వాడికి కాయలు ఇచ్చింది సీతారత్నం. వాడు సీతారత్నంకి పావుగంటలో కాయలు ముక్కలు కొట్టి ఇచ్చాడు. రంగయ్య ఆ మామిడికాయల ముక్కలున్న గోనెసంచిని భుజాన వేసుకుని సీతారత్నం వెనక బయలుదేరాడు. సీతారత్నం వెల్లుల్లిపాయలు అవీ ఇవీ కొనుక్కుంది. తరువాత మండి గేట్లోంచి బయటికి వచ్చి ఒక ఆటోని ఆపారు.
ఆటోవాడు సీతారత్నంని కళ్లింతింత చేసి చూసి ఆనందంతో నవ్వాడు.
"అమ్మా... మీరు జైమాలినీయే కదా?... నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలమ్మా మీరు!!..." అన్నాడు వాడు.
"వీడు నన్ను జైమలినీ అని ఎందుకనుకుంటున్నాడూ?"
ఆశ్చర్యపోతూ రంగయ్యని అడిగింది.
"మీరొట్టి లంగా జాకెట్టుతో ఉన్నారు కదండీ... అందుకు..." తొణక్కుండా జవాబు చెప్పాడు రంగయ్య.
సీతారత్నం అనుమానంగా తనవంక తను చూస్కుని "కెవ్వు" మని అరిచింది.
"నా చీరేది?..." కంగారు అడిగింది.
"ఇందాక కాయలు మేం ముక్కలు కొడ్తాం అంటే మేం ముక్కలు కొడ్తాం అని మిమ్మల్ని పట్టుకుని లాగారు కదమ్మా... అప్పుడు అక్కడే ఊడి కిందపడింది...
సీతారత్నం వెనక్కి పరుగెత్తుకువెళ్లింది. అదృష్టవశాత్తూ ఆమె చీర ఇంకా అక్కడే నేలమీద పడి ఉంది. దాన్ని గబగబా వంటికి చుట్టుకుని బయటికి వచ్చి రంగయ్యకి కూలీ ఇచ్చి ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది.
ఇంటి దగ్గర మామిడికాయ ముక్కలు మీదికి ఎగబడిన పిల్లల్ని కాకులు తోలినట్టు తోలి చాలా అవస్తలు పడి ఆవకాయ పెట్టింది సీతారత్నం.
మూడు రోజుల తరువాత జాడీలు తీసి ఆవకాయ కలిపింది. ఆ రోజు ఇంటిల్లిపాదీ కొత్త ఆవకాయని బాగా ఎంజాయ్ చేసారు. ముద్దపప్పులో నెయ్యివేసి కలిపి దానికి ఆవకాయ నంజుకుని తింటూ "ఆహా!... ఆవకాయ ఉంటే ఇంక వేరేకూరెందుకూ?" అన్నారు.
కానీ... ఆ కొత్తావకాయ మోజు వారం పదిరోజులుంది... తరువాత మళ్లీ ఆ పచ్చడని ఇంత ఇష్టంగా ఎవరూ తినలేదు - రోజుల తరబడి పట్టించుకోనూ లేదు.
ఇంత అనుభవం జరిగినా మళ్లీ సంవత్సరం సీతారత్నం గోనెసంచి పట్టుకుని మండీకి బయలుదేరింది పచ్చడి కాయలకోసం. అలా ప్రతి సంవత్సరం ఆవకాయ పెట్టడం ఒక ఆనవాయితీ అయిపోయింది తెలుగువాళ్ళకి. * * *