వరదాచారికి మండిపోయింది.....
"ఒరేయ్ వెంకా! నువ్వు చెప్పరా! ఎన్నాళ్ళనుంచి ఈ భాగోతం?" అని గర్జించాడు.
వెంకడు ఇందాకటి నుంచీ మతిపోయి, కళ్ళప్పచెప్పి జరుగుతున్నది చూస్తున్నాడు. ఇప్పుడు రెండుచెవులూ మూసుకొని "ఛ! ఛ!.... సరళమ్మగోరికీ, నాకూ యేటండీ! ఆయమ్మ దేవత...." అన్నాడు.
వింత చూస్తున్న నాగమ్మ కల్పించుకొని "మంచిదే కాని ఈడు మందెట్టి మనసు మార్చేసినాడు. రోజు సరళమ్మా, అయ్యీ, ఇయ్యీ, చాటుమాటున పెట్టిద్ది అంది.
వాడి చేతిలో అప్పటికి లడ్లు వున్నాయి. వరదాచారి దృష్టి వాటిమీద పడింది.
"వెధవా.....! నీకా లడ్డుండలు ఎక్కడివిరా? ఏమే? రంకు మొగుడికి ఇంటిలో చేసినవన్నీ దోచి పెడుతున్నావా"
"దోచిపెట్టడం లేదు. వాడిచ్చిన కషాయానికి బదులుగా డబ్బియ్యగలిగే శక్తిలేక, కనీసం కాస్త ఫలహారం పెడదామని పెడుతున్నాను"
"ఓహ్! చాలా బాగుందమ్మా! ఎంతో బాగుంది. ఇకమీదట ఈ ఇంటిలో ఇలాంటివన్నీ కుదరవు. ఇద్దరూ బయటికి పొండి. వాడి కషాయాలన్నీ నువ్వు తాగు. వాడికి కావలసినవన్నీచేసిపెట్టు. పొండి ఇక్కణ్నుంచి...."
"నేను పోను! ఎందుకు పోవాలి? ఏవండీ? మీరు చెప్పండి! నా గర్భంలో పెరుగుతున్న శిశువు మీ శిశివు కాదూ?"
అంతమందిలో సిగ్గువిడిచి నాదమునిని సూటిగా అడిగింది సరళ.
నాదముని పిచ్చిచూపులు చూశాడు.
వరదాచారి అందుకొని "వెర్రి వెధవని అడిగితే వాడేం చెప్తాడే? ఆవెర్రి మొగుణ్ని అడ్డు పెట్టుకొని వేషాలేద్దామనుకొంటున్నావా? వెఱ్ఱాడికి పిల్లలేమిటి....?" అన్నాడు.
నాదముని "ఇహిహి! వెర్రాడికి పిల్లలేమిటి?" అన్నాడు.....
అక్కడ చేరిన అందరూ పొట్టచేత్తో పట్టుకొని విరగబడి నవ్వారు.
వెంకడు భరించలేక "థూ! దేవతలాంటి అమ్మని ఇట్టాంటి మాటలంటారేటండీ?" అని చీదరించుకున్నాడు.
ఆ చీదరింపును భరించలేక వరదాచారి పలుపుతాడు తీసుకొని "అదొక దేవత. నువ్వొక దేవుడివి. ఇప్పుడే నిన్ను దేవుళ్ళలో చేరుస్తాను" అని చావబాదటం మొదలుపెట్టాడు.
పాపం, వెంకడు ఏడుస్తూ ఆ దెబ్బలు భరించలేక అటూ, ఇటూ పరుగెడుతుంటే వెంటపడి బాదసాగాడు వరదాచారి.
ఆ దృశ్యం చూసి సహించలేకపోయింది సరళ. వెంకడికి అడ్డుపడి "ఆపండి? వెంకడితో నేను వెళ్ళిపోతాను. వాడినేమీ చెయ్యకండి" అంది.
వరదాచారి పలుపుతాడు కిందపదేసి రొప్పుతూ, "అలారా దారికి! పొండి వెధవల్లారా?" అన్నాడు.
నిర్ఘాంతపోయాడు వెంకడు. తన దెబ్బలనుండి కారుతున్న రక్తం తుడుచుకోవటం కూడా మరచిపోయాడు.
"అమ్మగారూ! ఏటండీ నాతో యెక్కడికొస్తారు?" అన్నాడు.
"ఏంరా? రానియ్యవా? నువ్వూ ఈ అభాగ్యురాలిని వెళ్ళగొడతావా?" శాంతంగా అడిగింది సరళ.
"అదేంటండీ! ఏటోనండీ! రండీ! ఏం సెయ్యమంటారండీ...."
ఒకదానికొకటి పొంతనలేకుండా మాట్లాడుతున్నాడు వెంకడు.
వెర్రినవ్వుతో అంతా చూస్తూ నిలబడ్డ నాదమునిని చూసింది సరళ.
"వెళ్ళనా?" అంది.
"వెళ్ళు" అని లోపలకు పరుగెట్టి గొడుగు తీసుకొచ్చి సరళ చేతికిచ్చి " వర్షం వేస్తోంది. తడిసిపోతావు..... గొడుగు వేసుకొని వెళ్ళు" అన్నాడు.
ముందుకు అడుగు వెయ్యబోతున్న సరళ కాళ్ళను "పిన్నీ" అంటూ చుట్టుకున్నారు కమల, శ్యామల. చెరొక చెయ్యీ వాళ్ళ తలలమీద వేసి కన్నీళ్ళను నిగ్రహించుకొంది సరళ.
వెనక్కు తిరిగి ఆ ఇంటినొక్కసారి చూసింది. అయిదేళ్ళ క్రిందట ఆ యింటిలో ప్రవేశించింది కోడలి హోదాతో. కడుపుకింత తిండి తప్ప కట్టుకుందుకు మంచి బట్టకూడా ఎరక్కుండా ఆ ఇంటిలో చాకిరీ అంతా చేసింది. పిల్లల్నీ, పెద్దల్నీ, బంధువుల్నీ, స్నేహితుల్నీ. అందరినీ నావాళ్లనుకొని అందరికీ అన్నీ చేసింది. అయిదేళ్ళు మొత్తం ఆ కుటుంబానికి ఇంత చేశాక, కట్టుగుడ్డలతో, అపనిందలతో, గర్భవతిగా నడివీధిలోకి నెడుతున్నారు. తనచేత సకలసేవలూ చేయించుకొన్న ఆ వ్యక్తులు....
"పిన్నీ! పిన్నీ! నువ్వు పోవద్దు" అని ఏడుస్తున్నారు కమలా, శ్యామలా గట్టిగా.
రంగనాయకమ్మ, చెరొక చెయ్యీ పట్టి లాగి. "ఆ దెయ్యం దగ్గరకి వెళ్ళారంటే జాగ్రత్త" అంది.
పిల్లలు తిరగబడి నువ్వే దెయ్యం, నువ్వే పిశాచం, నువ్వే ఫో! పిన్ని మాతో వుంటుంది" అన్నారు.
అంతమందిలో పిల్లలు తనతో అలా మాట్లాడటం సహించలేక వాళ్ళని ఏనాడూ తన చేతులతో పెంచని రంగనాయకమ్మ వాళ్ళని ఛెళ్ళు ఛెళ్ళున చెంపలు వాయగొట్టింది.
పసివాళ్ళిద్దరూ కెవ్వుమన్నారు. సరళ ప్రాణాలు విలవిలలాడిపోయాయి.
వాళ్ళిద్దరినీ దగ్గిరకు తీసుకుని ఓదార్చాలనే తపనను అతి ప్రయత్నంమీద నిగ్రహించుకుని తలవంచుకుని వంటినిండా పైట కొంగు కప్పుకొని వెంకడి వెనకాల బయటకు నడిచింది.
"నాలుగడుగులు వెయ్యకుండానే "అక్కా," పిలుపు వినిపించి వెనక్కు తిరిగింది. చిన్న చేతిసంచీతో వచ్చి కలుసుకున్నాడు సారధి.
"సారధీ! నువ్వూ నాతో వస్తున్నావా" అంది సరళ కొంత సంతృప్తితోనే.
"అదేమిటక్కా! నువ్వుకాక లోకంలో నా కెవరున్నారు? నీ నీడలో కాక నేను మరెక్కడ బ్రతగ్గలను? పద దేవుడు మనకింత అన్యాయం చేశాడు....."
"సారధీ! అలా అనుకోకురా, ఏది న్యాయమో, ఏదీ అన్యాయమో మనకేం తెలుసు? ఈ క్షణంలో మనకు దురదృష్టంగా తోచింది. రేపు అదే అదృష్టంగా మారుతుందేమో. నాకు దేవుడిలో నమ్మకం ఉందిరా! నేను ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. దేవుడు నాకెందుకు అన్యాయం చేస్తాడు?"