ఆ సంగతి అలావుంచు. నీకు అప్పుడప్పుడూ చెబుతూవుండేవాణ్ణి మా మేనమామ కూతురు సత్యవతి సంగతి. ఒకసారి ఆ అమ్మాయి పిల్లల్తో కృష్ణకెళ్ళి స్నానంచేసి వస్తూంటే చూపించాను కూడా. బాగుందన్నావు నువ్వు. బాగుండటం, బాగుండకపోవటం అలావుంచు. సత్యవతి అంటే వ్యక్తిగతమైన ద్వేషం నాకేమీలేదు. కాని ఆ పిల్లను నాకంటగడదామని వాళ్ళంతా చూస్తున్నారు. ఎన్నిరకాలుగా ఎత్తులు వెయ్యాలో అన్నిరకాలుగా వేస్తున్నారు. నేను ఇంటికి ఎప్పుడుపోయినా ఇదో పెద్ద బెడద. అమ్మ బ్రతిమాలటం, కన్నీళ్ళు, అన్నయ్యల ఆర్భాటం. వదినెల ఎత్తిపొడుపులూ. వాళ్ళు నన్ను దబాయించి నాతో ఏ పనీ చేయించలేరనుకో. ఎవరికి వాళ్ళు స్వతంత్రులం. కాని మనకు ఎంత ఇష్టంలేకపోయినా, ఎంత స్వతంత్రాధికారం వున్నా ఏదో అజ్ఞాతశక్తితో, మరియొకశక్తికో ఒక దారుణ పరిస్థితిలో లొంగిపోవాల్సి వస్తుంది. ఆ సన్నివేశం నాకు రాకపోవచ్చుననుకో. కాని ఇది పెద్దయాతన. ఒక అసహ్యకరమైన పరిస్థితిలో మనం ఏంచేస్తామో మనకే తెలియదు. ఆ మధ్య ఒకసారి మా మేనమామ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అత్తయ్య ఏదో యుక్తిసంభాషణల ద్వారా మెల్లగా గ్రంథంలోకి దింపింది. నేను అప్పటికి మౌనం ధరించాను. వాళ్ళంటేనే, వాళ్ళ సాన్నిహిత్యం అంటేనే నా కెందుకో గిట్టదు. ఆ ఇంట్లో మసులుతూంటే ఏదో కృత్రిమ వాతావరణంలో, మరమనుషుల మధ్య మసులుతున్నట్లుగా వుంటుంది. ఆ ఇంట్లో నాకు భోజనం సహించదు. వాళ్ళ ప్రతిమాటా వెటకారంగా వుంటుంది. వాళ్ళంటే నాకెందుకో అయిష్టం. వాళ్ళు ప్రత్యేకంగా మా కుటుంబానికి చేసిన దగా ఏమీలేదు. కాని ఒకప్పుడు నేనంటే వాళ్ళకాట్టే ఆదరాభిమానాలు లేవని తెలుసు. తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. వారంరోజుల క్రిందట మామయ్య నా గదికి వచ్చాడు. రాత్రి సుమారు ఏడుగంటలయి వుంటుందనుకుంటాను. నేను భోజనానికి పోబోతున్నాను. ఆయన్ని చూడగానే నా గుండె బేజారయిపోయింది. ప్రపంచంలో ఆయనకంటే మొండివాణ్ని మనం చూడబోము. "నువ్వు చెప్పేది రైటే అనుకో" అంటూనే తనపట్టు మానడు. నా ఎత్తులన్నీ పటాపంచలుచేసి, బలవంతంగా రిక్షా ఎక్కించి, వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ముసలమ్మగారు. అత్తయ్యా, బావా, ఇహ వాళ్ళ వాళ్ళ సొంతమాటల్తో ఎవరిపురాణం వాళ్ళు మొదలుపెట్టారు. ఎలాగో భోజనాలతంతు ముగిసింది. కాని ఆరోజు నేను వాళ్ళను ధిక్కరించి గదికి వచ్చెయ్యటం సాధ్యంకాలేదు. అక్కడ మంచం అదీ వేసి పడుకోమన్నారు. పదకొండు గంటలదాకా ముసలమ్మగారు ప్రక్కనే చతికిలబడి సోది చెప్పింది. మా కుటుంబ పూర్వవృత్తాంతం, ఆకాలంలో ఒకరంటే ఒకరికి వున్న వాత్సల్యాలు, రక్తసంబంధం. "సత్యవతికి నువ్వంటే ప్రాణంబాబూ!" అంది. నేను ఉలిక్కిపడ్డాను. "అవును బాబూ! దాని పెళ్ళి గురించి చాలాసార్లు కదిపాను. 'రాజా అంటే నీ ఉద్దేశం ఏమిటే?' అనడిగాను చాలా తడవలు. 'పో అమ్మమ్మా!' అంటూ పారిపోయేది. మొన్న ఒకసారి మీ బావ అన్నాడు మీ అత్తయ్యతో 'పోనీ రాజుబావకు ఇదంటే ఇష్టంలేకపోతే మనం మట్టుకు తాపత్రయపడటమెందుకమ్మా? ఇష్టంలేని సంబంధంచేసి దానిగొంతుకోస్తామా?' అని. 'చాల్లే ఊరుకోరా. అతన్ది కుర్రతనం. ఇష్టం లేకపోవటమేమిటి?' అని అది కసిరింది. ఇహ సత్యవతి నా దగ్గరకొచ్చి ఏడుస్తూ కూర్చుంది. 'ఎందుకే ఏడుస్తున్నావు?' అని బుజ్జగించి అడిగాను. చివరకు బాధపడుతూ, దిగులుగా చెప్పింది. 'నన్నింకెవ్వరికైనా ఇచ్చి పెళ్ళిచేస్తే నూతిలోదూకి చచ్చిపోతాను అమ్మమ్మా!' అంది. 'పిచ్చిదానా! రాజాకు మట్టుకు నువ్వంటే ప్రాణం కాదుటే. అతను మొగవాడుకాబట్టి కొంచెం మొరాయిస్తాడంతే' అని నచ్చజెప్పాను. 'ఏమో అమ్మమ్మా! నాకు భయంగా వుంది. నేనేం తప్పుచేశాను? నాకెందుకీ శిక్ష?' అంటూ ఒకటే కొట్టుకుపోయింది. మొన్న పెళ్ళయిన ప్రక్కింటివాళ్ళతోబాటు తనూ నోములు నోచుకుంటూ 'మా రాజుబావే నాకు దక్కేటట్లు చెయ్యి' అని మనసులో కోరుకుందిట. 'పెళ్ళికానివారి నోములు ఫలించవే సత్యవతీ!' అన్నాను నవ్వుతూ.'పో అమ్మమ్మా! దేముడు నా ప్రార్థన వింటాడు' అన్నది ముఖం ఇంత చేసుకొని. దాని బాధ, వేదన అంతా సిగ్గువిడిచి ఈ ముసలిదానికి చెప్పుకుంటుంది. నాయనా రాజా! నేనూ పెద్దదాన్ని అయిపోతున్నాను. మీరిద్దరూ పసుపుబట్టలు కట్టుకుంటే చూద్దామని నా చివరికోరిక. సత్యవతి సుగుణాల మూట. తటపటాయించకు బాబూ!"
ఆమె నాకు బోధించి వెళ్ళిపోయింది. నేను మెల్లగా నిద్రకు ఉపక్రమించాను. నా మనసంతా వికలమై వుండడంచేత కలతనిద్దురపట్టింది.
ఒకరాత్రివేళ ఎందుకో మెలకువ వచ్చింది. ఈ మెలకువ రావడంలో స్వాభావికం కనబడకపోయేసరికి కళ్ళు నులుపుకుంటూ చూశాను. చీకట్లో నా కాళ్ళ దగ్గర ఒక స్త్రీమూర్తి నిలబడివుంది. ఉలికిపడి అటూ ఇటూ చూశాను. అదృష్టవశాత్తూ ఆ దగ్గర్లో ఎవరూలేరు.
"ఏం పనిచేశావు సత్యవతీ?" అన్నాను లేచి నిల్చుంటూ.
"సాహసమే కాని నేను సిగ్గులేనిదాన్ని. ఈ రాత్రి నీ దగ్గరకు రాకపోతే నువ్వెందుకో నాకు దూరమైపోతావనిపించింది. ఏం చెయ్యను చెప్పు? నీకిష్టంవచ్చిన శిక్ష విధించు" అన్నది సత్యవతి సన్నని కంఠంతో దీనంగా.
మేము ఎంత మెల్లగా మాట్లాడుకున్నా ఎవరికైనా వినిపించే ప్రమాదం లేదా? లేదు. ఆమెను అక్కడ్నుంచి గట్టిగా వెళ్ళిపొమ్మని చెప్పటానికి కష్టమనిపించింది. చేసేదిలేక "కూర్చో సత్యవతీ" అన్నాను. ఆమె కొంచెం సంశయించి మంచం చివర్న కూర్చుంది. నేను ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకున్నాను. నేను పడుకున్నగది అదృష్టవశాత్తు మిగతా ఇంటికి కొంచెం ఎడంగానే వుందిలే.
"నేనంటే నీకు ఎందుకు ఇష్టంలేదు బావా?" అంది సత్యవతి.
"సత్యవతీ! మాట్లాడుకునేందుకు ఇంకేవీ మాటల్లేవా?" అన్నాను.
"ఉహుఁ! ఈ రాత్రివేళ నీదగ్గరకు రహస్యంగావచ్చింది లోకాభిరామాయణం ముచ్చటించటానికి కాదుగా!"
"పోనీ ఏమిటో చెప్పు."
"చెప్పడం కాదు. ప్రశ్నలు వేయడానికి వచ్చాను."
"కాని సమాధానాలు చెప్పటానికి నేను సిద్ధంగా వుండొద్దా సత్యవతీ!" అన్నాను.
ఆమె బాధగా "బావా! నా కళ్ళలో నీళ్ళు చూడటం నీకు సరదానా? నువ్వు చాలా తెలివైనవాడివని చెప్పుకుంటారు. గొప్ప వక్తవటకూడా. నాతో మాట్లాడటానికి నీకు మంచిమాటలు కరువైనాయా?" అంది.
"నువ్వంటే ఇష్టమో, కాదో తేల్చుకుని యేంచేస్తావు చెప్పు?" అన్నాను తెగించి.