అతడి చేతిలో కప్పు తొణికి కాస్త టీ మీదపడింది. అదికూడా పట్టించుకోలేదు. స్తబ్ధుడై చూశాడు.
"చాలా గొప్ప ప్లాను వేశారు. జైలు మ్యాపుతో సహా వాళ్ళకి అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది."
"నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతూందా?"
"వార్షికోత్సవ సందర్భంగా మీరు పంపిన ఆహ్వానపత్రం మీద వ్రాసిన కోడ్ 'ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్' తో సహా అర్ధమయింది."
అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది. చాలా సేపటివరకూ మాట్లాడలేకపోయాడు. "నాకు...నాకేం తెలీదు" అన్నాడు.
"ఏం తెలీదా?" వెటకారంగా అన్నాను. "బ్రెడ్ తో పాటూ రంపం పంపించటం గురించి తెలీదా? బయట్నుంచి సొరంగం తవ్వించటం గురించి తెలీదా? స్వీట్ లలో మత్తు కలపటం గురించి తెలీదా? ఏం తెలీదు నీకు?"
'చాలా తెలుసుకున్నావే" అన్నాడు. ఇప్పటికి సర్దుకున్నట్టు కనిపించాడు. "చాలా తెలుసుకున్నావ్" అన్నాడు మళ్ళీ ... "కానీ దేన్నీ నిరూపించలేవు."
తెల్లబోయాను. అతడు ఈ విధంగా వస్తాడని వూహించలేదు.
బహుశా నా మొహంలో కనిపించిన మార్పుల్ని గమనించి వుంటాడు. మళ్ళీ నవ్వేడు. "దేన్నీ నిరూపించగలవు నువ్వు? దేనికి సాక్ష్యాధారాలు లేవు."
నిజమే. దేన్నీ నిరూపించలేను.
ఓడిపోయాను. చాలా తొందరపడి అతడి దగ్గిర బయటపడ్డాను.
లేచి అక్కణ్ణుంచి వచ్చేసేను.
కానీ, నా వెనుక జగన్నాధం ఆలోచనలో పడటం గమనించాను. ఎంత కాదనుకున్నా అతడి భయం అతడి కుంటుంది. విషయం అంతా నాకు తెలిసిపోయింది. కాబట్టి నన్నెలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ వుండి వుంటాడు. ఇకనుంచీ ప్రతీ క్షణమూ జాగ్రత్తగా వుండాలి.
అంతేకాదు.
అతడు ఎత్తు వేసేలోపులోనే దెబ్బకొట్టాలి. లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమే.
ఈ సాయంత్రం అమ్మకంతా చెప్పాను. సాధారణంగా అమ్మనుంచి ఏదీ దాచను. ఈ ప్రపంచంలో నాకున్నది అమ్మ ఒక్కతే.
అమ్మ చాలా దిగులుపడింది. "ఎందుకురా అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావు?" అంది.
"ప్రతివాడూ అలా అనుకుంటే ఎలాగమ్మా."
"మనకి కాని విషయాల్లో తలదూర్చకూడదురా."
నేను నవ్వేను. "గత నాల్రోజుల్నుంచీ ఆ గండ్రగొడ్డలిని తెగ పొగుడుతున్నావ్ కదమ్మా. అతడు కూడా ఆ రాత్రి 'నాకు కాని విషయంలో నేను తలదూర్చకూడదు' అని అనుకుని వుంటే ఈ రోజు ఇలా నీ ఎదురుగా కూర్చుని మాట్లాడటానికి నేను బ్రతికి ఉండి వుండేవాడిని కాను."
"అతడిని ఎప్పుడు ఉరి తీస్తున్నార్రా?"
"ఇంకా ఆర్డర్లు రాలేదమ్మా, ఎదో ఒకరోజు నిర్ణయించి తెలియపరుస్తారు."
"మరీ దారుణమైన హంతకుడట కదరా! కొంతమంది అలా అంటారు, కొందరు మరోలా చెప్తారు. ఏది ఏమైనా నీకు సాయపడ్డాడు. ఒకసారి అతడిని చూడటానికి వీలవుతుందట్రా?"
"నీకు అడ్డేమిటమ్మా."
"కలుసుకుని ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాల్రా."
నాల్గురోజుల తరువాత అమ్మ అతడిని కలుసుకుందట. నేను లేను.
అలా కలుసుకోవటంతో ఈ కథ ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది.
* * *
బాత్ రూమ్ సంఘటన తరువాత రేఖ నాకు కాస్త దగ్గిరయింది. చనువు పెరిగింది. వయసులో వున్న అబ్బాయీ అమ్మాయిల మధ్య చనువు పెరగటం ఎంతసేపు....? జైలులో కూని జయప్రదంగా అణిచి వేసిన సందర్భంగా పేపర్లలో పడిన ప్రముఖుల ఫోటోల్లో నాది కూడా ఒకటి. ఆ వార్తలు అన్నీ చదివి నాకు ఫోన్ చేసింది.
"కంగ్రాట్స్"
"థాంక్యూ."
"హీరో అయిపోతున్నారే?"
"హీరోయిన్ ఒక్కతే తక్కువ."
"అయ్యో పాపం!"
ఇద్దరం నవ్వుకున్నాం.
"అది సరేకానీ, సాయంత్రం ఏమిటి ప్రోగ్రాం?" అడిగాను.
"ఏముంది, ఏమీలేదు."
"పరీక్షలు అయిపోయినయ్ కదా. నాతో రాకూడదూ."
"ఎక్కడికి?"
"అడికిలమెట్టకి... ఈవేళ పౌర్ణమి."
అక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అడికిలమెట్ట వుంది. అక్కడ గుడిని పౌర్ణమి నాడు చూడటానికి చాలామంది వస్తారు.
"తిరిగి రావటం ఆలస్యం అవుతుందేమో?"
"తెలిసిన స్నేహితుడి కారు తీసుకుంటున్నాను. ఎనిమిదింటికి వచ్చేద్దాం."
"సరే అయితే.... నాన్నగారికి చెప్పి వస్తాను."
"నాన్నగారికా?"
"అవును"
"నాతో అంటే చచ్చినా వప్పుకోరు."
"ఇది నాకు సంబంధించిన విషయం. ఆయనకు సంబంధించినది కాదు."
"నీకు అంత ఇండివిడ్యువాలిటీ వుంటే మంచిదే."
"మీకు నా గురించి పూర్తిగా తెలీదు. సాయంత్రం కలుద్దాం. ఎన్నింటికి?"
"ఆరింటికి."
"ఓ.కే.!" ఫోన్ పెట్టేసింది. నేనుకూడా పెట్టేసి, మళ్ళీ వెంటనే రింగ్ చేశాను. నేను చేసింది- జైలు వ్యవహారాల్లో జరగిన ఈ ఘోరమైన 'కూ' నిమిత్తమై ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రమేష్ వర్మకి.
నా పథకంలో (జగన్నాధం భాషలో చెప్పాలంటే) ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్.
.....
అమ్మ పులిహోర కట్టిచ్చింది. అమ్మకి 'స్నేహితుల్తో' అని చెప్పాను. కానీ నమ్మివుండదని నా అనుమానం. కర్కోటకుడిగా పేరుపడ్డ ఈ జైలు ఉద్యోగి, ఈ మధ్య ప్రతిరోజూ ఉదయాన్నే గెడ్డం గీసుకోవటం, అప్పుడప్పుడూ పరధ్యానంగా వుండటం ఆ మాత్రం గమనించకుండా వుంటుందా? కానీ ఎక్కడా బయటపడలేదు. అదీ ఆమె గొప్పతనం.
ఫ్రెండ్ ని అడిగి తీసుకున్న కారులో బయలుదేరాం. ఆరుంపావు అయింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు.
అడికిలమెట్ట ఇటువైపే వుంది. ఊర్లోకి వెళ్ళక్కర్లేదు. రాజానగరం దగ్గిర మెయిన్ రోడ్డు నుంచి పక్కకి దారి వుంది. చిట్టడవిలో ఓ అయిదు కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి.
రాజానగరం దగ్గిర కొచ్చేసరికి ఆరున్నర అయ్యింది. వెన్నెల రాత్రి అవడంవల్ల ఎంతో తేడా తెలియటం లేదు.
"నిజంగా గుడి చాలా బావుంటుందటకదూ" అందామె.
"మరీ అంత గొప్పగా వూహించవద్దు. ఇలాగే అనుకుంటూ తాజ్ మహల్ చూశాను. వెన్నెల్లో తాజ్ ఎంతో బావుంటుందంటారుకదా. చాలా గొప్ప వూహతో వెళ్ళాను. కానీ చూస్తే ఏముంది- జేగురురంగు కట్టడం. నేను చాలా నిరాశ చెందిన అనుభవాల్లో అది ఒకటి."
"స్పందన కావాలి. అదీ ముఖ్యం" అందామె క్లుప్తంగా. ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాను. ఎందుకో ఆమె అలా మాట్లాడగలుగుతుందని నేను అనుకోలేదు. ఒక మామూలు కాలేజీ అమ్మాయిగానే తెలుసు ఇప్పటి వరకూ.
రాజానగరం దగ్గిర మలుపు తిరిగాము. మరికొంత సేపటికి అడవి ప్రారంభం అయింది. దూరంగా కొండలు నల్లగా కనపడుతున్నాయి. కారు గతుకుల్లో పడిలేస్తూంది. రెండు నిముషాల ప్రయాణం తరువాత ఆగి పోయింది.
"ఏమైంది?"
దిగి చూశాను. ముందు టైరు నేలకంటుకుపోయి వుంది.
"పంక్చర్" అన్నాను. "టైరు మార్చాలి. పది నిముషాలు పడుతుంది. సారీ!"
ఆమెకూడా కారు దిగుతూ "సారీ ఎందుకు? ఇక్కడ ఎంతో బావుంది" అంది. ఇక్కడ ఏం బావుందో నాకు అర్ధంకాలేదు. చుట్టూ చీకటి, ఎండుపుల్లలు, చెట్లు కీచురాళ్ళ శబ్దాలు.
కారు వెనుకనుంచి స్పేర్ టైర తీసుకువచ్చి ముందు పడేశాను. పంచర్ అయిన టైర్ విప్పటానికి సంసిద్దుడనవుతూంటే ఆమె వచ్చి పక్కన నిలబడింది. ఒక క్షణం ఇద్దరం అలానే ఒకర్నొకరు చూసుకుంటూ నిలబడ్డాం. చుట్టూ వున్న చీకటి, ఒంటరితనం ప్రోత్సహించాయి. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమె అప్రయత్నంగా అడుగు ముందుకు వేసింది. చెంపల క్రింద చేతులువేసి మొహాన్ని పైకెత్తి పెదవుల గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.
నాజీవితంలో నేనెప్పుడూ అంత ఆశాభంగానికి గురి అవలేదు. చాలా మామూలుగా వుంది ఆ ముద్దు. హెరాల్డు రాబిన్స్ నుంచి హవలాక్ ఎల్లీస్ వరకూ నేను చదివిన పుస్తకాల్లో వర్ణించినది వేరు. నాకు తెలుగులో అంతగా పరిచయం లేకపోయినా మిత్రులు చెప్పిన శృంగార నైషధాల వర్ణన వేరు. కానీ ఇదేమిటి? చాలా సాధారణంగా, దానికి మరికొంత విశ్లేషణం చేర్చాలంటే- 'చప్పగా' వుంది. ఒక ప్లాస్టిక్ ముద్దనో- రబ్బరుబొమ్మనో పెట్టుకున్నట్టుంది. మధువులేదు, మాధుర్యం లేదు. ఈ కవులూ నవలాకారులు, అనుభవంలేని వాళ్ళని ఊహల్లోపెట్టి ఎంత మోసం చేస్తారో అర్ధం అయింది. అనుభవంకన్నా ఊహ యెంత భ్రమలో పడేస్తుందో తెలిసింది.
నేనిలా ఆలోచిస్తూ వుండగానే ఆమె నా చేతుల్లోంచి అడుగు వెనక్కి వేసి "తొందరగా వెళ్దాం" అంది. నేను వంగి టైరు మార్చటంలో నిమగ్నమయ్యాను. అనుకున్నట్లే దాదాపు పది నిముషాల్లో పని పూర్తయింది. ఇద్దరం కూర్చున్నాక కారు స్టార్ట్ చేశాను. ఏదో గిల్టీ కాన్షస్ పీలింగ్ నన్ను విడవకుండా వెంటాడసాగింది. "ఐయాం సారీ" అన్నాను. ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనం నన్ను మరింత బాధపెట్టింది. అప్రయత్నంగా అన్నాను. "... మీ నాన్నగారితో మాట్లాడతాను మన వివాహ విషయం-"
ఆమె నెమ్మదిగా అంది "కంఠంలో ప్రాణం వుండగా ఆయన దీనికి వప్పుకుంటారనుకోను."
ఆశ్చర్యంగా "ఏం?" అన్నాను.
"మీ ప్రాణాలు తీయాలన్నంత స్థాయిలో ఆయన ఆలోచనలు సాగుతున్నాయి కాబట్టి"
దాదాపు కారు సడెన్ బ్రేక్ వేసినంత పని చేసి, "మీకు... మీకెలా తెలుసు?" అని అడిగాను.
"నాన్నా, దామోదరంగారూ నిన్న రాత్రి చాలా సేపటివరకూ యీ విషయం చర్చించుకున్నారు" వెనక్కి వెళుతున్న రోడ్డువంక కన్నార్పకుండా చూస్తూ అంది. ఆమె ఆలోచనలు ఎక్కడో వున్నట్టున్నాయి. భావాల్ని చదవటానికి ప్రయత్నించాను గానీ ఆమె మొహం నిర్వికారంగా వుంది.
"నీకు తెలుసా? జైల్లో కూ జరగటానికి మీ నాన్నగారే కారణం".
"తెలుసు" క్లుప్తమైన ఆమె జవాబు బుల్లెట్ లా దూసుకు వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ ని అల్లరి పట్టించిన అమ్మాయిలా లేదు యిప్పుడామె.
"ఇప్పుడిదంతా నాకు చెప్పటం ద్వారా మీ నాన్నగార్ని, ఆ అపాయకరమైన పరిస్థితిలో పడేస్తున్నావ్ ఆ విషయం తెలుసా?"