Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 17


    మరోసారి ఆర్తనాదం వినిపించింది.

    అక్కడ డెన్ లో కథానాయికని బంధించిన విలన్ ఆమెను క్రమంగా వివస్త్రను చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నాడు. అప్పటికే చీర వూడిపోయింది. ఇప్పుడు నాయిక నేలపై పడి ప్రాధేయపూర్వకంగా చేతులు జోడిస్తూంది తననేమీ చేయొద్దన్నట్టుగా...

    కసిగా మీదపడ్డ విలన్ ఆమె బ్లౌజ్ ని చించేసాడు.

    నేపద్య సంగీతం మరింత ఉధృతమయింది... నాగు వేగం పెరిగింది.

    సరిగ్గా ఇదే సమయంలో థియేటరులో నాలుగు క్లాసెస్ లో కూర్చున్న నలుగురు వ్యక్తులు చేతుల్లోని బ్రీఫ్ కేస్ లు తెరిచి కొన్ని రస్సెల్ వైపర్స్ ని నేలపై విడిచిపెట్టారు నిశ్శబ్దంగా.

    చీకటిలో చల్లగా వున్న నేలపై ఓ క్షణం ఆగిన పాములన్నీ ఏ శబ్ద తరంగాలకో అలజడి చెందుతున్నట్టు కంగారుగా ప్రేక్షకుల కాళ్ళ మధ్య ప్రాకడం మొదలుపెట్టాయి.

    తెరపై నాగుపాము వేగం పెరిగింది. నాయిక ఆర్తనాదం ఆమె ఉనికి అర్ధమైనట్లు గుహ ముఖద్వారం వేపు దూసుకుపోతూంది.

    లల్లీ తల్లిని భయంతో చుట్టేసింది. ఆ తెరపై సన్నివేశం చూడలేనట్టు. నిన్నరాత్రి కలవరపాటు నుంచి ఇంకా తేరుకోని సబిత అప్పుడనుకుంది. అనవసరంగా తను సినిమాకి వచ్చినట్లు.

    తెరపై పాము గమనాన్ని పరికిస్తున్న ఆమెకి తెలీదు. తన కాళ్ళకి సమీపంగా అప్పటికే ఓ రస్సెల్ వైపర్ చేరుకున్నట్టు.

    నిజానికి సబిత సినిమాచూసే మూడ్ లో లేదు.

    ప్రొద్దుటనుంచే ఇంట్లో ఉండటానికి భయమనిపించింది.

    అంతకుమించి ప్రతిచిన్న చప్పుడికి ఉలికులికి పడుతున్న లల్లీకి పాములంటే ఏర్పడిన అనూహ్యమైన భయాన్ని పోగొట్టాలని కోరి ఇలా సినిమాకి తీసుకొచ్చిందిగాని ఇక్కడా తను ఆపదలో కూరుకుపోబోతున్నట్టు వూహించలేకపోయింది.

    సినిమా ప్రారంభంలో కథానాయిక పాముని పెంచడం పాము ఆమెతో స్నేహంగా మెలగడం దోబూచులాటలా ఎక్కడో దాగున్న పాము ఆమె ప్రార్ధనలా పిలవగానే ముందుకొచ్చి నుదుట సిధూరాన్ని దిద్దడం అంతా ఉత్సాహంగా అనిపించింది లల్లీకి కూడా...

    ఆ లేత వయసులో నిన్నరాత్రి ఫోబియానుంచి రిలీఫ్ పొందగలిగింది కాని ఇప్పుడు తెరపై పతాక సన్నివేశం చూసి వణికిపోతూంది.

    చుట్టూ జనం వున్నారన్న విషయం మరచి ఏడ్చేస్తూ అడిగింది. "పాము ఇప్పుడు కాటేస్తుందా మమ్మీ..."

    ఇరుకుగా వున్న అగాధంలోని మనిషి కేర్పడే అణ్వస్త్రభయంగా సబిత గొంతుని మూగగా మార్చింది.

    నిన్నరాత్రి సంఘటన ఆమెకి గుర్తుకొచ్చి ఆరిన కుంపటిలో రగులుకునే స్మృత్యాగ్ని కణంలా తొట్రుపడుతూనే అంది "అమ్మాయిని అల్లరి పెడుతున్నది దుర్మార్గుడుగా, కాబట్టి వాడ్ని చంపేస్తుందన్న మాట."

    అప్పటికే పాము గుహలోకి ప్రవేశిస్తే, థియేటర్ నేలపై రక్తపింజెర సబిత పాదానికి ఓ అంగుళం దూరం చేరుకుంది.

    "మరి అమ్మాయిని ఏం చేయదా మమ్మీ" సినిమా స్టీరియోఫోనిక్ సౌండ్ లో లల్లీ కంఠస్వరం స్పష్టంగా వినిపించడం లేదు.

    "మంచి అమ్మాయిగా."

    "మరి మనిద్దరమూ మంచోళ్ళమేగా రాత్రి పాము" ఒక సమ్మెట పోటుతో పగిలిన గుండె సందుల చేరే విహ్వలత లల్లీ గొంతులో.

    తెరపై చెవులు చిల్లులుపడే హోరు.

    ఓ ఆర్తనాదం తెరపైనుంచి.

    మరుక్షణం రణకాష్టంలా విలన్ని చుట్టేసిన పాము బుసకొడుతూ కాటేసింది. 

    కెవ్వుమంటూ వినిపించింది. ఈసారి తెరపైనుంచి కాదు దిగువ క్లాసులోని జనంలోనుంచి. వెంటనే అరుపులు "పాము...పాము..." ఇక భూమి బ్రద్ధలైన చప్పుడుతో పరుగులు.

    తెరపై హడావుడి తగ్గింది. డేగరెక్కల్లాంటి పాము కాట్లతో ఇప్పుడు కొందరి ఆక్రందనలు వినిపించాయి.

    అప్పటికి జరుగుతున్నదేదో అర్ధమైన సబిత అంతదాకా అంధకారపు సముద్రపు ఆవలి ఒడ్డున నిలబడినట్టు అమాంతం పైకిలేచింది.

    తొందరపాటులో ఆమె పాదం పాము నడుంపై పడింది.

    ఒక గావుకేక సబిత గొంతునుంచి...

    బ్రతుకును బడబాగ్నికి బలి ఇచ్చినట్టు మరో ఆక్రందన...

    మృత్యువుని మెత్తని పరుపులా తొక్కుతూంటే కోరలు శిఖలై విషపు చుక్కలై శత్రువలయ పదఘట్టనలో పాదంలో ప్రవేశించింది.

    జనం కకావికలై బయటికి పరుగెడుతుంటే పసిపిల్లలు పాదాలక్రింద నలిగిపోతున్నారు. మూలుగులు మూఢత్వం క్రింద ఒరిగే జడత్వాలై మృత్యువు మంటలా మొహాన్ని కొడుతుంటే వెన్నెముకలు ఫళుక్కుమంటున్నాయి.

    బయటికి జనం వెల్లువలా...

    జనం చుట్టూ బయటి జనం చలిగుండెలపైన కత్తుల్లా

    సినిమా ఆగిపోయింది. థియేటర్ ఖాళీ అయ్యింది....

    కాని కాటుతిన్న సబిత ఇంకా మమతల మొహం వీడనట్టు లల్లీని ఎత్తుకుని మృత్యువు దారం తెగిన పతంగంలా ఉన్నచోటునే తూలుతూంది శక్తి ఉడిగిపోగా.

    అందరికీ సానుభూతిగా వుంది. కాని ఎవరూ లోపలికి వెళ్ళే సాహసం చేయడంలేదు. వెళ్ళిన మరుక్షణం ఏ మూలనో వున్న ఏ పాము విజృంభిస్తుందోనన్న భయం.

    అప్పటికి కొద్దిగా అర్ధమైన లల్లీ "అమ్మా" అంటూ నీళ్ళు నిండిన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూసింది. కానీ సబిత కళ్ళు భారంగా వాలిపోతున్నాయి.

    ఆ స్థితిలో కూడా సబితకి అనిపిస్తూంది లల్లీని దించితే హరాళ గరళమై కాటేసి వదిలిపెడుతుందని.

    వైపర్ నిశితంగా చూస్తూంది. తలపైకెత్తి చూస్తూనే.

    సత్తువ సన్నగిల్లిపోతున్న సబిత ఇక నేలపై తూలిపడబోతూంది.

    సరిగ్గా అప్పుడు లోపలికిదూసుకొచ్చాడో వ్యక్తి. నిజానికి అతడు అప్పటిదాకా సినిమా చూసిన ప్రేక్షకుడుకాదు. రోడ్డుపై వెళుతూ జరిగింది విన్నవాడు. అందరిలా అతడు సంకోచించలేదు. ఉద్వేగంగా లోనికి అడుగుపెట్టాడు. లల్లీని ఒడిలోకి తీసుకున్నాడు. సబితకొక అన్నలా ఆసరా ఇచ్చాడు.

    అబ్బురంగా చూస్తున్న అందరి మధ్యనుంచి అలా వచ్చిన వ్యక్తి నిన్నమొన్నటిదాకా పాముల్నేతప్ప ప్రపంచంలో అంతగా బాంధవ్యం పెంచుకోని జయేంద్ర.


                         *    *    *    *


    ఉస్మానియా హాస్పటల్ లో ఆ సాయంకాలం జనంతో కిక్కిరిసి పోయింది.

    సుమారు పదహారుమంది థియేటర్ లో పాము కాటుకి గురై ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో అయిదుగురు పసిపిల్లలు వృద్ధులు థియేటర్ లో తొక్కిసలాటలోనే ప్రాణాలు వదిలారు. శవాల్ని మార్చ్యురీకి తరలిస్తున్న హాస్పిటల్ సిబ్బంది ఒకవేపు జనం రద్దీని నియంత్రించే పోలీసు సిబ్బంది మరోవేపు ఇక్కడి వివరాల్ని సేకరించే ప్రయత్నంగా పత్రికా విలేఖర్లు ఇంకోపక్క చాలా హడావుడిగా వున్నారు.

    అప్పటికే డిజిపి హోంమినిష్టరుతోబాటు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ ప్రతిపక్ష నాయకుడు అక్కడే దుయ్యబడుతుంటే జనం రియాక్టవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

    మొహంచెల్లని ముఖ్యమంత్రి సెక్రెటేరియట్ లోని తన ఛాంబర్ నుంచి నిముషానికోసారి హాస్పటల్ కి ఫోన్ చేయించి మొత్తం కేజువాలిటీస్ ని లెక్క చేస్తున్నాడు.

    సరిగ్గా ఆరుంపావు ప్రాంతంలో అక్కడికి వచ్చాడు డిజిపి ప్రసన్న...

    అతడి మొహంలో నెత్తురు చుక్కలేదు. లల్లీకోసం ఇంటికి వెళ్ళిన ప్రసన్నకి ఓ పదినిముషాల క్రితమే తెలిసింది అతడి భార్య పాముకాటుతో హాస్పటల్ లో అడ్మిట్ చేయబడిందని.

    జనం మధ్యనుంచి లోనికి వెళుతూ చూసాడు జయేంద్రని. అతడి చేతిలో వున్న లల్లీని.

    అప్పటిదాకా వెక్కిపడుతున్న లల్లీ తండ్రిని చూడగానే "డాడీ" అంటూ పిలిచింది.

    ఒక్క ఉదుటున తండ్రి గుండెలపై వాలి "అమ్మని పాము కరిచేసింది డాడీ" అంటూ భోరున ఏడ్చేసింది.

    డిజిపి చేయి తన భుజంపై పడినా పట్టించుకునే స్థితిలోలేడు ప్రసన్న. నిశ్శబ్దంగా ఓ స్వప్నంలోలా లోపలికి నడిచాడు లల్లీతో సహా. అక్కడ ఓ వార్డులో పడుకుని వున్న వ్యక్తులందరికీ డాక్టరు ప్రధమ చికిత్సతోబాటు ఏంటీవీనమ్ సీరమ్ ఇంజక్ట్ చేస్తున్నారు.

    నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సబిత వున్న బెడ్ ని చేరుకున్నాడు.

    సబిత స్పృహలో లేదు. సన్నని నురుగు ఆమె పెదవుల మధ్య నుంచి స్రవిస్తూంది విషం రక్తంలో కలిసిన సూచనగా...

    "డాడీ...మమ్మీ...పాము" లల్లీ ఏడుపు ఉధృతమైంది. "మమ్మీకేమౌతుంది డాడీ?"

    తనకే తెలీని జవాబుని నిలదీసి మరీ అడుగుతుంది లల్లీ.

    "మమ్మీ కావాలి డాడీ" లల్లీ అతడి చెంపల్ని పట్టుకుని కుదిపేస్తూంది.     

 Previous Page Next Page