గిరిజ వంటిచుట్టూ పెళ్ళిబట్టలు.
సరోజ వంటిమీద పెళ్ళికోసం కొనుక్కున్న కొత్తబట్టలు.
గిరిజ ముఖంలో దుఃఖానికి పూసిన రంగులు.
సరోజముఖంలో రంగులులేని దుఃఖం.
చిక్కినా అర్ధంలేని పెళ్ళికళతో నిండుగా భ్రమ కలిగించే గిరిజ.
చూపరులకు నిజరూపం దాచలేక బయటపడిపోతున్న సరోజ.
గిరిజను చూసి సరోజ నవ్వింది.
జీవంలేని ఆ నవ్వుచూసి గిరిజ ఏడుపునాపుకుంది.
"పదవే" అంటూ సరోజ చెయ్యిపట్టుకుని పైకి తీసుకెళ్ళింది. తెల్లటి దుప్పటి పరిచిన మంచంమీద ఇద్దరు ప్రక్కప్రక్కన కూర్చున్నారు.
"చెప్పవే" అంది గిరిజ.
"నా పెళ్ళి ఆగిపోయింది."
'నాపెళ్ళి అయిపోతోంది' అనుకుంది గిరిజ. "మునుపే అర్ధమయింది."
సరోజ మాట్లాడకుండా తలవంచుకు కూర్చుంది.
"రాస్తానన్నది రాశాడా?"
"రాశాడు."
"ఏమిటిట?"
సరోజ తలెత్తి గిరిజ కళ్ళలోకి చూసింది. సరోజ చూపులో సందేహం, గిరిజకళ్ళలో ఆతురత- సరోజకు ఎలా చెప్పాలా అనీ, గిరిజకు ఎక్కడ వినలేకపోతానో అనీ.
ఒక్కనిముషం అలా చూసి మాట తప్పించేసింది. "నీ పెళ్ళికి రాలేనేమో అనుకున్నాను, రాగలుగుతున్నాను."
"నా పెళ్ళికి నువ్వు రావేమోనని సందేహించాను. ఇప్పుడు మహా చిరాగ్గా వుంది. అదిసరే, మాట తప్పించకు ఏం రాశాడు?"
"చాలా రాశాడు. నాకేం అర్ధంకాలేదు. ఒకటి తప్పు పెళ్ళి చేసుకోనని."
"అదే ఎందుకని?"
"అదే అర్ధం కాలేదు."
"నువ్వు నిజం చెప్పటంకాదు" గిరిజ అనుమానంగా, నిష్టూరంగా అంది.
"నిజం ఏమిటేమిటో రాశాడు. నాకు చదువుతుంటే భయం వేసింది. మరో ఒకటి రెండుసార్లు చదివితే అర్ధమయ్యేదేమో అంత ధైర్యంలేకపోయింది. నాకు కావలసిన విషయం తెలిసిపోయింది కదా! నన్ను పెళ్ళి చేసుకోడు."
గిరిజకు అంతకంటే తర్కించాలంటే భయంవేసింది. సరోజ ఏదో రహస్యం తనదగ్గర్నుంచి దాస్తోందన్న సంగతి తెలుస్తూనే వుంది. దాచవలసిన అవసరం ఏమిటో మాత్రం బోధపడలేదు. క్రిష్ణకిషోర్, తాను అంతరంగికంగా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామేమో అనుకుంది. ఎటొచ్చీ తనబాద సరోజకు తెలియదు. తాను చాలా సంతోషంగా వున్నదనుకుంటుంది. తన బాధ చెప్పుకునేస్థితిలో కూడా తనులేదు. ఎందుకంటే అదేమిటో తనకే స్పష్టంగా తెలియదు ఏదో గందరగోళం ఏర్పడుతుంది.
అది ఏ రూపం ధరిస్తోందో ఆగమ్యగోచరంగా వుంది.
"ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?"
గిరిజ నవ్వింది. అందులో జీవం లేకపోవటం యిప్పుడామె వంతయింది.
5
పెళ్ళయిపోయింది.
"నేనిప్పుడు బావకు భార్యను" అని ఆశ్చర్యపోయింది గిరిజ.
"ఇంకా ఏమి కానున్నానో?" అనికూడా విస్తుపోయింది.
వచ్చిన చుట్టాలంతా నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోయారు. పనిపాటలు లేనివాళ్ళు, వచ్చిన చోటునుంచి తొందరగా కదలవలసిన అలవాటు లేనివాళ్ళు మాత్రం దిగబడిపోయారు.
సుందరానికి ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహంగా వుంది. అతనికళ్ళకి గిరిజ మునుపటికన్నా అందంగా, కొత్తగా, కవ్వింపుగా కనబడింది.
అవటానికి మరదలుపిల్లే అయినా యిప్పుడు భార్య వింతగా అనిపిస్తోంది.
సమయం చూసి పలకరించటానికీ, మాటలు కలపటానికి అతను తహ తహలాడుతున్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా "బేబీ! బేబీ!" అంటూ కూడా కూడా తిరుగుతున్నాడు.
ఓసారి మేడమీద గదిలో ఒంటరిగా దొరికింది. అప్పుడే స్నానం చేసివచ్చి, తన గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసుకుని చీరె మార్చుకుంటోంది.
లోపల ఆమె ఏంచేస్తోందో తెలియని సుందరం తలుపులు త్రోసుకుని గభాలున వచ్చాడు.
గిరిజ ఉలిక్కిపడి చప్పున పమిట హృదయంనిండా కప్పుకుని 'ఛీ, ఏమిటిది?' అంది తొట్రుపాటుతో.
ఆమె వున్న పరిస్థితికి సుందరానికి కొంచెం భయమనిపించినా అక్కడ నుంచి వెళ్ళలేకపోయాడు.
"ఏం తప్పా?" అన్నాడు అడుగులు ముందుకు వేస్తూ.
"వద్దు, రాకు ఎవరన్నా చూస్తే బాగుందదు."
అయినా అతను వెనక్కి వెళ్ళలేకపోయాడు. ఆమెకు దగ్గర దగ్గరే వుండాలనీ, ఆమెచుట్టూ తిరగాలీ అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. చెయ్యిజాపితే ఆమె దొరికేటంత దూరంలోకి వచ్చేశాడు. అప్పుడే తలారా స్నానంచేసి వచ్చిందేమో, తడిసి, విరబోసి వున్న ఆమెజుట్టు, తెల్లగా మెరిసే నీటిబిందువుల్తో నిండివున్న శరీరం మీదనుంచి సాగివచ్చే వింత పరిమళం- ఈ అనుభవం మత్తుగా, మధురంగా వుంది. అతనిలోని ప్రతి అణువూ, ఆమెను ఎంతగానో కోరుకుంటున్నది.
"ఇప్పుడు నన్ను చూస్తే ఏమనిపిస్తోంది?" అన్నాడు చలించే కంఠంతో.
"నాకేమీ అనిపించటంలేదు" అంది గిరిజ.