అతని ముఖం ఎర్రబడిపోతోంది. మాట తడబడిపోతోంది. ఇదంతా చూస్తే తనకు చెప్పకుండా ముందే కొంచెం పుచ్చుకున్నాడేమో ననిపించింది చక్రపాణికి. అసలా బుడ్డిని చూస్తుంటేనే అతనికి ప్రేలాపన పుట్టించిందేమో ననిపించింది.
వీళ్ళు చేస్తున్న ఈ ఘనకార్యం చూడటానికి పాపం ముకుందం ఇక్కడలేడు. పోనీ భయటెక్కడో చల్లగాలి పీలుస్తున్నాడనుకొని చక్రపాణి తృప్తిపడ్డాడు.
సీసా పైకెత్తి గాలిలో పట్టుకున్నాడు చక్రపాణి.
ఇద్దరూ దానికేసి మళ్ళీ వింతగా చూశారు. పాణిలో కొంచెం స్వార్థం పనిచేసింది. ఇది చేయిజారి క్రిందపడి పగిలిపోతే బాగుండుననుకున్నాడు. మెల్లిగా బిరడా లాగేశాడు. అతని వణుకుతోన్న చేతుల్ని చూసి సిగ్గులేక బ్రహ్మానందం తన వణుకుతోన్న పెదాల్తో నవ్వుతున్నాడు. పాణికి ఒక్కసారిగా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. గ్లాసులో చెరిసగంపోసి గబగబా సోడా పోసేశాడు. ఇద్దరూ గ్లాసులు తాకించి "ఫర్ ది హెల్త్ ఆఫ్ యు" అనుకున్నారు.
పాణి ఒక గ్రుక్క తాగాడు.
నెత్తురు తాగినట్లుగా వుంది. కుంకుడుకాయరసంలో స్పిరిట్ పోసి తాగినట్లుగా వుంది. మలేరియా జ్వరానికి మందుతాగినట్లుగా వుంది. పంచదారపాకంలో విషం పోసుకుని తాగినట్లుగా వుంది.
ఒక చాక్ లెట్ మింగాడు.
తరువాత క్రమంగా పది చాక్ లెట్లు మింగాడు.
రెండుగ్లాసులూ బల్లమీద దూరదూరంగా నిలబడ్డాయి. బ్రహ్మానందం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. తూలుతూ అటూ ఇటూ నడిచాడు. పాణికూడా లేచి నిలబడ్డాడు. నడిచాడుగాని తూలుడేం లేదు. కాని ఎక్కడోవున్నట్లుగా వుంది. కలలో నిద్రలేచి నడుస్తున్నట్లుగా వుంది. అతను నటిస్తున్నాడని తోచింది.
"అరే పాణీ! జయించేస్తాను ప్రపంచాన్ని, ప్రేమించేస్తాను అందర్నీ, తోమించేస్తాను వీపుల్ని" అన్నాడు బ్రహ్మానందం ముందుకువస్తూ.
"బ్రహ్మం!" అన్నాడు చక్రపాణి కసిగా. "పిచ్చి పిచ్చి వేషాలెయ్యక. నీకు నిషా ఎక్కలేదు. నాకు తెలుసు. కుదురుగా కూర్చో."
"అరే పాణీ!" అన్నాడు తను మళ్ళీ. "మజాగా వుందిరా. మజారా ! చూడరా నా కుడికాలు ఎలా తూలుతోందో, ఎడంకాలుకి ఇంకా ఎక్కలేదు. అరేయ్! మనం జన్మలో మన ఇళ్ళకి పోవద్దు. 'ఎనక జన్మలో ఎవరమో అంటి... సిగ్గొచ్చి నవ్వింది సిలక నా ఎంకి!' నువ్వు ఎంకివి, నేను నాయుడుబావను. ఇక్కడనే మజా చేసుకుంటూ నువ్వూ నేనూ లవ్ చేసుకుందాం" అంటూ అతన్ని బిగియార కౌగలించుకున్నాడు.
ఇష్టంలేని ఆడదాని కౌగిలికూడా ఇలాగే వుంటుందా? అతను అసహ్యంతో ఒక్కతోపు తోశాడు. "వెర్రివేషాలేయొద్దని చెప్పాను. గొడవ చేయకుండా పడుకో" అన్నాడు.
"అమ్మో! ఆకలి! గుండెల్లో భగ్గుభగ్గు మంటోంది" అన్నాడు బ్రహ్మానందం.
అతను ఉడకబెట్టిన కోడిగ్రుడ్డును గబగబా నోట్లో కుక్కుకుని తినసాగాడు. ఒకటి స్నేహితుడి కాళ్ళదగ్గర పడేటట్లు విసిరేశాడు. పాణికేం ఆకలి లేదు. కాలితో అవతలకు తన్నేశాడు.
ఒకసారి వంటిమీద చేయివేసి చూసుకున్నాడు. జ్వరం వచ్చినట్లుగా అనుభూతి. కలలో లేచి తిరుగుతున్నట్లుగా వుంది. ఇక్కడ చచ్చి ఎక్కడో బ్రతికినట్లుగా వుంది. మెల్లిగా మంచంమీదకు చేరి పడుకున్నాడు. బ్రహ్మానందం తూలుతూ అటూ ఇటూ తిరుగుతూ ఏదో మాట్లాడుకుంటూ వున్నాడు.
మరునాడు చక్రపాణికి నిద్ర మెలకువ వచ్చేసరికి ఎండబాగా మీదికి వచ్చింది. కిటికీలోంచి ఎండ ముఖంమీదకు పడేసరికి ఉలికిపడి లేచి కూర్చున్నాడు. బ్రహ్మానందం ఇంకా నిద్రపోతున్నాడు. ముకుందం అప్పుడే స్నానంచేసి బయటకు వెళ్ళిపోయినట్లున్నాడు. మంచంమీదే బద్ధకంగా కూర్చుని రాత్రి జరిగిన విషయాన్నిగురించి ఆలోచించసాగాడు.
అన్నీ పీడకలలు. నిద్రలో గొంతు ఎవరో పిసుకుతున్నట్లుంది. కన్నీళ్ళు కారేవుంటాయి. అతనికి ఎందుకో నవ్వు వచ్చింది. లేచి అద్దంలో ముఖం చూసుకున్నాడు. తనముఖం లేతగా, సుకుమారంగా, మనోహరంగా గోచరించింది. ఇతరుల్ని ఆకర్షించేది ఇందులో ఏమైనా వుందా? తను ఆలోచించడం మానివెయ్యాలి. మనసుకు కష్టం కలిగించే ఏ అంశాన్ని గురించీ మధనపడకూడదు. అసలు ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు నవ్వగలగటం. చేతనైతే ధన్య్దుడు. చిరునవ్వు...! తన మందహాసం ఏమయినా రహస్యాలను వెల్లడిచేస్తుందా? అది ముగ్థమోహనంగా, హాయిగా వుండటానికి కారణం దాన్లోని లోతా? లోతు లేకపోవటమా? అసలు ఒక మనిషి నవ్వునుబట్టి అతని గుణగణాల్ని లెక్కకట్టవచ్చు. బ్రహ్మానందం నవ్వితే ఏదో గుండెలో గుచ్చుకున్నట్లుగా వుంటుంది. అందులో సుఖంలేదుగాని, మనిషికి గాలం వేసనట్లు చిత్రమైన అవస్థ.
అతను ముఖం కడుక్కుని కాఫీకి బయల్దేరాడు. తాను ఇల్లు వదిలి వచ్చి రెండునెలలు దాటింది. క్రొత్తయినా ఎందుకో ఇంటికి పోవాలనిపించటం లేదు. నాన్న ఓసారి రమ్మని అదేపనిగా ఉత్తరాలు రాస్తున్నారు. అమ్మకి తను కలలో కనిపిస్తున్నాడట. అతనికి కళ్ళలో నీళ్ళు నిండాయి. తాను పెరిగి పెద్దవాడు కాకుండావుంటే బాగుండేది. తల్లి ప్రేమ ఎంత సుఖమయినదో అంత దుఃఖానికి హేతువుకూడా. లేకపోతే ఇప్పుడెందుకీ కన్నీళ్ళు? అతిప్రేమలోనే అత్యంతసుఖంలోనే మెత్తగానే విషాదం మిళితమై వుంటుంది. అసలు ఈ చదువు, అభివృద్ధి, విజ్ఞానం, అనుభవం, వ్యక్తిత్వం, అంతస్థు ఇవన్నీ మానవుణ్ని ఇరుకున పడవేయటానికేనేమో. ఏది ఏమయినా ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం. అసలు ఓ సత్యానికి విశ్వజనీనత ఆపాదించటం కష్టం. అది ఒక అవస్థలో వున్నవాడికే - పోనీ ఓ వర్గపు మనస్తత్వం గల వ్యక్తికే తులతూగుతుంది.