Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 14

    "చెప్పలేను. సాగర్ కు  అతన్ని చంపటానికి  మోటివ్ లేదు. నాకు తెలిసినంతవరకూ  వాళ్ళు  స్నేహితులు మాత్రమే. అయినా....ఏమో నా కళ్ళతోటయితే  చూడలేదు. శేఖరాన్ని చూడగానే నేననుకొన్నది  అతను ఆత్మహత్య  చేసుకున్నాడనే"

    "మీ పెళ్ళి విషయం అతన్ని ఆత్మహత్య చేసుకునేటంత బాధించి వుంటుందంటారా ?"

    "ఆవకాశం వుంది. అతనికి  నేనంటే చాలా అభిమానం. కానీ నాకే ఆ ఉద్దేశ్యం కలగలేదెప్పుడూ. ఆ విషయమే నాతో మాట్లాడాలనుకుని  వుంటాడు.  కాని ప్రయోజనం  వుండదని  అనిపించిందేమో ! తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడేమో !"

    "సరే మేడం - మీరు వెళ్ళవచ్చు"

    "ఒక్క విషయం. ఈ విషయం  నేను మా పై అధికారులకు తెలుపవలసి వుంటుంది. బహుశా ప్రెస్ కివ్వడానికి  వాళ్ళు అభ్యంతరం చెప్పవచ్చు"

    "సరే మీరు ఫోన్ చేయండి. చూద్దాం" ఆమె వెళ్ళిపోయేక  సాగర్ నీ ఇంటరాగేట్ చేయటం ప్రారంభించాడు ఇన్ స్పెక్టర్.

    సోమశేఖరం ఒక్కడే  తోటలో వున్నాడని  మాట్లాడి  వద్దామని వెళ్ళాను. వెంటనే అతను కనిపించలేదు. అక్కడ పెద్ద  పందిరి వుంది అడ్డంగా. అటువైపు  వెళ్ళి చూద్దామనుకునేటంతలో  శబ్దం  వినిపించింది" అన్నాడు.

    "ఇది హత్య అనీ, మీరే చేసి వుండవచ్చుననీ  హిమజగారి అభిప్రాయం, మీరేమంటారు?" తీవ్రంగా  అడిగాడు ఇన్ స్పెక్టర్.

    "తను పొరబడుతున్నదంటాను. నాకు హత్యచేయాల్సిన అవసరం లేదు"

    "అది తర్వాత రుజువవ్వాలి. మిమ్మల్ని అరెస్టు  చేస్తున్నాను"

    సాగర్ ఆ మాటలకి నవ్వాడు. "మీరెనాళ్ళ నుండి సర్వీసులో వున్నారు ఇన్ స్పెక్టర్ ?" అని అడిగాడు.

    ఇన్ స్పెక్టర్ మొహం  జేవురించింది. "వాడ్డూయు మీన్ బై దట్ ?" అన్నాడు.

    "ఇంకా ప్రిలిమినరీ  ఇంటరాగేషన్ పూర్తవలేదు. ఫింగర్ ప్రింట్స్ రాలేదు. హత్యో, ఆత్మహత్యో తెలీదు. మోటివ్స్ (హత్యకుగల కారణాలు తెలీదు. ఎవరో ఒక సాక్షి - అదీ భయంతో బెదిరిపోయిన అమ్మాయి ఇచ్చింది సాక్ష్యం ఆధారంగా నన్ను  అరెస్టు చేస్తున్నానంటున్నారు. కేవలం నేనా ప్రదేశంలో  అందరికన్నా  ముందు వుండటం  తప్ప ఇంకేం ఆధారం వుంది మీకు?"

    "అవన్నీ  రేపు  కోర్టులో  చెప్పుకోండి"

    సాగర్ మళ్ళీ నవ్వాడు.

    "హతుడి వీపు గుండా  గుండు దూసుకుపోయింది. ఆత్మహత్య చేసుకునేవాడు వీపుమీద  పిస్తోలు  పెట్టుకొని  చేసుకోడు" ఇన్ స్పెక్టర్ అన్నాడు.

    "వీపు గుండా కాదు. ఛాతీ గుండా దూసుకుపోయి వీపులోంచి  బయటకొచ్చింది. మీ ఫోటోగ్రాఫర్స్ ఇంకా అక్కడే వున్నారు. వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించండి"

    ఇన్ స్పెక్టర్ మొహంలో  నవ్వు కొద్దిగా తగ్గింది.

    "అక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరు !"

    "అయుండవచ్చు. అందుకే ఇది ఆత్మహత్య అని నేను అభిప్రాయపడుతున్నాను. ఏమో చెప్పలేం. ఆధునిక మారణాయుధాలు వచ్చాక ఏ రేంజిలో  పిస్తోలు పేలింది కూడా చెప్పలేక పోతున్నాం"

    "అంటే టెలిస్కోప్ గన్ కి అమర్చి ప్రహరీ అవతల్నుంచి  పేల్చారంటారా ?"

    "అది తెల్సుకోవాల్సింది మీరు. కానీ నేననుకొనేది అతడు ఆత్మహత్య చేసుకున్నాడని. ఎందుకో అతడిని చూడగానే అతడో ద్వంద్వ ప్రవృత్తి వున్న మనిషి అనిపించింది. పైకి ఎంతో మెటీరియలిస్టుగా కనిపించినా, మనసులో చాలా సున్నితమైన మనిషి  అని నాకు తోచింది. పద్మజ అతడిని నిరాకరించటం అతడికి గొప్ప  షాక్."

    "ఆత్మహత్య చేసుకొనేటంతా ?"

    "అయ్యుండవచ్చు. మనుష్యులు  ఆత్మహత్య  చేసుకోవటానికి పెద్ద పెద్ద కారణాలు అవసరంలేదు ఇనస్పెక్టర్. ప్రేమ నిరాకరింపబడటం  వంటి చిన్న కారణం చాలు."

    "మీరెవరు?"

    సాగర్ లేచి, తలుపు లాక్ చేసి ఇనస్పెక్టర్ దగ్గిరగా వచ్చి జేబు లోంచి  కార్డుతీసి చూపించాడు.

    కూర్చున్నవాడు కాస్తా లేచి నిలబడ్డాడు ఇనస్పెక్టర్.

    "సారీ సర్! మీరేదో కార్పొరేషన్ లో పని చేస్తున్నారని హిమజ అన్నారు."

    "అవును. వాళ్ళకీ  తెలియదింతవరకూ. ఇవ్వాళో రేపో హిమజకి  చెప్తాను."

    "ఇప్పుడూ డ్యూటీలో ఉన్నారా ?"
   
    "లేదు. హిమజ నా ఫ్రెండు. మేం త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం. ఈ విషయం ఆమెకు కూడా తెలియనివ్వకండి అప్పటివరకూ!"


                         *    *    *


    శివయ్య ట్రేలో  కాఫీ కప్పులు పెట్టి తెచ్చాడు. రాత్రి రెండవుతోంది. పోలీసులు తమ కార్యక్రమం పూర్తిచేసుకుని వెళ్ళాక అందరూ శేఖరం ఇంటికివెళ్ళి వాళ్ళమ్మకు  వార్త వినిపించారు ఆవిడ కుప్పకూలింది. ఆవిణ్ణి బలవంతంగా యింటికి తీసుకువచ్చి  డాక్టర్ తో ఒక కంపోజ్ ఇంజక్షన్  యిప్పించాక  పడుకుంది. ప్రకాశరావుగారు  అప్పటిదాకా ఉండి అప్పుడే వెళ్ళారు. గిరి ఊళ్ళో లేడు.

    నిద్రపట్టక  అందరూ హాల్లోనే కూర్చున్నారు.

    "అయితే శేఖరం ఆత్మహత్య చేసుకున్నాడంటావా?" బాధగా అంది హిమజ.

    "చెప్పలేము. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు  యింకా మాట్లాడాలనుకుండేవాడు గాదు. నాకు తెలిసినంత వరకు శేఖరం అలాంటి వాడు కాడు. ఒకవేళ  అలాంటి ఉద్దేశ్యం ఉన్నా ఇక్కడా పని చేసేవాడు కాడు. వాళ్ళింటికి వెళ్ళి నోటు వ్రాసి పెట్టి మరీ చేసేవాడు. అందులో అతనికి తల్లంటే ప్రాణం. ఆవిడకోసమైనా  తను బ్రతకాలని నిశ్చయించుకునేవాడు. ఇదంతా తార్కికంగా  ఆలోచిస్తే తోచేది. మనిషి చేతలకు తర్కానికీ పొత్తు కుదరదు ఒకోసారి. మీరేమంటారు?" పద్మజని  అడిగాడు సాగర్.

 Previous Page Next Page