"మీరు సరోజకు బెస్ట్ ఫ్రెండ్ కదూ?"
ఈ గొంతు గ్రుచ్చుకున్నట్లు వినిపించి ఉలిక్కిపడి అతనివంక చూసింది.
"చెప్పండి" అన్నట్లు చూస్తూన్నాడు.
ఏం చెయ్యాలో తెలీక భయం భయంగా తలవూపింది.
"మీ యిద్దరిమధ్యా రహస్యాలు లేవుకదూ?"
అతను మామూలుగా అడుగుతున్నట్లు లేదు. ఏదో గొప్పవిషయం మహత్తర మైన సంగతి చెప్పటానికి నాందీప్రస్తావనం చేస్తున్నట్లు తోచింది.
అవునన్నట్లు తలాడించింది మళ్ళీ.
"మీ యిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు కదూ?"
"ఇదేమిటి బాబూ ఈ గొడవ?" అనుకుంది బెదిరిపోయి నేరకపోయివచ్చానా, అని పశ్చాత్తాపపడుతోంది.
"మీవల్ల నాకో సాయం కావాలి."
ఈసారి హడలిపోయింది.
"సరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. నన్ను చూస్తేనే మైకంలో పడినట్లయి పోతుంది. పిచ్చిపిల్ల! సరూ అంటే నాకూ యిష్టమే కానీ...ఆమెను పెళ్ళి చేసుకోవటం నాకిష్టంలేదు."
తను కూర్చున్న సోఫా కదిలిపోతున్నట్లనిపించింది. కళ్ళముందు చీకట్లు చీకట్లుగా అయింది.
"ఎందుకని?" అనడిగింది శక్తినంతా కూడదీసుకొని.
"ఎందుకంటే... మైగాడ్! మీకు చెప్పకూడదు. మీకసలే చెప్పకూడదు" అతనేదో అర్ధం చేసుకొన్నట్లు చెబుతున్నాడు.
గిరిజకు అయోమయం పడిపోతున్నట్లనిపించింది. అంతలోనే కోపం వచ్చింది. "ఎందుకని చెప్పకూడదు? నాతో ఎందుకు చెప్పకూడదు?" అనేసింది గట్టిగా.
ఆమెతో ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు అతను పశ్చాత్తాపపడుతున్నాడా అనిపించింది.
"వద్దులెండి ఆ విషయం. సరూతో ఈ పెళ్ళి నాకిష్టంలేదని చెప్పండి చాలు."
"మీరే ఎందుకు చెప్పకూడదు?"
"చెప్పవచ్చు కాని సరోజ వూహాలోకాల్లో చాలా ముందుకెళ్ళిపోయింది. నా నోటినుంచి ఈ విషయం వింటే ఆమె ఈ షాక్ తట్టుకోకపోవచ్చు. అక్కడ మావాళ్ళూ అర్ధం చేసుకొనేటట్లు లేరు. అందుకని సరోజకు చెప్పి ఒప్పిద్దామని ఈ ఊరికి వచ్చాను. కానీ నావల్ల కావటంలేదు. ఆమె యీవేళ పెళ్ళి శుభలేఖలు సెలక్ట్ చేద్దామంటోంది."
"ఆమె బాధ అంతగా అర్ధం చేసుకొన్నాప్పుడు పెళ్ళి చేసుకొంటేనేం?"
"నోనో! నావల్లకాదు" అతనిముఖంలో విపరీతమైన భయం కనిపించింది.
"ఎందుకని?"
"అదే మీకు చెప్పకూడదు. మీకు చెప్పలేను."
"బాగుంది మీ మనస్సులో వున్నది నాకు చెప్పరుగానీ, మీరు దాన్ని పెళ్ళి చేసుకోవటల్లేదన్న సంగతి నావల్ల జరగాలి."
"అవును మీరీ బాధ్యత స్వీకరించాలి" అతడాశగా అన్నాడు.
"నేనీ బాధ్యత స్వీకరించను" గిరిజ నిష్కర్షగా అంది.. "మీరు విద్యాధికులు. డాక్టరు వృత్తిచేస్తున్నారు. ఆడదాన్ని కన్విన్స్ చేసే శక్తి మీకు లేకపోతే నాకంతకన్నా లేదు."
"ఏమిటి మాట్లాడుకొంటున్నారు?" అంటూ సరోజ చీరె పట్టుకొని లోపలకు వచ్చింది.
క్రిష్ణకిషోర్ వెంటనే ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. "ఇద్దరు మనుషులు ఎదురెదురుగా వుండి మాట్లాడుకోకుండా విగ్రహాల్లా కూర్చుంటే బాగుండదుగా, అందుకని" అన్నాడు.
'నటన ఎంత తప్పనిసరి?' అనుకుంది గిరిజ.
సరోజ స్నేహితురాలి ప్రక్కకు వచ్చి కూర్చుంది "చూడవే" అంటూ.
* * *
చుట్టాలొక్కొక్కరూ వచ్చేస్తున్నారు. వైకుంఠంగారు ముందుగానే వచ్చేశారు. అనసూయమ్మగారితోపాటు కోడళ్ళంతా చకచక పనులు చేసేస్తున్నారు, ఒక్క సామ్రాజ్యం మినహా.
గిరిజకు తన సంగతలా వుంచి సరోజగురించి ఆలోచన లేక్కువగా అలుముకుంటున్నాయి. క్రిష్ణకిషోర్ ఆమెను పిచ్చిపిల్ల అన్నాడు. నిజమే పిచ్చిపిల్ల. ఆశలు అవధులులేకుండా పెంచుకుంటోంది. ఒక్కొక్క రోజు గడుస్తూన్నకొద్దీ గిరిజ నిస్సత్తువ పెరుగుతున్నట్లనిపించింది. సరోజకి ఈ విషయం తెలిసిందా? ఈపాటికి తెలిసి వుంటుందా? ఎప్పుడు తెలుస్తుంది. లేకపోతే క్రిష్ణకిషోర్ మనసు మార్చుకున్నాడా? కాని అతని వైఖరిచూస్తే మార్చుకునేలా కనబడటం లేదు.
ఓ సాయంత్రం సరోజ వచ్చింది. ఆమె లోపలకడుగు పెడుతుంటే ఆమె ముఖంవంక ఆతృతగా పరీక్షగా చూసింది గిరిజ. తాననుకున్న బాధ కనిపించలేదుగాని, ఏదో అస్పష్టత గోచరించింది.
"పైకి వెడదాం రా" అని చెయ్యి పట్టుకుని మేడమీద గదిలోకి తీసుకెళ్ళింది.
సరోజ ఏవేవో కబుర్లు చెబుతూ కూర్చుందిగాని, ఎంతకూ గిరిజ అనుకున్న ప్రసక్తి తీసుకురాలేదు.
చివరకు వుండబట్టలేక గిరిజే అడిగింది. "మీ బావ వున్నాడా?"
"వెళ్ళిపోయాడు" అంది సరోజ "గిరిజా! నీకోసంగతి చెప్పాలి."
గిరిజ గుండె గబగబా కొట్టుకుంది ఆమె తనకు విపరీతమైనదేదో చెప్పబోతుంది. తట్టుకుంటుందా తను? అసలు సరోజ మామూలుగా ఎలా వుండగలిగింది?
"బావలో ఏదో మార్పు వచ్చినట్లు కనబడుతోంది గిరిజా"
అయితే అతనింకా ఆమెకేమీ చెప్పలేదా?
"వాళ్ళ పెద్దవాళ్ళూ, మా వాళ్ళూ అంతా అన్నీ నిర్ణయించుకోవటం ముహూర్తం నిర్ణయించటం ఇవన్నీ నీకు తెలుసు. పెళ్ళి ప్రసక్తి రానంతవరకు ఎంతో సరదాగా, చనువుగా మాట్లాడతాడు. మా అమ్మో, నేనో ఆ ప్రమేయం తీసుకురాగానే అమాంతం బిగుసుకుపోతాడు. ఏదో చెప్పాలని తారట్లాడు తున్నట్లనిపిస్తుంది, చెప్పడు శుభలేఖలకై కార్ద్సు సెలెక్ట్ చేద్దామని ఎన్నోసార్లు బయటకు తీసుకెళ్ళటానికి ప్రయత్నించాను. ఉలకడు, పలకడు. ఒకవైపు ముహూర్తం ముందుకొచ్చేస్తుంది. ఉన్నట్లుండి వూరెళ్ళిపోయాడు" సరోజ ముఖంలో కలవరపాటు, గొంతులో తడబాటు!