Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 14


    చివరకు ఆమె అంగీకరించింది. "థాంక్స్. మీకు చాలా శ్రమ యిస్తున్నాను." అంది మృదువుగా. సూటుకేసు పట్టుకుని గదిలోపలకు నడిచింది. తర్వాత గదితలుపు గడియపెట్టి దుస్తులు మార్చుకుంది. తల శుభ్రంగా తుడుచుకుని జుట్టు అలా వదిలేసింది. తెల్లటి బట్టలు, ఆ రూపంతో ఆమె తిరిగి తలుపులు తెరిచేసరికి ఓ దివ్యకన్య సాక్షాత్కరించినట్లయింది. వెచ్చటి పరిమళం వ్యాపించినట్లయింది. మృదుసుగంధం వీచినట్లయింది.
    బయటకువచ్చి వసారా అంచున అతనికి చేరువగ నిలబడి "వర్షాలు ఎక్కువగా రాత్రుళ్ళే కురుస్తాయి కదండీ!" అది ప్రకృతిలోకి తిలకిస్తూ.
    "అవును" అన్నాడతను విస్మయపడుతూ.
    "మీకు వానలో తడవడం యిష్టమేనా?" అని అడిగింది కొంచమాగి.
    అతనికి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. "అంత యిష్టమూలేదు. అయిష్టమూలేదు" అన్నాడు ఆలోచించి.
    "చాలా బాగుంటుంది వర్షంలో తడుస్తూంటే, కాని యీ నాగరికత ప్రపంచంలో మన యిష్టం వచ్చినట్లు మనం సంచరించటానికి వీల్లేదు. ప్రతిదానికీ అడ్డు, సంకోచం, వాళ్ళు నవ్వుతారనీ, వీళ్ళు మందలిస్తారనీ ఏవేవో అభ్యంతరాలు. స్త్రీలు ఎగతాళి చేస్తారు. పెద్దమనుషులు 'నీమంచి కోసమే'నంటూ సలహాలు చెబుతారు. రౌడీలు ఏడిపిస్తారు."
    రౌడీలు అన్నపదం తనకోసమే వాడిందన్న అనుమానం అతనికి గుచ్చుకుంది. ఆమెవంక పరిశీలనగా చూశాడు. కాని ఆమె యిటువైపు చూడటం లేదు.
    "పువ్వులు తడిసినప్పుడు వచ్చే సువాసన విచిత్రపు మత్తుని కలిగిస్తుంది. గమనించారా?" అంది ఓ నిముషం గడిచాక.
    చచ్చాం. ఈవిడ సౌందర్యోపాసకురాలిలా వుంది. ఇప్పుడు చర్చగనక మొదలుపెడితే తను శ్రోతగా వుండటానికి తప్ప ఎందుకూ పనికిరాడు. "మరే" అన్నాడు గత్యంతరంలేక.
    "కొన్ని పువ్వులు మెత్తగా వుంటాయి. వాటివాసన గుచ్చుకుంటుంది. కొన్నిపువ్వులు గుచ్చుకుంటాయి. వాటి సౌరభం మెత్తగా వుంటుంది. ఏమంటారు?" అన్నదా యువతి నవ్వుతూ.
    అతనికి అర్ధంకాలేదు. తనుకూడా నవ్వుతూ తల ఊపాడు.
    ఇలా ఆమె కొంతసేపు ప్రకృతిని ఉపాసించాక "పాపం, మీరెప్పుడు భోంచేశారో ఏమో! ఆకలిగా వుండివుంటుంది" అన్నాడు మధ్యలో కలుగజేసుకుని.
    ఆమె ఫకాల్న నవ్వి "చంపారు, యిదంతా ఆకలితో పుట్టిన ప్రేలాపన అనుకున్నారేమిటి?" అంది చిలిపిగా.
    "అబ్బే! లే...దు... లేదు."
    "ఆకలి లేదండీ, నిద్ర వస్తోంది."
    అతను కంగారుపడుతూ "అదిగో, మీరు గదిలో పక్కమీద పడుకోండి. నేను చాప వేసుకుని వసారాలో కునుకు తీస్తాను" అన్నాడు.
    ఈ ఏర్పాటుకు ఆమె అభ్యంతరం చెప్పలేదుగాని 'మీరు మంచం బయట వేసుకోండి. నేను గదిలో చాపమీద పడుకుంటాను" అన్నది.
    "ఆఁ, ఆఁ, భలేవారే. మీరు అతిథులు" అంటూ తన అద్భుతమైన పళ్ళతో ఒకనవ్వు ప్రదర్శించాడు మృత్యుంజయరావు. కాసేపటికి ఆమె తలుపు గడియపెట్టుకుని గదిలో పడుకుంది. గోడకి ఒకమూల ముసుగు బిగించి అతను వొదిగాడు.
    కాని అతనికి నిద్రరాదు. ఆమె తలుపు గడియపెట్టుకుంది. అందుకని కాస్త అహం దెబ్బతింది. పోన్లే ఆడది అని సరిపెట్టుకున్నాడు మళ్ళా.
    తన పేరేమిటని అడగలేదు. తనెవరో అడగలేదు. ఎంత నిశ్చలంగా నిద్రపోతోంది లోపల! నిద్రపోతోందో, ఆలోచిస్తోందో లోపల. తనని గురించి ఆలోచిస్తూందేమో! ఛ, ఛ, అలాంటివాళ్లు ఆలోచించరు. ఈ మాదిరి విషయాలను చాలా తేలికగా తీసుకుంటారు.
    కాని ఆహా! యెంత మధురమైంది ఈ సన్నివేశం? ఎంత తీపి ఈ అనుభూతిలో?
    కాని...!
    ఉన్నట్లుండి అతను ఉలిక్కిపడ్డాడు. తను సరిగ్గా సహజంగా ప్రవర్తిస్తున్నాడా? అసలు యిలాంటి సందర్భంలో ప్రవర్తించవలసింది యిలానేనా? ఇలానేనా అని, అని చవటయిపోవటల్లేదు కదా?
    శేఖరం అందగాడు. ఆడపిల్లలతో చమత్కారంగా మాట్లాడగల నేర్పు గలవాడు. సాహసి, అవకాశవాది.
    ఈ సన్నివేశంలో శేఖరం అయితే...? చస్తే తలుపు గడియపెట్టనివ్వడు. అసలతను వుంటే తలుపు గడియపెట్టడం గురించి ఆ అమ్మాయికి గుర్తురాదు. తన మాటలతో, నవ్వులతో, మేనరిజమ్స్ తో, చూపులతో, చేతలతో ఆమె హృదయాన్ని కలచివేస్తాడు. ఆమె చలించిపోతుంది. ఆమె చకిత అయిపోతుంది. ఆమె వివశ అయిపోతుంది. అప్పుడిహ తలుపు గడియ అతనే వేస్తాడు.
    ఛ ఛ! నేను వెగటుగా ఆలోచిస్తున్నానా?
    లేదు లేదు, కానియ్యి. బాగుంది ఆలోచన. అయినా నువ్వు కాదుగా అలాచేసేది, శేఖరమాయె. ఊహాలోకంలోని ప్రేక్షకుడివి నువ్వు. కానియ్యి...
    'బాగానేవుంది పద్ధతి" అని పెదవి విరుస్తుంది ఆమె. కాని కాళ్ళలో కాంతి.
    "ఏం? నేను నచ్చలేదా?" అంటాడు శేఖరం.
    అబ్బ! అంత డైరెక్ట్ గా ఎలా అంటాడోరా దేముడా! ఎంత గుండెనిబ్బరం, ఆత్మవిశ్వాసం కావాలి.
    చూద్దాం ఆమె ఏమంటుందో! "ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు?" నంగనాచి ఇందాక పువ్వులూ, వానా అని అతీతమైన కబుర్లు చెప్పింది. ఇదా అసలు స్వరూపం?
    ఏమో, ఈ గొప్ప శేఖరానిదేమో. నాగస్వరంవిన్న పాములా అతని విశేష ప్రతిభకు ఆమె దాసోహమన్నదేమో.
    శేఖరం మందహాసం చేశాడు. దగ్గరకు వచ్చి ఆమె భుజంమీద చెయ్యి వేశాడు.
    ఓరి నీ చెయ్యి ముక్కలైపోనూ! ఎంత దర్జాగా వేశావురా చెయ్యి? అదే యింకోడైతే ఎంత అసభ్యంగా గోచరమయ్యేది ఈ దృశ్యం.
    ఆమె... అతని హృదయంమీద వాలిపోతోంది.
    హఠాత్తుగా మృత్యుంజయరావు మనసు ఎదురు తిరిగింది.
    "ఛీ ఛీ! నేనిలాంటి ఆలోచనలు ఆలోచించకూడదు. నేను వీటికి అతీతుడ్ని" అనుకున్నాడు.
    ఇలా అనుకుంటే అతనికి చాలా సంతోషంగా వుంది. సంతృప్తిగా వుంది. గొప్పగా వుంది. అతీతుడ్ని అనేమాట పదే పదే ఉచ్ఛరించుకున్నాడు.
    "అబ్బో! నాకు యిలాంటి పనులంటే అసహ్యం. అసలు యింత అల్పమైన విషయాలను గురించి నాకు తట్టదు. నేను వీటికి ఓ అంతస్థు ఎత్తుగా వున్నాను" అని వెన్ను చరుచుకున్నాడు.
    "అతీతుడివా నువ్వు? నాయనా ఏదీ నీ మొహం చూపించు ఓసారి. ఆహా. నీ మొహమే మొహం. ఆ పాడుమొహానికి తోడు యింత దురహంకారమా?" గదిలోని గోడమీద వ్యక్తి గోడలోనుండి బయటకు దూసుకువచ్చి నడుంమీద చేతులు వేసుకుని వెక్కిరించాడు.
    "ఆఁ, నాకు దురహంకారమా?" అని విస్తుపోయాడు మృత్యుంజయరావు.
    "ఓరి నాయనో! ఏం గొప్పవార్త? నాకు అహంకారపడటం వచ్చును. పైగా దురహంకారం. ఏం వైభవం?" 
    అతని వైభవం ఎక్కువసేపు నిలబడలేదు. గోడలోంచి దూసుకు వచ్చిన వ్యక్తి ఛడామడా తిట్టాడు. "ఓరి చవటా! నిముషాలను ఛండాలంగా ఖర్చుపెట్టే అప్రయోజకపు వెధవ్వి. నవ్వాల్సిన టైంలో నవ్వాలనికూడా తెలీని వెంగళాయివి. ఏడవాల్సిన టైంలో ఏడవాలని కూడా తెలీని బడుద్ధాయివి. ఆత్మవంచన చేసుకోక పడుకోరా సన్యాసీ. పడుకుని, కుళ్ళుకలలు కను."
    "అంతే! నేను, చవటని, మొద్దును, అసమర్థపు... నా కొడుకుని, పడుకుంటాను, పడుకుని పాపిష్టినిద్ర పోతాను. చచ్చుకలలు కంటాను" అతను, కళ్ళనుండి నీళ్ళు కారుతూండగా, వాటిని తుడుచుకుంటూ, మీదపడి కసిగా కరిచేస్తూన్న దోమల్ని తోలుకుంటూ మెల్లిగా ఎప్పటికో నిద్రలో పడ్డాడు.
    పాపిష్ఠి నిద్ర- చచ్చుకలలు...
    ఆ కలల్లో అతను వీరుడయాడు. రసికాగ్రేసరుడయాడు. అబ్బో! ఏమి హాస్యం, చమత్కారం వొలకబోస్తున్నాడనీ... "అరె! నేనా యింత దర్పంగా ప్రవర్తిస్తున్నది? ఈ భూమ్మీద యిది యెలా సంభవం దేవాది దేవా! ఇది కల! కాసేపటిలో చెదిరిపోతుంది. ఈ మధురదృశ్యం చెరిగిపోతుంది. చెరిగిపోయే లోపలే... వెళ్ళు... నీ అనుభవం పూర్తికానియ్యి." 
    కాని మధ్యలోనే కరిగింది కల. కాసేపు తిట్టుకున్నాడు. తిమురుకున్నాడు. గదితలుపులు వేసివున్నాయేమో చూద్దామని లేచివెళ్ళి వసారా అంచువరకూ నడిచి, ఓకాలు ఎత్తాక అప్పుడది గదికాదని గ్రహించి, క్రిందపడకుండా ఎలానో బ్యాలెన్స్ చేసి తప్పించుకుని తడబడుతున్న కాళ్ళతో వెనక్కివచ్చి పడుకున్నాడు. గుండెదడ వచ్చింది. దాహం వేసినట్లయింది. మంచినీళ్ళు గదిలో వున్నాయి. ఆవిడ తలుపులు వేసుకుని పడుకుంది. తలుపుతడితే ఏమనుకుంటుందో! తనని అపార్థం చేసుకుంటుంది. "మీరు చాలా మంచి వారనుకున్నాను. ఛీ, యిలాంటి అల్పులా?" అంటుంది. ఉహుఁ, అలా అనదు. "అల్పుడివా?" ఉహుఁ, అలాకూడా అనదు. "నువ్వెంత అల్పుడివిరా?" అంటుంది. అందుకని- దాహంవేస్తే వెయ్యనీ- తను తలుపు తట్టకూడదు.
    భేష్! ఇది మంచిపని. నేను మంచిపని చేశాను. నేనిహ పడుకుంటాను. అన్నట్లు తలుపు గడియవేశానా? ఏమో అనుమానంగా వుంది. చూద్దాం.
    లేవబోయాడు. సగంవరకూ లేచాడు. "ఓహో! ఇది వసారాగా!" ఎవరూ చూడటల్లేదు కదా అని ఒకసారి అటూ యిటూ చూసి పడుకున్నాడు. "దాహం వేస్తోంది. మంచినీళ్ళుంటే బాగుండును. గదితలుపు తడదామా?" "అల్పుడివిరా" అంటుంది... "అన్నట్లు గదితలుపులు వేశానా!"
                                                 *    *    *
    తర్వాత జరిగిన కథ క్లుప్తమైనది. ఆమె ఉదయమే నిద్ర మేలుకుంది. భూమ్మీద మొదటి సూర్యకిరణం వొచ్చి తాకినట్లు అతను అనుభూతి పొందాడు. ఆమె రెండునిముషాల్లో తయారై సెలవు తీసుకుంటానంది. అతను జగన్నాథపురం దాకా సాయం వస్తానన్నాడు అత్యంత వినయంగా ముఖంపెట్టి. ఆమె "అక్కర్లేదు, థ్యాంక్స్" అంది. రిక్షా ఎక్కివెళ్ళిపోయింది. "మళ్లీ కనిపిస్తారా అని అడగలేదు నేను" అని అతను విచారించాడు. "ఇంటర్వ్యూ విషయం తెలియపర్చండి" అని అడిగితే మర్యాద, సంస్కారం వుట్టిపడేది అనుకున్నాడు. నిట్టూర్చి గదిలోకి వచ్చి ఓ గంటసేపు ఆలోచించాడు.
    కాని ఈ సంఘటన ఎవరికైనా చెప్పుకుని ఆనందించాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతూంది. ఈ సంఘటనలో తెలియరాని గొప్పతనం వున్నట్లు అతనికి చీటికీ మాటికీ స్ఫురిస్తోంది.

 Previous Page Next Page