దేవిగారికి గాలి మరోవేపుకి మళ్ళినట్లుందే " అన్నాడు హాస్యంగా.
పరధ్యానంగా ఉన్న వారిజ "ఏమిటి?" అంది.
"ఇటీవల మీ ఇంటి కెవరో తరచూ వస్తున్నారట కదూ! అప్పటి నుంచే నువిలా మందకోడిగా ఉంటున్నావ్?" ఆమె ఆలోచనలో పడింది.
నిజమే ఎంత ప్రయత్నించినా తనకీ మధ్య ఎందులోనూ ఉత్సాహం కలగటం లేదు. ఇదివరకూ నిజమైన ఉత్సాహం లేదు. కానీ తనను తానూ మోసం చేసుకుంటూ కృత్రిమమైన ఉత్సాహన్ని చూపించగలిగేది - ఇప్పుడదీ సాధ్యం కావటం లేదు.
"ఏం? అతనేనా కారణం?" రెట్టించాడు రాధాకృష్ణ.
"ఊ" అంది విసుగ్గా , నీరసంగా.
"ఓహో! అతనంతటి రసికుడన్నా మాట!" అదిరిపడి కూర్చుంది వారిజ.
లోకంలో ఉన్న దైన్యమంతా ముఖాన్నే ఉన్నట్లు అనిపించింది . కోపం రాలదు. ఆవేదన కలగలేదు. చిత్రం! చీదర కూడా కలగలేదు. శాంతంగా చెప్పింది.
'అతను మా అన్నయ్య."
"అన్నయ్యా? ఏ రకం అన్నయ్య?"
అప్పటికీ వెటకారమే రాధాకృష్ణ గొంతులో.
ఒకే తల్లికీ తండ్రికీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య.
'ఆయామ్ సారీ!" అన్నాడు రాధాకృష్ణ. తను ,మనసులో నొచ్చుకుంటున్నందుకు నిదర్శనంగా వెకిలిగా నవ్వాడు.
ఈ చికాకులో వారిజ పరుగు వేగం కాస్త మందగించింది. వారిజ నిలబడి వున్న రంగం నిరంతరమూ అతి వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది ......అక్కడ కాలుంచి నిలువదలుచుకున్న వాళ్ళు తాము కూడా అతి వేగంగా పరుగులు పెట్టాల్సిందే! ఏ కాస్తా వేగం మందగించిన వీళ్ళు తిరిగి అధఃపాతాళంలోకి కూరుకు పోవాల్సిందే! ఈ ప్రమాదం గుర్తించిన వారిజ మళ్ళీ పరుగు అందుకుంది.
భర్త కోసం సమస్తమూ అర్పించే శీలవతి సహనాన్ని, తన మానం దుర్మార్గుల చేతిలో కోల్పోయిన కన్య ఆక్రోశాన్ని, ప్రాణాన్ని కోల్పోడానికయినా సిద్దపడి మానాన్ని నిలుపుకొన్న పతివ్రత పాతివ్రత్యాన్ని అతి సమర్ధంగా నటించగలుగుతోంది - వేలాది ప్రేక్షకులు ముక్త కంఠంతో తననను ప్రశంసిస్తోంటే, ఏ మాత్రమూ సంచలనం లేకుండా నవుపుకాగలిగిన తనను తను అభినందించుకుంది.
ఒక అమాయకమైన పల్లె పడుచుగా నటిస్తోంది వారిజ. ఔట్ డోర్ షూటింగ్ ల కోసం పల్లెటూరికి వచ్చారు. షూటింగ్ అయిపొయింది .....ఆ పల్లెటూరు నచ్చిన వారిజ అక్కడ నాలుగు రోజులుండాలని నిర్ణయించుకుంది. మిగిలిన వారందరూ వెళ్ళిపోయినా తనూ నిలిచిపోయింది.
తను పూర్తిగా చచ్చిపోయాననుకుంటోన్న హృదయ తంత్రులు యింకా సజీవంగానే వున్నాయనీ , తగిన ప్రేరణ లభిస్తే అవి తిరిగి స్పందిస్తాయని, పాపం వారిజకి తెలిసి వుంటే అలా ఆగిపోయేది కాదు.
తనకు పరిచయమయిన ప్రపంచాన్ని బట్టి రామచంద్ర లాంటి మనుష్యులుంటారన్నదే వారిజ ఊహించలేని విషయం, అట్లాంటిది రామచంద్రతో తనకు పరిచయం. అతని ప్రేమలో గాడ శీలతం, భావనలో నైర్మల్యం, ప్రవర్తనలో సారళ్యం - ఇవన్నీ తనను పూర్తిగా వశపరచుకుంటాయనీ , మనవ జీవితంలోని మధురతను అనుభూతిని తనకు రుచి చూపి, ఇంత వరకూ తాను ఆనందమని నమ్మించుకోడానికి ప్రయత్నిస్తోన్న అన్ని విషయాల మీదా రోత కలిగిస్తాయనీ వారిజ ఊహించుకోగలిగితే , అసలా పల్లెలో నిలిచేది కాదు......కానీ, ఇప్పుడింక చెయ్యగలిగిందేమందీ?
5
తింటున్న అన్నంలో చెయ్యి కడుక్కుని లేచిపోయాడు రామచంద్ర." చాలు! ఇంక చెప్పకండి వినలేను....." అంటూ బయటికి నడిచాడు.
ఆవేదనతో అడ్డు పడింది వారిజ.
"ఇలా తింటున్న అన్నం మధ్యలో వదిలి వెళ్ళటం మాకు న్యాయం కాదు నేనంత బాధపడతానో ఊహించలేరా?' రామచంద్ర నవాడు . ఊహించగలను. నటించటం బాగా చేతనయిన వారు ఎంత బాధయినా పడగలరు.
వారిజ ముఖం పాలిపోయింది. "నమ్మకండి నన్నూ - నా మాటల్ని నమ్మోద్దు . నేనేం కోరుతున్నాను మిమ్మల్ని? నన్ను ప్రేమించమానటం లేదు పెళ్ళి చేసుకోమనటం లేదు. ఒక స్నేహితురాలిగా అంగీకరించమంతున్నాను. ఆత్మీయమైన స్నేహానికి వ్యక్తిగత చరిత్రతో సంబంధమేముందీ? మన జీవితాలు పెన వేసుకున్నప్పుడూ కదా, వ్యక్తిగత చరిత్రలతో సంబంధం?"
"స్నేహం! ఆత్మీయతా! ఇలాంటి మాటలు వాడి ఆ మాటల గౌరవాన్ని పాడు చెయ్యొద్దు వారిజా! నన్ను వెళ్ళనివండి...." వారిజ పెదవులు వణికాయి.
"కనీసం నిర్మలమైన స్నేహం చేసే అర్హత కూడా లేదా నాకు?"
"అర్హత? మీకన్నా ఎక్కువ అర్హత ఎవరి కుంటుంది శర్యం, సౌందర్యం -బోలెడు ప్రఖ్యాతీ ! మీరు కొద్దిగా కనుసైగ చేస్తే కోట్ల కొలదీ స్నేహితులు మీ పాదాల మీద వాలతారు! కావలసినంత నిర్మలంగా స్నేహం చెయ్యొచ్చు , నాకు దారి వదలండి...."
"సరే, నా స్నేహాన్ని కూడా అంగీకరించకండి - కానీ ఇవాళ ఒక్కరోజుకి ఇక్కడ ఉండండి. భోజనం చెయ్యలేదు. కాఫీ, ఫలహారాలు తీసుకొని వెళ్ళండి" రామచంద్ర ఆగి వారిజ ముఖంలోకి తీక్షణంగా చూశాడు.
"వారిజా! నేను నీ అందానికి వ్యామోహితుడి నయ్యానని నువనుకుంటే అది నీ భ్రమ. నువు నమ్మలేకపోవచ్చు కనీసం ఊహించలేక పోవచ్చు. కాని, నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎలాంటి వ్యమోహాలకి లొంగేవాడిని కాను నేను. ఆనాడు ఆ ఉదయ సంధ్యలో ఏదో దేవి మూర్తిలా కనిపించావు నువు నా కంటికి. ఆనాడు నీ ముఖంలో కనిపించిన అమాయకత్వం చూసి ఆశ్చర్యపోయాను. పసి పాపలా నీలో నువ్వు నవుకుంటున్నావు. ప్రకృతిలో ఒక భాగంగా కలిసిపోయిన తపసినిలా అనిపించావు. అనాడయినా నీ మెడలో నల్లపూసల్ని చూసి దూరంగానే ఉన్నాను. అయినా ఏదో శక్తి బలంగా నన్ను నీ వైపుకు ఆకర్షించింది.
నీ ప్రతిమాట, ప్రతి చర్య నాలో ఆణువణువూ నా మాధుర్యాన్ని నింపింది. పిచ్చి వాడినయి పోయాను. నువు అవివాహితవని తెలిసిన నాడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్ను దగ్గిరకు తీసుకుని నన్ను నేను మైలపరచుకున్నాను. నిన్నటి వరకూ నా అంత అదృష్టవంతుడు లేడని మురిసిపోయాను. దురదృష్ట వంతుణ్ణి నువింత మాహనటివని నాకు తెలీదు.
"మీ ఇష్టం వచ్చిన మాటలనండి" పడతాను. కానీ, మీతో గడిపిన జీవితం మాత్రం నటన కాదు. మొదట మీరు నన్ను వివాహిత అనుకొంటూన్నప్పుడు ఏం చెప్పలేక అలాగే నటించాను అంతే. అంతవరకూ జీవించడం కోసం నటించాను. ఆ క్షణం నటనలో జీవించడం మొదలు పెట్టాను. మీ సహచర్యంలో జీవితమంటే ఏమిటో తెలుసుకున్నాక మీ ముందు నటించగలిగే శక్తి లేకపోయింది .....ప్రతి మాటా, ప్రతి చేష్టా , నా గుండెలలోటులో నుండి వచ్చినవే......."
"నిన్ను మాటలనటానికి నేనెవర్ని వారిజా! అతి సమర్దురాలాయిన నటివి......ఏది నటనో కాదో ఎవరు చెప్పగలరు? అయినా అంత తేల్చుకోవలసిన అగత్యం నాకేం వచ్చింది? వెళ్ళనియ్యి." వారిజ గబుక్కున రామచంద్ర చేతులు పట్టుకుని.....
"ఒక్క క్షణం ........" అంటూ ఏదో అనబోయింది. ఆ చేతులు విదిలించి కొట్టాడు రామచంద్ర.
"ఛీ! వారిజా! నీ స్పర్శ కోసం ఆశపడే అధముడ్ని అనుకొంటూన్నావా? కామోద్రేకాన్ని రెచ్చగొట్టి నన్ను లొంగ దీసుకోవాలను కుంటున్నావా?"
"కాదు.......కాదు ....." వెంటనే అడ్డు లేచిపోయింది వారిజ. విసురుగా లేచిపోయాడు రామచంద్ర. ఆ రోజు రామచంద్ర కోసం స్వయంగా ఎన్నెన్నో తయారు చేసింది వారిజ . అవన్నీ అలాగే వున్నాయి. మళ్ళీ వంటింట్లో కెళ్ళాదానికి భయమేసింది వారిజకి. అక్కడే అలాగే కూలబడిపోయింది.
ప్రయాణానికి సిద్దమై టాక్సీ లో కూర్చున్నాక ఒక్కసారి రామచంద్రకు చెప్పి రావాలనే కోరికను అణుచుకోలేకపోయింది వారిజ.
టాక్సీని రామచంద్రం ఇంటి దగ్గర ఆపమని వణికే కాళ్ళతో దిగి లోపలికి వెళ్ళింది . అడుగులు చప్పుడుకు పరధ్యానంలో వున్న రామచంద్ర ఉలిక్కిపడి చూశాడు. ఒక్కరోజులోనే అతని కళ్ళలో ఎంతో దైన్యం కనిపించింది అలా శూన్యంగా వారిజ వంక చూస్తూ ఉండిపోయాడు.
ఆ చూపులకి తట్టుకోలేకపోయింది వారిజ. చటుక్కున క్రింద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. "ఎందు కెడుస్తావ్?" నిదానంగా అడిగాడు రామచంద్ర. 'నటన' ప్రసక్తి రానందుకు పొంగిపోయింది వారిజ హృదయం.
'ఇంకా ఏడవగలిగే శక్తి మిగిలి ఉందన్న ఆనందంతో ఏడ్చాను. వెళుతున్నాను, నన్ను క్షమించండి. బాగా ద్వేషించకండి. త్వరలో పెళ్ళి చేసుకుని సుఖంగా జీవించండి స్వార్ధపరురాలిని , మీకు కష్టం కలుగుతుందని తెలిసినా ఒక్కసారి మిమ్మల్ని చూడటానికి వచ్చాను. వెళుతున్నాను" లేచి బైటికి వచ్చింది వారిజ. కలలో మనిషిలా హిప్నటైజ్ చేయబడ్డ వాడిలా తనూ లేచి గుమ్మం దాకా నడిచాడు . టాక్సీలో కూర్చుని తలెత్తి చూసింది వారిజ.
రామాచంద్ర వారిజనే చూస్తున్నాడు. అతని కళ్ళలోనూ లీలగా బిందువులు కదిలాయి చేతులెత్తి నమస్కరించింది వారిజ. అతను చటుక్కున తల దించుకున్నాడు. టాక్సీ కదిలింది.
"చాలు , నాకీ అదృష్టం చాలు" సంతృప్తిగా అనుకుని మందుతోన్న కళ్ళ మీదకి బరువయిన కనురెప్పల్ని వాల్చుకుంది వారిజ.
-----------