"ఇంగ్లీష్ డైలీ సిటీ ఎడిషన్ చూశావా....?"
"చూశానే....?!"
"నువ్వు అబ్జర్వ్ చేసుండవు. జర్నలిస్ట్ మహిమ న్యూస్ స్టోరీ చూడు. న్యూ డైమన్షన్.... వీరూ కేసులో కొత్తకోణం....ఇంతవరకూ మన మావైపు మన దృష్టిని సారించలేదు. ఇకపై ఆవైపు కూడా ఓ కన్ను వేసి ఉంచాలి...." డి.జి.పి.దేవదాసు ఎక్కడో ఆలోచిస్తూ అన్నాడు.
సి.సి.ఎఫ్. చంద్రశేఖర్ ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు.
అక్కడే ఉన్న ఇంగ్లీష్ డైలీ తీసుకొని మహిమ న్యూస్ స్టోరీని శ్రద్ధగా చదివాడు.
"కేసులో కొత్తమలుపు....ఎస్....యూ ఆర్ రైట్....ఇట్స్ ఏ న్యూ డైమన్షన్.... ఎప్పటికప్పుడు హైలెవెల్లో అతన్ని పట్టుకొనేందుకు పన్నుతున్న పథకాలెలా అతనికి తెలిసిపోతున్నాయని, ఎలా తప్పించుకుంటున్నాడని నాకు చాలా కాలంగా అనుమానంగా ఉంది....మన పరిశోధనకి మరో కొత్త బాధ్యత...." నుదుటిని రుద్దుకుంటూ అన్నాడు చంద్రశేఖర్.
"నేను రాత్రంతా మా ఐ.పి.ఎస్. ఆఫీసర్స్ పర్సనల్ ఫైల్స్ ని స్టడీ చేసి రాయచూర్ డిస్ట్రిక్ట్ ఎస్.పి. రంజిత్ ని సెలక్ట్ చేశాను. నేరస్థులకి సింహస్వప్నం అతనంటే. అతనికో ఎస్సైన్ మెంట్ ని అప్పగిస్తే అది పూర్తయ్యేదాకా నిద్రపోడు. ఆల్ రెడీ వైర్ లెస్ మెసేజ్ వెళ్ళిపోయింది. సరీగ్గా ఇరవై నలుగు గంటల్లో అతనెళ్ళి మైసూర్ హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేస్తాడు.
వెరీ ఇంటెలిజెంట్ కాప్....నువ్వు కూడా మీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ పర్సనల్ ఫైల్స్ తెప్పించుకొని స్టడీ చెయ్. ధైర్యసాహసాలతోపాటు నీతీ నిజాయితీలున్న ఆఫీసర్ ని సెలెక్టుచేసి మైసూర్ డిస్ట్రిక్టుకి పంపించు. కంబైన్డ్ గా ఆపరేషన్ ఆరంభిస్తారు. కావల్సిన ఫోర్స్ ని, వెహికల్స్ ని, వెపన్స్ ని సిద్ధంచేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాను...." అన్నాడు దేవదాసు ఒక స్థిరమైన నిర్ణయానికొస్తూ.
అప్పటివరకు తనతో ఉంచుకొన్న ఫైల్స్ ని దేవదాసుకి అందించాడు చంద్రశేఖర్.
శర్మ అనే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్సనల్ ఫైలది. ఐ.ఎఫ్.ఎస్. కర్ణాటక కేడర్.
పది నిముషాల్లో ఆ ఫైల్ ని చూడటం పూర్తిచేశాడు దేవదాసు. ఆయన కళ్ళలో సంతృప్తి కనిపించింది.
"మోస్ట్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్....ధైర్యసాహసాలకు కొదవలేదు. ఒంటరిగా మేన్ ఈటర్ ని హతమార్చిన కరేజియన్ ఆఫీసర్...." అన్నాడు చంద్రశేఖర్.
"శర్మ సహకారం తీసుకొమ్మని రంజిత్ కి ఇన్ స్ట్రక్షన్స్ వెంటనే పంపిస్తాను. నువ్వూ అలాగే మీ ఆఫీసర్ ని పంపించు. కంబైన్డ్ కూంబింగ్ ఆపరేషన్స్ వీరూ పరిధిని, కార్యకలాపాల్ని కుదించివేస్తాయి ముందు, ఆపైన ఏం చేయాలన్నది వీరూ స్ట్రాటజీని బట్టి ఆలోచిద్దాం...." అన్నాడు డి.జి.పి.
సి.ఎం. తన శక్తిసామర్థ్యాల్ని, నీతినిజాయితీల్ని ప్రశ్నించటం డి.జి.పి.దేవదాసుకి కష్టంగా ఉంది. అది ఆయన మాటల్లో స్పష్టంగా వ్యక్తమయింది.
"ఇఫ్ యూ డోంట్ మైండ్....చిన్న సమస్య వుంది ఇందులో.... ఫారెస్ట్ ఆఫీసర్స్ కి తెలిసినంతగా అడవి గురించి ఐ.పి.ఎస్. ఆఫీసర్స్ కు తెలీదు.
ప్రతి అంగుళం అడవిలో ప్రమాదం పొంచి వుంటుంది. ఓ పక్క వీరూ_ అతని ప్రమాదకరమైన అనుచరులూ_ మరోపక్క వైల్డ్ ఏనిమల్స్, కర్ణాటక అడవులు పర్వత శ్రేణులమయం. డెన్సీ ఫారెస్ట్స్.... సరైన దారులుండవు. ప్రతిచోటకి వాహనాలు వెళ్ళలేవు. కాలినడక కూడా అవసరం.
ఎంతో ధైర్యస్థులు కూడా అటవీ అంతర్భాగపు నిశ్శబ్దాన్ని, నీరవాన్ని, పూర్ విజబిలిటీని చూసి భయపడిపోతారు. ఫారెస్ట్ గార్డ్స్ కూడా వెళ్ళలేని ప్రమాదకరమైన ప్రాంతాలున్నాయి.
ఆధునిక ఆయుధాలున్న నలభైమంది ముఠాతో వీరూ ప్రస్తుతం మైలామలై అటవీప్రాంతంలో మకాం చేసుకున్నాడని ఈరోజు ఉదయమే ఇన్ ఫర్మేషన్ వచ్చింది. ఆ ప్రాంతం అతి ప్రమాదకరమైంది. అక్కడికి వెళ్ళేందుకు ఖలేజా వున్న ఫారెస్ట్ రేంజర్ సయితం ఇష్టపడడు.
అలాంటి పరిస్థితుల్లో అడవి గురించి అవగాహనలేని రంజిత్ కొంత కాలాన్ని అందుకోసం కేటాయించ వలసి వుంటుంది. దానిమూలంగా కాలయాపన జరుగుతోంది. ఈలోపు ఫలితమేది అంటూ సి.ఎం. విరుచుకుపడే ప్రమాదముంది. అందుకని అడవి గురించి ఆల్రెడీ కొంత అవగాహన వున్న ఐ.పి.ఎస్. ఆఫీసరయితే బావుంటుందేమో....ఆలోచించు...."చంద్రశేఖర్ తన అనుభవాన్ని నెమరువేసుకుంటూ అన్నాడు.
డి.జి.పి. దేవదాసు మందహాసం చేశాడు.
"యూ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చంద్రా....! వాటిని దృష్టిలో పెట్టుకొనే రంజిత్ ని సెలెక్ట్ చేశాను. రంజిత్ మొదట ఐ.ఎఫ్.ఎస్. చేసి తరువాత తిరిగి యు.పి.ఎస్.సి. ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ లో సెలెక్ట్ అయ్యాడు. ఐ.ఏ.ఎస్.ని కాదని ఐ.పి.ఎస్.ని ఎన్నుకున్నాడు. ఐ.ఎఫ్.ఎస్. ట్రైనింగ్ లో ఫారెస్ట్స్ గురించి క్షుణ్ణంగా భోదించటం జరుగుతుంది. అతనికి అంతగా ప్రాక్టికల్స్ ఎక్స్ పీరియన్స్ లేకున్నా, థీరియాటికల్ గా బాగానే తెలిసుంటుంది. స్వతహాగానే తెలివికలవాడు. ఇప్పుడిక మీ ఆఫీసర్ శర్మ మైసూర్ జిల్లా అడవుల్ని ఒకసారి పరిచయం చేయగలిగిదిచాలు....అన్నాడు డి.జి.పి.దేవదాసు.
మరో అరగంట చర్చల తరువాత కొత్త ఉచ్చును వీరుకోసం సిద్ధం చేసి లేచారు ఆ ఇద్దరు అధికారులు.
అందుకు సంబంధించిన వాహనాలు, వైర్ లెస్ సెట్స్, వెపన్స్, మ్యాప్స్, దుస్తులు, డబ్బు యుద్ధప్రాతిపదికపై సిద్ధం కాసాగాయి మరోపక్క.
* * * *
రెండు రోజులకి కరియా రెండు లారీలు, వేలాయుధం మూడు లారీల చందనాన్ని సిద్ధంచేసి వీరూ ఆజ్ఞల కోసం ఎదురుచూడసాగారు. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో, ఎన్ని గంటలకు బయలుదేరాలో, అవెంత వేగంగా వెళ్ళాలో కూడా నిర్ణయించవలసింది వీరూనే.
అప్పుడు రాత్రి పదకొండు గంటలు కావస్తోంది.
అడవంతా నిశ్శబ్దంగా వుంది.
కన్ను పొడుచుకున్నా కానరాని గాఢాంధకారం మాటున యాభై లక్షలు ఖరీదుచేసే గంధం చెక్క చేతులు మారేందుకు సిద్ధంగా వుంది.
ఉన్నట్లుండి తీతువు భయంకరంగా అరిచింది. అటవీ అంతర్భాగపు నిశ్శబ్దం కొద్ది క్షణాల్లో చెదిరిపోయింది. లారీల డ్రైవర్లకు భయంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఆజ్ఞ అందిన మరుక్షణం లారీలు స్టార్ట్ కావాలి. హెడ్ లైట్స్ వెలగాలి. సంధించి వదిలిన బాణంలా అవి వీరూ నిర్ధేశించిన లక్ష్యానికేసి దూసుకుపోవాలి. ఎంతటి పరమాం ఎదురయినా ఆగకూడదు. కౌదల్లీ అడవుల్లో వేలాయుధం....
మలై మహదేశ్వరా హిల్స్ అడవుల్లో కరియా....క్షణాలు లెక్కించుకుంటుండగా వాయువేగంతో వచ్చిన భైరవీ, కరియా ముందాగింది.
* * * *
సరీగ్గా రాత్రి పదకొండు గంటలకు....బెంగుళూరులోని ఓ ఇంగ్లీష్ డైలీ ఆఫీసులో రెసిడెంట్ ఎడిటర్ కి, మహిమకి మధ్య సంభాషణ కొనసాగుతోంది.
"ఈరోజు పేపర్ హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. అదుక్కారణం నీ న్యూస్ స్టోరీయే.... కంగ్రాట్స్" అన్నాడు రెసిడెంట్ ఎడిటర్ అభినందనా పూర్వకంగా.