Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 13


    పిలిచారట! పరమేశ్వరం ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.

 

    "ఆ .... ఫాలూ కేసు అడ్మిట్ చేశారట!"

 

    "అవున్సార్!"

 

    "వారం రోజుల బేబీనట!" ఆపరేషన్ చేస్తానన్నారని విన్నాను.

 

    "చేద్దామనుకొంటున్నాను. వాళ్ళు చేయించుకోడానికి సిద్ధంగా వున్నారు"

 

    "ఏమిటి మీకంత ధైర్యం?" చికాకుని అణచుకొంటున్నట్లు గొంతు తీవ్రంగా ఉంది.

 

    ఆ అడిగే తీరుకి అభిమానం దెబ్బతిని ఊపిరి వేడెక్కింది శరత్ చంద్రకి.

 

    "అంటే?" అన్నాడు తనని తాను తమాయించుకుంటూ.

 

    "బేబీ బ్రతుకుతుందని నమ్ముతున్నారా?"

 

    "ఆపరేషన్ చెయ్యకపోతే ఎలాగూ బ్రతకదు. చెయ్యడంవల్ల అయిదు శాతం అవకాశం ఉంది. ఆ అయిదు శాతంలో ఈ బేబీ కూడా వుండాలని ఆశతో, నమ్మకంతో చెయ్యాలనుకొంటున్నాను" అన్నాడు. సంభాషణ ఇంగ్లీషులో సాగుతోంది.

 

    "కానీ, మన హాస్పిటల్ కి కావాల్సింది ఆశలూ, నమ్మకాలూ కాదు! రిజల్ట్"

 

    "బేబీకి కొంత వయసొచ్చేసరికి బేబీనే మిగలకపోతే?" అన్నాడు శరత్. కోపం అతన్ని అధిగమిస్తోంది అయినా ఒప్పించే ప్రయత్నంలో మృదువుగానే అన్నాడు.

 

    "దానికి మనమేం చేస్తాం? ఇక్కడ కావాల్సింది మన ఉత్సాహం ఒక్కటే కాదు! హాస్పిటల్ గురించి కూడా ఆలోచించాలి! పోయే కేసులు ఎక్కువచేస్తూ కూచుంటే.... కాంపిటేషనే లో ఉన్నవాళ్ళని మనమే, మనని బజారు కీడవమని పిలిచినట్లవుతుంది! పసిపిల్లల కేసులు ఇప్పుడిప్పుడే చేయకండి! ఇంకా కొంతకాలం ఆగింతర్వాత చూద్దాం!"

 

    "సర్....!" తెల్లబోయినట్లు ఏదో చెప్పబోయాడు శరత్.

 

    "సారీ డాక్టర్! మీరింకేం చెప్పనవసరం లేదు. మీరనుకున్నదానికి నా అంగీకారం లేదు!" అనేసి ఏదో పనున్నట్లు కుర్చీలోంచి లేచాడు పరమేశ్వరం. దానర్ధం 'ఇంక మీరు వెళ్ళవచ్చ'ని అర్ధమైంది. తనూ కుర్చీలోంచి లేచాడు శరత్ చంద్ర. నిస్సహాయంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి!

 

    'కాంపిటేషన్....' డామిట్! వీళ్ళ కాంపిటేషన్ కోసం.... వీళ్ళ ప్రతిష్టకోసం పసివాణ్ణి చూస్తూ చూస్తూ.... నరకయాతన అనుభవించి చచ్చిపోనివ్వాలి!! కొంత వయసొచ్చేవరకూ ఆగాలట! ఏమవుతుంది జరిగితే?? చెడిపోయిన గుండె మరింత చెడి ఊపిరితిత్తులను కూడా మరింత చెడగొడుతుంది!

 

    ఇలాగే పుట్టి, కొంత వయసొచ్చేసరికి అంతా పాడయిపోయి అసలు తనే లేకుండా పోయింది!

 

    ఆడుతూ.... ఆడుతూ.... ఆయాసపడిపోయి.

 

    'అన్నయ్యా! నేను చచ్చిపోతానటగా?' అని దీనంగా అడిగేది!

 

    ఇప్పుడు - ఇప్పుడు - ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ బాబుని అలాగే చంపుకోవాలా?? చంటివాడి మొహం కళ్ళముందు కదిలింది! వాడి అమాయకమైన చూపు జ్ఞానాన్ని ప్రశ్నిస్తున్న శూలంలా - గుచ్చుకొంటున్నట్లు గిలగిల్లాడాడు!


                                                *    *    *    *


    "మమ్మీ, డాడీ ఇంకా రాలేదా?" అప్పుడే నిద్రలేచిన మువ్వ ఇల్లంతా కలియజూస్తూ అడిగింది. తండ్రి వెళ్ళి అప్పటికి పది నిమిషాలయింది.

 

    "నోర్మూయ్! వెళ్ళి మొహం కడుగు" ఖస్సుమంది నీలిమ. మొహం మాడ్చుకుని బాత్ రూమ్ వైపు వెళ్ళింది మువ్వ. మరో పదినిముషాల్లో 'జీవన్' నిద్రలేచాడు.

 

    కళ్ళు తెరుస్తూనే "మమ్మీ హాస్పిటల్లో మనిల్లు ఎలా వచ్చింది అని అడిగాడు. రాత్రి హాస్పిటల్లో కళ్ళు మూసి ఇప్పుడే కళ్ళు తెరిచాడు.

 

    ప్రక్కనే కుర్చీలో కూర్చుని కాలేజీకి లీవులెటర్ రాస్తోంది తల్లి.

 

    "అయ్యో.... ఇది హాస్పిటల్ కాదురా.... మనిల్లు!" దీర్గాలు తీస్తూ అని గొప్ప విషయం చెప్తున్నట్లు మొహం ఇంత చేసుకొని వచ్చి అన్నదగ్గర కూర్చుంది మువ్వ.

 

    "ఇంటికెప్పుడొచ్చాం?"

 

    "ఏమో నాకేం తెలుసు?" అన్న కాలివైపే చూస్తూ ఆరిందలా అంది. దెబ్బ తగిలిన అన్న గురించీ, కట్టివున్న కాలిగురించీ సవాలక్ష అనుమానాలొచ్చాయి. కాలుకు కట్టువేశాక ఇప్పుడే చూడటం!

 

    "అన్నా! నువ్వు బాత్ రూమ్ కెళ్ళి మొహం కడుక్కుంటావా?"

 

    "ఊహూ.... కాలునొప్పికదా!" పొడిగానే అన్నాడు జీవన్.

 

    "స్నానం చేస్తావా?"

 

    "ఏమో?"

 

    "మరి స్కూలుకి వస్తావా?" తల అడ్డంగా వూపాడు.

 

    "కో....కో.... ఆడతావా?" మాట్లాడలేదు జీవన్.

 

    "మరి, క్రికెట్ కూడా ఆడవా?"

 

    "నువ్వు నోరు ముయ్యకపోతే నిన్ను త్రోబాల్ ఆడతా!" నీరసంగానే విసుక్కున్నాడు.

 

    "నువ్వివతలికొస్తావా? దెబ్బలు పడాలా?" లెటరు మడిచి, కుర్చీలోంచి లేస్తూ కోపంగా అరిచింది నీలిమ.

 

    మొహం మాడ్చుకొంది మువ్వ.

 

    "మమ్మీ! డాడీ అసలు రానేలేదా?" గుండెలోతుల్లోంచి తొలుచుకొచ్చినట్లు అడిగారు జీవన్. ఆ భావాన్ని అర్ధం చేసుకొనే స్థితిలో లేదు తల్లి.

 

    చివ్వున తలతిప్పి చూసింది కొడుకు మొహంలోకి. 'వీడికి ప్రాణాలమీదికి వచ్చినా, ఏ అవసరం వచ్చినా కంటిమీద కునుకులేకుండా చూడవలసింది నేను. రెండ్రోజులకొకసారయినా ఇంటిమొహం గుర్తురాని ఆయన కావాలని తెగ కలవరించి పోతున్నాడు! ఎదురుగా ఉన్న నేను కనపడను కాబోలు!'

 

    అని వెంట వెంటనే మనసులోకి వచ్చాయి ఆలోచనలు! ద్వేషం బ్రద్ధలైంది!

 

    "రాలేదు! ఎందుకొస్తాడు?? మనని మించిన ఆకర్షణలు చాలా ఉన్నాయక్కడ. ఇప్పుడు మనమెందుకు కనిపిస్తాంరా? అంటూ ఆ ద్వేషాన్ని మాటల్లోకక్కింది.

 

    ఆత్మ వంచన! భర్త దూరమౌతున్నాడన్న బాధ భరించలేక తనని తాను ఓదార్చుకునే ప్రయత్నంలో తనని తాను వంచించుకొంటోంది.

 

    అంతా బయటికొచ్చాక .... తెల్లవార్లూ కొడుకు ప్రక్కనే కూర్చున్న శరత్ చంద్ర కళ్ళముందు కదిలాడు.

 

    చేసిన పొరపాటుకి మనసునింజా ముళ్ళతో గుచ్చుతున్న బాధ! తనుచెప్పింది అబద్ధమని తిరిగి చెప్పడానికి అడ్డొస్తున్న అహం! భర్త నిర్లక్ష్యం వల్ల ద్వేషం.

 Previous Page Next Page