Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 12


    "ఏమిటమ్మా! మనం మొదట్నుంచీ అనుకుంటున్నదేగా?"
    
    "అదికాదు నాన్నా!" తండ్రితో యింత పెద్దసమస్య ఎప్పుడూ చర్చించలేదు ఎంత చనువున్నా "నాకు అప్పుడే..."
    
    "నాకు తెలుసమ్మా అక్కయ్యలందరికీ నీకంటే చిన్నవయసులోనే పెళ్ళయింది. అవతలవాళ్ళు తొందరపడుతూన్నప్పుడు మనం ఆలస్యం చెయ్యటం భావ్యంగా వుండదమ్మా."
    
    "కాని, నాకు..."
    
    "చెప్పమ్మా! నీకభ్యంతరం ఏమయినా వుందా?"
    
    "నాకు... నాకు యిష్టంలేదు నాన్నా!'
    
    కూతురు యిలా అన్నదని పుండరీకాక్షయ్యగారు బెంబేలు పడిపోలేదు. కోపమూ తెచ్చుకోలేదు. ఆయన దృష్టిలో ప్రతి పెళ్ళికూతురూ యిలా అనటం స్వాభావికం."
    
    "ఇష్టంలేదా? అసలు పెళ్ళే ఇష్టంలేదా? సుదరం బావంటే ఇష్టంలేదా?"
    
    ఏం జవాబు చెప్పాలో తెలియలేదు గిరిజకు ఆ ప్రశ్న వింటే భయమూ వేసింది అంత దుఃఖంలోనూ సిగ్గూపడింది.
    
    "చెప్పమ్మా! చిన్నప్పట్నుంచీ నీకు తెలిసిన సుందరం బావా, మీ యశోదత్తయ్యా, లక్ష్మీపతి మామయ్యానూ! బావంటే యిష్టమేకదా."
    
    గిరిజ గబగబ ఆలోచించింది. ఈ పెళ్ళికి తనెందుకు యిష్టపడటంలేదు? బావంటే యిష్టమా, అయిష్టమా? అతనంటే ఏ భావంవుంది తనలో? ఎందుకు తనకు ఎదురుతిరగాలనిపిస్తోంది?
    
    ఏదో వుంది లోపల అస్పష్టంగా తనకే తెలియటంలేదు. ఏదో చెప్పాలని వుంది. తనతండ్రి ప్రేమగా, దయగా తన అభ్యంతరమేమిటో చెప్పమంటున్నాడు చెప్పలేకపోతోంది. భావమే సమగ్రంగా ఏర్పడకపోతే భాష ఎక్కడ్నుంచి వస్తుంది?
    
    "చెప్పు యిష్టమే కదూ?"
    
    గిరిజ అవునన్నట్లు తలవూపింది కళ్ళముందు ఏవో సున్నాలు సున్నాలుగా తిరుగుతున్నాయి.
    
    పుండరీకాక్షయ్యగారు గట్టిగా నవ్వారు. "పిచ్చిపిల్లా! మరేం? ఊరికే భయపడ్డావు. ఇహ లే, లేచి స్నానం చేసి ముస్తాబుకా ఓ అరగంటలో తెమలాలి మరి" అంటూ కూతురిబుగ్గమీద చిటికవేసి, లేచి వెళ్ళిపోయారు.
    
    గిరిజకు కోపమొచ్చింది. గిరిజకు ఏడుపొచ్చింది. గిరిజకు అసహ్యమేసింది. గిరిజ ఏడ్చేసింది.
    
    గిరిజ క్రిందకు దిగింది.
    
                                                        * * *
    
    ఆ సాయంత్రం తాంబూలాల తంతు. ఆ యింటి సంప్రదాయం ప్రకారం శాస్త్రయుక్తంగా జరిగిపోయింది. గిరిజకు అంతా కలలా వుంది. అది చెరిగిపోతే బాగుండునన్న ఆశ ప్రేరేపిస్తోంది. మనసులో ఏమూలో.
    
    ఆమెకు కొత్తబట్టలు కట్టబెట్టారు. ఆమెకళ్ళకు కాటుక పెట్టారు. ఆమెకు నగలలంకరించారు. ఆమెనప్పుడే పెళ్ళికూతుర్ని చేసినట్లు చేశారు.
    
    అంతా జరిగిపోయింది.
    
    ఆ రాత్రి ఎర్రబడిన కళ్ళతో, క్రిందనుంచి భోజనానికని పదిసార్లు పిలవగా, దిగివస్తోన్న గిరిజకు మెట్లమీద సుందరం తారసపడ్డాడు.
    
    "ఒక్క నిముషం" అంటూ అడ్డు నిల్చున్నాడు.
    
    "నిమిషమేం ఖర్మ? జీవితమంతా అడ్డు నిలబడ్డానికి అధికారం సంపాదించావు" అనుకుని మెదలకుండా నిలబడింది.
    
    "నేనంటే నీకిష్టమేకదూ?"
    
    ఆమె అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఆమె పెదవులు మెలికలు తిరిగినట్లుగా కదిలాయి. కనిపించీ కనిపించనట్లు వాటిమీద చిన్న చిరునవ్వు.
    
    ఇష్టమే అన్నట్లు తల ఆడించింది.
    
    "హమ్మయ్య" అన్నద్తహను తేలికపడినట్లుగా "నిన్నటి నీ ప్రవర్తనకు భయపడిపోయాననుకో!"
    
    అప్పుడో చిత్రం జరిగింది. గిరిజ ఈసారి మరింత విశాలంగా నవ్వి అతని బుగ్గమీద చిన్న చిటికవేసి, 'భయంవద్దు' అని గబగబ మెట్లుదిగి క్రిందకు వెళ్ళిపోయింది.
    
                                                       4
    
    మరునాడు సుందరం తల్లిదండ్రులతో వూరికెళ్ళిపోయాడు. పెళ్ళికి ముహూర్తం నిశ్చయించటం జరిగిపోయింది. అదింకా నెలరోజులలోపే.
    
    గిరిజకు జ్వరం వచ్చినట్లుగా అయింది. ఆ తర్వాత అయిదారురోజులదాకా కాలేజీకి వెళ్ళలేకపోయింది.
    
    ఏడోరోజున సరోజ వచ్చింది. ఆరోజు ఆదివారం.
    
    "ఏమే కనబడటం మానేశావు?" అంది ఉదయం తొమ్మిది గంటలవేళ మేడమీద గిరిజ గదిలోకి వస్తూ.
    
    గిరిజ అప్పటికింకా స్నానంచేయలేదు. వదినను చూసి నేర్చుకున్న పూసలతో బొమ్మ అల్లుతోంది.
    
    "ఇహ కనిపించుదామనుకున్నాను. ఇంతలో నీవొచ్చేశావు" అంది పూసలను ప్రక్కకు పెట్టి.
    
    సరోజ స్నేహితురాలి ప్రక్కన మంచంమీద కూర్చుంది. "రోజూ వద్దామని అనుకోవటం! వీలు కుదరకపోవటం" అంది.
    
    "చిక్కావే?" అంది మళ్ళీ థానే ఆమెముఖంలోకి పరీక్షగా చూస్తూ.
    
    "అవును, చిక్కానే" అంది గిరిజ చప్పున.
    
    ఆమె గొంతులో పరిచితమైనదికాక మరేదో ధ్వనించింది. "అదేమీటే అలా వున్నావు" దిగులుగా అనడిగింది.
    
    "సంతోషంగా వుంటే అలా అంటావేమిటే? జీవితంలో గొప్పమార్పు జరగాబోతోంది. నా పెళ్ళి తెలుసా?"
    
    "ఎప్పుడూ?" సరోజ తెల్లబోతూ అడిగింది.
    
    "ముందు ఎవరితో అని అడుగు అస్మదీయుడు సుందరంబావతో."

 Previous Page Next Page