Previous Page Next Page 
అనైతికం పేజి 12


    నేను సిగ్గుపడుతూ నవ్వాను.

 

    మా బావగారితో నా అంతట నేను మాట్లాడటం అదే మొదటిసారి మేమిద్దరం అలా ఎదురెదురుగా సమాన స్థాయిలో కూర్చుని హైఫండా మాట్లాడుకుంటూంటే ఎందుకో నా స్థానం పెరిగినట్టు అనిపించింది. ఇంట్లో కూడా 'నా' సమయానికి (అంటే స్నానాల గది దగ్గర) విలువ ఇవ్వటం ప్రారంభించాడు. నా భర్తని డబ్బు అడిగి లేదనిపించుకోవటానికీ, ఈ రోజు స్థితికీ తేడా తెలుస్తూంది. అయితే కాలేజీకి- ఇంటికీ మధ్య పరుగులు తీయడం కష్టంగా వుండేది. రోజూ నాలుగు క్లాసులు వుండేవి. అవికాక కాస్తంత రొటీన్ వర్క్...తర్వాతి రోజు తీసుకోవాల్సిన క్లాసుల తాలూకు ప్రిపరేషన్... పరీక్షలప్పుడు కాస్త ఎక్కువ వత్తిడిగా వుండేది. ఏదేమైనా ఇది మునుపటి జీవితంకంటే చాలా బావుంది నాకు.

 

                                                          *    *    *

 

    ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు దాటేది, ఐదు వరకూ విశ్రాంతి తీసుకుని రాత్రి వంట తాలూకు కూరలు తరిగి పెట్టుకుని, ఏ జర్నలో, పత్రికో పట్టుకునేదాన్ని. నా పనులు నేను ఎవరితోనో చెప్పించుకోకుండా రెగ్యులర్ గా చేసుకుపోవడం వల్ల ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు.

 

    నా భర్తతో ఎలాగు పొద్దునపూట మాట్లాడటానికి ఏ మాత్రం టైముండేది కాదు. సాయంకాలాలు కూడా అవసరమైతే తప్ప మా మధ్య ఎలాంటి మాటలు వుండేవి కావు. మా ఇద్దరి మధ్యా వున్న అగాధం నన్ను బాధించడం మానేసింది. ప్రస్తుతం నాది వేరే లోకం.

 

    నా బావగారు నన్ను స్టాక్ మార్కెట్ వివరాలు అడిగినప్పటి నుంచి మరింత శ్రద్ధగా ట్రెండ్స్ పరిశీలించసాగాను. ఏ క్షణానయినా ఆయన అడిగితే జవాబుతో సిద్ధంగా వుండాలన్నదే నా ఆకాంక్ష. కొద్ది రోజులపాటు ఆయన నన్ను కదిలించలేదు. బహుశా ఆ విషయం మరచిపోయుంటాడనుకున్నాను. అది తప్పని తరువాత తెలిసింది.

 

    ఓ రోజు నేను 'ఫైనాన్షియల్ విజార్డ్ పట్టుకుని కాలేజీ నుండి ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఆయన డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చుని కన్పించాడు. నా చేతిలో వున్న పేపరు చూసి "ఫర్లేదే అయితే, ఇంత బిజీలోనూ నీ హాబీ మరిచి పోలేదన్నమాట? గుడ్!" అన్నాడు.

 

    నేను మొహమాటంగా నవ్వి అక్కడే నిల్చుండిపోయాను. అంతలో నా తోడికోడలు చేతిలో టీ కప్పుతో అక్కడికి వచ్చింది. నన్ను దాటుకుని కప్ ని ఆయన ముందు టీపాయ్ మీద వుంచబోతూంటే నన్ను కూర్చోమని సైగచేసి "ఇంకోటి తీసుకురా" అన్నాడు భార్యతో. నాకు బెరుగ్గా అనిపించింది. ఆవిడ ఏమనుకుని వుంటుందో కదా అనుకున్నాను. అదే నా భర్త నన్నలా పురమాయించుంటే నాకు మండిపోయేది. చిత్రమేమిటంటే....

 

    నాకు కొద్దిగా కొద్దిగా ఏమిటి- చా...లా... గర్వంగా అనిపించింది.

 

    ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. "ఊ... ఇప్పుడు చెప్పు. ఈ వారంలో నేను ఏ షేర్లలో డబ్బు పెట్టొచ్చు?" అన్నాడు నా వైపు తిరిగి. నేను ఆలోచించి మూడు పేర్లు చెప్పాను.

 

    "నువ్వు చెప్పేవాటిలో జి.కె. షేర్లు నా దగ్గరున్నాయి. రైట్స్ వస్తున్నాయి కదా వాటికి! ఇక మిగిలిన రెండూ రేపు కొంటాను. చూస్తాను నువ్వెంత తెలివైన దానివో!" అని నవ్వాడు.

 

    అమ్మో! ఈయన పైకి చెప్పుకున్నంత అమాయకుడు కాదు. రైట్స్ విషయం గంట క్రితమే పేపర్లో చదివాన్నేను. అప్పుడే ఈయనకి ఎలా తెలిసిందబ్బా! అనుకున్నాను.

 

    నా తోడికోడలు తెచ్చిన టీ తాగి నా గదిలోకి వచ్చేశాను. మంచంమీద వాలి దిండులో తలదాచుకుని ఆలోచించాను. నా భర్త ఇలా నా బావగారిలా అన్నింటిలోనూ ఉత్సాహకరంగా వుంటే బావుండుననిపించింది నాకు. ఎప్పుడూ, అమ్మా, చెల్లీ, వంటింట్లో పనీ, నెలసరి వెచ్చాలూ, ఆఫీసు టైమూ' తప్ప ఆయన మరోటి మాట్లాడటం నేను వినలేదు. ఎందుకిలా వుండడు గంభీరంగా, మందహాసంతో అనిపించింది.

 

    నా బావగారిని చూస్తే ఆశ్చర్యంగా కూడా అనిపించింది.

 

    చిన్న వయసులోనే అన్ని బాధ్యతలూ నెత్తినేసుకుని పెద్ద దిక్కులేని సంసారాన్ని ఓ కొలిక్కి తెచ్చి, ఆర్థికంగా ఇంత ఉన్నతమైన స్థాయిలో వున్నాడంటే ఎంత కృషి చేసుండాలి? అయినా ఎప్పుడూ ఆ అలసట, చిరాకూ కనపడవే? అతనూ, నా తోడికోడలు ఎప్పుడూ మాట మాట అనుకోగా కూడా నేను చూడలేదు. ఇంట్లో ఏ విషయంలోనూ కల్పించుకోనట్టుగానే వుంటాడు కానీ ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అందరి అవసరాలూ గుర్తుంటాయి.  

 

    తర్వాతి రోజే ఆయన నేను చెప్పిన షేర్లు కొనుగోలు చేసిన విషయం నాతో చెప్పాడు. ఆ షేర్ల తాలూకు భవిష్యత్తే ఆయనకు నామీద విశ్వాసాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తుందని నేను కాస్త భయపడ్డాను.

 

                                          9

 

    ఓ వారంరోజుల తర్వాతనుకుంటా- కాలేజీలో విపరీతమైన పని ఒత్తిడిగా వుండి, చాలా అలసటగా అనిపించింది. నీరసంగా బసెక్కి ఇంటి దగ్గర దిగి నడుస్తూ వున్నాను. ఇల్లు ఓ అరఫర్లాంగు దూరముంది. మొహం తుడుచుకుంటూ, ఉక్కగా వున్న వాతావరణాన్ని తిట్టుకున్నాను. సన్నగా తలపోటు కూడా వుంది. ఆ స్థితిలో నా పక్కనే కారు ఆగడం కూడా నేను గమనించలేదు. "కాలేజీ నుంచేనా?" అన్న నా బావగారి గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూశాను.

 

    డ్రైవింగ్ సీటు కిటికీ నుండి తల బయటకు పెట్టి అడుగుతున్నాడతను.

 

    "అవునండీ?" అన్నాను చిరునవ్వుతో.

 

    "నేనూ ఇంటికే, కమిన్" అన్నాడు ఫ్రంట్ డోర్ తెరిచి.

 

    నేను మొహమాటంగానే కారెక్కాను. నేనొక్కదాన్నే అతనితో కారెక్కడం అదే మొదటిసారి. ఇంట్లోవాళ్ళు ఎలా రియాక్టవుతారోనని ఆలోచిస్తున్నాను నేను.

 

    "నిన్ను కంగ్రాచ్యులేట్ చేయాలి" అన్నాడతను.

 

    ఆలోచనల నుండి తేరుకుని "దేనికి?" అని అడిగాను.

 

    "నువ్వు టిక్ చేసిన షేర్ల ధరలన్నీ పెరిగాయి. ఈ రోజే అవన్నీ అమ్మేయమని బ్రోకర్ తో చెప్పాను. నాకు ఏ షేర్లూ ఎక్కువకాలం వుంచుకోవడం ఇష్టం వుండదు. ఆఖరికి బ్లూచిప్స్ అయినా సరే, నాకు స్పెక్యులేట్ చెయ్యడం ఇష్టం. ఇంతకాలం బ్రోకర్ మీద ఆధారపడటం ఇష్టంలేక ఆ ఇష్టాన్ని చాలా తక్కువ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి... తిరిగి నేనా అలవాటు పెంచుకుంటాను. ఏమంటావ్?" అన్నాడు.

 

    నేను బిడియంగా నవ్వి వూరుకున్నాను కానీ, లోలోపల నాకు చాలా సంతోషంగా వుంది- అతని అంచనాలకు తగినట్లుగా నా తెలివితేటలున్నందుకు. ఏదో అనాలన్నట్లుగా "జస్ట్...ఫ్లూక్ అయ్యుండచ్చు కదా! నా జ్యోతిషం ఎప్పుడూ కరక్టే అవుతుందని చెప్పలేను" అన్నాను.

 

    "నో...నో... అది పర్ ఫెక్ట్ స్టడీ. ఒక బ్రోకర్ మాత్రం ఇంతకంటే ఏం చేయగలడు?" అన్నాడు.

 

    కారు ఇంటివైపు వెళ్ళట్లేదని గమనించి "మనం ఎటువెళ్తున్నాం?" అని ప్రశ్నించాను గాభరాగా.

 

    ఆయన నవ్వి "నీ గెలుపుకి ... నా లాభానికి కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం" అన్నాడు.

 

    నా కెందుకో ఆ ఆలోచన పెద్దగా రుచించలేదు. అతనితో కారులో ఇంటికెళ్తానంటేనే భయమేసింది. పైగా ఈ పార్టీలు కూడానా? "వద్దు ... వద్దు... అయినా ఇది చాలా చిన్న విషయం" అన్నాను. "మరేం భయపడకు! జస్ట్ వన్ ఐస్ క్రీం అండ్ వి ఆర్ హోమ్" అన్నాడు. ఏం మాట్లాడాలో తోచలేదు.

 

    కారు డూడుల్ ముందాగింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే ఆందోళనతో నేను కారు దిగాను. ఒక టేబుల్ ముందు నన్ను కూర్చోబెట్టి రెండు 'టూటీ ఫ్రూటీ' లు తెచ్చాడతను. నేను మెల్లగా ఐస్ క్రీం చప్పరిస్తూ వుండగా అడిగాడతను- "ఇలా నేనడగటం నీకు నచ్చుతుందో, లేదో నాకు తెలియదు. కానీ ఇంటికి పెద్దవాడుగా అది నా బాధ్యతని నేననుకుంటున్నాను. నా ఇంట్లో ఎవరూ అసంతృప్తిగా బ్రతకడం నాకిష్టంలేదు".

 

    నా చేతిలోంచి స్పూన్ జారిపోయింది. అతడు ఏం అడుగుతున్నాడో తెలియక నా గుండె జల్లుమంది. నా ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోయింది. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాను, ఏం చెప్తాడా అని. ఆయన అన్నాడు. "...నీకూ, వాడికీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలున్నాయా? నేనిలా అడుగుతున్నానని నువ్వేం అనుకోవద్దు. ఇలా ఎందుకడుగుతున్నానంటే మీ ఇద్దరికీ పడట్లేదన్న విషయం ఎవరికీ తెలియదని మీరనుకుంటున్నారేమో కానీ, అందరికీ తెలుసనీ, మీ వ్యక్తిగత విషయాల్లో తల దూర్చేంత సాహసం వాళ్ళు చెయ్యట్లేదనీ నేను నీకు చెప్తున్నాను. మీ యిద్దరికీ ఎలాంటి గొడవలో నాకు తెలియదు. కానీ అవి కేవలం అపార్థాలే అయితే మాత్రం నేను తీర్చగలనేమో చూస్తాను. ఎందుకంటే వాడిని నీ కంటే ఎక్కువగా చూసినవాడిని నేను". ఆయన కంఠం మంద్రంగా వినిపించింది నాకు.

 

    నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. కంట నీటిపొర కదిలింది. నా దాంపత్యంలో వున్న అసంతృప్తిని గురించి పట్టించుకుని ప్రశ్నించే వ్యక్తి ఒకడు దొరికాడు. అతనివల్ల నాకే లాభం వుండకపోవచ్చు. కానీ నేను బాధపడే సమయంలో మా గురించి పట్టించుకునే వ్యక్తి ఒకడు వున్నాడన్న నిజం నాకు ఓదార్పునిస్తోంది. అతనంటున్నాడు- "సంసారంలో గొడవలంటూ రావని నేను చెప్పను. కానీ గొడవలే సంసారం కాదు కదా! నా తమ్ముడు మంచివాడు. అలాగే నీవూ చాలా తెలివైనదానివి. సమర్థురాలివి. ఇద్దరు తెలివైనవాళ్ళు భార్యాభర్తలుగా మనలేరన్న సామెతని గురించి మీరిదివరకే వినుంటారు. అయినా అది నిజం చెయ్యాలనే తాపత్రయం దేనికి?...."  

 

    నాకతని వాదించే విధానం, ప్రజెంట్ చేసే స్వరం నచ్చాయి. ఎదుటి వాళ్ళచేత తనకిష్టమైనది ఇష్టంగా చేయించగలిగేంత మృదుగాంభీర్యం, మెటల్ ఆ గొంతులో వున్నాయి. నాకు అతను నా బావగారిలా కాక, నా స్నేహితుడిలా తోచాడు.

 

    అంతకు ముందు రోజువరకూ అతను నన్ను ఏకవచనంలో సంబోధించడం నాకు కాస్త కష్టం కలిగించినా, వయస్సులో చాలా పెద్దవాడు కదా అనే విషయంతో సరిపెట్టుకున్నాను. కానీ చిత్రంగా అదే ఇప్పుడు అతని మనస్సులోని ఆత్మీయతని సూచిస్తున్నట్లుగా ఫీలయ్యాను. అన్నినాళ్ళ నా అలసట, భారం క్రమంగా తగ్గుముఖం పడుతూన్నట్లనిపించింది.

 

    ఆ తర్వాత అతనా విషయం ఇక పొడిగించలేదు. ఏదో జనరల్ టాపిక్స్, నా ఉద్యోగం, తన బిజినెస్ విషయాలు మాట్లాడాడు. నేనూ ఉత్సాహంగా అతను చెప్పేది విన్నాను. చిత్రంగా అప్పటివరకూ నేనతనితో అక్కడికి వచ్చానని వున్న గిల్టీఫీలింగ్, బెరుకు పోయాయి.

 

    బయల్దేరుతూండగా అతనన్నాడు- "సో... నో హార్డ్ ఫీలింగ్స్. నేనలా అడిగానని మరోలా అనుకోలేదుగా" అని.

 

    "లేదు" అన్నాను మనస్పూర్తిగా.

 

    "అయినా ఓసారి ఆ విషయం ఆలోచించు. ప్రతిచోటా రాజీ పడాలి మనం. నువ్వు నీ ఉద్యోగం విషయంలో అప్పుడప్పుడూ రాజీపడట్లేదూ. అలాంటిది సంసారంలో కూడా అనుసరిస్తే ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చు" అన్నాడు.

 

    "నిజమే... కానీ ఉద్యోగంలో వ్యక్తిగత అనుభూతులు వుండవు. సంసారంలో ఎమోషన్స్ తప్పనిసరిగా వుంటాయి కదా!" అన్నాను. "ట్రూ..ట్రూ... " అని ఒప్పుకున్నాడతను. "కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. చాలా సంసారాలకన్నా మీది సుఖప్రదమైన సంసారం. చాలా మంది భర్తలకన్నా నీ భర్త మంచి వాడు. మనుష్యులలో వున్న బలహీనత ఏమిటంటే- లేనిది కావాలనుకుంటారు! తమకన్నా మిగతావాళ్ళ సంసారాలూ, జీవితాలూ బావున్నాయని అనుకుంటారు. నీ భర్త స్థానే ఒక తిరుగుబోతునీ, భార్యని కొట్టేవాడినీ ఊహించుకో. నీ ఆనందం అర్థమవుతుంది. నిజానికి నీ భర్తలో నీకు నచ్చనిది ఏమిటి? సాధుగుణం, జీవితం మామూలుగా సాగిపోతే చాలు అనే మనస్తత్వం - అవేమీ ఘోరమైన తప్పులు కావుగా!"

 Previous Page Next Page